Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 21


    విజయ నవ్వింది. "ఏం చెప్పమంటావు. నీకు తెలియని కొత్త విషయాలు లేవు. నీలాగే మొగుడి చేతిలో చివాట్లు, చెప్పు దెబ్బలు తిని అవమానం సహించిన దానినే."
    "అలా కాదు సరిగా చెప్పండి."
    "వుండు, ఇదిగో క్యారియర్ వచ్చింది, భోజనం చేస్తూ చెపుతాను." క్యారియర్ విప్పి రెండు ప్లేట్లల్లో వడ్డించింది విజయ.
    ఇద్దరూ భోజనం చేయసాగారు. విజయ ఎంతసేపటికి తనకథ చెప్పక పోవడం చూసి ఆరాటం అణుచుకోలేక శారద "చెప్పండి మరి." అంటూ తొందరపెట్టింది.
    "నీవు ఆ విషయం మరిచిపోవన్నమాట! సరే ఇందాక చెప్పానుగా శారదా, మొగుడి చేతిలో హింస అనుభవించినవారి అన్ని కధలూ ఒకలాగే వుంటాయని మీ ఆయన కంటే మా ఆయన మరి రెండు ఆకులు ఎక్కువే చదివారు. మీ వారికి నిన్ను హింసించడం ఒక్కటే వ్యసనం. కాని మా ఆయనకీ తాగుడు, వ్యభిచారం వుండ వలసిన వ్యసనాలన్నీ వుండేవి..." శారద ఆశ్చర్యంగా చూసింది.
    "మరి అతను అలాంటి వాడని ముందు మీకు తెలియలేదా?"
    "హ... తెలిస్తే... చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులు పిల్లనిస్తారు. అందులో అపురూపంగా ముగ్గురు మగపిల్లలు తరువాత పుట్టిన ఆడపిల్లని తీసికెళ్ళి అలాంటి హీనుడికి ఎందుకిస్తారు?"
    "ఐశ్వర్యం మధ్య పుట్టాను, అపురూపంగా పెరిగాను, ముల్లోకాలు గాలించి తెచ్చినట్టు అందగాడు, ఉద్యోగస్థుడు, ఆస్థిపరుడు అయిన వరుడ్ని వెదికి తెచ్చి ఏభై వేలు ఖర్చుపెట్టి వైభవంగా పెళ్ళి చేశారు. తక్కినవన్నీ చూశారుగాని గుణం సంగతి మరిచి పోయారు నాన్నగారు. లేదు మరిచి పోలేదు. తెలుసుకోలేక పోయారు. ఇంతకీ నన్ను కన్నారుకాని నా రాతని కనలేదు వాళ్ళు! వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. కాని నా అదృష్టాన్ని వాళ్ళెలా మార్చగలరూ? ఆయన మేడిపండని, వయోముఖ విషకుంభమని చూడగానే ఎవరికి తెలుస్తుంది. పచ్చగా ఆరడుగుల పొడుగుతో అందంగా దృఢంగా వుండే ఆయన రూపం, ఆయన నాలుగంకెల సంపాదన, రెండు లక్షల ఆస్థి చూసి 'చిలకా గోరింకలా వున్నారు. ఇద్దరూ అందంలో, ఐశ్వర్యంలో పోటీపడుతున్నారు. ఇదంతా విజయ అదృష్టం' అన్నారంతా కాబోలనుకుని పొంగి పోయాను నేనూ.
    "కాని నేనెంత అదృష్టవంతురాలినో మొదటి రాత్రే తెల్సిపోయింది. అబ్బ! ఆ రోజు గుర్తు వస్తే భయంకరమైన కలవచ్చినట్లు వణుకు వస్తుంది. ఆ రాత్రి...
    
                                            *    *    *
    
    ఆ రాత్రి...మొదటి రాత్రి అందరి కన్నెపిల్లల మాదిరే కోటి ఆశలతో కోర్కెలతో గదిలో అడుగుపెట్టింది విజయ. అప్పటికే ప్రకాష్ గదిలో వున్నాడు.
    తెల్లని వెన్నెలలాంటి కాంతి. పాలనురుగు లాంటి పాన్పు. అంతకంటే తెల్లని మల్లెలు, జాజులమాలలు వేలాడుతున్నాయి మంచానికి.
    ఆ పాన్పుమీద మన్మథుడిలా కన్పించాడు ప్రకాష్ విజయకి.
    అలవోకగా పాన్పుమీద పవళించివున్న ప్రకాష్ విజయ గదిలోకి రాగానే అదోలా విలాసంగా నవ్వాడు.
    విజయని ఆపాదమస్తకం పరీక్షించి సిగరెట్టు పొగ విలాసంగా వదిలి పక్కమీదనించి లేచి విజయవైపు అడుగులు వేశాడు.
    విజయ సిగ్గుతో తలదించుకుంది.
    ప్రకాష్ జానపద హీరోలా చూపుడు వేలితో విజయ చుబుకం ఎత్తి కళ్ళలోకి అదోలా చూసి "ఊ...అంతగత్తెవే  ఈఅందాన్ని ఇన్నాళ్ళు ఎవరూ ఆస్వాదించలేదా?" అన్నాడు అదోలా నవ్వుతూ.
    విజయ బిత్తరపోతూ చూసింది.
    "ఏం-ఇంత అందాన్ని ఎవరికీ ఇవ్వకుండా నా కోసమే దాచి వుంచావా ఇన్నాళ్ళూ - ఏమో ఈ ఆడవాళ్ళని నమ్మలేం, చెప్పు నేను ఎన్నో వాడిని. పరవాలేదు నేను ఏం అనుకోను." విషపు నవ్వు నవ్వాడు...
    "ఏమిటీ మాటలు." అర్ధంకాక తెల్లపోతూ చూసింది విజయ.
    "పోనీ నీవు ఎవరినీ ప్రేమించ లేదూ ఇన్నాళ్ళు. నిజంగా ఇష్టపడే చేసుకున్నావా ఈ పెళ్ళి?" మొహంలో మొహంపెట్టి భుజాలమీద చేతులు వేశాడు.
    విస్కీ వాసన గుప్పున కొట్టింది.
    ఉక్కిరి బిక్కిరి అవుతూ .... "ఏమిటిది మీరేం మాట్లాడుతున్నారు అసలు?" అంది మాటలు కూడదీసుకుంటూ భయంగా.
    "నా మాటలే అర్ధంకానంత అమాయకురాలివా....ఆహాహా....పోనీలే. రా.... నీ అందం అంతా నా కోసం ఇన్నాళ్ళు దాచావన్న మాట థాంక్స్..." అంటూ మోటుగా కౌగిలిలోకి లాగి బలంగా చేతులు బిగించి పెదాలు అందుకోబోయాడు.
    విజయ వెగటుగా మొహం తిప్పుకుని "మీరు... మీరు తాగారా..." అంది భయంగా చూస్తూ-
    "ఏం తాగకూడదా .... మగువతోపాటు మదిర కూడా కలిస్తే ఎంత మజాగా వుంటుందో తెలుసా - కమాన్ ... ఆలశ్యం చేయకు."
    మొరటుగా విజయని నలిపివేయసాగాడు.
    విజయ ఉక్కిరి బిక్కిరి అవుతూ ... "వదలండి ... ఛీ..ముందు వదలండి నన్ను - తాగివచ్చి...మీరు మీరిలాంటి..." విజయ మాటలు పూర్తికాక ముందే అతను విజయని మాట్లాడనీయకుండా నోటితో పెదాలు మూశాడు.

 Previous Page Next Page