"అదే సమయంలో నువ్వు బాత్రూమ్ లో దూరిపోతావ్..."
"ఓ.కే... టాప్... టాపున్నర... పద... ఈ గోరింటాకు కడిగేసుకొస్తాను... ఆ తర్వాత చీర కట్టుడు, కార్యక్రమం..." అని ఆనందం చీరకట్టుకుంటున్నపుడు అడిగాడు ఆంజనేయులు.
"ఒరే... చీర బాగానే వుంది. జాకెట్టులేదు గదరా... ఎలాగరా...?"
"మర్చేపోయాను... ఎలాగ... ఏం పర్లేదు... ఎర్రరంగు చీర కాబట్టి, నా ఎర్ర రంగు షర్టుతో ఇవాళ లాగించేద్దాం... ఇవాళంతా క్లోజప్పులు లేవు కాబట్టి పర్వాలేదు.. ఓ.కే..." అన్నాడు ఆనందం తేలిగ్గా తీసుకుంటూ.
అప్పటికి సమయం 5-15 నిమిషాలైంది.
తెలతెలవారుతోంది.
పాతకాలం నవలా రచయిత్రులు వర్ణించినట్టు బంగారు సూర్యకిరణాలు వసుధను తాకడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఆనందం అచ్చు అమ్మాయిలా తయారయ్యాడు.
"ఆ బుగ్గన చుక్క, బొట్టు, చీరా, గాజులు, సరిగ్గా అమ్మాయిలాగే ఉన్నావ్ రా..." ఆవేశంగా అన్నాడు ఆంజనేయులు.
అప్పుడు సమయం అయిదున్నర కావస్తోంది.
కిటికీలోంచి మేడవేపు చూస్తున్నాడు ఆంజనేయులు. ఆంటీ ఇంకా డాబా ఎక్కలేదు.
"ఇంకా డాబా... ఎక్కలేదు... ఎక్కలేదు..." అన్నాడు ఆంజనేయులు. మేడవేపు చూస్తూ.
అప్పటికే పాత ముగ్గు బుట్టతో రెడీగా వున్నాడు ఆనందం.
భువనేశ్వరీదేవి లోనగదిలోంచి బయటికొచ్చి డాబామెట్లు ఎక్కుతుండడంతో...
"ఆంటీ ఆయా... ఆయా... వెళ్ళు... వెళ్ళు..." అని అరిచాడు ఆంజనేయులు.
ఒక్కసారి తన ముఖాన్ని చూసుకుందామని అద్దాన్ని పైకెత్తిన ఆనందం 'కెవ్వు'మని కేకవేశాడు.
"ఏమైంది?" కిటికీ దగ్గరున్న ఆంజనేయులు పరుగు పరుగున వచ్చాడు.
"అర్జంటుగా షేవింగ్ క్రీమ్, బ్లేడూ తీసుకురా... అర్జెంట్... అర్జెంట్..."
ఇన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసి 'మీసం విషయం' మర్చిపోయారిద్దరూ.
ఆంటీ డాబా ఎక్కి సూర్య నమస్కారాలు చేస్తోంది.
గబగబా షేవింగ్ క్రీమ్ పట్టించి, ఆదరా బాదరాగా మీసం తీసేసి, పౌడరద్దేసి, తయారయిపోయాడు ఆనందం.
ఆంటీ నమస్కారాలు పూర్తిచేసేసి, దిగుదామని మెట్లచివర నిలబడడం, ఆనందం ముగ్గు బుట్ట పట్టుకొని వాకిట్లోకి వెళ్లడం ఒకేసారి జరిగాయి.
వారగా కూర్చుని, ముగ్గులు రాకపోవటం వలన 'ఏ,బి,సి,డి'లు వేస్తున్నాడు.
అవుట్ హౌస్ ముందు ఆడపిల్లను చూడగానే, దడాల్మని ఆశ్చర్యపోయి, కళ్ళు నులుముకుని మళ్ళీ చూసింది భువనేశ్వరీదేవి.
అవును అమ్మాయే!
నిగనిగా మెరుస్తూ, రింగులు, పట్టీలు, గాజులు, ఎర్రరంగు చీర, ముఖం కనబడుతుందేమోనని డాబాపై కొచ్చిందావిడ.
