తెల్లవారి గోపాలస్వామి కోనేట్లో మల్లమ్మ శవం తేలింది! భీముడు పరిగెత్తాడు. గూడెం అనుసరించింది. భీముడు కోనేట్లో దూకాడు. చెల్లెలు శవాన్ని తీసుకొని పైకెక్కాడు. శవాన్ని భుజాన వేసుకొని సాగిపోతున్నాడు. గూడెం అనుసరించింది. గూడేనికి చేర్చాడు. పడుకోబెట్టాడు. చూస్తూ కూర్చున్నాడు. అతని గుండెలో ఎన్ని అగ్గి కొండలు బద్దలవుతున్నాయో! కన్నీరు ఇగిరిపోయింది అది రాలేదు. పరుగెత్తి వచ్చారు రఘు, జానకి, నాగేశ్, వీరయ్య, రావఁడు. ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందరూ కలిసి తల్లిదండ్రుల సమాధుల పక్కనే కూతురును పూడ్చారు.
భీముణ్ణి తమ ఇంటికి తీసికెళ్ళారు వీరయ్యగారు.
జరిగిందేమంటే మల్లమ్మను పట్టుకొచ్చారా? ఆమె చేయి విరిచారా? తీసికెళ్ళి ఒక గదిలో పారేశారు. అది అంతఃపురం. అక్కడికి మగ పురుగు పోరాదు. ఆడవాళ్ళే కట్టుకట్టారు. చేయి అతుక్కోవడం మాట అలా ఉండగా జ్వరం ముంచుకొని వచ్చింది. వంటిమీద పేలాలు వేగాయి. ఏవో మందులు మాకులు యిచ్చారు. గుణం కనిపించలేదు. మూసిన కన్ను తెరవలేదు. మగతలోతల్లినీ, తండ్రినీ, అన్ననూ పలవరించింది. ఆడవారి గుండెలు కరిగాయి. కాని అక్కడ కరుణలేదు, కనికరంలేదు. అసలు మనిషిలేడు. అది లంక. చుట్టూ వున్నవారు రక్కసులు!
మల్లమ్మ మూలిగింది. పలవరించింది. ఏడ్చింది. మొత్తుకున్నది. అన్నం ముట్టలేదు. మందు తాకలేదు. చిక్కింది. శల్యం అయింది. చివరకు ఎలాగో జ్వరం జారింది. కొద్దిగా కోలుకున్నది. చేయిమాత్రం అతుక్కోలేదు.
ఆ రాత్రి తెలిసింది తాసిల్దారుకు. చేతితో అతనికి పనిలేదు. మనిషి కోలుకున్నది అంతేచాలు. కామం అతనిలో మండింది. అది నాల్కలు చాచింది. విషం పోసింది. బుసలు కొట్టాడు. మంగమ్మను తయారు చేయమన్నాడు. మల్లమ్మ విసిరి కొట్టింది. హూంకరించింది. మనిషిని దగ్గరికి రానివ్వలేదు. తయారు కాలేదు. దాంతో మరీ మండిపోయాడు తాసిల్దారు. యముడై బయలుదేరాడు. కీచకుడై గదికి చేరాడు. మల్లమ్మలో ప్రాణం లేదు. పొరకపుల్ల అయింది. లేచి నుంచుంది. పెనుగాలికి ఎండుటాకులా వణికిపోయింది. ఉద్రేకం హెచ్చింది తాసిల్దారుకు. ఆమెను పట్టుకున్నాడు. లాగాడు ఆమె గిచ్చింది. అతడు కొట్టాడు. ఆమెకొరికింది. అతడు బాదాడు పూచీకపుల్ల పడిపోయింది. రాక్షసుడు ఆమెమీద పడ్డాడు. ఆమె విలవిలలాడింది. కాళ్ళుచేతులు కొట్టుకున్నది. అరచింది. అయినా ఎవడు రాలేదు. బలవంతంగా చెరిచాడు తాసిల్దారు అన్వర్ బేగ్. పంటిగాట్లు మండుతుండగా గది విడిచి వెళ్ళిపోయాడు తలుపులు వేయకుండానే.
మల్లమ్మ తనను చూచుకుంది. తలిదండ్రులను తలచుకుంది. అన్నను గుర్తుకు తెచ్చుకుంది. కుమిలి కుమిలి ఏడ్చింది. తనకు రక్షకులెవరు? తన మానం ఎవరు కాపాడారు? తాను బ్రతికి ఏం చేస్తుంది. ఈ జీవితం ఎందుకు? బ్రతికి తాను ఏం చేయాలి? బ్రతికి లాభంలేదు. చావడంలోనే సుఖం ఉంది అనుకుంది. చాటుగా బంగళాదాటింది. కోనేరు చూచుకుంది. అందులో తనను దాచుకుంది.
