Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 23

    మరోకట్ట వేసింది.

    నాలుగువేలు....తెలీని నిజాలు కూడా నోటివెంట వచ్చేలా వున్నాయి.

    "ఈ కేసుని దర్యాప్తు చేసిందెవరు?"

    "ఎస్.ఐ. దీక్షిత్ సార్"

    "కాదు! నిజం చెప్పు" మరో వెయ్యి కట్ట టీపాయ్ మీద పడింది.

    "మెయిన్ సి.ఐ. పద్మనాభన్ సార్."

    "ఎస్.ఐ. దీక్షిత్ పై నీ అభిప్రాయం?"

    "చాలా మంచోడు.... నిజాయితీపరుడు."

    "సి.ఐ. పద్మనాభన్?"

    "అతను....అతను...." నసిగాడతను.

    మరో కట్ట పడింది. మొత్తం ఆరువేలు....నాలుగు నెలల జీతం....పిల్లల ఫీజులు.... బట్టలు.... గడిచిపోతాయి.

    "అతను లంచగొండి-నరరూప రాక్షసుడు. ఇప్పటికే పదిమందిని లాకప్ లో చంపేశాడు. అయినా అతనికున్న పొలిటికల్ లింక్స్ మూలంగా సేవ్ అయ్యాడు."

    "అతనికి డబ్బిస్తే పనులవుతాయా....? లంచగొండి అన్నావుగా?"

    "కావు."

    "ఎందుకని?"

    "ఆ కేసు బయటికొస్తే అతను యిరుక్కుపోతాడు. అతనికి రాబోతున్న డి.ఎస్.పి. ప్రమోషన్ ఎగిరిపోతుంది. దానికంటే డబ్బు గొప్పవేం కాదుగా. పదవుంటేనేగా డబ్బు....డి.ఎస్.పి. అయితే ఇంకా సంపాదించవచ్చుగా....?"

    టీపాయ్ మీదున్న ఆరుకట్టల్ని చేతిలోకి తీసుకొని- "ఇవి నీ స్వంతం కావాలంటే ఆ కేసు తాలూకు ఎఫ్.ఐ.ఆర్ జిరాక్స్ కాపీ నాకు కావాలి" అంది ఆమె కట్టల్ని అతని కళ్ళముందు ఆడిస్తూ.

    అతనొక్క క్షణం భయంగా చూశాడు.

    "ఓస్! అదేగా....ఇచ్చేస్తాడు" అంటూ ఒక నడివయస్కురాలు పక్కనే వున్న బెడ్ రూంలోంచి బయటకు వచ్చింది.

    "నా భార్య...." అన్నాడతను.

    "నీకేమీ కష్టం రానివ్వను. అసలు నాది హైదరాబాద్ కాదు. న్యూఢిల్లీ....నువ్వెప్పుడు జిరాక్స్ కాపీ యిస్తే అప్పుడే ఈ డబ్బు నీకిచ్చి నే ఢిల్లీ వెళ్ళిపోతాను. ఆలోచించుకో-రేపుదయం తొమ్మిది గంటలకు వస్తాను" అంటూ గిరుక్కున వెనుదిరిగి బయటకు వచ్చి ఆటోకేసి నడిచింది.

    "శభాష్! డబ్బు ఇవ్వకుండా డబ్బు చూపి చాలా ఇన్ ఫర్మేషన్ లాగావ్. బి.ఎల్. చదివుంటే గొప్ప లాయర్ వి అయ్యేదానివి" అన్నాడు హరికుమార్ మెచ్చుకోలుగా. ఆమె చెప్పింది విని.

    ఐదు నిమిషాలాగి ఆటో మరో కిలోమీటరు పైకెళ్ళి ఆమెను సూర్యా ఎన్ క్లేవ్ మెయిన్ రోడ్ మీద దింపేసి, హరికుమార్ తో వార్త ఆఫీసుకేసి దూసుకుపోయింది.


                          *    *    *    *


    అర్దరాత్రి దాటి అరగంటయింది.

    ఉరుములు, మెరుపులతో ఆకాశం అల్లకల్లోలంగా వుంది. ఈదురు గాలులు, చిరుజల్లులు, వాతావరణం పోటెత్తిన సముద్రంలా వుంది. కరెంటు పోయి సూర్యా ఎన్ క్లేవ్ కాలనీ గాఢాంధకారంలో మునిగిపోయి వుంది.

