Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 22

అనుమానంగా తిరిగిచూసింది భానురేఖ.
గులాబి కాడకి ఉన్న ముల్లు చివర చేతితో గట్టిగా వత్తాడు రవిచంద్ర. రక్తం బొటబొట కారడం మొదలెట్టింది. ఈ అరచేతిని తెల్ల గులాబిపైన వుంచాడు. క్షణాల్లో అది ఎర్రగా మారిపోయింది.
"తీసుకోండి!" అన్నాడు, ప్రపంచంలోని ప్రేమనంతా పోగుచేసి గొంతులో పలికిస్తూ.
నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది భానురేఖ. మెల్లిగా చెయ్యిజాచి, ఆ గులాబి పువ్వుని అందుకుంది.
స్వర్గానికి వెళ్ళే మొదటి మెట్టు ఎక్కినంత సంతోషం కనబడింది రవిచంద్రకి.

                                                                   * * * *
"ఇవాళ భానురేఖని చూడడానికి మదన్ మోహన్ వస్తున్నాడని భానుతో చెబితే మంచిదంటావా? చెప్పకపోవడం మంచిదంటావా?" అన్నాడు రఘురాం విలాసినితో. అతను ఆ విషయం గురించి నిన్న రాత్రినుంచి తల పగలగొట్టుకుంటున్నాడు.
నొసలు ముడేసి కాసేపు ఆలోచించింది విలాసిని. ముందే చెప్పి, అమ్మాయిని హడలు గొట్టేయ్యడమెందుకూ? అసలు అతనికి నచ్చితే! ఆ తర్వాత నెమ్మదిగా అమ్మాయితో చెప్పొచ్చు. ఇంతకీ ఆ కుర్రాడు దేన్లో పనిచేస్తున్నాడన్నారూ?"
కంపెనీ పేరు చెప్పాడు రఘురాం. "పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ. బాంబే బ్రాంచిలో పనిచేస్తున్నాడు."
"కుదిరితే అమ్మాయి అదృష్టమే! అతని కోసం కారు పంపాలా?"
"వాళ్ళు కారుకి గతిలేని వాళ్ళనుకున్నావా ఏమిటి? అతనికి కొత్త మారుతి ఏ.సి.కారు ఉంది."
"మన పింకీకి కూడా ఇలాంటి సంబంధం వస్తే బాగుండు!"
నవ్వాడు రఘురాం "వస్తుంది! అప్పుడే తొందరెందుకు?"
అదే టైంలో గేటు ముందు రెండు కార్లు ఆగాయి. మారుతి ఏ.సి.కారులో మదన్ మోహన్ వచ్చాడు.
విలాసిని పంపిస్తే స్వీట్స్ తేవడానికి బజారుకి వెళ్ళిన రవిచంద్ర కూడా నిస్సాన్ కారులో అప్పుడే తిరిగి వచ్చాడు.
నిస్సాన్ కారుని డ్రయివ్ చేస్తున్న రవిచంద్రని గుర్తుపట్టాడు మదన్ మోహన్.
అతన్ని చూడగానే రవిచంద్ర మొహంలో కళ తగ్గింది. తను వదులుకున్న ఉద్యోగంలో చేరాడు మదన్ మోహన్. ఇతను తనకు పరిచయమే. కంపెనీ ఇంటర్వ్యూలో తన తర్వాత రాంకు వచ్చింది అతనికి. ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి?
మదన్ మోహన్ కూడా రవిచంద్రని ఆశ్చర్యంగా చూశాడు. రవిచంద్ర ఇక్కడికెందుకొచ్చాడు?
రెండు కార్లూ ఒకేసారి గేట్లో ప్రవేశించడం కుదరదు కనక, మర్యాదగా చెయ్యి చూపుతూ, "ముందు మీరు" అన్నాడు మదన్ మోహన్ చిరునవ్వుతో.
