Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 24

    "గుడ్ మార్నింగ్" అన్నాడు వివేక్ నవ్వుతూ.

    విచిత్రమైన పలకరింపు.

    అతనేనా? వివేకేనా? తననేనా విష్ చేసింది?

    ఆశ్చర్యపోతూ తనూ "గుడ్ మార్నింగ్" అన్నాడు.

    మరో పావుగంటకు కొత్తగా కట్టబోయే బ్యారల్ పునాదుల దగ్గర కలిసారిద్దరూ.

    క్రితం రోజు ఉదయం కూరగాయల తోట దగ్గర జరిగిన సంఘటన గురించి-క్రితం రాత్రి తనమీద జరగబోయిన పర్ వర్టెడ్ సెక్స్ దాడిగురించి చెప్పాడు ఎగ్జయిట్ మెంట్ తో.

    రామదాసు ఆశ్చర్యాన్ని నటించాడు.

    వివేక్ కి తెలీదు- ఆ రెండు సంఘటనల్ని సెంట్రీలయిన చిదంబరం, నిరంజనం ద్వారా తనే క్రియేట్ చేసినట్లు.

    "నౌ ఐ వాంట్ డూ సమ్ థింగ్....ఎస్....నేను ఏదోకటి చేయాలి- చెప్పండి....నౌ ఐయామ్ రెడీ" అన్నాడతను ఆవేశంగా.

    అప్పుడు నిజంగానే ఆశ్చర్యపోయాడు రామదాసు.

    "శభాష్....అదే మాట మీద, పట్టుదల మీద నిలబడి నా కొడుకువనిపించుకో" అని మాటలు వినిపించేసరికి ఇద్దరూ ఉలికిపాటుగా వెనుతిరిగి చూశారు.

    అక్కడ వేదవతి....ఆడ ఖైదీల పనిని పర్యవేక్షించే నెపంతో అక్కడికొచ్చిందావిడ.

    ఒక్కక్షణం అటూ ఇటూ అనుమానంగా చూసి.... చటుక్కున కొడుకు దగ్గరకు చేరి తన అక్కున చేర్చుకుందతన్ని.

    రామదాసు కళ్ళు చెమ్మగిల్లాయి ఆ దృశ్యాన్ని చూసి.


                            *    *    *    *


    అదే రోజు ఉదయం సరిగ్గా తొమ్మిదయ్యింది.

    మనోజ్ఞ పోలీస్ స్టేషన్ రైటరు తలుపు తట్టింది. అప్పుడామె బురఖా లోనే వుంది. స్టేషన్ రైటర్ భార్య లోపలకు రమ్మని సంజ్ఞ చేసింది. మనోజ్ఞ లోపలకు వెళ్ళగానే తలుపువేసి కొంగుచాటు నుంచి జిరాక్స్ కాపీ కట్టని తీసింది.

    దాన్ని చూస్తూనే మనోజ్ఞ కళ్ళు మెరిశాయి.

    వెంటనే ఆరువేలు ఆమెకిచ్చి- జిరాక్స్ కాపీస్ తీసుకుంది మనోజ్ఞ.

    "ఈ విషయం బయటకు తెలిస్తే మా ఆయన ఉద్యోగం పోతుంది. ఎక్కడా చెప్పకమ్మా....పిల్లలు వున్నవాళ్ళం...." ఆమె అర్ధింపుగా అంది.

    "నాకూ అదే కావాలి. నేనెక్కడా చెప్పను. మీరూ మీ భర్తకు చెప్పండి. థాంక్స్....వస్తాను" అని చటుక్కున తలుపు తీసుకుని బయటకొచ్చిందామె. అక్కడ ఎక్కువసేపు వుండటం క్షేమం కాడని, కాలి నడకన సూర్యా ఎన్ క్లేవ్ కేసి బయలుదేరింది.

    పావుగంటలో ఇంటికి చేరుకుని, తన గదిలోకెళ్ళి తలుపులేసుకుని ఎఫ్.ఐ.ఆర్. చదవటం ప్రారంభించింది.


                           *    *    *    *


    రాత్రి ఎనిమిది గంటల సమయం....

    జైలు ఎప్పటిలాగే నిశ్శబ్దంలో కూరుకుపోయింది.

    ఆ సాయంత్రమే కబురుపెట్టి వుండటంతో సబ్ జైలర్ నాయుడు ఠంచనుగా ఎనిమిది గంటలకు రామదాసు సెల్ ముందు ప్రత్యక్షమయ్యాడు.