    అప్పుడే సెకండ్ క్రాస్ లో వున్న తొమ్మిదవ నెంబర్ ఇంట్లో ఒక కొవ్వొత్తి వెలిగింది. ఆ వెంటనే మరో కొవ్వొత్తి- అలా ఆరు కొవ్వొత్తులు వెలిగాయి.

    దాంతో ఆమె వున్న గది, పల్చటి కాంతితో నిండిపోయింది. కిటికీ రెక్కలు మూసేసి వచ్చి ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ ముందు కూర్చుంది మనోజ్ఞ.

    పక్కనే నాలుగయిదు స్క్రిబ్లింగ్ పేడ్స్....ఏవో పేపర్స్....కొన్ని ఫైల్స్.

    డెమ్మీ పేపర్స్ మీద గజిబిజిగా రాసుకున్న తన రాతల్నే టైప్ రైటర్ కి ఫీడ్ చేస్తోంది.

    ఆమె తల్లిదండ్రులు ఫేన్ ఆగిపోవటంతో లేచారు. తండ్రి కూతురు గది వద్దకు వచ్చి, తలుపుని కొద్దిగా లోనికి నెట్టి చూశాడు.

    ఆరు కొవ్వొత్తుల మధ్య ఋషిలా కూర్చున్న మనోజ్ఞ చేతివేళ్ళు మెషిన్ కన్నా అత్యంత వేగంగా కదులుతున్నాయి.

    మధ్యమధ్యలో పనాపి పక్కనున్న కాగితాల్లోకి చూసి ఒకింతసేపు ఆలోచించి తిరిగి ఫీడ్ చేస్తోంది.

    ఆయన నిట్టూర్చి వెనుదిరిగారు.

    ఆమెకు తన తండ్రి తన గదివద్దకు వచ్చి తొంగిచూసి వెళ్ళినట్లు తెలుసు. ఆమె గ్రహణశక్తి అంత సునిశితమైనది. అయినా తన తపస్సు నుంచి ఈసమెత్తయినా డీవియేట్ కాలేదు.

    మెషిన్ లోంచి పైకి వస్తున్న కాగితం నిండా కొన్ని పదుల సందేహాలు.... అనుమానాలు.

    సుచిత్ర బతికే వుండవచ్చన్నది తన ఊహ.

    ఒకవేళ సుచిత్ర బతికే వుంటే మరి రేప్ కి గురికాబడి చంపబడిందెవరు?

    ఆమెకి, సుచిత్రకీ వున్న సంబంధం ఎలాంటిది?

    ఆమె వివేక్ కి తెలుసా?

    ఈసారి జైలుకెళ్ళినప్పుడు తనకింకెవరన్నా అమ్మాయిలు తెలుసో లేదో అడగాలి.

    వివేక్ కేసు గురించి తనకింకా పూర్తిగా తెలీదు. అతను చెప్పే స్థితిలో లేడు- నిర్లిప్తతతో కూరుకుపోయిన వివేక్ సహకరిస్తాడనుకోవటం భ్రమ. 

    1. సుచిత్ర బతికుందా?

    2. ఉంటే ఎక్కడుంది?

    3. బతికున్న కూతుర్ని చచ్చిపోయినట్లు భ్రమింపచేసి ఆమె తల్లిదండ్రులు సాధించేదేమిటి?

    4. డబ్బేనా?

    5. అసలు వివేక్ మీదే ఆ కేసుని బనాయించటంలో దోషుల వుద్దేశమేమిటి?

    6. వివేక్ మూలంగా వాళ్ళకేమన్నా ప్రమాదమా?

    7. ఉంటే - ఎలాంటి ప్రమాదం?

    8. వివేక్ భార్యా, తండ్రి, అక్క, బావ, చెల్లి, మేనత్త కారు యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తూ పోయారా? ప్రమాదాన్ని సృష్టించారా?

    9. వాళ్ళందర్నీ చంపవలసిన అవసరమేమిటి?

    10. ప్రైమ్ విట్ నెస్ కేశవమూర్తి ఏం ఆశించి అబద్దపు సాక్ష్యం చెప్పాడు?

    11. రేప్ చేసిన వ్యక్తి....చంపిన వ్యక్తి ఒకరేనా?

