Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 22

    "మీరిచ్చిన మాత్ర చాలా బాగా పనిచేసిందండీ. నిన్నటినించి వదలని జ్వరం వక్క మాత్రతో చాలా భాగం తగ్గిపోయింది. మీకు చాలా ఋణపడి వున్నాను." చాలా పెద్దమాట వాడింది పద్మిని.

    "భలేదానివమ్మాయీ! ఇందులో ఋణాల ప్రసక్తి ఏముంది? నిన్ను చూడగానే విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నానని గ్రహించాను. అంతేకాదు. చూడంగానే మరోటి కూడా అనిపించింది."

    పార్వతమ్మ సాంతం మాట పూర్తిచేయక ముందే పద్మిని అందుకుంది. "ఏమనిపించింది?" అంటూ.

    "కలవారి అమ్మాయివని. లేకపోతే బతికిచెడిన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయివని. నీ వంటరి ప్రయాణం చూస్తూంటే నాకు ఆపై ఏం మాట్లాడాలో తెలీక పార్వతమ్మ ఆగిపోయింది.

    పద్మిని చెపుతుందేమోనని చూసింది.

    పద్మిని ఏంమాట్లాడలేదు ఆలోచిస్తూ వుండిపోయింది.

    "చూడబోతే చిన్న వయసు. అనుభవం చూస్తుంటే జీవితంలో చాలా పెద్ద దెబ్బతినిన దానిలాగా కనిపిస్తున్నది." అనుకుంటూ అలా పద్మిని ముఖాన్ని పరిశీలనగ చూస్తూ ఆలోచనలో పడిపోయింది పార్వతమ్మ.

    "రాత్రి సరీగ నిద్రపట్టలేదోయ్! పై బెర్త్ ఖాళీగ వుంది. వెళ్ళి పడుకుంటాను. నిద్రలేపకు." అని పార్వతమ్మతో చెప్పి పై బెర్తు ఎక్కి పడుకున్నాడు శంకరరావు.

    నిద్రంటూ వస్తే అలా పడుకోటం యిలా నిద్రపోవటం శంకర్రావు అలవాటు. మేను వాలుస్తూనే నిద్రపోయాడు.

    పార్వతమ్మ యింకా పద్మినిని అలా చూస్తూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నది.

    ఆలోచన చాలించిన పద్మిని హటాత్తుగ కళ్ళు తెరిచింది.

    వకరినొకరు చూసుకుని రవంత కంగారుపడి మళ్ళీ సర్దుకున్నారు. పలకరింపుగ నీరసంతో కూడిన చిరునవ్వు నవ్వింది పద్మిని.

    "ఇప్పుడు వంట్లో తేలికగా వుందామ్మా! పార్వతమ్మ కూడా చిరునవ్వుతో అడిగింది.

    "రెండు రోజులబట్టీ జ్వరం. విడవకుండ వస్తున్నది. తలనొప్పి మాత్రలు తప్ప జ్వరానికంటూ ఏ మాత్రలూ వేసుకోలేదు. అందువల్ల కాసేపు జ్వరం తగ్గటం మళ్ళీ రావటం చాలా బాధపడ్డాను. ట్రైను ఎక్కటం వరకు నాకు తెలుసు ఆ తర్వాత మళ్ళీ మీరు లేపిందాక నావళ్ళు నాకు తెలియదు. మీ చల్లని చేత్తో ఏ మాత్ర యిచ్చారో గానీండి. జ్వర తీవ్రత తగ్గింది. ఇంక కాస్త వుంది." పైత్యం వాగుడులాగ విడవకుండ మాట్లాడింది పద్మిని.

    "మెటాసిన్ అది జ్వరం తగ్గే మాత్ర. మూడు గంటలకి వకసారి వేసుకోవాలి." అంతవరకు చెప్పి ఏదో అడగాలి అనుకుని మళ్ళీ కాస్త సంశయించి చివరికి అడిగేసింది పార్వతమ్మ.

    "పెళ్ళయిందా అమ్మాయీ!"

    "ఉహు!" తల అడ్డంగ ఊపింది పద్మిని.

    పార్వతమ్మకి ఎక్కువ మాట్లాడటం అలవాటు. "ఈ అలవాటు మంచిది కాదు పార్వతీ!" అని తియ్యగ మందలించటం తప్పించి శంకర్రావు ఎప్పుడూ గిరిగీసి గిరిలో కూల వేయలేదు ఎప్పుడూను. దాంతో పార్వతమ్మ తన అలవాటు మానుకోలేకపోయింది.

    "విజయవాడలో మీ చుట్టాలు వున్నారా అమ్మాయీ!"

    "ఉహూ!" అంది పద్మిని ప్రియదర్శిని తల అడ్డంగ ఆడించి

    "తెలిసినవాళ్ళు వున్నారా!"

    "ఉహూ!"

    "ఓహో, స్నేహితురాలి యింటికి వెళుతున్నావా?"

    "నేను విజయవాడ వెళ్ళటం యిదే మొదటిసారండి."

