Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 21

భానురేఖ అతనితో కూడా ఎక్కువేం మాట్లాడదు. అయితే అతని సమక్షంలో ఇబ్బందిగా కూడా ఫీలవదు తను. ఆ బంగళా తాలూకు తలుపులూ, ఆ కాంపౌండ్ లో ఉన్న చెట్లూ, చేమలతో రాళ్ళూ రప్పలతో బాటు అతనూ అలవాటయిపోయాడు ఆమెకు. రాళ్ళూ రప్పలని చూసి తను భయపడనఖ్కర్లేదు. రాతి గుండె గల మనుషులని చూసే భయపడాలి.
అదీకాక, ఇతను తనని చూసి పొరబాటున కూడా నవ్వడు. వెక్కిరించడు. కసురుకోడు. వెకిలి చేష్టలు చెయ్యడు.
అతను తనని ఏం చేస్తాడో అని భయపడుతూ కనిపెట్టి ఉండవలసిన అవసరం లేదు తనకి.
అతను ఉన్నందువల్ల పెద్ద చిరాకేం లేదు.
అతను పక్కన ఉన్నా, తన ఆలోచనలలో తను ఉండిపోవచ్చు.
అంతే! అంతకంటే ఎక్కువ ఆలోచించదు భానురేఖ రవిచంద్రను గురించి.
రొటీన్ లో ఏ మార్పూ లేకుండా మరో మూడు నెలలు గడిచిపోయాయి. ఆ మూడు నెలలలో మూడేళ్ళ అనుభవం వచ్చింది భానురేఖకి. మనసు మెల్లిమెల్లిగా విషయాలను గ్రహిస్తూ ఎదుగుతోంది. దానితోబాటే ఆమె "మానసిక వయసు" కూడా పెరుగుతోంది.
తెలివితేటలు పెరుగుతున్నకొద్దీ ఈ లోకమంటే మరీ విరక్తి కలగడం మొదలెట్టింది భానురేఖకి. మరణించాలనే నిర్ణయం మరింత గట్టిపడిపోయింది.
మానసికంగా ఆమె ఉన్న లెవెలుకి దిగివచ్చి, ఆమెతో ఉత్సాహంగా, అభిమానంగా, మాట్లాడి ఆమెని మామూలు మనిషిని చెయ్యాలని తనకు చేతనయినంత ప్రయత్నం చేస్తున్నాడు రవిచంద్ర. ఈమధ్య అతను మనసు 'పర' వశమైపోయి మరోలా వుంటున్నాడు కానీ, మామూలుగా అయితే అతను హ్యాపీ గో లక్కీ ఫన్ లవింగ్ యంగ్ మాన్. చెప్పిన జోకు చెప్పకుండా గంటల తరబడి చెప్పగలడు. అతను ఎక్కడుంటే అక్కడ నవ్వుల పువ్వులు విరుస్తాయి.

