Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 22


    చర చరా సూర్యుడు ఎక్కుతున్నాడు. తనముందే పకీర్లకు రొట్టెలూ మిఠాయిలూ పంచుతున్నారు. అతనికి ఆకలీ, దాహం రెండూ మొదలైనవి. డొక్క మండసాగింది. ఎద మండసాగింది. మరిగిన రక్తం ఆవిరైంది. కళ్ళు నిప్పులు కురిశాయి. కొంతసేపటికి చల్లారాయి.

 

    ఇల్లు-తన యిల్లు గుర్తుకు వచ్చింది పీరయ్యకు. పీరమ్మ కళ్ళల్లో మసలింది. ఆమెకు క్షయ. రోగంతోనే బిడ్డను కన్నది. బిడ్డ పోయింది. ఎముకల గూడు! కుక్కి మంచంలో పడివుంది. మల్లమ్మ ఏమయింది? మల్లి తన నీలమణి. ఎక్కడ పోయిందో? అసలు బ్రతికి వుందా? మల్లి తనకూతురు బ్రతకాలి. తాను బ్రతకాలి. భీముడు-తన కొడుకు? ఎలా బాగుపడ్తాడు. అమాంతంగా ఏదో దృశ్యం గోచరించింది. భీముడు సమ్మెట అందుకున్నాడు. ఒక దెబ్బ ఒక్కటే దెబ్బ. నీల్గాడు తాసిల్దారు. రక్తం మడుగు. అందులో పడివుంది మాంసం ముద్ద. చెదిరిపోయింది దృశ్యం. నవ్వుదామనుకున్నాడు. నవ్వలేకపోయాడు. ఏవో చీకట్లు ముసిరాయి. కంటికి ఏమీ కనిపించలేదు. అంతే.

 

    మొహరం ఆరవరోజు. హసన్ కు నీటిచుక్క అందకుండా చేయడానికి లక్ష సైన్యాన్ని పంపాడు యాజీద్. హసన్ వెంట ఆరు నెలల పాప ఉన్నాడు. అది ఎడారి. మండే ఎండ తల్లిపాలు సహితం ఎండిపోయాయి. బిడ్డ తల్లడిల్లుతున్నాడు. భరించలేక పోయాడు హసన్. బిడ్డను భుజాన వేసుకొని సైన్యకుడ్యాన్ని చీలుస్తూ ఫరాత్ నదివైపు పయనం అయినాడు. బాణంతో పసిపాప తల ఎగరకొట్టాడు ఒక సైనికుడు. వెనక్కు తిరిగాడు హసన్. మొండాన్ని భార్యకు అందించాడు. ఆమె గొల్లుమన్నది.

 

    ఆరోజు షియాలకు అతి పవిత్ర దినం. ఆరోజు కన్నుల్లో ప్రాణాలున్న పీరమ్మను తీసుకొని తాసిల్దార్ ఇంటికి వచ్చారు వడ్డెర్లు. పీరమ్మను తాసిల్దార్ కాళ్ళ మీద పడేశారు. పీరయ్యను తీసికెళ్ళడానికి అనుమతించాల్సిందని ప్రార్థించారు. తాసిల్దార్ వళ్ళు మండింది. అంతమంది రావడం తనను ప్రార్థించడం! అదీ కట్టుగొయ్యనున్న వాణ్ణి తీసుకుపోతామని కట్టుగొయ్యకు పోయినవాడు కాటికి పోవాల్సిందే. వడ్డెర్ల ధైర్యం చూచి వళ్ళు మండింది తాసిల్దారుకు. అయినా కోపం దిగమింగాడు. అతడు దుఃఖంతో కుమలాల్సిన రోజది! పీరయ్యను చూచాడు. ఎక్కడా ప్రాణం ఉన్న జాడ కనిపించలేదు. చచ్చాడేమో! అదీ మొహరం ఆరవ రోజున. తన యింటి ముందు చావు. తనకు రావలసిన పుణ్యం లాక్కుపోతున్నట్లనిపించింది.

 

    "లేజావ్" గట్టిగా అరచాడు.

 

    ఆ కేకకు ముందు వడ్డెర్ల గుండెలు అదిరాయి. తరవాత అర్థమైంది తీసికెళ్ళమన్నాడని. గొలుసులు విప్పారు. పీరయ్యను మంచంమీద వేసి తీసుకెళ్ళారు.

 

    పీరీల కొట్టం ముందు తాషామార్ఫా మ్రోగుతుంది.

 

    అగ్ని గుండంలో నిప్పు మండుతూంది.

 

    వెన్నెల విరిసింది.

