Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 21


    "గుర్రం పెద్దబ్బాయి మీ ఫాదరయ్యుండీ..." ఏదో అనబోయాడు ఆదిత్య.

 

    "ప్రపంచంలో హ్యూమన్ రిలేషన్స్ కన్నా, బిజినెస్ రిలేషన్స్ కే ఎక్కువ విలువ. ఐ హేట్ దిస్ ఆర్టిఫీషియల్ రిలేషన్స్..."

 

    ధరణి మనసులో బయటకు చెప్పుకోలేని ఏదో కసి... ఆదిత్యకు అర్థంకాని కసి.

 

    ఏ బాధనూ బయటకు చెప్పుకోలేని మనస్తత్వం ధరణిది.

 

    రెండు నిమిషాల నిశ్శబ్దం....

 

    "నిన్న రాత్రి నిన్ను ఇంటరాగేషన్ కు తీసికెళ్లారా?" మళ్ళీ అడిగాడు ధరణి.

 

    ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

 

    తను ఇక్కడ్నించి తప్పించుకుని అహోబలపతి అంతు చూడాలని చూస్తున్నాడు. అహోబలపతి తనచేత ధరణిని హత్య చేయించాలని చూస్తున్నాడు. గుర్రం పెద్దబ్బాయి తన కోసం చూస్తున్నాడు. తన పరిస్థితి తనకే విచిత్రంగా వుంది ఆదిత్యకు.

 

    "అవును"

 

    "థర్డ్ డిగ్రీ ఉపయోగించారా?" ఆదిత్య ఆపాదమస్తకాన్నీ చూస్తూ అన్నాడు ధరణి.

 

    "లేదు"

 

    "స్టోర్ రూమ్ లోకి తీసికెళ్ళడం చూశాను. నిన్ను హింసిస్తే నేను రావాలనుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు వాంటెడ్ గా యీ మర్డర్ చేయలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి."

 

    నిజాం కాలేజీలో ఫంక్షన్ జరిగిన ముందు రోజునుంచీ ఈ రోజు వరకూ ఆదిత్య మనసులో ఎంతో తెలియని నిట్టూర్పులు, నిరాశ, బాధ, వేదన, నిద్రలేని రాత్రులు, కనురెప్పలమీద కసి పేరుకున్న నిశ్శబ్దపు చప్పుడు, గుండె లోయల్లో ఘూర్ణిల్లుతున్న ఆవేదన... అంతై అంతై మహావటవృక్షంలా మానవత్వాన్ని మరచిపోయేట్టుగా చేస్తున్న పగ...

 

    సానుభూతి కనిపించని ప్రపంచంలో ఇనపచువ్వల వెనక మగ్గుతున్న మనసుకు...

 

    ధరణి మాటలే కొండంత ఓదార్పుగా కనిపించాయి.

 

    ఆదిత్య కనురెప్పల వెనుక కనబడని తడి.

 

    "అది జైలు ఇంటరాగేషన్ కాదు. పొలిటికల్ ఇంటరాగేషన్" పెదవుల మీద నవ్వు పులుముకుంటూ అన్నాడు ఆదిత్య.

 

    సడన్ గా టాపిక్ మార్చాడు ధరణి.

 

    "నిన్న నేనిచ్చిన నావెల్ ఎలా వుంది. చదివావా?" అడిగాడు ధరణి.

 

    "సగం పూర్తయ్యింది. హీరో ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

    "అంటే... నీలా... నా..." నవ్వుతూ అన్నాడు ధరణి.

 

    "నేను తప్పించుకోవాలనే ప్రయత్నంలో వున్నానంటారా?"

 

    "కాదా..."

 

    "అవున్సార్... తప్పించుకుంటాను... ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. అయిదు లక్షలు ఆశ చూపి... నన్నీ ట్రాప్ లో ఇరికించాడు అహోబలపతి. ఆ అహోబలపతికి నా రియల్ క్రిమినల్ బ్రెయిన్ తడాఖా చూపిస్తాను..." ఆవేశంగా అన్నాడు ఆదిత్య.

 

    "క్రిమినల్ కి, ఇంటలెక్చువల్ కీ ఉండకూడనిది ఆవేశం. నువ్వు ఇంటలెక్చువల్ వి. నీకసలే ఆవేశం పనికిరాదు. అహోబలపతి ప్రస్తుతం సి.ఎం. నువ్వు నా దగ్గర మాట్లాడావు కాబట్టి సరిపోయింది... ఇంకోళ్ళ దగ్గర మాట్లాడి వుంటే..."

