Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 22

    "దొరికిందే సందు వేసుకున్నదే మందు" అన్నాడట వెనకటికో వైద్యుడు.
   
    "ఆలశ్యం అమృతం విషం" అని బావించిన లీడర్ లీలారాణి కష్టాలు చెప్పకుండానే టకటక కోరికలు కోరేసింది.
   
    పాపం ఆయన్ని కాస్త ఆలోచించుకోటానికి కూడ టైమివ్వకపోయే సరికి వీళ్ళ ఉచ్చులో అంతటి మహాశివుడు పడనేపడ్డాడు.
   
    "తథాస్తు. మీ కోరికలు ఈ క్షణంనించే భూలోకంలో అమలు జరుగుతాయి." అన్నాడు ఆ పరమ శివుడు వెనకా ముందు ఆలోచించకుండా.
   
    అందరు ఒక్కసారిగా "శివ శివ" ధ్వనులు చేశారు.
   
    అరుణవర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర మాత్రం "శివ్ జీ! మీకిదే నా రెడ్ శాల్యూట్" అంది.
   
    వాళ్ళక్కావాల్సిన వరాలిచ్చాం తర్వాత తను నోరు జారినట్టు గ్రహించుకొన్నాడు పరమ శివుడు. వరాలిచ్చాం తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవడం అసాధ్యం. సృష్టిణే తహరుమారు చేసే తనిచ్చిన వారాలకి తనే చిన్నబుచ్చుకుని అలా దిగాలుగా చూస్తు బూడిద కుప్పమీద కూర్చుండి పోయాడు.
   
    ఇంక శివుణ్ణి మాట్లాడిచ్చి ప్రయోజనం లేదని గ్రహించిన ఆ మహిళా మణులు ఇంకా అక్కడుంటే ఏం కొంప మునుగుతుందో అని తలా గుప్పెడు బూడిద తీసుకొని చెంగుల్లో మూట గట్టుకొని ఆయనతో మాట మాత్రంగా వెళ్ళొస్తామని చెప్పి తలో నమస్కారం పెట్టి అక్కడ్నించి వేగంగా భూలోకం వైపు సాగారు.
   
    శివుడు దిగ్భ్రాంతి నించి ఇంకా తేరుకోలేదు.
   
                                               *    *    *    *
   
    నారదుల వారికి కావలసినంత పని.
   
    నారద మహర్షులవారు మాయా రూపంతో వీళ్ళకు కనబడకుండా ఆడవాళ్ళని వెన్నంటి అన్ని లోకాలకి వచ్చాడు. చివరికి ఆడవాళ్ళంతా కలిసి ఆ పరమ శివుడి ద్వారా తమ కోర్కెలని నెరవేర్చుకుని మహా సంతోషంతో తిరిగి వెళ్ళటం కూడా చూశాడు.
   
    దరిదాపుల్లో ఆడవాళ్ళు లేకపోవడంతో నిర్భయంగా పైకే "నారాయణ.... నారాయణ...." అనుకొని తుంబర మీటల్ని టింగ్ టింగ్ మని మోగించాడు.
   
    "ఈ మధ్య కాలంలో నాకు కాలక్షేపం లేక నా ఉదరం కూడా పీక్కుపోయి అదేదో రోగం వచ్చినవాడిలా తయారయ్యాను. ఈ ఆడవాళ్ళ కొత్త కోర్కెలతో కొత్త కధలతో మళ్ళీ నా పొట్ట నా కొచ్చేసింది. నా పొట్ట ఉబ్బిపోతున్నది. ఈ పరమ రహస్యం అందరి చెప్పిరావాలి." అనుకొంటు మేఘాలపైన పయనిస్తున్న నారదమహర్షి ఆఘమేఘాలమీద బయల్దేరి అందరు దేముళ్ళ దగ్గరికి వెళ్ళి "ఆడవాళ్ళు తమ కోర్కెలు సాధించుకోవడం...పరమ శివుడు వాళ్ళకి వరాలివ్వడం ... అక్కడ భూలోకంలో మార్పు బయల్దేరడం" అన్నీ వివరంగా అందరికీ చెప్పేశాడు.
   
    నారద మహర్షి చెప్పంగానే అందరు దేముళ్ళు ఆశ్చర్యంతో ముక్కుమీద వేలేసుకొని, ముక్కుమీద వేలు నోట్లోవేలు వేసుకొంటే పనులు కావని గ్రహించి అందరు కలిసి ఒకచోట సమావేశమయ్యారు.
   
    "సృష్టి చేసేవాడిని నేనైనను పరమ శివుడు ఇచ్చిన వరాలవల్ల ఇకపై నేను మార్పులుచేయాలి. పురుషులుగా తయారుచేసే మట్టిబొమ్మల్లో గర్భాశయాలు ఏర్పరచాలి. ఇంకో కొత్తపని నా అసిస్టెంట్లకి. ఇప్పటికే ఆడవాళ్ళు కనే జనాభాతో భారతదేశం ఉండనా ఊడనా అన్నట్టు ఊగిస లాడుతోంది. మగాళ్ళు కూడా వరసగా కంటూపోతే నీ భూదేవి సంగతి ఇంతె సంగతులు." విష్ణుమూర్తితో  అన్నాడు బ్రహ్మదేవుడు.
   
