Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 22

    శివపాదం మాట్లాడలేదు.
    "ఏం పలకరు?"
    "మిష్టర్ శ్రీకర్! మీరు చెప్పినట్టుగా చేయాలంటే కుదరదు. ఫ్యాక్టరీ దివాలా తీస్తుంది యిలా అయితే. ప్రతి రిఫ్ రాఫ్ గాడు యాక్సిడెంట్ చేసుకుని క్లయిమ్ పెడతాడు!"
    శివపాదం మాటలకి ఏవగింపు కలిగింది శ్రీకర్ కి. "సారీ మిష్టర్ శివపాదం! మీ మాటలతో నేను ఏకీభవించలేను. చూసిచూసి ఎవరూ నిండుప్రాణాల్ని బలిచేయలేరు. మరీ ఘోరంగా వూహిస్తున్నారు మీరు. వాళ్ళు వర్కర్స్ అయినంతమాత్రాన పశువులుకారు. వాళ్ళూ మనుషులే! అయినా అదంతా యిప్పుడెందుకు ముందు డబ్బు యిచ్చి పంపండి."
    "మూడొందలు చాలు శవంఖననానికి."
    "మూడొందలా?"
    "అవును...అదీ యెక్కువే!"
    "ఛ! శవాలతో ఆడుకునే మనిషిలా మాటాడొద్దు. వేయి రూపాయలు యిచ్చెయ్. నే చెప్పినట్టు లెక్కవేసి చెక్ తయారుచేయించు దట్సాల్."
    "సారీ! నేను చేయలేను."
    "ఏం?"
    "మీ మామగారు ఒప్పుకోరు."
    "ఆయన్ని నేను ఒప్పిస్తాను."
    "మీ యిష్టం. యిప్పుడే నేను మాటాడాను. నేచెప్పిన ఫిగర్ ఆయన నోటంట వచ్చిందే."
    ఆ మాటవిని షాకయ్యాడు శ్రీకర్. "ఆయన అలా చెప్పారా? ఎక్కడున్నారు? ఇంట్లోనా?"
    "ఊహూ ఎడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో వున్నారు."
    చకచక వెళ్ళాడు శ్రీకర్ పైకి. అతన్ని చూడగానే కాలుస్తోన్న పైపులో మరింత పొగాకు దట్టించాడు గోవర్ధన. కమాన్!" అన్నాడు మామూలుగా.
    "శివపాదానికి మీరేం చెప్పారు?"
    "ఏ విషయం"
    "శాయన్న ఖననానికి యిచ్చే విషయం! మూడొందలు చాలు అన్నారా? కాంపెన్సేషన్ ఎంత యివ్వను అన్నారు?"
    "ఓ! ఆ విషయమా? కూర్చో స్థిమితంగా!"
    "చెప్పండి!" కూర్చున్నాడు.
    "శ్రీకర్! డబ్బుందని దానధర్మాలు చేస్తూ వెళితే ఆఖరికి మనకి పైసా కూడా మిగలదు. ఆగు, నువ్వు వూరకే ఆవేశపడద్దు. నువ్వనుకున్నంతగా వారు ప్రాణాలకి విలువ ఇవ్వరు. శాయన్న ఈరోజు పోతే అతని భార్య బ్రతుకు బయటపడదు. నెల తిరిగీ తిరక్కముందే మరొకడి అండ చూసుకుంటుంది. నీతి విషయంలో వాళ్ళు అట్టే పట్టింపులు పెట్టుకోరు. తెలుసా? అందుకే మనం ఎంత్తిచ్చినా దాని విలువ వుండదు. నువ్వు అతని సర్వీస్ కాలమంతా లెక్కకట్టి యివ్వమన్నావట. అది ముప్పై ఆరువేలు అవుతుంది. అంతడబ్బు యిస్తే వాళ్ళదృష్టి మరోవిధంగా తయారై మనం నెలకోసారన్నా అంత యివ్వాల్సి వుంటుంది. కాబట్టి నీవు యీ విషయంలో జోక్యం చేసుకోవద్దు!"
    ఆ మాటలు వినగానే శ్రీకర్ కడుపులో దేవినట్టయింది.
    "దయచేసి నే చెప్పినట్టుగా యివ్వండి. నేను యీ కార్మిక సోదరుని తరుపున మాటాడుతున్నాను అంతే!"
    శ్రీకర్.
    అవును మావగారూ! వాళ్ళు నన్ను నమ్మి నా వద్దకు వచ్చారు. ఇన్నాళ్లూ వాళ్ళకీ మీకూ న్యాయం చేకూర్చిన నేను ఇప్పుడు అన్యాయం చేయలేను!"