    "చెప్పు రామదాసూ! నీకేం సహాయం చేయమంటావ్? నాకేం యిస్తావ్?" డైరక్ట్ గా విషయంలోకి వెళ్ళాడు నాయుడు.

    "ఎవరూ రారుగా? ముఖ్యంగా వీరనారాయణగారు...."

    "రారు-ఏడింటికేగా రౌండ్స్ వేసుకుని వెళ్ళారు. ఇప్పుడాయన....వాళ్ళావిడ, కూతురుతో కలిసి టీవీలో ఏదో సినిమా చూసే టైమ్....చెప్పు...."

    "ఈ జైల్లో ఉన్న ఒక ఖైదీకి నేను ట్రైనింగ్ యివ్వాలి....పదిహేనవ వార్డ్ చివర వున్న పండ్లతోటే దానికనువయిన ప్రదేశం. ఇది వీరనారాయణ దృష్టికి రాకుండా నువ్వు మేనేజ్ చేయాలి. చేస్తావా?" అడిగాడు రామదాసు.

    వాళ్ళ సంభాషణంతా చెవులు రిక్కించి శ్రద్ధగా వింటున్నాడు వివేక్.

    "చేస్తాను- కానీ రిస్క్ తో కూడుకున్న పని....తడి బాగా వుంటే-" నసిగాడు నాయుడు.

    "నువ్వు ఓకే అంటే రేపే కిట్టూ నీకు జైలు బయట పదివేలు అడ్వాన్స్ యిస్తాడు. మొత్తమెంత కావాలో నువ్వే అడుగు?"

    ఒకింతసేపు ఆలోచించాడు నాయుడు.

    "ఏభయ్ వేలు" ఇస్తాడో లేదోనన్న సందేహమున్నా మరీ తక్కువ అడిగితే బేరమాడతాడేమోనని అంతడిగాడు నాయుడు.

    కొద్దిక్షణాలు ఆలోచిస్తున్నట్లుండిపోయి....

    "ఓకే....డన్....అయినా కాస్త ఎక్కువే సుమా...." నవ్వుతూ అన్నాడు రామదాసు.

    "ఏం ఎక్కువ బాసూ! నువ్వు లక్షాధికారివి.... వెనుకా ముందూ ఎవరూ లేనివాడివి...."

    నాయుడు మాటలకు రామదాసు కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. చనిపోయిన తన పెళ్ళాంబిడ్డలు గుర్తుకొచ్చి. అయినా వెంటనే తేరుకుని కళ్ళు తుడుచుకుని అన్నాడు-

    "రాత్రయితే బావుంటుంది. పగలయితే అందరూ చూస్తారు. ఈ ఆపరేషన్ సీక్రెట్ గా, చీకటిమాటున జరిగిపోవాలి."

    "అందుకే బాసూ! ఎక్కువ అడిగాను. ఈ పన్నెండవ బ్యారక్ నుంచి మీ ఇద్దర్నీ పదిహేనవ బ్యారక్ వెనక్కు తీసుకెళ్ళాలా? సెంట్రీలని మేనేజ్ చేయాలా? ఆ సమయంలో సూపరింటెండెంట్ గారు రాకుండా చూసుకోవాలా? ఒకవేళ పొరపాటున వస్తే- ముందుగా మనకు తెలియజెప్పేందుకు మరో ఇద్దరు గార్డ్స్ ని పెట్టాలా? ఇన్ని పనులు మాటలా?"

    నవ్వాడు రామదాసు.

    "మీరు తలచుకుంటే బందోబస్తు అలాగే వున్నా ఈ జైలు నుంచి ఖైదీల్ని బయటకు వదలగలరు- బయటివాళ్ళు జైల్లోకి ప్రవేశించేలా చేయగలరు. మీ సామర్ధ్యం నాకు తెలీదా?

    ఎన్ని జైళ్ళనుంచి ఎంతమంది తప్పించుకోవటంలేదు....? ఎంతో పటిష్టమైన తీహార్ జైలునుంచే ఛార్లెస్ శోభరాజ్ తప్పించుకోలేదా?

    బందోబస్తులో నిర్లక్ష్యం-అధికారుల అవినీతి-మాఫియా నాయకుల ప్రమేయం ఇండియన్ జైల్స్ లో సర్వసాధారణం. ఆ కహానీలు నాకు వినిపించకు" నవ్వుతూ అంటించాడు రామదాసు.

    అవన్నీ వింటున్న వివేక్ విస్తుపోయాడు.

    అవి అతనికి అప్పుడే తెలిసిన నిజాలు.

