Previous Page Next Page 
మాయ జలతారు పేజి 21


    డగ్గుత్తికతో అన్నది డెయిజీ "మిస్టర్ రాజారావ్! ఎవరన్నా సహించగలను కాని, ఆమాట నువ్వంటే సహించలేను. నీకు నా హృదయం ఇచ్చాను. అయామ్ ఫెయిత్ ఫుల్ టు యూ. నేను ఆడదాన్ని. నాకు ఒక మనసుంది. నిన్ను అందులో ఉంచుకున్నాను. ఫలితంగా నాలో ఒక ప్రాణి పెరుగుతూంది"
    రాజారావు మీద పిడుగు పడ్డది. పేపరు మడిచి పక్కకు విసిరాడు. తబ్బిబ్బయినాడు, కలవరపడ్డాడు.
    "మైకేలు అబార్షన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వాడు రాక్షసుడు. నాకు పాప కావాలి రాజా! పాప! నిన్ను ఆశ్రయం అర్థించడానికి వచ్చాను. నీ ఆశ్రయంలో తల్లిని కావాలని నా ఆశ"
    మండిపోయాడు రాజారావు. నరాల్లో చిచ్చుపెట్టినట్లయింది. మెదడు మొద్దుబారింది. కళ్ళు పొగలు కక్కాయి.
    "షటప్, గెటవుట్" అని పెద్ద కేక పెట్టాడు.
    డెయిజీ గుండె ముక్కలైంది. కన్నీరు జలజలా రాలింది. "మిస్టర్ రాజ్! ప్లీజ్, అండర్ స్టాండ్ మీ!" ఏడ్చేసింది డెయిజీ.
    "ఐ సే యూ గెటవుట్!" లేచి నుంచొని మరీ బిగ్గరగా అరిచేశాడు. అతని కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి. కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.
    లక్ష్మి కళ్ళు తెరవడమూ, డెయిజీ వెళ్ళిపోవడమూ ఒకేసారి జరిగాయి. డెయిజీ వెళ్ళినదారి కన్నీటితో నిండింది.
    లక్ష్మి కళ్ళు తెరిచింది. వెర్రిగా అటూ ఇటూ చూచింది. అది చూచాడు. రాజారావు కోపం దిగిపోయింది. ఆదుర్దాతో పరిగెత్తాడు లక్ష్మి మంచం దగ్గరికి. డాక్టరును పిలవాలనే ఆలోచన కూడా రాలేదు. చూస్తూ నుంచున్నాడు.
    లక్ష్మి మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఏవో పూర్వ స్మృతులను తోడడానికి ప్రయత్నించింది. ఫలించలేదు. కళ్ళు తెరిచింది, ప్రశ్నార్థకంగా రాజారావును చూచింది.
    అతనికి ఏమీ అర్థం కాలేదు "రజనీ!" అనే మాట అతని నోట వెలువడ్డది. అది ఎందుకు వచ్చిందో అతనికీ తెలియదు.
    "రజనీ?" రాజారావుపై చూపు నిలిపి "అవును, నాపేరు రజని. నేనెక్కడున్నాను?" అడిగింది.
    "ఆస్పత్రిలో, ఉస్మానియాలో"
    "ఎందుకు?"
    "ఏమో? ఏం చెప్పాలో అతనికే అర్థం కాలేదు. డాక్టరును పిలవాలనే విషయం మెరుపులా తోచింది. వెంటనే డాక్టరు దగ్గరికి పరుగెత్తాడు. డాక్టరు, నర్సులు పరుగు పరుగున వచ్చారు. గది ముందు జనం కూడారు.
    డాక్టరు "అమ్మా! లక్ష్మీ!" అన్నాడు.
    లక్ష్మి వెర్రిగా చూచింది. "నాపేరు రజని" అన్నది.
    డాక్టరు గ్రహించాడు పూర్వ స్మృతులు పోయినాయనుకున్నాడు. ఇలాంటి కేసు ప్రత్యక్షంగా చూడ్డం ఇదే మొదటిసారి. అతనికి ఆసక్తి ఎక్కువ అయింది.
    "రజనీగారూ! మీరు ఎక్కడున్నారు?"
    "ఆస్పత్రిలో ఉన్నానని చెప్పారు _" అని పేరుకోసం తడుముకుంటూ రాజారావు వైపు చూచింది. "రాజారావుగారు" అని పూర్తి చేశాడు డాక్టరు.
    "రాజారావు, రాజారావు" అని మననం చేసుకుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంది, పూర్వస్మృతులు వెదకడానికి.
