వాణి మొహం వాడిపోవడం చూసి రాజారావు ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని అవిరామంగా వీణ వాయించడంవల్ల వేళ్ళమీద గాట్లలా పడిన వాతలని చూస్తూ "చూడు యీ చేతులు ఆ పాడు వీణ వాయించి ఎలా తయారయేయో? ఇకమీదట యీ చేతులకి విశ్రాంతి యియ్యి..." అంటూ వాణిని మరింత దగ్గరకు లాక్కున్నాడు.
అతని కౌగలినించి విడిపించుకుని చిటుక్కున లేచి నిలబడింది....
వాణి రాజారావు నోటినించి విస్కీ సిగరెట్లు కలిసిన వాసన వెగటుగా అన్పించింది.
"ఛీ-ఏమిటిది? దయచేసి వదలండి- ముందు నన్ను వదలండి" అంది కటువుగా.
ఆమె కళ్ళలో తిరస్కారానికి ఆమె గొంతులో కఠిన త్వానికి అహంకారం దెబ్బతిని అప్రయత్నంగానే ఆమెని వదిలేశాడు.
"ఇలా ఎప్పుడూ చేయకండి నాకిష్టంలేదు" వాణికి కోప్మతో నిస్సహాయతతో, అవమానంతో కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. చటుక్కున గదిలోంచి బయటికి పరిగెత్తింది.
ఆ రాత్రంతా వాణి నిద్దరపోలేదు. మాటి మాటికి రాజారావు స్పర్శ గుర్తువచ్చి జుగుప్సతో ఆమె మనసు నిండి పోయింది. ఈ మనిషిని ఎలా భరించడం? ఈ పెళ్ళి చేసుకోవడం ఎలా? దిగులుతో బెంగతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో రాత్రంతా జాగరణం చేసింది వాణి. కనీసం రేపు వెళ్ళిపోవాలి ఏదో వంక చెప్పి-అని నిశ్చయించుకుంది.
* * * *
ఉదయం తొమ్మిదిగంటలవేళ వాణి వంటగదిలోవుంది. రాజారావు యింకా నిద్ర లేవలేదు.
"అమ్మగారూ, మీకోసం ఎవరో వచ్చారు....." అన్నాడు పనివాడు.
వాణి గుండె ఝల్లుమంది. కొంపదీసి కిషోర్ కాదు కదా? అనుకుంది. "ఎవరూ?" అంది ఆశ్చర్యంగా.
"మీ తమ్ముడుగారంట" అన్నాడు. వాణి మరింత ఆశ్చర్యపోయింది. సత్యం ఎందుకు వచ్చాడు చెప్మా-ఏం జరిగిందో? వాణి ఆరాటంగా ముందు హాలులోకి వచ్చింది.
"సత్యం! ఏమిటిరా ఇలా వచ్చావు? ఏం జరిగింది?" గాభరాగా అడిగింది హాలులోకి వస్తూనే.
"ఏం లేదక్కా, మరేం కంగారుపడకు, చిన్న పని వుండి....ఏం లేదక్కా-ఓ మంచి పేపరు ఏజన్సీకి అవకాశం వచ్చింది. ఇది వరకటి ఏజంటు మానుకుంటున్నాడు. అతని స్థానంలో ఆ పేపరు నేను తీసుకుందామనుకుంటున్నాను. దానికి ధరావతుగా ముందు రెండువేలు కట్టాలి. ఆ డబ్బు కడితే నెలకి అన్ని ఖర్చులు పోగా మూడునాలుగు వందలు మిగులుతాయి. ఎవరిమీద ఆధారపడకుండా అమ్మవాళ్ళని చూసుకోగలను. అమ్మ ఈ సంగతి విని ఎలాగైనా ఈ రెండు వేలు.... రాజారావుగారిస్తే...ఇంక ఆయనమీద మనం ఆధారపడనక్కరలేదు. ఈ ఒక్కసారీ యీ సహాయం చెయ్యమని అడుగు-వాణి అక్కడే వుంది వెళ్ళి అడుగు అంటూ పంపింది. నీ వెలాగైనా ఆయనతో చెప్పి ఈ డబ్బు యిప్పించాలి అక్కా, ఇంక రెండురోజులే టైముంది" అన్నాడు సత్యం ఆరాటంగా గబగబ.