సగం పైగా ముసుగు వుండడం వల్ల ముఖం కనబడలేదు. ఆమె సంతృప్తిగా లోపలికి వెళ్ళిపోయింది.
"ఆంటీ గయా" అని అనగానే ఆనందం కుచ్చిళ్ళు ఎత్తుకుని లోనికి వచ్చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.
"ఎలా వుంది... ఎఫెక్టు?" అడిగాడు ఆనందం.
"బాగానే వుంది గానీ, ఆ ముగ్గులేవిట్రా... ఏ,బి,సి,డీలు వేశావ్. రెండు అడ్డంగా గీతలేస్తే బాగుండేది" విసుక్కున్నాడు ఆంజనేయులు.
"ఇవాళ ముగ్గుల పుస్తకం కొంటే, రేపు ముగ్గు వేయొచ్చు..." అన్నాడు ఆనందం పైట సర్దుకుంటూ.
ఇక్కడిలా వుండగా....
భర్త గదిలోకెళ్ళిన భువనేశ్వరి, ఆయన కప్పుకున్న దుప్పటిని లాగేసి...
"అమ్మాయొచ్చేసింది... అమ్మాయొచ్చేసింది... లేవండి... లేవండి" అని లేపేసింది.
"అమ్మాయ్... రావడం ఏంటి?" ఆవలింత తీస్తూ అడిగాడాయన.
"అదేనండీ... ఆంజనేయులు పెళ్ళాం ముగ్గులెడుతుంటే చూసేనండీ" అంది భువనేశ్వరి.
"అంజిగాడి పెళ్ళామా?" గొంతుక్కూచుని అన్నాడాయన.
"వేగిరం స్నానం చేసి పిల్లను చూసి రావాలి" అనుకుంటూ లోపలకు వెళ్ళిపోయిందావిడ.
హమ్మా ఆంజనేయులు... నాతో నువ్వు డ్రామాలాడుతున్నావన్న మాట...
చెప్తాను... చెప్తాను... అని గబుక్కున లేచి మేడదిగి, అవుట్ హౌస్ వేపు నడిచాడు భుజంగరావు.
ధడేల్మని తలుపు తోసుకుని లోనికొచ్చిన భుజంగరావు పైటను బొడ్డుకి కట్టుకుని కులాసాగా కబుర్లు చెపుతున్న ఆనందాన్ని చూసి-
"అప్పుడే అనుకున్నాను... ఇదేదో మతలబనుకుని... బాగున్నావురా... పిచ్చిది నిన్ను చూసి మా ఆవిడ అంజి పెళ్లాం అనుకుంది..." అనేసి, ఎంత వేగిరం వచ్చాడో అంత వేగిరం బిల్డింగ్ లోకి వెళ్ళిపోయాడాయన.
"ఒక్కసారి అమ్మాయిని చూసొస్తాను.. అలాగే వాళ్ళని టిఫినిక్కూడా పిలుస్తాను, ఏమంటారు?"
ఆ మాటంటూ బయటికెళుతున్న భువనేశ్వరివేపు 'ఓసి పిచ్చి మాలోకమా' అన్నట్టు చూశాడాయన.
"అబ్బాయ్... ఆంజనేయులూ..."
తలుపు తట్టిన చప్పుడు వినబడటంతో...
"పిన్నిగారి సీను షెడ్యూల్లో లేదు... వచ్చేశారు..." ఎగిరి గెంతాడు ఆనందం.
"ఏం చేద్దాం..... ఏం చేద్దాం......?" ఆంజనేయులు గొణిగాడు భయంగా.
"అర్జంట్ గా బాత్ రూం కెళ్ళిపో..."
ఆనందం చీర చుట్టుకొని బాత్ రూంవేపు పరుగెత్తాడు.
అప్పుడు గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా తలుపు తీశాడు ఆంజనేయులు.
"రండి... ఆంటీ... రండి..." ఆవలింత తీస్తున్నట్టుగా నటిస్తూ అన్నాడు ఆంజనేయులు.
ఆ ఆవలింతల్ని చూసి వేరే రకంగా అర్థం చేసుకుందావిడ ముసి ముసిగా నవ్వుతూ...
"అమ్మాయేదీ..." అంటూ లోనకెళ్ళబోయింది.