                                                                    * * * *

ఒకరోజు మామూలుగానే అతను కారు డ్రయివ్ చేస్తున్నాడు రోడ్ సైన్ ఒకటి కనబడింది. "అది చూశారా మేడమ్!" అన్నాడు భానురేఖతో.
ఇంట్రెస్టు లేకుండా చూసింది భానురేఖ. "స్పీడ్ లిమిట్ 15 కిలోమీటర్స్!" అని ఉంది.
"స్పీడు లిమిట్ మీద ఒక జోకు ఉంది మేడమ్! ట్రాఫిక్ కానిస్టేబుల్ తో ఒక డ్రైవర్ దిగులుగా అన్నాడట. "చూడు భాయ్! మనం ఉంటున్న భూగోళం గంటకి 1500 కిలోమీటర్ల స్పీడుతో తన చుట్టూ తాను తిరుగుతూ, గంటకి 107000 కిలోమీటర్ల స్పీడుతో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, ఆ సూర్యుడు గెలాక్సీలో గంటకి కొన్ని మిలియన్ల్ స్పీడుతో తిరుగుతుండగా. మన గెలాక్సీ విశ్వంలో ఎన్నో మిలియన్ల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. నువ్వేమో నన్ను పదిహేను కిలోమీటర్ల జోన్ లో ఇరవై కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నందుకు పట్టేసుకున్నావ్? ఇదేమన్నా బాగుందా చెప్పు?"
నవ్వకుండా సీరియస్ గా విండోలో నుంచి బయటికి చూస్తోంది భానురేఖ.
నిరాశగా ఆమె వైపు చూశాడు రవిచంద్ర "నవ్వు రాలేదా మేడమ్!"
విసుగ్గా తల ఊపింది భానురేఖ.
'నాకు ఇంకా ఎన్నో, ఎన్నెన్నో జోకులు గుర్తొస్తున్నాయి గానీ చెప్పడానికి భయమేస్తోంది మేడమ్! మీరు తిడతారేమోనని! పోనీ జోకులు మీదే ఒక జోకు చెప్పేసి నోర్మూసుకుంటాను ఏమంటారు?"
భానురేఖ మాట్లాడలేదు.
ఆమె ఏమీ అనకపోయినా చెప్పడం మొదలెట్టాడు రవిచంద్ర. "రష్యాలో నాలాంటి జోకర్లు బతకడం కష్టమండీ! అక్కడ జోకులు చెప్పేవాళ్ళకి బాగా బుద్దొచ్చేటట్లు శిక్ష వేస్తారట.
అక్కడ ఒక కాలవ వుంది. దాన్ని కుడివైపు తవ్వినవాళ్ళందరూ జోకులు చెప్పినవాళ్ళేట. మరి ఎడమవైపు కాలవ తవ్విన వాళ్ళెవరని అడగరేం?"
తనకు తెలియకుండానే కుడి కనుబొమ్మ కొద్దిగా ఎత్తి ప్రశ్నార్థకంగా చూసింది భానురేఖ.
"ఎడం వైపు కాలవ తవ్విన వాళ్ళందరూ జోకులు విన్నవాళ్ళుట!"
మొదటిసారిగా, ఆమె ఎర్రని పెదిమలు చిరునవ్వుతో అతి కొద్దిగా వంపు తిరిగాయి.
"నవ్వారా! అమ్మయ్య! నన్ను రష్యా వెళ్ళిపొమ్మని చెబుతారేమోనని హడలిపోయాను. థాంక్ గాడ్!"
నిజంగానే అతను దేముడికి శతకోటి వందనాలు అర్పించాడు మనసులోనే.
ఈ మంచు బొమ్మ కరగడం మొదలెట్టింది. మంచు కరిగితే మనసు పెరగడం ఎంతసేపు?
పెద్ద పెద్ద బంగళాలు ఉన్న ఏరియాలోకి వచ్చారు. నెమ్మదిగా వెళుతోంది కారు. ఒక కాంపౌండ్ వాల్ మీద నుంచి గులాబి పువ్వు ఒకటి తొంగి చూస్తూ. "ఇలారా, ఇలారా" అని పిలుస్తున్నట్లు గాలికి తల వూపుతోంది.
కారు రోడ్డు పక్కన ఆపి, అటూ ఇటూ చూసి, ఆ గులాబి పువ్వుని కాడతో సహా తెంపి, రెండు చేతుల్లో పట్టుకుని భానురేఖకి అందించాడు రవిచంద్ర.
అది అందుకోలేదు భానురేఖ. "తెల్ల గులాబీలు నాకు ఇష్టంలేదు. రక్తం లేక పాలిపోయిన పేషంట్లలాగుంటాయ్! ఎర్ర గులాబీలే నాకు ఇష్టం!" అంది మొహం తిప్పుకుంటూ.
"ఇది ఎర్ర గులాబీనే! ఇటు చూడండి!" అన్నాడు రవి.

 Previous Page Next Page