    12. అది చంద్రనాథేనా?

    13. అందుకే అతని తండ్రి జితేంద్రనాథ్ రంగంలోకి వచ్చాడా?

    14. సి.ఐ. పద్మనాభన్ ని కొన్నదెవరు?

    టైప్ చేయటం ఒక్కక్షణం ఆపింది మనోజ్ఞ.
   
    15. కేస్ దూదిపింజలా ఎగిరిపోవాలంటే ప్రధానంగా ఏం కావాలి?

    అని కేపిటల్ లెటర్స్ తో టైప్ చేసింది.

    సమాధానం కోసం ఒకింతసేపు ఆలోచించింది.

    16. సుచిత్ర....ఎస్....సుచిత్రే-సుచిత్రే బతికున్నా బయటకొస్తుందా? వచ్చినా వివేక్ కి ఉరిపడ్డాక రావచ్చేమో?

    17. సెషన్స్ కోర్ట్ వేసిన మరణశిక్ష హైకోర్టుకి ధృవీకరణకు వెళ్ళింది. అదే స్టేజ్ లో వుంది?

    18. దాన్నిబట్టే వ్యవధి నిర్ణయించబడేది. ఈ కేసుని సాల్వ్ చేయడానికి తనకెంత వ్యవధి చిక్కుతుంది?

    19. వివేక్ తల్లి ఇల్లు అమ్మేసి తన తమ్ముడు సత్యమూర్తితో ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడుంటోంది? ఎందుకలా?

    20. వివేక్ నుంచి పూర్తి వివరాల్ని రాబట్టాలంటే ఏం చేయాలి?

    21. ఎఫ్.ఐ.ఆర్.లో లభించే వివరాలేమిటి?

    22. వివేక్ తరపున వాదించిన డిఫెన్స్ లాయర్ ఆదిరెడ్డి కేసునెలా అంత త్వరగా ఓడించగలిగాడు?

    23. ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదికి దొరికిన బలమైన సాక్ష్యాలేంటి? అవెలా దొరికాయి? లేదా ఎలా సృష్టించారు?

    టైప్ చేయటమాపి, ఒకసారి నిద్ర కళ్ళను రబ్ చేసుకుని పక్కనే ఉన్న ప్లాస్కులోని టీ వంపుకుని సిప్ చేస్తూ ఆలోచించటం మొదలుపెట్టింది.

    అప్పుడు టైమ్ తెల్లవారుఝాము మూడు గంటలు....

    టీ తీసుకోవటం పూర్తిచేసి....

    మరుసటి రోజు ప్రోగ్రామ్ ని టైప్ చేసింది.

    ఆపైన లేచి ఒకింతసేపు అనీజీగా అటూ ఇటూ తిరిగి, కొవ్వొత్తులను ఆర్పి, బెడ్ మీద వాలిపోయింది.


                          *    *    *    *


    జైల్లోని ఖైదీలు సన్ రైజ్ కి ముందే లేవటం సర్వసాధారణం. లేవకపోయినా సెంట్రీలు లేపేస్తారు.

    వివేక్ తన సెల్ లోంచి 127 నెంబర్ సెల్ కేసే చూస్తున్నాడు రాత్రంతా.

    అతనా రాత్రి నిద్రపోలేదు గనుక సన్ రైజ్ కి ముందే లేచే ప్రసక్తి లేదు.

    క్రితం రోజు ఉదయం నుంచి- కూరగాయలతోట దగ్గర జరిగిన సంఘటన దరిమిలా వివేక్ ఆలోచనా విధానంలో అనూహ్యమైన మార్పొచ్చింది.

    అతని ఆలోచనలు ఆగ్రహావేశాలతో పెనవేసుకుని, పెనుమార్పుతో ప్రళయానికేసి చూస్తున్నాయి.

    ఏదో ఓ నిర్ణయం తీసుకోకతప్పదని, చౌరాస్తాలో వివేక్ ఆలోచనలిప్పుడు సుడులు తిరుగుతున్నాయి.

    సరిగ్గా ఆరున్నరకి రామదాసు బద్ధకంగా కళ్ళిప్పాడు. కళ్ళు నులుముకొని, లేచి కూర్చుని వివేక్ కేసి చూశాడు.

 Previous Page Next Page