    "ఆ...!" అంటూ నోరు తెరిచి అలా వుండిపోయింది పార్వతమ్మ.

    జీవితంలో తనకి అబద్ధం ఆడే అవసరం లేదని గతంలో ఏదో మాటల సందర్భంలో ఫ్రెండ్ తో గొప్పగ అంది పద్మిని. జీవితంలో ఎప్పుడో వకప్పుడు ఎంతటి మహానుభావుడైనా ఏదో ఒకనాడు వకబద్ధం లేక వంద అబద్ధాలు ఆడక తప్పదన్న నగ్న సత్యం పద్మినికి ఆనాడు తెలియదు.

    ఆఖరికి

    వర్కర్స్ వున్న పేదవారి పేటలో వున్నప్పుడు కూడా అబద్ధం ఆడే అవసరం పద్మిని ప్రియదర్శినికి రాలేదు. బంగారుగాజు అమ్మేటప్పుడు కూడ అటు అబద్ధం ఆడకుండ ఇటు నిజం చెప్పకుండ మాట దాటవేస్తూ డబ్బు అవసరం అయింది అమ్ముకుంటున్నానని చెప్పి పని పూర్తి చేసుకుంది.

    ఇప్పుడు

    ఈ పరిస్థితిలో

    వక అబద్ధం కాదు వంద అబద్ధాలు ఆడక తప్పదు. మనసుని దహించే నిజంకన్నా మర్యాద నిలబెట్టే అబద్ధం మంచిది...అన్న నిర్ణయానికి వచ్చింది పద్మిని ప్రియదర్శిని!

    "నువ్వేమీ అనుకోనంటే ఓ మాట అడుగుతాను అమ్మాయీ!" కాస్త సంశయిస్తూనే అడిగింది పార్వతమ్మ.

    "పెద్దవారు నా తల్లిలాంటివారు. ముఖ్యంగ వళ్ళు తెలియని జ్వరంలో వున్నప్పుడు నన్ను ఆదుకున్నారు, నేను లేచి కూర్చునేలా చేశారు. అడగండి మీరేమడిగినా చెపుతాను" అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన పద్మిని మనసు నిబ్బరపరుచుకుని నీరసంతో కూడిన చిరునవ్వుతో చెప్పింది.

    "మీ అమ్మ నాన్న ఇల్లు వాకిలి..."

    పార్వతమ్మ మాట పూర్తిచేయకముందే అడ్డుతగిలి పద్మిని ప్రియదర్శిని మాట్లాడసాగింది.

    "కొందరికి అన్నీ వుంటాయి. అందరూ ఉంటారు. అవసరానికి ఉపయోగం వుండదు. నా జీవితం అట్లాంటిదే! డిగ్రీ పూర్తిచేశాను. ఏ మగాడివల్లా మోసపోలేదు. ఇంతవరకు యెవరిని ప్రేమించలేదు!

    నాకు యిష్టంలేదని చెపుతున్నా నామాట వినక ఎదురు డబ్బు యిస్తున్నారని ఓ రౌడీకి ఓ దుర్మార్గుడికి నన్ను కట్టబెట్టాలని మా మామయ్య చూశాడు. వాడిని నేను పెళ్ళాడనని చెప్పాను .ఎదురుతిరిగి చాలా గట్టిగా చెప్పాను. నా నిర్ణయం మా మామయ్యకి నచ్చలేదు.

    నేను తనమాట వినలేదని యింట్లోంచి పొమ్మనలేదు.

    గదిలో బంధించి ముహూర్తాలు పెట్టించాడు. పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ ఘనంగా చేశాడు. ఈ రాత్రికే ఆ రౌడీతో నా పెళ్ళి! గత మూడు రోజులబట్టీ నాకు జ్వరం వస్తున్నది. ఈ జ్వరంతో లేచి యిదెక్కడికి వెళుతుందిలే యింటినిండా మనుషులు వున్నారనే ధీమాతో నేనున్నగది తలుపులకి తాళం వేయలేదు. అది నా అదృష్టం!

    రౌడీ అయేది దొంగ అయేది పెళ్ళాడినా ఫరవాలేదు.

    వాడు అలాంటివాడు కాదు. ఇతర దేశాలకి అమ్మాయిలని అమ్మేవాడు. గతంలో రెండుసార్లు పెళ్ళి అయింది. బొంబాయిలో ఏదో రోగంవచ్చి భార్య మరణించిందని...ఇలాంటి కధలు చెప్పి ఎదురుడబ్బులు పారేసి మళ్ళీ పెళ్ళికి సిద్ధం అయాడు.

    లోకానికి తెలుసు వాడు ఎటువంటివాడో, అయినా యెవరూ మాట్లాడరు. వాడి సంగతి మామయ్యకి తెలుసు. అయితేనేం నా పెళ్ళి వాడితో చేస్తే తనకి బోలెడు డబ్బు వస్తుంది. నేనెలా చచ్చినా ఫరవాలేదు. అదీ విషయం! 

 Previous Page Next Page