Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 23


    వాణికి అవమానంతో వళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకినట్లయింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తమ గురించి. డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం వుండదను కున్నాడా? అయినా తమదే తప్పు-తప్పు. ఛీ....డబ్బు అడగడం ఎంత పొరపాటయింది. అక్కరలేదు. ఆయనగారి అడుక్కుతింటారుగాని యీయనగారి సహయం అక్కరలేదు వాణి ఉడికి పోతున్న మనసుతో ఉక్రోషంగా అనుకుని సత్యాన్ని వెళ్ళిపోమనాలని విసురుగా వెనక్కి తిరిగింది.
    "ఆ అమ్మాయి మొహమాటపడి నన్ను అడగమంది. ఆ డబ్బు యిస్తే బాగుంటుందని నా సలహా, ఆపై నీ యిష్టం" ఆవిడ విరక్తిగా అంది.
    రాజారావు "హు" అని గదిలోంచి బయటికి వచ్చాడు. అప్పటికే వెనుదిరిగిన వాణిని చూసి ఒక్క అరక్షణం గతుక్కుమన్నాడు తమ మాటలు విందేమో! విననీ, తనకేం భయమా? అంతలోనే అహం అడ్డురాగా అనుకున్నాడు.
    "వాణీ, ఒకసారి గదిలోకి రా!" అన్నాడు.
    రాజారావు మొఖం చూసేసరికి ఏదో అందామనుకున్నా నోట్లోంచి మాట ఊడిరాలేదు వాణికి. అప్రయత్నంగానే అతనివెనక అడుగులు వేసింది గదిలోకి.
    "అమ్మ చెప్పింది. చూడువాణీ.....ఈసారికి ఎలాగో ఇస్తాను. ఇకముందు ఇలా అస్తమాను వందలు వేలు తే అంటే బాగుండదు. మన దగ్గర ధనరాసులు వున్నాయని అనుకోవద్దు, సరే, ఏదో ఎలాగో ఉద్యోగం వేయిద్దామనుకున్నాను-దాని బదులు ఈసారి ఇస్తున్నాను." వాణిని సంతోషపెట్టడానికి చాలా ఉదారంగా అన్నాడు.
    అతని మాటలలో దర్పం అహంకారం, తనవారిపట్ల చూపిన న్యూనతాభావం చూసేసరికి వాణికి ఆ డబ్బు వద్దని తిరస్కరించాలన్నంత ఆవేశం వచ్చింది. మరుక్షణం ఏదో వివేకం మేల్కొలిపినట్టు అతి ప్రయత్నంమీద నోటిని అదుపులో పెట్టుకుంది.
    రాజారావు బీరువాలోంచి డబ్బు తీసి వాణి దగ్గరకి వచ్చి చేతిలో నోట్లు వాణి మొహంముందు ఆడిస్తూ "మరి యీ డబ్బిస్తే నాకేం యిస్తావు నీవు..."
    విలాసంగా నవ్వి దగ్గరకి వచ్చి వాణి రెండు బుజాలు గట్టిగా పట్టుకుని ఒక ఉదుటునదగ్గిరకి లాక్కుని పెదాలు అందుకోబోయాడు.
    ఆ క్షణంలో వాణికి ఎక్కడలేని అసహ్యం వేసింది. "అంటే.....నా శరీరం మీకు అప్పగించాలన్న మాట-నా ఖరీదు రెండు వేలన్న మాట-నామీద మీకున్న అభిప్రాయం యింతేనన్న మాట-" అనుకోనంత కటవుగా అంది వాణి తిరస్కారంగా తీక్షణంగా చూసి-"దయచేసి వదలండి నన్ను-చిన్నపిల్లని ఆశపెట్టినట్లు డబ్బుతోనన్ను బంధించాలని దయచేసి ఎప్పుడూ చూడకండి, అలా మీనించి ఆ డబ్బు ఆశించను-ఆ అవసరమూ లేదు-అంతకి దిగజారలేదు నేనింకా. మీ డబ్బు మీదగ్గిరే వుండనీండి, పెళ్ళయ్యే వరకు నాకిలాంటివి యిష్టంలేదు, దయచేసి నన్ను వదలండి" - వాణి తీవ్రంగా అంటూ అతని చేతులలోంచి తప్పించుకుని విసురుగా కిందకి వెళ్ళిపోయింది.