    "భూదేవి భారం సంగతి అలా ఉంచండి. నా నాభిలోంచే కదా మీరు పుట్టారు. కలికాలం అంతం కావాలంటే ఏదో ఒక కొత్త మార్గం అవసరం. పోయిందేముంది! మగవాళ్ళకి కూడా కడుపులు రానీండి. వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడతారు. మనకా పాట్లు లేవు. కొంతలో కొంత బతికిపోయాం." నవ్వుతూ అన్నాడు విష్ణుమూర్తి.
   
    "నీకన్నీ నవ్వులాటలుగానే వుంటయ్ విష్ణు! నా మటుకు నేను తొందరపడి ఒళ్ళుమరచి వరాలిచ్చానేమోనని బాధపడుతున్నాను." పరమ శివుడు దిగాలుగా అన్నాడు.
   
    "నీకేం నీవు వరాలిచ్చి ఊరుకున్నావ్. ఈ విష్ణువుకేమో అన్నీ ఎకసెక్కాలు...హేళనలు....ఎలా నవ్వుతున్నాడో చూడు. ఇప్పుడు అదనంగా పనిభారంపడింది నాకు, నా అసిస్టెంట్లకి పుట్టబోయే మగాళ్ళ నుదుట అంట్లు, ముట్లు, కడుపులు గట్రా....రాతలూ గీతలూ...ఎన్ని చేయాలో!" అంటూ వాపోయాడు బ్రహ్మ.
   
    "పిత్రుశ్రీ మీరు యింక యుగాలకి పూర్వమే ఉండి ఆలోచిస్తున్నారు. మీరు పెద్దవారయ్య ఈ చేతికింద సరీగా చదువు సంధ్యలు రాని పట్టుమని పది మార్కులు కూడా రాని అసిస్టెంట్లని నియమించటంవల్ల వాళ్ళేనాడో మగాళ్ళ మొహాన వంకర గీతలు గీశారు ఆ గీతలే ఈనాటి భూలోకంలో మగాళ్ళపట్ల కొత్తరాతలు అయ్యాయి. ఎంతచెడ్డా కొన్నాళ్ళ పాటు మగాళ్ళకి కొత్తపాట్లు తప్పవ్" నారదుడు నవ్వుతూ శెలవిచ్చాడు.
   
    "ఇది నవ్వులాట విషయం కాదు. సృష్టి పుట్టినప్పటినించి లేని కొత్తపని ఇది. మనం మొదట్లోనే దీన్ని అరికట్టాలి ఎలా? ఒక్కసారి అందరు ఈ విషయం తీవ్రంగ చర్చించడం మంచిది. ఎవరికి ఏ ఆలోచన తడితే అది చెప్పండి." అంటు చిల్లరదేవుళ్ళవైపు తిరిగి శెలవిచ్చాడు బ్రహ్మ.
   
    శంకరుడి వరాలవల్ల పని భారం పెరిగేది బ్రహ్మకి. ఆందోళన కాక మరెవరికి! బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాక మిగతా దేముళ్ళంతా కలిసి ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచించారు చర్చించారు. ఎవరికి ఎటువంటి ఆలోచనలూ రాలేదు. ఏం చేయాలో అర్ధంకాలేదు. ఎవరికి వారే నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు.
   
    చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
   
    తెలివి తక్కువగ శివుడు వరాలివ్వటం... ఆ వరాలని విష్ణువు తిప్పికొట్టడం...గతంలో చాలాసార్లు జరిగిందే. ఇప్పుడు కూడ అంతా కలిసి ఆ విష్ణువునే వేడుకొన్నారు.
   
    "కొన్నాళ్ళపాటు భూలోకంలో మగవాళ్ళు ఈ విధమైన కష్టాలకి గురికావడం మంచిదే. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ కష్టాలని మగవాళ్ళు పట్టించుకోవడం లేదు. అందువల్లనే ఇందరు ఆడవాళ్ళు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. తొందరపడి శివ వరాలిచ్చినా అదీ భూలోక వాసులకి మంచిదిదే అనుకుందాం. ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్ళకి తెలిసివస్తాయ్." అన్నాడు విష్ణుమూర్తి.
   
    "తెలిసి రావడం మాట తర్వాత. నేను చేసిన పనికి విరుగుడు చెప్పవయ్యా మగడా!" అన్నాడు శివుడు.
   
    "మగవాళ్ళల్లో మార్పురానంతకాలం వాళ్ళకి ఈ కష్టాలు తప్పవ్. మగాళ్ళలో మార్పు వచ్చిననాడు ఆడవాళ్ళంతా కలిసి "మాతృత్వం మాకే కావాలి. మగవారలకి ఆ అర్హత ఉండరాదు" అని కోరిననాడు నీవు ఇచ్చిన వరాలకి విముక్తి కలుగుతుంది. నీ వరాలకి ఇదే నేనిచ్చే ప్రతివరం." గంభీరంగా అన్నాడు విష్ణుమూర్తి.

 Previous Page Next Page