    అంతా నిశ్శబ్దంగా ఊపిరి సహితం బిగబట్టి రెప్పవాల్చకుండా చూస్తున్నారు. డాక్టరు స్వయంగా అయోమయంలో పడ్డాడు.
    కళ్ళు తెరిచింది లక్ష్మి _ కాదు రజని "ఊ" అన్నది.
    "నేనెవరిని?" అడిగాడు డాక్టరు.
    చిరునవ్వు నవ్వింది "డాక్టరు" అన్నది.
    "ఈమె ఎవరు?" నర్సును చూపించి అడిగాడు డాక్టరు.
    మళ్ళీ కళ్ళు మూసుకుంది రజని. కాస్సేపటికి తెరిచింది. డాక్టరు అడిగిన ప్రశ్నకు జవాబు మాత్రం ఇవ్వలేదు.
    ఆమె మేధస్సుపై భారం వేయదలచలేదు డాక్టరు.
    "మీకెలా ఉందమ్మా?" అడిగాడు.
    "మబ్బు కమ్మినట్లున్నది. మనసు మీద పొగ కమ్మినట్లున్నది"
    "ఆకలిగా ఉందా?"
    "అవు" - అప్పటికిగాని ఆకలిగా ఉందనే విషయం తెలియలేదు రజనీకి.
    నీరసంగా కళ్ళు మూసుకుంది రజని.
    డాక్టరు ఆమెను పరీక్షించి, నర్సుకు ఏవో ఆదేశాలిచ్చి వెళ్ళిపోతూ రాజారావును రమ్మన్నట్లుగా సంజ్ఞ చేశాడు. రాజారావు డాక్టరును అనుసరించాడు. మౌనంగా ఇద్దరూ కుర్చీల మీద కూర్చున్నారు. ఇద్దరూ ఏవో ఆలోచనలలో నిమగ్నులై ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేదు. డాక్టరు సిగరెట్టు కేసు తీశాడు. రాజారావుకు అందించాడు. సిగరెట్టు తీసుకున్నాడు. డాక్టరూ అందుకున్నాడు. ఇద్దరూ కాల్చుకున్నారు.
    డాక్టరు గట్టిగా పొగలాగి వదిలాడు.
    డాక్టరు చెప్పేదాన్ని వినాలనే ఆతురతతో గబగబా సిగరెట్టూ పీల్చుతూ వదులుతున్నాడు రాజారావు.
    "మిస్టర్ రాజ్!" రాజారావు ఆఖరు దమ్ములాగి సిగరెట్టు పారేశాడు. "ఇది చాలా విచిత్రమైన కేసు. మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని గురించి చదివేప్పుడు నాకు నమ్మకం కలిగేది కాదు. హిస్టరీయే అలాంటిది. లక్ష్మిగారి మెదడుకు బలమైన దెబ్బ తగిలింది. దాంతో ఆవిడకు పూర్వస్మృతులు పోయాయి. అసలు ఆమె జీవించిందంటే మీరు తీసుకున్న శ్రద్ధ వల్లనే ఇప్పుడు ఆమెకు ఇదొక క్రొత్త జన్మ. మీరు ఏది చెబుతే అది నమ్మాల్సిందే కాని, ఒక చిక్కుంది. ఆమె మెదడుమీద ఏమాత్రం భారం పడినా ప్రమాదమే. పూర్వస్మృతులు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించిందా _ ఆ భారం భరించలేక మతి భ్రమించినా భ్రమించవచ్చు. మిస్టర్ రాజ్! ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ ఫీలింగ్స్, బట్ యూ మస్ట్ హేవ్ పేషన్స్. అంటే, మీరు ఓపిక పట్టాలి" అని మిగతా విషయాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేశాడు.
    "అంటే డాక్టర్! జీవితాంతం ఇంతేనా?"
    "చెప్పలేం కాని, కొంతకాలం ఆవిడను ఏ విషయంలోనూ బలవంతం చేయరాదు. ఈ క్రొత్త స్మృతులు కాస్త బలపడితే, గతాన్ని గురించి ఆమె ఆలోచించడం మానేస్తే బహుశః మీకు ఉపయోగపడవచ్చు. అందుకు ఒక సంవత్సరం పట్టవచ్చు మీరు తీసుకునే కేర్ మీద ఆధారపడి ఉంటుంది"
    "డాక్టర్! యూ మస్ట్ హెల్ప్ మీ. రజనీకోసం ఒక జీవితకాలం వెయిట్ చేయగలను"
    "మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టాలి అంతే. నాకు సాధ్యమైనంతా చేస్తాను. ఆఫ్టరాల్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్!"