    "సరే! అయితే నేను మేనేజింగ్ పార్టనర్ గా చెబుతున్నాను. అంతకుమించి యివ్వను ఇక వెళ్ళు అంతే!"
    "అంకుల్ పరిస్థితి విషమిస్తుంది. వాళ్ళు తిరగబడితె!"
    "బెదిరిస్తున్నావా?"
    "లేదు హెచ్చరిస్తున్నాను."
    "దట్సాల్! నా స్టెప్స్ నే తీసుకుంటాను. యు కెన్ గో!" 
    "అంకుల్! నా మాట వినండి. కార్మికులతో ఘర్షణ వద్దు."
    "నథింగ్ డూయింగ్! నేనిక్కడ నీ అంకుల్ ని కాను శ్రీకర్. మేనేజింగ్ పార్టనర్ ని. నన్ను సార్ అని పిలువు దట్సాల్!"
    "గోవర్ధనంగారూ! మీరు నిదురించే బెబ్బులిని రెచ్చగొడుతున్నారు. కార్మికులు చెలరేగితే సమ్మె చేస్తారు ఆస్థినష్టం కలగొచ్చు! ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు!"
    నీ బెదిరింపులు సాగవు! మీరు సమ్మెచేస్తే నేను లాకౌట్ చేయిస్తా! నాకు నేర్పిస్తావా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట! పాపమని చేరదీసినందుకు విశ్వాసం లేకుండా నాకే ఎసరు పెడతావా?" గెటౌట్! నిన్ను... నిన్ను..."
    ఆయన ధోరణికి ఆశ్చర్యపోయాడు శ్రీకర్. ఆయన్ని మేనేజరు ఎలా రెచ్చగొట్టిందీ అర్ధమైంది. అంతలో మేనేజరు అక్కడికి వచ్చాడు.
    "ఏమిటి?"
    "సార్! శాయన్న భార్య నాలుగొందలు అడిగి తీసుకొని వెళ్ళింది. ప్రాణ నష్టపరిహారంక్రింద మూడువేలు ఇస్తానంటే సంతోషంగా అంగీకరించి యీ కాగితంమీద సంతకం చేసి వెళ్ళింది!"
    ఆ పేపరు అందుకుని చూశాడు. అది డబ్బు ముట్టినట్టుగా స్టాంప్ డ్ రిసీట్. మేనేజర్ వైపు అర్ధవంతంగా చూశాడు గోవర్ధనం...శివపాదం మెల్లిగా నవ్వాడు కళ్ళు చికిలిస్తూ...
    "యస్! యు కెన్ గో..."
    "యిదిగో చూశావా? ఇదీ ఎడ్మినిస్ట్రేషన్ అంటే విన్నావుగా ఏంజరిగిందో అదంతే...వాళ్ళ మనస్తత్వాలు అంతే! నువ్వు వాళ్ళని నీ స్థాయికి తేవాలన్నా తేలేవు. ఇక నుంచి ఫ్యాక్టరీకి రాకు...నీకు మరోపని చూసేదాకా యింటి విషయాలు చూస్తూవుండు!"
    శ్రీకర్ కి లోకమంతా చీకటి కమ్ముకున్నట్టయింది. శివపాదం శకుని రాజకీయాలు, గోవర్ధనం మాయాపరిపాలన అతనికి వెగటుకలిగించాయి. ఆలోచనలతో ఇంటికి వెళ్ళాడు.
                                           23
    గోవర్ధనం మాట్లాడి బయటికివచ్చాడు శ్రీకర్ తో అతనికి సోదర కార్మికులను చూడ్డానికి ముఖం చెల్లలేదు. యజమానుల దోపిడి మనస్థత్వాన్నీ ఆ మనస్తత్వానికి అలవాటుపడిన మేనేజ్ మెంట్ నీ, కార్మికులనీ అతను అసహ్యించుకున్నాడు.
    అతను బయటకు వచ్చేసరికి అక్కడెవరూ లేరు. యంత్రాల శబ్దం వినిపిస్తోంది ఫ్యాక్టరీ పనిచేస్తుంది.
    అతనికి నిలువునా దహించుకు పోయినట్టుగా అయింది. ఇంటిప్రక్కలోవున్న యువకుడు చనిపోతే, పెళ్ళిచేసుకుంటూ విందుఆరగించే మనిషిగా కనిపించింది ఆ ఫ్యాక్టరీ...  

 Previous Page Next Page