Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 22


    పగ, ప్రతీకారాల- రాగద్వేషాల విషపు గుళికల్ని తనలో ఇముడ్చుకున్న జైలు మూగగా రోదిస్తున్నట్లుగా వుంది.

    అప్పుడే రౌండ్స్ ముగించుకుని తన ఆఫీస్ రూమ్ లోకొచ్చిన నాయుడు మాన్షన్ విస్కీబాటిల్ తీసి, రెండు గుక్కలు సిప్ చేసి, మూతి తుడుచుకుని, సిగరెట వెలిగించుకుని, రామదాసు అడగబోయే సహాయం గురించి, తనకు రాబోయే మొత్తం గురించీ ఆలోచనలో పడిపోయాడు.

    అప్పుడే....

    సరీగ్గా అప్పుడే పావురాయిని గండభేరుండ పక్షిగా మార్చే ప్రయత్నానికి తొలి అంకం ఆరంభమైంది!

    పన్నెండవ బ్లాక్ లో - 118 సెల్ లోకి కొత్తగా చేరుకున్న ఇద్దరు ఖైదీలు నియంత్రించిన రోబోట్స్ లా లేచారు.

    ఆవేదనానంతంలో కూరుకుపోయి, నిద్రపట్టక అటూ ఇటూ కదులుతున్న వివేక్ పక్కలోకి చేరారు.

    వాళ్ళు పక్కలోకి చేరుతుండగానే వివేక్ ఉలికిపాటుగా లేవబోయాడు.

    వాళ్ళు అతన్ని లేవనీయకుండా నొక్కిపట్టారు.

    ఒకడు తన జైలు యూనిఫామ్ ని విప్పదీశాడు. రెండోవాడు కూడా ఆ పని చేయబోతుండగానే- కట్టలుతెంచుకున్న ఆగ్రహావేశాలతో, అసహ్యంతో ఒక్క ఉదుటున లేచాడు వివేక్.

    జరగబోయే అతి హేయమైన చర్యకు అది నాంది అని వివేక్ కి తెలుసు. అలాంటి నైట్ మేర్స్ అతనికి అనుభవమే....పర్ వర్షన్....పర్ వర్టెడ్ సెక్స్.... అసభ్య శృంగారం....

    అది తలుచుకోగానే అతనికి ఒళ్ళు గగుర్పొడిచింది.

    వాళ్ళు మీదకు వస్తున్నారు తనను బలిపశువును చేయటానికి.

    అంతే....జస్పాల్ ని కొట్టిన సంఘటనని, ఆ రోజు ఉదయమే కూరగాయన తోటలో జరిగిన సంఘటననీ ఒక్కక్షణం గుర్తుకుతెచ్చుకున్నాడు.

    శరీరాన్ని ఉక్కుముక్కలా బిగించాడు.

    గుండెల నిండా ఊపిరి తీసుకున్నాడు.

    వీళ్ళిద్దర్నీ ఈ క్షణాన చంపినా ఉరిశిక్షకంటే పెద్దదేం పడదుగా....

    ఉరిశిక్ష ఒకసారేగదా వేయగలరు. రామదాసు మాటలు చెవుల్లో మారుమోగుతుండగా రెండు పిడికిళ్ళనూ బిగించి ఇనుప గుండ్లలా చేసి, వాళ్ళను బాగా దగ్గరగా రానిచ్చి, ఒక్కసారిగా మెరుపులా వారి పొత్తికడుపు కిందిభాగంలో గుద్దాడు. కళ్ళు తెరిచి మూసేలోపు వాళ్ళు పెనుకేక వేస్తూ నేలకూలిపోయారు.

    వాళ్ళప్పుడే లేవగల స్థితిలో లేరని అర్ధంచేసుకొని వాళ్ళకిచ్చిన బ్లాంకెట్స్ ని కూడా కసిగా లాగేసుకుని, పక్క మెత్తగా వేసుకుని పడుకున్నాడు.

    తనమీద తనకే ఆశ్చర్యంగా వుంది.

    తనేనా....పొద్దున్న ఇద్దర్నీ, ఇప్పుడిద్దర్నీ మట్టికరిపించింది? తనలో నిజంగా అంత శక్తి, ఒడుపూ వున్నాయా?