    బెడ్ నెం 25లో సీరియస్ గా ఉందని నర్స్ చెపితే వెళ్ళిపోయాడు డాక్టరు.
    రాజారావు గదికి వచ్చాడు. రజని మంచంమీద కూర్చున్నాడు. తదేకంగా రజనీని చూడసాగాడు. ఆవిడలో ఏదో ఆకర్షణ ఉంది. అయస్కాంతం ఉంది. ముఖం శుష్కించింది. అందం కొంత అడుగంటింది. అయినా, ఆ ఆకర్షణ అలాగే ఉంది. అది ఏ జన్మ బంధమో అర్థంకాలేదు. ఈ బంధం, అనుబంధం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రయత్నించినా బహుశః అర్థం కాదు. లైలా కురూపి అంటారు కొందరు. "లైల్" అంటే రేయి. ఆమె రంగు రేయి వంటిదట. అయినా, మజ్నూ ఎందుకు పిచ్చివాడైనాడు? మనసుకు గణితశాస్త్రంతో సంబంధంలేదు.
    రజని ఆరోగ్యం కుదుటపడింది. ఆస్పత్రి నుంచి ఆమెను ఇంటికి తెచ్చుకున్నాడు రాజారావు. రాజారావు పోషణలో రజని బాగా కోలుకుంది. పెదవులలో గులాబీలను, చెంపలలో కెంపులను నింపుకుంది. రాజారావుకు రజనీనే లోకం లేదు. రజనికి రాజారావువినా లోకం తెలియదు.
    రజనీతో రాజారావు సినిమాలకు వెళ్తున్నాడు. పార్టీలకు, పిక్నిక్కులకు జంటగా పోతున్నారు.
    రజని కబుర్లు చెపుతుంది. నవ్వుతుంది. కళ్ళతో మాట్లాడుతుంది. ఆమె సరసన అతడు ఏదో అందని ఆనందం అనుభవిస్తున్నాడు.
    ఒకనాడు రాజారావు తాగి వచ్చాడు. రజనీ మూతి ముడిచింది. రాజారావు తాగుడు మానాడు. సిగరెట్లను సహించింది కాబట్టి, కాలుస్తున్నాడు రాజారావు.
    రజని ఇంటికి రావడంతో కలిసివచ్చింది రాజారావుకు. లక్ష్మి ఆ ఇంట్లో అవతరించినట్లయింది. అతనికి ఎన్నడు లేనన్ని కాంట్రాక్టులు వచ్చాయి. ప్రభుత్వంలో పలుకుబడి హెచ్చింది. అతడు కోరుకున్నవారిని తన పనిమీద నియమించేటట్లు చేయగలిగాడు. తనకు గిట్టని వారిని బదిలీలు చేయించాడు. ఒక ఇంజనీరునే, తన పనిని సవాలు చేసినందుకు ఉద్యోగం ఊడగొట్టించాడు.
    రజనీతో అతనికి కాలం కర్పూరంలా గడుస్తూంది కాని, కావలసింది ఇంతవరకూ లభించలేదు. రజని వలన అతనికి లభిస్తున్నదల్లా మానసికమైన ఆనందమే. అతనిని దగ్గరికి రానివ్వదు రజని. తాకాడంటే "టచ్ మీ నాట్" వలే ముడుచుకుపోతుంది. అందం సాంతం అంతం అవుతుంది. భయంకర రూపం దాల్చుతుంది. శవంలా పడిపోతుంది.
    రాజారావు సహనానికి రజని పరీక్షలా తయారైంది. అతని ఇంద్రియ తృష్ణ తీరడానికి రజని ఉపకరించడం లేదు. అది ఒక రోగం అన్నారు డాక్టర్లు. దాన్ని కుదర్చడానికి అనేకమంది డాక్టర్లకు చూపాడు. డబ్బును పంపునీళ్ళలా ఖర్చుపెట్టాడు. ఎందఱో వైద్యులు చికిత్స చేశారు అయినా, అందుకు మందు కనిపెట్టిన నాధుడు కనిపించలేదు.
    డాక్టర్లు స్థలం మార్చమన్నారు. దానికి మానసిక వ్యాధి అని పేరు పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించాలన్నారు. స్థలం మార్చడం మంచిదన్నారు. వినోదయాత్ర విహారయాత్ర చేయించమన్నారు.
    రజనీని తీసుకొని విలాస యాత్రకు బయలుదేరాడు రాజారావు.

                                     * * * *

 Previous Page Next Page