    "మరెలా ఛస్తాం చెప్పు ఈ జీతాలతో, ఈ జీవితాలతో. ఇంతకీ ఎప్పటినుండి ఆపరేషన్?"

    "వీలయితే ఈ రాత్రినుంచే....అదీ నా మీద నమ్మకముంటేనే."

    "ఎంతమాట....ఓకే....డన్.... ఇంతకీ ఎవరికి ట్రైనింగ్?"

    "ఆ సెల్ లో ఉన్న వివేక్ కి."

    "వ్వాట్?!" ఆశ్చర్యపోతూ అన్నాడు నాయుడు.

    "ఎస్....అతనికే"

    "అతనో పావురం....పావురానికి ట్రైనింగిస్తే - మహా అయితే ఉత్తరాలు మోస్తుందేమో....మరోసారి ఆలోచించి గట్టివాడ్ని ఎన్నుకోరాదూ!"

    "ఈ రామదాసు తలచుకుంటే నేటి పావురమే రేపటి గండభేరుండ పక్షయిపోతుంది. నా లెవెల్ మర్చిపోయి మాట్లాడుతున్నావు" చిరుకోపముతో అన్నాడు రామదాసు.

    "లే....లేదులే....నీ ఇష్టం" గాభరాగా అన్నాడు నాయుడు.

    "ముహూర్తం ఈ రాత్రి పదకొండు గంటలకి. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో....వెళ్ళిపో...." అన్నాడు రామదాసు.

    నాయుడు వెళుతూ వెళుతూ వివేక్కేసి ఒకసారి చూశాడు.


                           *    *    *    *


    మనోజ్ఞ ఎఫ్.ఐ.ఆర్. జిరాక్స్ కాపీని అప్పటికి మూడుసార్లు చదివింది. నాలుగోసారి చదువుతూ టైప్ రైటర్ ముందు కూర్చుంది.

    ఆ ఎఫ్.ఐ.ఆర్ లో సుచిత్ర ప్రస్తావనే తప్ప మరో యువతి ప్రస్తావన లేదు.

    వాంటెడ్ గానే ఒమిట్ చేశారా?

    లేక నిజంగానే వివేక్ కేసులో ఉంది సుచిత్ర ఒక్కతేనా?

    'ఇది కస్టమ్ మేడ్-కరెప్టెడ్ మేడ్ ఎఫ్.ఐ.ఆర్.' అని స్టేషన్ రైటర్ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. దీన్ని తను పూర్తిగా విశ్వసించనక్కర్లేదు.

    జిరాక్స్ కాపీని పక్కనపెట్టి, టైప్ చేయటం ఆరంభించింది.

    ఒకపక్క చట్టపరంగా విడిపించే ప్రయత్నం....

    మరోపక్క తప్పించుకుని, చేయని నేరాల్ని నిజంగా చేయాలనే పథకం....

    రెంటి అంకాలు ఆరంభమయ్యాయి. అవి ఎక్కడికి దారితీస్తాయో ఎవ్వరూ వూహించలేని వుద్విగ్న స్థితి ఆ కేసు పరంగా కాళ్ళూనుంది.

    రక్షించే ప్రయత్నం....

    విడిపించే ప్రయత్నం....

    ఏది ముందో....ఏది వెనుకో తెలీని స్థితి....

    ఏ ఒక్కటి ముందు జరిగినా, రెండవ ప్రయత్నం ఆటోమేటిగ్గా ఆగిపోతుంది.

    మనోజ్ఞ చాలా తెలివికలది, పట్టుదల కలది, తనంటే ప్రాణమిస్తుందని తెలీని వివేక్, ఆమె ప్రయత్నాల మీద ఆశ వదులుకున్నాడు. వేరే దారిని ఎన్నుకునే ప్రయత్నంలో వున్నాడు.

    రామదాసు, వేదవతి వివేక్ జీవితంలోకి చొచ్చుకుపోయి, చట్టవిరుద్దంగా అతడ్ని తయారుచేస్తున్న విషయం మనోజ్ఞ వూహించలేక, తన ప్రయత్నాలు తను చేస్తోంది. సరయిన దారినే తను ఎన్నుకుంది.

    ఈ రెండు దారులు క్రాస్ అయితే-కలహించుకుంటే....పెను ప్రళయమే!

    వీటినేమీ పట్టించుకోని కాలం తన దారిన తను, తనను తానే కరిగించుకుంటూ వెళుతోంది.

                                                                 *    *    *    *

 Previous Page Next Page