    రాజారావు మొహం తెల్లబడింది. ఆ తిరస్కారం, ఆ అవమానం సహించలేకపోయాడు. పాలిపోయిన మొహం రక్తంపొంగినట్లు ఎర్రబడింది. చేతిలో నోట్లువంక వాణి వెళ్ళిపోయిన గుమ్మంవంక చూస్తూ ఆవేశపడ్డాడు. ఎక్కడికి వెడ్తుంది-మరో నెలలో పెళ్ళయ్యాక-అప్పుడు చూపించాలి తన తడాఖా-గర్వంగా తలెగరేసాడు రాజారావు.
    తమ్ముడి భవిష్యత్తు-కుటుంబ ఆధారం వీటన్నింటి మించి తన ఆత్మాభిమానాన్ని వెల్లడించగల్గినందుకు వాణి సంతోషపడింది. ఆ ఆవేశం, ఆ సంతోషం హాలులో ఆరాటంగా ఎదురుచూస్తున్న సత్యాన్ని చూడగానే సగం తగ్గిపోయింది.
    "ఏమన్నా రక్కా--యిస్తామన్నారా- యిచ్చారా?" ఆరాటంగా అడిగాడు సత్యం.
    "వరేయ్-ఆ పాపిష్టి డబ్బు మనకక్కరలేదు, నీవు కూలి పని చేసుకుంటే యింతకంటే ఆత్మగౌరవంతో - బతకగలం-వీళ్ళని దేబిరించేకంటే అదే నయం-ఎక్కడన్నా అప్పుదొరుకుతుందేమోచూడు నెమ్మదిగా తీర్చుకోవచ్చు-లేదంటే మానుకో-అంతే" ఉద్రేకంగా అంది వాణి.
    సత్యం పాలిపోయిన మొహంతో - "ఇవ్వనన్నారా పోనీ, ఆయన్నే అప్పుగా యిమ్మని అడగక పోయావా నెమ్మదిగా తీర్చుకుంటాం అని చెప్పు" ఆశగా చూశాడు.
    "చెపుతూంటే నీకు బోధపడదేం రా- ఆయన్ని అడగడంకంటే అడుక్కోడం మంచిది. వూరికే పదిసార్లు అడగకు వెళ్ళు-నేనింకేం చెప్పలేను" ఎవరిమీద చూపలేని నిస్సహాయలో, ఉక్రోషం తమ్ముడి మీద చూపించుతూ విసుగ్గా విదిలించింది-సత్యం చిన్నపోయిన మొహం చూసేసరికి వాణికి జాలికల్గింది. రాజారావు ఉనికి. స్పర్శే భరించలేక పోతూంది తను-యీ పెళ్ళి చేసుకుని కాపురం ఎలా చెయ్యడం? కాబోయేభర్త అంటే కలగవలసిన మధురభావాలు కలగక పోగా ఏదో అసహ్యం! అదే....కిషోర్....ఆరోజు చెయ్యిపట్టు...
    ..."అయితే వెళ్ళిపోతానక్కా... యింకా ఎందుకిక్కడ" అన్నాడు సత్యం.
    వాణి ఆలోచనలమధ్యనించి ఉలిక్కిపడి చూసింది. ఆ కిషోర్....కిషోర్ ఏమన్నా సహాయం చెయ్యగలడేమో-అప్పుగా తీసుకుని నెమ్మదిగా యిస్తామంటే యీయగలడేమో-తను కోరితే అతని దగ్గిర లేకపోయినా-పోనీ అడిగిచూస్తే తప్పేంవుంది-ఆ ఆలోచన రాగానే "చూడు సత్యం-యిక్కడ యీయమని అడిగి లాభంలేదు కాని, పక్క వూరిలో తెల్సిన వాళ్ళున్నారు- వాళ్ళు తప్పకుండా యీ సహాయం చేస్తారు నేను ఉత్తరం రాసి యిస్తాను, తీసికెళ్ళి చూపించు-" వాణి తమ్ముడికి కిషోర్ యింటి గుర్తులు అంతా బోధపరిచి అప్పటి కప్పుడు కిషోర్ పేర ఉత్తరం రాసి, సత్యాన్ని పంపేసింది మళ్ళీ యిటు రావద్దని చెప్తూ.
    
                                        *    *    *    *

 Previous Page Next Page