Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 21


    అనసూయమ్మ ఏదో అనే లోపలే కిషోర్ ముందుకు వచ్చి-"రాజారావుగారూ-యిక్కడికి రావడం పెద్దమ్మ గారి కోరికమీద వచ్చినా రావడం మా తప్పే -వప్పుకుంటున్నాను క్షమించండి-అయితే ఒక సంగతి మరవకండి-పెద్దమ్మ గారి మొహంచూసి యిన్నాళ్ళు బీడులా పడివున్న మీ పొలాన్ని దున్ని తిండిగింజలు యిచ్చాను-మాటలు వాడడం మాకు వచ్చు-పెద్దవారని అంటే డబ్బులోకాదు వయసులో పెద్దవారని యిదివరకు ఒకటి రెండుసార్లు మీరు నోరు జారినా వినీ విననట్టు వూరుకున్నాను- ఆత్మాభిమానం మాకూ వుంటుందన్నది మీరు మరిస్తే తరువాత పరిణామానికి నేను బాధ్యుడని కాను" సూటిగా తీక్షణంగా చూస్తూ కఠినంగా అని "పద రేణూ వెడదాం, పెద్దమ్మగారూ వస్తాను" అంటూ వాణివంక ఒకసారి చూసి తొందరగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు.
    రేణు వాణివంక స్నేహపూర్వకంగా చూసి చెయ్యి నొక్కి కళ్ళతోనే వీడ్కోలు చెప్పి- రాజారావువంక తిరస్కారంగా చూస్తూ, విసవిస బయటికి వెళ్ళిపోయింది.
    రాజారావు మొహం కోపంతో అవమానంతో ఎర్రబడింది.
    అక్కడే నిలబడి భయంగా బితుకుబితుకుమని చూస్తున్న వాణిని చూశాడు. అతని కళ్ళు అనుమానంగా వాణిని ఆపాదమస్తకం పరీక్షించాయి. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. "ఈ చీర.....ఈ నగలు నీవేనా? ఇవి ఎక్కడివి నీకు?" తీక్షణంగా అడిగాడు.
    వాణి అతని రూపానికి ఆ తీక్షణతకి బెదిరిపోయింది. నోరు తడారిపోయింది-జవాబు చెప్పలేనిదానిలా గుటకలు మింగింది. వాణి నిస్సహాయంగా అనసూయమ్మవైపు చూసింది. "నేనే కట్టుకో మన్నాను. ఊర్లోవాళ్ళు చూడ్డానికి వస్తారంటే వాణికి మంచి చీర లేకపోతే తీసి కట్టుకోమన్నాను" ఈసారి ఆవిడ మొహంలోకూడా కాస్త బెదురు కన్పించింది.
    రాజారావు క్రోధావేశాలతో తల్లివంక చూసి, తరవాత వాణి వంక చూసి "వెళ్ళు, ముందు అవి విప్పు. ఆ బట్టలతో మరోక్షణం వుండడానికి వీలులేదు. ఊ-వెళ్ళు" హుంకరించాడు.
    వాణి పరుగెత్తినట్టే తడబడ్తూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. వెడుతూంటే వెనకాలనించి "నేను ఇదివరకే చెప్పాను. ఆబట్టలు తగలపెట్టమని. అయినా నా కిష్టంలేదని తెలిసీ వాణికి కట్టుకోడానికి యిస్తారా - నా మాట అంటే ఎంత నిర్లక్ష్యం? కన్నతల్లి అయీ నన్నవమానించడానికి ప్రయత్నించడం సహించను. మరోసారి ఇలా జరగడానికి వీలులేదు" ....తల్లి అన్న గౌరవం లేకుండా కఠినంగా అని విసవిస గదిలోంచి వెళ్ళిపోవడం వాణి వింది.
    ఆమె గుండెలు దడదడలాడాయి. అతని కోపం చూసి-గదిలోకి వెళ్ళి వంటిని పాము చుట్టుకున్నట్టు గబగబా చీర విప్పేసింది. ఆమె గుండెదడ యింకా తగ్గలేదు.
    వాణి మనసంతా దిగులుతో నిండిపోయింది. పాలిపోయిన మొహంతో బెంగగా గదిలో కూర్చుంది.
