"మీరుకూడా కూర్చోండి. నలుగురం తింటూ కబుర్లు చెప్పుకుందాం సరదాగ వుంటుంది." అంది వాసంతి.
సుశీల భర్తవేపు చూడటం అతగాడు గుడ్లురిమిచూడటం కన్నుమూసి తెరిచేలోగా జరిగింది. అది కంటబడనే బడింది వాసంతికి.
"నాకు అలవాటులేదు. మీరు తినండి నేవడ్డిస్తాను." అంది సుశీల.
"కుర్చోవోయ్ దీనికి అలవాటేమి!" అన్నాడు మోహన్.
"ఉహూ! అంది సుశీల.
"చెప్పినా వినదు, అంతే మొండి." అన్నాడు మోహన్.
"చూసినవాళ్ళు మొగుడు మంచివాడు పెళ్ళాం చెడ్డది అనుకోవాలనా! నీ రోగం నేను కుదురుస్తా." ననుకుంది వాసంతి." నామటుకు నాకు సుశీలగారి పద్ధతే రైట్ అనిపిస్తుంది. వడ్డిస్తుంటే భోంచేసినట్లుంటుంది. సుశీలగారు వంటరిగా తినాల్సివస్తుందని అన్నాగాని మరేంలేదు. అహా అహా ఈ మామిడికాయ పప్పు ఎంతబాగుందో! పప్పుతో మొత్తం అన్నం తినొచ్చు. అనవసరంగా యిన్ని చేయించారు. పాయసం పులిహోర, ఆవడలు, మైసూర్ పాక్, వేపుడుకూర వుత్తకూర. ముద్దపప్పు రసం రెండురకాల చట్నీలు, వక్కచేతిమీద యిన్ని చేయటం అభినందించదగ్గ విషయం. లక్ష్మిపతి బాబాయి అని మాకో చుట్టం వున్నాడు లెండి. తుమ్మల్లో పొద్దుగూకినట్లున్న లాంటి ముఖం ఊరికెధుమధుమ లాడుతుంటాడు. ఊరివాళ్ళ వంట నచ్చదు. పెళ్ళాంచేతివంట అసలు నచ్చదు, మహానుభావుడు వంకపెట్టంది చస్తే ముట్టడు. అలాంటి ఆయన కూడా సుశీలగారి చేతివంట తిన్నాడంటే గుమ్మైపోవాల్సిందే...
కామా పులిష్టాపులు లేకుండా వాసంతి మాట్లాడుతూనే వుంది.
మోహన్ ముఖం కందగడ్డయింది. ఆ సన్నాయి నొక్కులు తనమీదనే అని అర్ధంచేసుకున్నాడు.
భోజనాలు పూర్తి అయ్యాయి.
సినిమాకి బైలుదేరారు.
"సుశీలగారి భోజనం కానీండి. నలుగురం కలిసి బైలుదేరుదాము." అంది వాసంతి.
"సరేలేండి. ఈ జన్మకి అది అయేపనికాదు. సినిమా చూసొచ్చిందంటే చాలు తలనొప్పితో మూడు రోజులు లేవదు. ఎంతమంది డాక్టర్లకో చూపించాను. ఎన్ని వైద్యాలో చేయించాను. సినిమా అలా చూస్తే యిలా తలనొప్పి తయారు." మోహన్ అన్నాడు.
"వారు చెప్పింది నిజం నేను సినిమా చూడను. మీరు వెళ్ళండి." అంది సుశీల.
నేనుకూడా సినిమాకి వస్తానని గొణుగుతున్న కూతురిని వదిలేసి కొడుకుతో సినిమాకి బైలుదేరాడు మోహన్.
వాసంతి బలవంతంచేసి మోహన్ కూతురిని సినిమాకి బైలు దేరతీసింది. ఆపిల్లపేరు పుష్ప,
పుష్ప ముఖంలో కోటి కాంతులు.
సుశీల ముఖంలో రవంత తృప్తి.
గంటుబారిన మోహన్ ముఖం.
నిమ్మదిగా సణుగుతున్న ముసలమ్మ.
సాధించాను ఏకొంచమైనా అనే తృప్తితో వాసంతి.
ఇదేంపట్టని శ్యామ్ సుందర్.
అంతా సినిమాకు బైలుదేరారు.
క్రైమ్ సెక్స్ కలిసిన ఇంగ్లీషు సినిమాకి ఐనోకి వెళదామన్నాడు మోహన్.
"ఉహూ మనతో పిల్లలు వస్తున్నారు. నేనూ నా యిల్లాలు" సినిమాకి వెళదాం" అంది వాసంతి.
శ్యామ్ సుందర్ ఓటుకూడా వాసంతికి పడటంతో నేనూ నాయిల్లాలుకే బయలుదేరారు.
నేను నా యిల్లాలు అచ్చం మోహన్ సంసారంలాంటి కధే ఆముదం తాగినట్లు ముఖంపెట్టి కూర్చున్నాడు మోహన్.