    ఉన్నాయేమో! లేదంటే రామదాసు అన్నిసార్లు ఎందుకంటాడు?

    THUTH IS THE ULTIMATE.

    REALITY....ఎస్....ముమ్మాటికీ అది నిజం.

    నిజమే వాస్తవరూపం ధరించాలి.

    నిజమే వాస్తవం....

    వాస్తవమే నిజం....

    అది జరగాలంటే తనలో పాతుకుపోయిన వరెస్ట్ ఫియర్స్ అదృశ్యమైపోవాలి. ఎస్....అదృశ్యమైపోవాలి.

    I would have scared them to death.

    వాళ్ళను మృత్యువు కేసి పరుగెత్తించాలి.

    తన జీవితం ఇలా శిథిలమయిపోవటానికి కారణమైనవాళ్ళను తను బ్రతకనివ్వడు.

    అందుకు తగిన శక్తి, ఒడుపు తన దగ్గరున్నాయి. ఆయుధసంపత్తి అర్ధబలం, అంగబలం రామదాసు దగ్గరున్నాయి.       

    పిచ్చిపిల్ల....మనోజ్ఞ అనవసరంగా ప్రయత్నిస్తోంది. ఈ దేశంలో అమాయకులకు, పేదవాళ్ళకూ న్యాయం దొరుకుతుందా?

    అది డబ్బు, అంధకారం వున్న వాళ్ళకేనని ఆమెకి అర్ధమయ్యే రోజు త్వరలోనే వస్తుంది.

    తన మరణశిక్షకు కారణమయినవాళ్ళను మనోజ్ఞ శోధించే ప్రయత్నము వ్యర్ధం....

    దెబ్బకు దెబ్బ....రక్తానికి రక్తం....

    మానవత్వం, నీతిసూత్రాలు తనను కాపాడాయా వాటిని స్మరించుకోడానికి?

    తనేదో చేయాలి. చేయాలా? ఎస్....చేయాలి. ఈ దుర్భరమైన మరణశిక్షాపరమైన సంధికాలాన్ని భారంగా మోసేబదులు ఏదో ఒకటి చేయటమే మేలు!

    రేపే రామదాసుకి తన అంగీకారం తెలపాలి.

    తన తల్లి కోర్కె తీర్చాలి. రామదాసుకి మనశ్శాంథి చేకూర్చాలి. తన పగా- ప్రతీకారాలు తీర్చుకోవాలి.

    ఆ సందర్భంలో తననెవరయినా బంధిస్తే, అదే మరణశిక్ష దగ్గరవుతుంది. లేదా వాళ్ళ చేతుల్లోనే శిక్ష అమలు జరిగిపోతుంది.

    నౌ అయామ్ డెస్పరేట్....తెగించినవాడినే....రేపుదయమే నువ్వో గుడ్ న్యూస్ వింటావు రామదాసూ! అని మనస్సులోనే అనుకున్నాడు. నిద్రపోతున్న రామదాసుకేసి చూస్తూ.

    ఆ విషయం రామదాసుకెప్పుడో తెలుసు- ఎప్పుడో ఊహించాడని వివేక్ కి తెలీదు.


                                                            *    *    *    *


    సరీగ్గా రాత్రి 11.30కి ఆటో మాదాపూర్ లోని ఆర్గనైజేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ పక్కన ఆగింది.

    చీకటి దుప్పటిలా పరుచుకొని వున్న ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఒకటీ అరా వీధి దీపాలు వెలుగుతున్నాయి.

    మెయిన్ రోడ్ నిర్మానుష్యంగా వుంది.      

    ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు వుండుండి పడుతున్నాయి.

    ఆటోలోంచి దిగి ఒకింత పక్కకు వెళ్ళి బురఖా వేసుకుంది మనోజ్ఞ.

    హరికుమార్ కూడా ఆటో దిగి ఆమె దగ్గరకు వెళ్ళాడు.

    "నేను వస్తే అతను భయపడవచ్చు. నా గురించి అతనికి పూర్తిగా తెలుసు. లాకప్ డెత్స్ గురించి, పోలీసుల దౌర్జన్యం గురించి రాస్తుంటానని అతనికి బాగా తెలుసు. మనదేశంలో పలుకుబడికన్నా డబ్బే బాగా పని చేస్తుంది. అర్ధమయిందనుకుంటాను. వీలైతే వాయిస్ మార్చి మాట్లాడు. ఈ రాత్రే మన పనయిపోవాలి...." ఆటో డ్రైవర్ కి వినిపించకుండా అన్నాడు హరికుమార్.