ఎందరి మల్లమ్మలను దాచిందో ఆ కోనేరు!
ఎందరి దాస్య విముక్తి చేసిందో ఆ కోనేరు!
భీముని ఇంట్లో - ఇప్పుడది భీముని ఇల్లు - మూడు చావులు. మిగిలింది తానొక్కడె. అతడు మనిషిగా మారాడు. పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. చదువు ప్రారంభించాడు. ఇప్పుడతనికి చాలా అర్థమవుతున్నాయి. వెట్టికి రాయి ఎందుకు కొట్టాలి? ఇదే మాట తనవాళ్ళందర్ని అడిగాడు. ఎవడూ సమాధానం చెప్పలేదు. అతడే సమాధానం చెప్పాడు. కొట్టరాదు. కొట్టగూడదు. కూలి ఇస్తే పని లేకుంటే బంద్.
వడ్డెర్లను కూడచేశాడు. వారిని బయలుదేరజేశాడు. సుత్తె భుజాన పెట్టుకొని బయల్దేరాడు. అందరూ అతన్ని అనుసరించారు. ఒక ఊరేగింపు సాగింది. సుత్తెలు భుజాల మీద పెట్టుకున్న వడ్డెర్లు సాగిపోతున్నరు. మౌనంగా సాగిపోతున్నారు. వీధుల వెంట సాగిపోతున్నరు. అది వింతగా తోచింది జనానికి. అనుసరించారు.
ముందు భీముడు,
అతని వెనుక వడ్డెర్లు,
వారి వెనుక జనం.
తాసిల్దారు ఇంటికి చేరారు. వడ్డెర్లను వారి సుత్తెలను వారివెనక వచ్చిన, వస్తున్న జనాన్నీ చూశాడు. తాసిల్దారు జంకాడు. నోటితో అరచాడు. "ఎందుకొచ్చిన్రు" అని.
"ఎట్టికి రాయికొట్తే వెళ్ళుతలేదు. దొరా! పోరలు ఉపాసాలుంటున్రు. వంట్ల బలం లేకుండ అయితాంది. కూలి ఇప్పించండి" భీముడు అడిగాడు.
తాసిల్దారు తల గిర్రున తిరిగింది. అధికారం అస్తమిస్తున్నట్లనిపించింది.
"ఎవరు నేర్పి పంపిన్రురా లం....కొడకుల్లార" కేక పెట్టాడు.
ఆ కేకకు ఎవరు ఉలికిపడలేదు. "కడుపు నేర్పింది దొరా! ఆకలి నేర్పింది! అది అన్ని నేర్పుతది. వద్దంటారా ఊరువిడిచి పోతం- రెక్కలు చల్లగుంటే గంజినీలు కరువైతాయి?" గంభీరంగా జవాబు చెప్పాడు భీముడు.
అర్థంకాలేదు తాసిల్దారుకు. వడ్డెర్లకు ఇంత ధైర్యమా? కూలి అడగటానికి వస్తారా? అమీన్ను పిలిపించి అందరినీ తుపాకులతో కాల్చుతామనుకున్నాడు. అందువల్ల అమీను నెత్తికెక్కుతాడు. ఇంతలో రావఁడు గుర్తుకొచ్చాడు. తాను కడుతున్న బంగళా గుర్తుకొచ్చింది. ఎంత చిన్న మనుష్యులు ఎంత పెద్దపనులు ఆపగలరు? వీళ్ళను వెళ్ళనీయరాదు. కూలి ఈయరాదు. తనపని సాగాలి. ఎలా? తలమీద చేయి రాచుకున్నాడు. ఏమీ తోచలేదు. అమాంతంగా ఆలోచన తట్టింది. వ్యాపారస్థులను పిలిపించాడు. వారంతా వెంకయ్యతో వచ్చారు. జరుగుతున్న వింత చూడ్డానికి జనం చాలా కూడింది. అమీనుకు తెలిసి మౌనం దాల్చాడు. వడ్డెర్లు తాసిల్దారుకు బుద్ధి చెప్పాలని లోలోన కోరుకున్నాడు.
