"రాకుంటే చచ్చిపోత."
"వస్తగని చావకు" చిలిపిగా నవ్వింది పిచ్చమ్మ. అత్త పిలుస్తే అటు వెళ్ళిపోయింది. బుచ్చమ్మ గురువయ్యను చూచి ఉరికి వచ్చింది. "ఊదంగ తాగుతున్నావు. బాకీ పెరుగుతాంది. మల్లి పైక మెప్పుడిస్తవు?" అడిగింది గురువయ్యను.
"ఇస్తిత్రంగా మాట్లాడ్తున్నావు బుచ్చమ్మ -- పంట లోచ్చినంకగద బాకీ కట్టేడిది."
"వచ్చిండమ్మ దొర - పంటల్దాక పోస్తం" చేతులు ఊపుతూ "ఇగో చూడు చెప్తాన్న. కొంటాయిన కాడికి పోయి బాకీ వాల్చుకొమ్మంటేనే రేపిటురా. లేకపోతే బంద్" ఖచ్చితంగా చెప్పేసింది.
'అట్లనే చెప్పుత. వస్తవా మరి నాతోని" తాటి వనానికి రావడం ఆగిపోతుందేమో నన్న భయంతో అన్నాడు గురువయ్య.
"అయితే జరుండు. చేతుల పనున్నది వస్త" అని అటు వెళ్ళిపోయింది బుచ్చమ్మ.
తరవాత బుచ్చమ్మను పిల్లిలా అనుసరించాడు- రామక్రిష్టయ్యకు రెండేళ్ళ పంట రాసిచ్చాడు గురువయ్య. రెండేళ్ళ దాకా బికారి అయిన గురువయ్య చేతులూపుకుంటూ ఇంటిదోవ పట్టాడు.
ఆ రాత్రి నిగా వేసింది బుచ్చమ్మ కోడలు మీద. కొడుకుతో చెప్పింది కోడల్ను కదలనివ్వోద్దని. అసలు అన్నాలు ఆలస్యంగా తిన్నారు. ఆ తరవాత ముచ్చట పెట్టింది బుచ్చమ్మ. - రానున్న కాలాన్ని గురించి - రావలసిన బాకీలను గురించి కలపాల్సిన నీళ్ళను గురించి , ఊళ్ళో మల్లి మీద ఎల్లి పడటం - ఎల్లి మీద మల్లి పడడం కొంతసేపు సాగింది.
పిచ్చమ్మ ఆవులించింది.
బుచ్చమ్మ ముచ్చట చాలించింది.
అందరూ మంచాల్లో పడుకొన్నారు.
పిచ్చమ్మకు నిద్ర పట్టలేదు. ఆమె ఆరోజు మల్లె పూలు పెట్టుకుంది. ఆమెకు తాటివనం - గురువయ్యా కనిపించారు. ఆమెకు ఆరాటం పెరుగుతుంది. మొగుడు ముచ్చట పెట్టాడు. కాసేపు ఊ కొట్టింది. నిద్ర నటించింది. మొగుడు నిద్ర పోయాడు. ఆమె సర్వేంద్రియాలూ అతి జగరూకంగా ఉన్నాయి. చెవులు అత్త గుర్రు విన్నాయి. కళ్ళు తెరిచి చూచింది. మొగుడు నిద్ర పోతున్నాడు. మెల్లగా కదిలింది. మొగుడు కదల్లేదు , లేచింది ----జాగ్రత్తగా కూర్చుంది. నాలుగు దిక్కులా పరికించింది.
పిల్లి మ్యావ్ మంది ----గోడ మీంచి దమ్మున దూకింది.
పిచ్చమ్మ గుండె దడదడలాడింది. చప్పున మంచంలో పడుకుంది. గుండె అరచేతులో అడుతున్నట్లుంది. ఊపిరి బిగపట్టుకుని వింటుంది - ఎక్కడ్నుంచి ఏ శబ్దం వస్తుందోనని.
పొద్దు పోతున్నది . గురువయ్య వస్తానన్నాడు. తాను వెళ్ళలేకుండా ఉంది. పరిగేట్టాలని ఉబలాటం? గుండె దడదడా కొట్టుకుంటుంది.
"పిచ్చీ!" పిలుపు ----సన్నగా - తీయగా --దూరంగా -- గురువయ్య ధ్వని -- నిజమా? ఆలాపనా?
"పిచ్చీ!" మళ్ళీ పిలుపు.
అవును. గురువయ్యదే వచ్చాడు -- లేవాలి. ఉరకాలి. అది ఊహ, ఉబలాటం గుండె దడదడ లాడుతుంది. వళ్ళు నీరసించింది. చెమట పట్టింది -- లేవలేకుండా వుంది. పడకలో మొగుడు - అటు పక్క అత్త.
గుండె దడ! దాహం! ఆరాటం!
"పిచ్చి! మరోసారి పిలుపు - దొడ్డి వైపు నుంచి వస్తుంది ధ్వని. అది పిచ్చమ్మను లాగుతుంది. రక్తం వేడెక్కుతుంది. కళ్ళు పొగలు కక్కుతున్నాయి - ఆలోచన ఆడుగంటింది - ఆరాటం ఆకాశాన్నంటింది - భయం పరుగు పెట్టింది- పరిణామాలు అగుపించలేదు --- లేచింది పిచ్చమ్మ.
పిచ్చమ్మ అడుగు ముందుకు పడింది.