 

    జనం పాటలు పాడుతున్నారు. ఆటలు ఆడుతున్నారు.

 

    ఆ రాత్రి రఘూ, నాగేశ్, రావఁడు వడ్డెర్ల గూడెంలోనే గడిపారు. జానకి కూడా వచ్చింది. రావఁడు కట్లు కట్టాడు. వైద్యుణ్ణి పిలిపించారు. చికిత్సలు జరుగుతున్నాయి. పీరయ్యను, పీరమ్మను చూచి జానకి గుండె పగిలింది. మూర్తీభవించిన దుఃఖంలా మంచం ప్రక్కన కూర్చుంది పీరమ్మ. ఏడుస్తూ కూర్చుంది. దగ్గుతూ రక్తం ఉముస్తున్నది.

 

    జానకీ పీరయ్యకు పరిచర్యలు చేసింది. కన్నతండ్రికి చేసినట్లు చేసింది.

 

    అప్పుడు వచ్చాడు భీముడు-పీరయ్య కొడుకు. భీముడు భీముడే. ఆరడుగుల మనిషి. నల్లగా బొగ్గుగా ఉంటాడు - ఇనుప మనిషి. అతని బుర్రమీసాలు, గిరజాలు, విశాలమైన నొసలు భయంకరంగా ఉంటాడు. తాగుడు ముండలు అతనికి వేరే పనిలేదు. అతనంటే అందరికీ హడల్. అతన్ని అడ్డగలవారు ఆ గూడెంలో కాదు, ఆ ఊళ్ళోనే లేరు. అలాంటివాడు వచ్చాడు. అతన్ని చూచి నిజంగానే దడుచుకుంది జానకి. లేచి నుంచుంది. భీముడు మంచం ముందు నుంచున్నాడు. తండ్రిని చూచాడు. తల్లినీ చూచాడు. కళ్ళల్లో నీరు నిండింది. టపటపా రాలింది. "అయ్యా" అని తండ్రిమీద బడి బావురమన్నారు. పీరమ్మ కొడుకు మీద పడి ఏడ్చింది. ఒకరి మీద ఒకరు పడి యేడ్చారు. అక్కడున్న వారంతా కంట తడి పెట్టారు.

 

    జానకి చాటుకి పోయి ఎక్కెక్కి ఏడ్చింది.

 

    భీముణ్ణి ఓదార్చాడు రఘు.

 

    ఆ రాత్రి ఒక్కడూ పీరలకొట్టానికి వెళ్ళలేదు. పీరయ్య వేదనను తమ గుండెల్లో నింపుకున్నారు. వారిమీద జరుగుతున్న అక్రమాలనూ, దౌర్జన్యాలనూ, అత్యాచారాలను గురించే రఘు విడమర్చి చెప్పాడు. భీమునికి ఏదో కొత్తలోకం కనిపించింది. కొత్త మనుషులు కనిపించారు. అతడు రోజూ చూస్తున్నవే. అయినా వాటిలో ఏవో కొత్త అర్థాలు గోచరించాయి అతనికి, వారికి. కొత్త వెలుగులు కనిపించాయి. కొత్త ఆశలు చిగిర్చాయి.

 

    రోజులు గడుస్తున్నాయి. రఘు నాగేశ్ జానకి అక్కడే గడుపుతున్నారు. భీమునిలో వింత మార్పు వస్తూంది. అతని అవతారమే మారిపోయింది. ఆందోళన గూడు కట్టుకుంది. ఆవేదన వ్యక్తం అవుతూంది. ఆవేశం కనిపిస్తూంది.

 

    ఆ రోజు తెల్లవారుతుండగా స్పృహ వచ్చింది పీరయ్యకు. "మల్లీ" అని పిలిచాడు. ఆమె కనిపించలేదు. పీరమ్మ మంచంలో ఉంది. ఆమెను తీసుకొని వచ్చారు. పీరమ్మను చూచాడు పీరయ్య. కన్నీరు నిండింది. కనుకొలుకుల్లోంచి జారి చెవుల్లో చేరింది. అందరికి గుండెలు చెరువులైనాయి. పీరయ్య బ్రతుకుతాడు అనుకున్నాయి అన్ని మనసులూ. పీరయ్య తనచుట్టూ ఉన్న వారిని చూచాడు. జానకి, రఘు, నాగేశ్! రఘు, జానకి, నాగేశ్! తన మంచం దగ్గర! ఎంత గొప్ప మార్పు! ఎంత మంచి మార్పు. భీముడు - తన కొడుకు మంచం పక్కన. ఎంత దుఃఖం నిండివుంది అతనిలో, ఎంత మారిపోయాడు! పీరమ్మను చూచాడు. శల్యంలా ఉంది. ఎందరు వచ్చారు! ఎవరి దగ్గరికి వచ్చారీ పెద్దలు? దొరలు, దాతలు. తాను ధన్యుణ్ణి అయినా ననుకున్నాడు. అతని గుండెలో కృతజ్ఞత నిండింది. వ్యక్తపరచాలనుకున్నాడు. మాట పెకల్లేదు. చేతులు జోడించాడు. కళ్ళలో నీళ్ళు నిలిచాయి.