వడ్డెర్లకు కూళ్ళు ఇవ్వాల్సిందని వ్యాపారస్థులను ఆదేశించాడు తాసిల్దారు. తాము ఇదివరకే పట్నం నుంచి వచ్చిన వాళ్ళ జీతభత్యాలూ, భోజనాలు భరిస్తున్నామనీ, బేరాలు తగ్గాయనీ, పెట్టిన అప్పులు రావడం లేదనీ, అదనపు భారం భరించలేమనీ విన్నవించుకున్నారు వ్యాపారులు.
వ్యాపారులు తనకు ఎదురు చెప్పడం! తన ఫర్మానును ధిక్కరించడం! మండిపోయాడు తాసిల్దారు. వడ్డెర్లమీద కోపం, కోమట్లమీద తీర్చుకున్నాడు. అరచాడు. చీవాట్లు పెట్టాడు. వ్యాపారులు బదులు పలుకలేదు. తలలు వంచుకొని విన్నారు. కాని మళ్ళీ పాతపాటే పాడారు.
తాసిల్దారు మండిపోయాడు. అధికార ధిక్కారాన్ని సహించలేకపోయాడు. అందుకు కారణాలను గురించి ఆలోచించసాగాడు. మంగళ్ళు ఊరు విడిచిపోవడం, పీరిగాణ్ణి కట్టుగొయ్య మీదినుంచి తీసికెళ్ళడం, ఇప్పుడిలా వడ్డెర్లు, కోమట్లు ఎదురు తిరగడం-వీటన్నింటికీ ఒక దానితో ఒకటి సంబంధం కల్పించుకున్నాడు. పత్రిక తెచ్చిన రఘు మెదడులో మెదలాడు. మొనగాడు. వాడే వీటన్నిటికీ కారణం అనుకున్నాడు. కాని ఏం చెయ్యాలి? అతడు వీరయ్యగారికి అల్లుడు. వారికి జాగీర్దారుతో నేరుగా సంబంధాలున్నాయి. అంతేకాక రఘు ఖానూను చదువుకున్నవాడట. అంగ్రేజు మాట్లాడ్తాడట! అతణ్ణి తాను కొట్టలేడు. కసితీర్చుకోలేడు. ఇందరిముందు అవమానించాలనుకున్నాడు. రఘును పిలిపించాడు.
రఘు వచ్చాడు. తాసిల్దారు చూచాడు. అతని ముఖంలో గాంభీర్యం ఉంది. సౌమ్యత ఉంది. సౌశీల్యం ఉంది. అతణ్ణి చూచి నీళ్ళు నమిలాడు తాసిల్దారు. రఘు సలాం చేస్తే ప్రతి నమస్కారం చేశాడు. ఎందుకో క్షణం నిర్వీణ్నుడయిపోయాడు.
రఘు నుంచున్నాడు. తాసిల్దారు కూర్చున్నాడు. అది సహించలేకపోయాడు భీముడు. కుర్చీ తెచ్చి వేసి కూర్చోమన్నాడు.
రఘు కూర్చున్నాడు.
తాసిల్దారు గట్టిగా కేక పెట్టాడు.
చెట్లమీద కాకులు ఎగిరి కావు కావుమని అరవసాగేయి.
జనం గుండెలు దద్దరిల్లాయి.
తాసిల్దారుకు గుండె బీటలు వారింది.
ప్రజల గుండెల్లో మేఘాలు గర్జించాయి.
"చూడు తెల్లారేటార్కల్ల నెత్తురు కక్కుకొని చస్తవు" అని దండ కడియం కదిలించాడు తాసిల్దారు. ఆ కడియంలో ఏవో మాయలూ, మంత్రాలూ ఉంటాయనీ, అది కదులుతే ఎదురు చెప్పినవాడు తెల్లవారేవరకు చస్తాడనీ, ప్రజల విశ్వాసం.
ఆ మాటకు వడ్డెర్లు అదిరిపడ్డారు. తమకు కూలి లేకున్నా రఘును రక్షించుకోవాలనుకున్నారు. వెట్టికే బండలు కొడ్తామనీ, ఉపవాసాలు లెక్కచేయమని విన్నవించుకుందా మనుకున్నారు. కాని -
ఆ మాటలు విని ఉగ్రుడై లేచాడు రఘు.
"మంత్రాలు నీకే వస్తాయనుకోకు. నీ ముందే రక్తం పిండుతా చూడు" అని "హాంఫట్ హ్రాం హ్రీం హ్రీంక్లీ" అని ఏదో మంత్రం చదివినట్లు చేసి చేయి మూసి తెరిచాడు. చేతిలోకి నిమ్మకాయ వచ్చేసింది.
తాసిల్దారు బిత్తరపోయాడు. అతని ప్రాణాలు పైపైనే ఎగిరాయి.