ఆమె భర్తను చూడలేదు - అత్తను చూడలేదు. ఇల్లు చూడలేదు. వాకిలి చూడలేదు. ఇరుగు పొరుగు చూడలేదు .
ఆమె వింటున్నది - చూస్తున్నది - పిలుపు "పిచ్చి " -అది దొడ్డి గుమ్మం నుంచి.
అటు సాగింది . తలుపు తీసింది - అంతే! గురువయ్య వళ్ళో వాలిపోయింది.
"పిచ్చీ నువ్వు రావనుకున్న."
ఆమె మాట్లాడలేదు. అతని మెడ మీద చేతులు వేసింది - ముద్దు పెట్టుకుంది.
ఆమె ఊపిరి వేడిగా ఉంది. పెదవులు కాలుతున్నాయి.
"పిచ్చీ! ఇక్కడ్నా! పా. అగొ ఆ చెట్టు కిందికి....."
"వాండ్లు లేస్తరు- నేను పోవాలె." పిచ్చమ్మ గురువయ్యను లాక్కుంది.
గురువయ్య ఆమెను అదుముకున్నాడు.
రెండు గుండెలు దడలు విన్నాయి. రెండు ఊపిర్లు కలిసి అడేయి. చీకటి గొంగళి పరచింది.
విడిపోయేప్పుడు అడిగాడు గురువయ్య "రేపెక్కడ?" అని.
"పోద్దాల రాలేను ....రేత్రి తాటివనంల."
"రావాలే. రోజంతా ఆడనే ఉంట."
"వస్త.....నేను రాకుంటే .....నా పీనిగన్నోస్తదీ."
"ఏం దట్టంటావు?"
"అత్త కనిపెట్టినట్టున్నది .....ఏం చేస్తదో చూడాలే."
"పిచ్చీ!"
ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది.
విడిపించుకొని ఉరికింది పిచ్చమ్మ.
పిచ్చమ్మ తలుపేస్తుంటే అత్త కనిపించింది.
ప్రాణాలు పైపైనే పోయాయి.
"యాడికి పోయినావు?" బుచ్చమ్మ అడిగింది.
"అవుతలికి" గుండె దడ హెచ్చింది.
"అట్లనా?" అని వెళ్ళిపోయింది బుచ్చమ్మ.
పిచ్చమ్మ వెయ్యి దేవుళ్ళకు మొక్కి పోయి పడుకుంది, కాని నిద్ర పట్టలేదు. ఏవేవో పీడ కలలు వచ్చాయి --ఏదో బెదురు ఆవహించింది.
తెల్లవారి ఆలస్యంగా లేచింది పిచ్చమ్మా. ఆమెను చూస్తే బుచ్చమ్మకు అదో రకంగా అనిపించింది. ముఖం కళావిహీనం అయిపొయింది. కళ్ళు లాక్కుపోయాయి. చూపులు దేన్నో వెదుకుతున్నట్లున్నాయి.
"ఏమో అట్లున్నావు?" అడిగింది బుచ్చమ్మ.
"ఎట్లున్న బాగున్నగద" నవ్వింది పిచ్చమ్మ --- ఆ నవ్వులో కూడా ఏదో బెదురు కనిపించింది.
"వంట్లో బాగాలేదా?"
"బాగున్నది గద."
"నువ్వింట్లనుంచి ఎల్లకియ్యాళ . పన్లన్నీ నే చేసుకుంటలే."
"అట్లనే"
అక్కడ్నుంచి సాగిపోయిన బుచ్చమ్మ మళ్ళీ వెనకొచ్చి అడిగింది "డొకోచ్చినట్లున్నదా?"
"ఊహు" లేదన్నట్లు తల ఊపింది.
బుచ్చమ్మ వెళ్ళిపోయింది.
పిచ్చమ్మ మంచంలో కూలబడ్డది. ఏదో రిక్టంగా ఉన్నట్లనిపించింది. ఏదో పోగొట్టుకున్నట్లూ --- పోయినదాని కోసం వెదకాలన్నట్లూ వెదికినా అది దొరకనట్లూ ఉంది ఆమె స్థితి. ఇల్లు బోసిగా ఉంది. మనసు బోసిగా ఉంది. అసలు మనిషి బోసిగా ఉంది. బోసిగానే పొద్దు కుంకింది. పిచ్చమ్మను ఇంట్లో ఉండమని బుచ్చమ్మ తాటివనానికి వెళ్ళింది.
బుచ్చమ్మ వెళ్ళగానే పిచ్చమ్మకు ప్రాణం లేచి వచ్చింది. లేచి చకచకా ముఖం కడుక్కుని అలంకరించుకుంది. దొడ్డి గుమ్మం నుంచి బయలుదేరింది. ఆవిడకు తెలుసు బుచ్చమ్మ వచ్చే వేళ! అప్పటికి తిరిగి రావాలని ఆమె సంకల్పం!
పిచ్చమ్మ కనిపించకపోగా గురువయ్యకు పిచ్చెక్కినట్లయింది. బాగుండదని బుచ్చమ్మ పోసింది తాగాడు - తాటి వనంలో పడ్డాడు.
పిచ్చమ్మ ప్రాణాలు పైపైనే పోయాయి. "ఎవరో చెప్పుకో" అనే గురువయ్య ధ్వని వినేదాకా. చేతులు తొలగించి "అబ్బ ఎంత బయపెట్టినవు?" అన్నది.