 

    "మీరు దేవలు" అన్నాడు అంతే. ఇంక మాట్లాడలేక పోయాడు.

 

    అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి. జానకి టపటపా కన్నీరు రాల్చింది. ముఖం చాటుచేసుకొని కళ్ళు తుడుచుకుంది.

 

    "కాదు మనుషులం" అని రఘు పీరయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు. మంచం పట్టెమీద కూర్చొని పీరయ్యకు ఎంతో ధైర్యం చెప్పాడు.

 

    "పీరయ్యకూ జై" అన్న మాటలు దూరంగా పలుకుతున్నట్లు వినిపించాయి మళ్ళీ స్పృహ తప్పుతున్న పీరయ్యకి.

 

    మూడోనాడు సాయంకాలం వీరయ్యగారు కూడా పీరయ్య ఇంటికి వచ్చారు! పీరయ్య, పీరమ్మా ఇద్దరూ మృత్యుశయ్య మీదనే ఉన్నారు. జానకి పీరమ్మ దగ్గర వీరయ్యగారు పీరయ్య దగ్గరా కూర్చున్నారు. కొంతసేపు ఉండి రఘు సహితంగా అంతా వచ్చేశారు.

 

    నాగేశ్ మాత్రం అక్కడే వుండిపోయాడు.

 

    రఘు మంచంలో పడి వున్నాడనేకాని నిద్రరావడంలేదు. ఆలోచనలు అనేకం వస్తున్నాయి. ఒక్కటీ చివరంటా సాగడంలేదు. పొర్లుతున్నాడు. అక్కడ జానకి దశ అలాగే వుంది. పేరుకు ఏదో పుస్తకం చూస్తూంది.

 

    అర్థరాత్రి దాటింది. తలుపుకొట్టిన చప్పుడు అయింది. రఘు లేచాడు. తలుపుతీశాడు, నాగేశ్! రొప్పుతున్నాడు. "పీరయ్య పీరమ్మ చచ్చిన్రు" అని చెప్పి లోపలికి వచ్చేశాడు.

 

    రఘుమీద పిడుగు పడ్డది. కుప్ప కూలిపోయాడు.

 

    జానకి కన్నీరు రాల్చింది. ఎక్కి ఎక్కి ఏడ్వసాగింది.

 

    "తే నా కత్తి. మండిపోతున్నారు వడ్డెరోండ్లు. పీనిగెలు లేవకముందే తేల్చుకుంట, ఈ రాత్రి యుద్ధం జరగాలి. తెల్లారేటోర్కె మనం గెలవాలె. తాసిల్దార్ చావాలె. రక్తం కాల్వలు కట్టాలె. నా గుండె మండుతున్నది. ఆగలేను. చస్త. ఈ ఘోరం చూడలేను. తాసిల్దారును కూడా వాండ్లతోనే బొంద పెట్టాలె. తే, నా కత్తి నా కియ్యి. నీతులు చెప్పకు. అయ్యి నేను వినను"

 

    నాగేశ్ కళ్ళు చింతనిప్పు కురుస్తున్నాయి. వణకి పోతున్నాడు. రక్తం తుక తుక ఉడుకుతూంది.

 

    రఘుకు ఏమి తోచలేదు. అతని మెదడు మొద్దుబారింది. ఆలోచించలేక పోతున్నాడు. నాగేశ్ భయంకరంగా ఉన్నాడు. చంపి చావడానికి కృత నిశ్చయుడై వచ్చినట్టున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ తోచలేదు. తల పట్టుకొని కూర్చున్నాడు.

 

    "ఇయ్యి నా కత్తి నా కియ్యి, నువ్వు మంచంలో పండుకో, మంచిగ నిద్రపో, మీరు కామందులు. మీకేమి తెలుస్తది గరీబోని బాధ? చదువుకొన్నోళ్ళంత ఇంతే. అసలు చదువులొద్దు. మూర్ఖుల్లోంచే విప్లవం రావాలె. ఇస్తవా లేదా నా కత్తి? మీకేం చాతకాదు. వట్టి ముం..." మాట మింగేశాడు నాగేశ్.

 Previous Page Next Page