    ఓ అరగంట తర్వాత రాజారావు వాణి గదిలోకి వచ్చాడు.
    వాణి దిగ్గున లేచి నిల్చుని భయం భయంగా చూసింది. వాణి చీరమార్చి వుండడం, నగలు లేకపోవడం చూసి సంతృప్తిపడిన వాడిలా వాణిని చూసి పలకరింపుగా నవ్వాడు. వాడిపోయిన వాణి మొహం వాణిని చూసి "కోపం వచ్చిందా అలా అన్నానని? నీ వెప్పుడూ ఆ చీరలతో కనపడకు. నీకు చీరలు కావాలంటే లక్ష కొంటాను. రేపే తెప్పిస్తాను- ఎన్ని కావాలి?" దర్పంగా అడిగాడు.
    వాణి అక్కరలేదన్నట్టు తల ఆడించింది. ధైర్యం చిక్కపట్టుకుని రాజారావువంక చూడకుండానే "ఇంకెందుకు? మీరు వచ్చారు రేపు నేను వెళ్ళిపోతాను" అంది గబగబ.
    రాజారావు కాస్త ముందుకు వచ్చి మొహం ప్రసన్నంగా మార్చుకుని "అదేమిటి నేను రాగానే వెళ్ళిపోతానంటావు. నీకోసం పనులు తొందరగా చేసుకుని మూడు రోజులు ముందు వచ్చాను తెలుసా?" నవ్వుతూ అని వాణి బుజంమీద చెయ్యి వేశాడు.
    వాణి ముడుచుకుపోయింది. అది సిగ్గువల్లో- అయిష్టత వల్లనో ఆమెకే తెలియదు. ఆమెకి తెలియకుండానే అతని నించి దూరం జరిగి పోయింది.
    "ఊ ఊ....ఎలా వుంది యిక్కడ నీకు? బాగుందా.....ఏం చేశావు యిన్నాళ్ళూ...అన్నట్టు కిషోర్ వాళ్ళు ఎలా తెలిశారు నీకు?" అంత ప్రసన్నంగా వున్న అతని మొహం కిషోర్ ప్రసక్తితో అప్రసన్నంగా మారింది. కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు.
    వాణి బితుకు బితుకుమని చూసింది.
    వాణి తప్పదన్నట్టుగా ఆ రాత్రి కిషోర్ బండిలో రావడం అల పరిచయం అవడం మాత్రం చెప్పింది. తను కిషోర్ వాళ్ళ వూరు వెళ్ళినట్టు చెప్పలేదు.
    "ఊ....వాడు మహా పొగరుబోతు, వాడి చెల్లెలు అంతకంటే పొగరుది. వాళ్ళతో నీ పరిచయం, స్నేహం నాకు యిష్టంలేదు. నీ వెప్పుడూ వాళ్ళతో మాట్లాడకు" శాసిస్తూన్నట్లే అన్నాడు మొహం గంటపెట్టుకుని.
    వాణి జవాబివ్వకుండా మౌనంగా వూరుకుంది.
    వాణి అప్రసన్నంగా వుండడం చూసి "కూర్చో ఎందుకలా నిల్చున్నావు?" అన్నాడు.
    వాణి అయిష్టంగానే అతని పక్కన అంటీ అంటకుండా సోఫాలో ముడుచుకు కూర్చుంది.
    "నా గది అంతా సర్దినట్లుంది."
    "తుడిచి బాగుచేశాను."
    "నీవే సర్దావా? పనివాళ్ళంతా ఎందుకున్నట్టు? నీవలా పనివాళ్ళతో కలిసిచేస్తే వాళ్ళకి లోకువైపోతావు. మేం జమీందార్ల మన్నది మరిచిపోకు. నీవు నా క్కాబోయే భార్యవి తెలుసా? నీ పాత అలవాట్లు అవి మరిచి కాస్త దర్జాగా వుండడం నేర్చుకో-" అన్నాడు దర్పంగా.
    తను యిల్లు బాగుచేస్తే సంతోషిస్తాడనుకున్న వాణి అతను అంత దర్పంగా తమ గొప్పతనం చూపిస్తూ తన లేమి తనాన్ని ఎత్తి చూపించడంతో ఆమె మనసు కృంగిపోయింది.

 Previous Page Next Page