    మౌనంగా తలూపి మైక్రోకేసెట్, కార్డర్ ని చెక్ చేసుకుని బయలుదేరింది.

    అక్కడికి యాభై అడుగుల దూరంలోనే వుంది స్టేషన్ రైటర్ ఇల్లు.

    ఒకసారి అటూ ఇటూ పరికించి చూసి తలుపులు తట్టింది ఆమె.

    రెస్పాన్స్ లేదు. మరోసారి తట్టింది.

    ఆపైన కొద్దిక్షణాలకు ఆ యింటి తలుపులు తెరుచుకున్నాయి.

    ఎదురుగా పైన స్వెట్టర్- కింద లుంగీతో ఓ నడివయస్కుడు....

    "ఎవరు? ఎవరు కావాలి....?" ఆమె బురఖాని చూసి హిందీలో అడిగాడు.

    "మీకు లాభం కలిగించటానికే వచ్చాను. నా పేరు రుక్సానా.... నేను లోపలకు రావచ్చా?"
   
    అతను ఆశ్చర్యపోతూ దారిచ్చాడు.

    ఆమె లోపలకు వెళ్ళింది.

    "నస అనవసరం....నేను ఢిల్లీ యూనివర్శిటీలో లా స్టూడెంట్ ని- మేం ఫైనలియర్ లో వింతయిన కేసులతో థీసిస్ సబ్ మిట్ చేయాలి. మీ కష్టం వుంచుకోను" డైరెక్ట్ గా అసలు విషయంలో కొచ్చింది మనోజ్ఞ.

    "మా పోలీస్ స్టేషన్ పరిధిలో అంత వింతకేసులేమీ జరగలేదే" అతను ఆమె వ్యానిటీబ్యాగ్ వైపు చూస్తూ అన్నాడు.

    "జరిగింది ఆరు నెలలక్రితం ఒక రేప్ అండ్ మర్డర్ కేసు. మీ స్టేషన్ జ్యూరిస్ డిక్షన్ లోనే జరిగింది. దాన్ని మీ స్టేషన్ అధికారులే దర్యాప్తు చేశారు."

    "ఓ! అదా! వివేక్ అనే కుర్రాడు సుచిత్రనే అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు."

    "ఆ! అదే....!"

    "చాలా కష్టం-చాలా గొప్పోళ్ళు ఇన్ వాల్వ్ అయిన కేసది" అన్నాడతను ఒకింత గాభరాగా.

    మనోజ్ఞ వ్యానిటీబ్యాగ్ లోంచి వెయ్యిరూపాయల కట్ట తీసి అతని ముందున్న టీపాయ్ మీద నిర్లక్ష్యంగా పడేసింది.

    "ఆ కేసులో విచిత్రమేముంది?"

    మనోజ్ఞ మరో కట్టని టీపాయ్ మీద పడేసింది.

    కుండ అడుగున వున్న నిజాలు పైకి రావాలంటే. నోట్ల కట్టలు వేయాలి. డబ్బుంటే ఇండియాలో కానిపనేదీ వుండదేమో.

    "చెప్పండి మీకేం కావాలి....?" టీపాయ్ మీదున్న రెండు కట్టల వైపు ఆశగా చూస్తూ అడిగాడు.

    "వివేక్ నిజంగా రేప్ చేసి చంపాడా?" అంటూ మరో కట్ట వేసింది.

    "లేదు పాపం....ఎవరో చేసి అతని మీదకు తోశారని నా అనుమానం. కానీ పెద్దోళ్ళు అందులో ఇన్ వాల్వ్ అయి వున్నారు. అందుకే అది...."

    "మీ దర్యాప్తు యంత్రాంగం నిజాల్ని కప్పిపుచ్చింది గదా....?" అంటూ మరో కట్ట వేసింది.

    ఆ డబ్బును చూసి అతని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.

    "ఆఁ....అంతేగదా?"

    "అసలు దోషుల్ని రక్షించేందుకు నిందితుడు వివేక్ పైన కేసుని బనాయించారుగాదూ....?"

 Previous Page Next Page