"రెండువేలే" అంది వాణి "అమ్మో- ఒక్కసారి రెండువేలు ఎలా అడగడం? ఇంకా పెళ్ళన్నా కాకుండా రెండువేలు ఎలా అడగనురా?" అంది మొహమాటపడ్తూ ఇబ్బందిగా.
ఆలోచించగా సత్యం చెప్పింది నిజమే. రెండువేలు ఇచ్చేస్తే ఇంక తనకు వాళ్ళగురించి నిశ్చింత-కాని రాజా రావుని ఎలా అడగడమో-అడిగితే ఏమంటాడో, ఏమూడ్ లో వుంటాడో? ఇవ్వకపోతే అడిగి లేదనిపించుకోడం ఎంత చిన్నతనంగా వుంటుంది. చివరకి అనసూయమ్మగారిని ముందుగా అడుగుదామనుకుంది వాణి.
సత్యాన్ని అనసూయమ్మగారిదగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసింది.
"అలాగా....కూర్చోబాబూ! వాణీ, ఉదయమే బయలుదేరి వచ్చినట్లున్నాడు. కాఫీ ఫలహారాలు పెట్టు" అంటూ అతిథి మర్యాదలు జరిపించి "ఏం బాబూ, ఇలా వచ్చావు? వారం రోజులకే అక్కమీద బెంగ పుట్టిందా?" అంది అభిమానంగా.
"లేదండీ.....చిన్న పనిమీద వచ్చాను" అంటూ వాణివైపు చూశాడు చెప్పమన్నట్టు.
వాణి చాలా మొహమాటపడ్తూ, ఇబ్బంది పడ్తూ, సిగ్గుపడ్తు, సత్యం రాకకి కారణం వివరించింది.
"ఆహా....అలాగా-పోనీలే మీ కుటుంబానికి ఏదో ఆధరువు ఏర్పడుతుంది. రాజా లేచాక నేను అడుగుతాను. అబ్బాయికి కాఫీ ఫలహారాలు పెట్టు" అందావిడ.
వాణి గుండెలమీదనుంచి బరువు దింపినట్లు అయింది. కృతజ్ఞతతో భక్తిగా ఆమెవంక చూసి తమ్ముడ్ని తీసుకుని కిందకి వెళ్ళింది.
సత్యానికి కాఫీ టిఫిను ఇచ్చి కింద పని చూసుకుని అనసూయమ్మకి హార్లిక్స్ తీసుకు వెళ్ళింది. ఆవిడ గది దగ్గరకి రాగానే రాజారావు గొంతు విని అప్రయత్నంగానే ఆగి పోయింది.
"నాకు తెలుసు, ఇలాంటి దరిద్రగొట్టు సంబంధాలు చేసుకుంటే యిలా పీక్కుతింటారని- పెళ్ళికాకముందే యిలా ఇంటిమీదకి వచ్చి రెండువేలు మూడువేలు అడిగారంటే తరువాత ఎలా పీక్కుతింటారో? వీళ్ళకోసం వేలు మూట కట్టుకు కూర్చున్నానా?" రాజారావు గొంతు తీవ్రంగా వుంది.
వాణి మొహం ఎర్రబడిపోయింది.
"కాస్త నెమ్మదిగా మాట్లాడు. వాణి వింటే బాధ పడ్తుంది. లేనింటిదని తెలిసి చేసుకోడానికి సిద్దపడి యిప్పుడలా అనడం బాగుండదు. ఆ డబ్బేదో యిస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారుగదా- ఆ మాత్రం సహాయం చెయ్యడంలో తప్పులేదు. వాణి సంతోషిస్తుంది. మంచిపిల్ల పాపంవాళ్ళవాళ్ళని ఆదుకోవాలని ఏ ఆడపిల్లకి వుండదు? నీవు కాస్త వున్నవాడివి కనక సహాయం చేస్తానని ఆశపడి అడిగారు" అనసూయమ్మ అంటోంది.