 

    "మీతో ఫ్రాంక్ గా అన్ని విషయాలూ చెప్తున్నానంటే దానర్థం... నేను తెలివి తక్కువ వాడిననా? ఎంతో ఆవేశాన్ని అణచుకుని యిక్కడ గడుపుతున్నాను. ఐయామ్ వెయిటింగ్ ఫర్ మై డే... ఎస్... ది డే ఆఫ్ ది ఆదిత్య... మీరు చూస్తుండండి... పొలిటికల్ గేమ్ ని ఎలా మలుపు తిప్పుతానో... యు విల్ సీ... విత్ యువర్ ఓన్ వెస్... దిసీజ్ మై ఛాలెంజ్."

 

    తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు ఆదిత్య.

 

    "ఇలా మాట్లాడటం ఆవేశమే కదూ...."

 

    "భరించలేని బాధతో, భరించలేని ఒంటరితనంతో బాధ పడుతున్న నాకు మీరిక్కడ కన్పించకపోతే నా పరిస్థితి మరింతగా వుండేది సార్! ఈ పాటికి ఎప్పుడో నేను ఈ జైలు గోడల్నుంచి తప్పించుకునే వాడిని... లేదా సూసైడ్ చేసుకునే వాడిని..." ఒక్కొక్క మాటను వత్తి పలుకుతూ అన్నాడు ఆదిత్య.

 

    నిర్వికారంగా చూశాడు ధరణి ఆదిత్య వైపు-

 

    "ఇప్పుడు ఈ క్షణంలో నేనొక బొమ్మను కీ యిస్తే ఆడతాననుకునే బొమ్మను... పిస్టల్ చేతికిస్తే ఎవర్నయినా మర్డర్ చేస్తాననుకునే డాల్ ని. మీకు తెలీదు... ఈ గుండె వెనక ఎంతటి చేదు నిజాలున్నాయో... మనసు ఊబిలోకి రోజు రోజుకీ కూరుకుపోతున్న మనిషిని సార్... అందుకే ముల్లుల్లేని గడియారంలా వున్నాను" చేతిలోని రాయిని దూరంగా విసురుతూ అన్నాడు ఆదిత్య.

 

    "నీ పరిస్థితిని నేను అర్ధం చేసుకోగలను... కానీ ఒక్కటి చెప్తున్నాను విను. కక్ష కంటే ప్రేమ గొప్పది... అధికారం కంటే మానవత్వం గొప్పది... కరెన్సీ కంటే ఆత్మీయత చాలా గొప్పది... అధికారం కంటే మానవత్వం గొప్పది... ప్రేమ, కన్నీరు, ఆత్మీయత, మానవత్వం యీ నాలుగూ నీలో లేనినాడు నువ్వు బతకడం అనవసరం... నువ్వు నిజంగా ఏం కోల్పోయావో నీకు తెలిసేది ఆ క్షణంలోనే... నా అనుభవం ద్వారా నేను చెప్తున్నాను విను... కరెన్సీ నోట్ల పరుపు మీద నీకు దొరకని ఓదార్పు, ఒక్క కరుణామయి మెత్తని చేతి స్పర్శ ద్వారా లభిస్తుంది... అంతులేని దుఃఖ సముద్రంలో నువ్వు గిలగిలలాడుతున్నప్పుడు ఒక్క ప్రేమాస్పదమైన హృదయ స్పర్శ చాలు నిన్ను పునర్జీవింప చెయ్యడానికి. మానవ ప్రపంచం మహావృక్షమైతే, దానికింద నీడలాంటిది మనిషి బతుకు. ఆ నీడను దూరం చేసుకోకు. నీడలా కన్పించే ఎండమావుల్ని ఎన్నడూ నమ్మకు."

 

    గొప్ప జీవిత సత్యాన్ని అంత సున్నితంగా, అంత స్పష్టంగా చెప్పిన ధరణి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆదిత్య.

 

    ఆ మాటలద్వారా ధరణి మనసు అద్దంలా కన్పిస్తోంది ఆదిత్యకు.

 

    ఇలాంటి వ్యక్తిని అహోబలపతి ఎందుకు చంపమంటున్నాడు...

 

    ఆదిత్య మనసులోకి అకస్మాత్తుగా చొచ్చుకొచ్చిందా ప్రశ్న. ఎందుకు ధరణి సూసైడ్ చేసుకోవాలి?

 

    ఆదిత్య గొంతు చాలాసేపు మూగదైపోయింది. ఆదిత్య గుండె ఆర్ద్రీభూతమై పోయింది.

 

    ఆదిత్యా... రేపాదివారం... ప్రిజనర్స్ ని... బైటకు తీసికెళ్తున్నార్ట నిజమేనా?" సడన్ గా అడిగాడు ధరణి.

 

    "అవున్సార్... నేనూ విన్నాను. రెండు నెలల కొకసారి ఖైదీల చేత... కొండల్ని పగలకొట్టిస్తార్ట. దానికి రాళ్ళు కావాలట... జైలర్ చెప్పాడు" చెప్పాడు ఆదిత్య.

 Previous Page Next Page