ఒకరోజు "అడ్డా" విషయంలో తనకీ గురూగాడికి తగువు వచ్చింది. వాడు పెద్దవాడు కాబట్టి తనని తన్ని తగలేశాడు అక్కడ నుంచి.
అయితే లక్కీగా అప్పటికే తను అంతకంటే మంచి అడ్డా ఒకటి వెతికి వుంచుకున్నాడు. తనకి తెలుసు! గురూగాడికి తను కాంపిటీషన్ గా అక్కడే వుండడం ఇష్టం వుండదని.
తన కొత్త అడ్డా ఒక పెద్ద హోటలు.
ఆ హోటల్ కి తను పొద్దున్నే వెళ్ళేవాడు.
ప్రతి రూమూ బజర్ నొక్కి "బూట్ పాలిష్ సార్!" అని అరిచేవాడు.
నాలుగైదు రూములకి ఒక రూములో తనకి బేరం దొరికేది.
బూట్లన్నీ తీసుకెళ్ళి, మెట్లకింద కూర్చుని, ఛమకాయించేటట్లు పాలిష్ కొట్టితెచ్చి ఇచ్చేసేవాడు.
తన మొహం తనకి పెద్ద వరం.
బూట్లు పాలిష్ చేసినందుకు కూలీతోబాటూ, టిప్పు కూడా బాగానే ముడుతుండేవి.
అట్లా కొన్నాళ్ళు బాగానే గడిచింది.
ఒకరోజున మామూలుగానే తను హోటల్ కి వెళ్ళాడు. రూముల బజర్ కొట్టి "పాలిష్ సార్" అని అరుస్తూ వుండగా....
హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు మేనేజరు.
తన మెడ దగ్గర షర్టుని పట్టుకుని పైకి లేవదీశాడు.
'పటపటపట' చెంపలు కందిపోయేటట్లు కొట్టాడు.
"సార్! సార్! సార్! కొట్టకండి సార్!" అని తను ఆర్తనాదాలు చేస్తూ వుంటే....
ఉన్నట్లుండి ఒక రూము తలుపు తెరుచుకుంది.
నెమలి కంఠం రంగు పట్టుబట్టతో కుట్టిన లాల్చీ, చుడీదార్ పైజమా వేసుకున్న ఒక మనిషి గుమ్మం దగ్గర కనబడ్డాడు.
తీక్షణంగా చూసే కళ్ళు, డై చేసిన జుట్టు, కోర మీసం, పాన్ ల మీద పాన్ లు తింటూ వుండడం వల్ల గారపట్టిన పళ్లు, సన్నగానే వున్నా, దృఢంగా వున్న ఒళ్ళు.
అతను మాట్లాడుతుంటే సింహం శాసిస్తున్నట్లు వుంది.
"పురుషోత్తం! ఆ కుర్రాడ్ని వదిలెయ్!" అన్నాడు ఆ మనిషి.
వెంటనే భయభక్తులతో అతని మాటని శిరసా వహించాడు మేనేజర్ పురుషోత్తమ్.
తర్వాత వినయంగా సంజాయిషీ చెప్పాడు.
"మాఫ్ కర్నా సాబ్! ఇవాళ హోటల్లో దొంగతనం జరిగింది. ఈ వెధవే చేశాడని నాకు అనుమానంగా వుంది."
"ఏం పోయింది" అన్నాడు ఆ మనిషి.
"ఒక కస్టమర్ ది - పర్సు"
"ఎంత వుంది అందులో?"
"రెండు వేలు!"
ఆ మనిషి నవ్వాడు. తర్వాత అన్నాడు మేనేజర్ తో.
"దేఖో పురుషోత్తమ్! ఈ పోరగాడికి ఆరేళ్లు వుండవు. వీడు రెండు వేలు దొంగతనం చేస్తాడా? అనుమానమే! ఒకవేళ నిజంగానే చేశాడనుకో! వీడు పెద్ద ప్లేయర్ అవుతాడన్నమాట! నాకు పనికి వస్తాడు."
అప్పట్లో అతనెవరో తనకి తెలియదు గానీ, ఆ తర్వాత తెలిసింది.
అతని పేరు నర్సింగ్.
నర్సింగ్ ఒక పెద్ద దాదా.
హైదరాబాద్ లో అతనికి ఎదురు లేదు.
హైదరాబాద్ లో ఎక్కడ ఏ సంఘ వ్యతిరేక కార్యకలాపం జరిగినా, దాని వెనక నర్సింగ్ అన్నా వుంటాడు, లేదా ఆ పని చేసిన వాళ్ళకి నర్సింగ్ ఆశీస్సులు వుండి వుంటాయి.
నర్సింగ్ అట్లా తన తరఫున్ మాట్లాడగానే, మేనేజర్ గాభరాగా తనని వదిలేశాడు.
"లోపలికి రారా" అని పిలిచాడు నర్సింగ్.
లోపలికి వెళ్ళాడు తను.
తన వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు నర్సింగ్. ఆ పర్సు తనే కొట్టేశాడా అని మరీమరీ అడిగాడు.
భయంతో వణికిపోతూ చెప్పాడు తను - తను దొంగతనం చెయ్యలేదనీ తను దొంగని కాదనీ!
తన భయం చూసి నవ్వాడు నర్సింగ్. తర్వాత అన్నాడు.
"బేటా! దొంగతనం అంటే అదేదో తప్పని భయపడకు. బూట్లు పాలిష్ చేస్తూ వుంటే కాళ్ళ దగ్గరే పడివుంటావ్! అది ఒదిలెయ్! పైకి వచ్చే పద్ధతులు నేను చెబుతాను. అవి ప్రాక్టీస్ చేస్తూ వుండు. నీకు అవన్నీ ప్రాక్టీస్ అయ్యాక ఏదో ఒక మంచి రోజు చూసి 'జిప్' మని నిన్ను పెద్ద ప్లేయర్ ని చేసేస్తా" అన్నాడు.
ఆ తర్వాత తనకి తను తినగలిగినంత టిఫిన్ పెట్టించాడు నర్సింగ్.
తనకి ఊహ తెలిసిన తర్వాత అలా పొట్ట పగిలేటట్లు తినడం అదే మొదటిసారి. మసాలా దోసె, వడా, పూరీ, డబల్ కర్రీ, డబల్ చట్నీ, డబల్ సాంబారు....చివరగా కాఫీ.
తిన్న తర్వాత తనకి ఓ వందరూపాయల నోటు ఇచ్చాడు నర్సింగ్. తన గ్యాంగు మెంబరూ, కొన్ని ఏరియాలకి వస్తాద్ అయిన నజీర్ కి అప్పగించాడు తనను.
వద్దనే సాహసం లేదు తనకి.
నజీర్ తనకి రకరకాల 'గేమ్స్'లో ట్రెయినింగ్ ఇచ్చాడు. తక్కిన 'ప్లేయర్ల'కి యింట్రడ్యూస్ చేశాడు.
తను చాలా చలాకీ!
అతి కొద్దికాలంలోనే పెద్ద 'ప్లేయర్' అయిపోయాడు తను కూడా.
చిన్న వయసులోనే పెద్ద ప్లేయర్.