"దరిదృడు లోకంలో యిలాంటివాళ్ళూ వుంటారు ఎంతమగడైతే మాత్రం అంతయిదా? పెళ్లానికి రోగంవస్తే పట్టించుకోని వెధవ వాడికి రోగంవస్తే మాత్రం పెళ్ళాం గాడిద చాకిరీ చేయాలేం. అసలు నన్నడిగితే, ఇట్లాంటివాడి పెళ్లాం లేచిపోవాలంటాను వాడికదే శిక్ష. పాడుముఖం వేసుకుని పాత్రకు తగ్గట్టే తగలడ్డాడు హీరో." సినిమామొత్తం ఇలా ఏదో వకటి మాట్లాడుతూనేవుంది వాసంతి.
అవునవునంటూ వాసంతి మాటలకి వంతపాడాడు శ్యామ్ సుందర్.
మోహన్ బాగా అర్ధమైంది. నేరక వాసంతిని భోజనానికి పిలిచాను అనుకున్నాడు. వళ్ళుమంట తలనొప్పి ప్రారంభం అయాయి. ఇంటర్ వెల్ లో సిగరెట్లు ఊదటానికి బయటికి వెళ్ళాడు. పిల్లలకి ఏమన్నా కొనటానికి శ్యామ్ సుందర్ కూడా బయటికి వెళ్ళాడు.
ఆ కొద్ది సమయంలో పుష్పనడిగి చాలానే తెలుసుకుంది వాసంతి.
తల్లికి తనకి సినిమాలు చూడటం చాలాయిష్టం. తండ్రికొడుకుతప్ప ఆ యింట్లో ఎవరు వెళ్ళరు. అందరూ సినిమాకి వెళితే నాకు గుండెపోటు వచ్చి చస్తే ఎలా, అంటుందిట ముసల్ది. ఆడముండలు యింట్లోనే వుండాలి. మగాళ్ళు మాత్రం బయట తిరగవచ్చు అంటాడట తండ్రి, బాగా కోపంవచ్చినప్పుడు సుశీలని కొడతాడట మోహన్, ఇలా యింటి విషయాలు చాలానే చెప్పింది పుష్ప పరాయి సంసారం గురించి ఆరాలు తీయటం తప్పని తెలుసు వాసంతికి కాని తను పొరబడలేదు అని తెలుసుకోటానికి మాత్రమే అడిగింది. వాసంతి అంచనా కరెక్ట్ అయింది.
శ్యామ్ సుందర్ మోహన్ తిరిగి వచ్చారు.
శ్యామ్ సుందర్ పిల్లలకి చాలానే కొనుక్కువచ్చాడు.
మళ్ళీ తెరమీద బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి.
భర్త అనబడే మగవాడు తాగి తందనాలాడినా కొట్టినా తిట్టినా మరో మగువని తెచ్చుకొని దానిబట్టలు కూడా భార్యచేత వుతికించినా ఎన్నిరకాలుగా ఎన్ని వెధవపనులు చేయవచ్చో అన్ని చేసినా భార్య అనబడే అబల నీతి నియమాలతో ఓర్పుగా వుంటే ఆ సంసారం చివరి ఘడియల్లోనయినా సరే స్వర్గతుల్యం కావటం ఖాయం అనే హామీతో చిత్రం ముగించాడు దర్శకుడు.
"ఆడదానికి సహనం వుండటంవల్ల ముసలితనంలో కూడా భర్తకి వండిపెట్టి చాకిరీ చేయవచ్చు గొప్ప నీతిసూత్రం దర్శకులవారు మననెత్తిన రుద్దారు." బయటికి వచ్చింతరువాత వాసంతి అంది.
ఎందుకైనా మంచిదన్నట్లు మోహన్ మారు మాట్లాడకుండా అవతలికి వెళ్ళి రెండు రిక్షాలు మాట్లాడుకుని వచ్చాడు.
శ్యాంసుందర్ వాసంతి వకరిక్షా ఎక్కారు. మోహన్ పిల్లలు మరో రిక్షా ఎక్కారు.
చెరోదోవన బయలుదేరాయి రిక్షాలు.
"వాళ్ళ సంసారం గమనించావా శ్యామ్?" వాసంతి అడిగింది.
"ఆ......"
"అలాంటివాడితో యింత దోస్త్ గా ఎలా వున్నావ్?
మోహన్ తప్ప అతని ఫామిలీ నాకు తెలియదు. బయటకూడా అతను ఆడవాళ్ళమీద వల్గర్ జోక్స్ విసురుతుంటాడు. మా మగజాతి సాధారణంగా అలాంటివి పట్టించుకోము. పాపం, సుశీలగారు మనకోసం ఎన్ని చేసిందో! ఏదైనా ఆడదాన్ని హీనంగాచూస్తే నేను భరించలేను వాసంతీ! మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మోహన్ కి నేను చాలాసార్లు డబ్బు సాయంచేశాను. అందుకు బోజనానికి పిలిచాడు" శ్యాంసుందర్ అన్నాడు.