"కాదు! ముందు మీరు!" అన్నాడు రవిచంద్ర కూడా నవ్వుతూ.  
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సింహద్వారం దగ్గర ఇద్దరూ కలిసి, 'ముందు మీరు అంటే ముందు మీరు' అని మర్యాదలు చేసుకోవడం గుర్తొచ్చింది.
చిరునవ్వుతో తలపంకించి, తన కారుని లోపలికి పోనిచ్చి, పార్టికోలో ఆపాడు మదన్ మోహన్.
ఇతను తనను గురించి వివరాలు అందరికీ చెప్పేస్తాడేమో అని భయం కలిగింది రవిచంద్రకి. ముందుగా హెచ్చరిస్తే మంచిది అనుకుని, "మిస్టర్ మదన్ మోహన్!" అని పిలిచాడు మెల్లిగా.
కానీ అప్పటికే రఘురాం, విలాసినీ బయటికి వచ్చేశారు.
"రండి మిస్టర్ రవిచంద్రా!" అని పెద్దగా పిలిచాడు మదన్ మోహన్. "మీకు కూడా మిస్టర్ అండ్ మిసెస్ రఘురాం పరిచయమేనా? మిస్టర్ రఘురాం! రవిచంద్ర నాతో కలిసి ఎం.బి.ఎ. చదివాడు. ఆయన రిజెక్ట్ చేసి వదిలేసుకున్న ఉద్యోగంలోనే నేనిప్పుడు చేరింది."
రవిచంద్ర వారించే లోపల చెప్పకూడని వివరాలన్నీ గబగబ చెప్పేశాడు మదన్ మోహన్.
ఊపిరి బిగపట్టి చూస్తూండిపోయాడు రవిచంద్ర.
"ఏమిటి? ఏమిటి మీరంటోంది? మా డ్రైవరు ఎం.బి.ఏ. చదివాడా? మీరు పొరపాటు పడి ఉంటారు" అంది విలాసిని అయోమయంగా.
మదన్ మోహన్ షాక్ తిన్నట్లు ఉలిక్కిపడ్డాడు. "ఏమిటీ? రవిచంద్ర డ్రయివరా? మీకా? అబ్సర్డ్!"
రఘురాం నుదురు చిట్లించి రవిచంద్ర వైపు చూస్తున్నాడు. ఎవరితను? ఎం.బి.ఎ.చదివి, ఎవరికీ దొరకనంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి, తన దగ్గర కారు డ్రయివర్ గా ఎందుకు చేరాడు?
అంతకుముందు లిఫ్టు డ్రయివర్ గా ఎందుకు పనిచేశాడు?
అవే అనుమానాలు విలాసినికీ కలిగాయి. మదన్ మోహన్ కి కూడా కలిగాయి.
గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి వింటున్న భానురేఖకి కూడా కలిగాయి. అతనివైపు తదేకంగా చూస్తూండిపోయింది భానురేఖ. ఇతను ఎం.బి.ఎ. చదివాడా? చదివి లిఫ్టు ఆపరేటర్ గా, కారు డ్రయివర్ గా పనిచేస్తున్నాడా? ఎందుకు? ఎవరికోసం?
లీలగా అర్థమవుతున్నట్లు అనిపించింది ఆమెకు.
కూతురు వైపు చూశాడు రఘురాం. "రామ్మా! రా! కూర్చోండి మిస్టర్ మదన్ మోహన్!"
అని ఇబ్బందిగా రవిచంద్ర వైపు తిరిగి, "రవిచంద్రా! నువ్వు కూడా.. మీరు కూడా కూర్చోండి" అన్నాడు. ఆయన కదంతా గందరగోళంగా ఉంది. తన అదృష్టం బాగాలేదేమో! లేకపోతే ఇంత కష్టపడి తన కూతురుకి మంచి సంబంధం తీసుకొస్తే, మధ్యలో ముసుగు మనిషిలా వీడెవడు? తన దగ్గర ఎందుకు చేరాడు? వీడేం మాట్లాడకుండా ఇప్పటికి నోర్మూసుకు వెళ్ళిపోతే బాగుండు? తర్వాత తీరిగ్గా తను వీడి పని పడతాడు!

 Previous Page Next Page