ఆ పరిస్థితి రవిచంద్రకి కూడా చాలా మొహమాటంగానే ఉంది. "నేను బయట వెయిట్ చేస్తాను" అని మెల్లగా గొణిగి వెనక్కి తిరగబోయాడు.
అతన్ని ఎక్కువ బలవంతం చెయ్యలేదు రఘురాం. సోఫాలో కూర్చున్నా ముళ్ళమీద కూర్చున్నట్లు ఫీలవుతున్నాడు మదన్ మోహన్.
"మా అమ్మాయి అంత మంచిపిల్ల మరెక్కడా ఉండదని ధైర్యంగా చెప్పగలను నేను. తను ఎవరి ఇంట్లో అడుగుపెడితే వాళ్ళు సుఖపడతారు" అన్నాడు రఘురాం. బిజినెస్ లో అలవాటయిపోయిన 'సేల్స్ టాక్' లాగా మాట్లాడం మొదలెడుతూ.
గుమ్మం దాటి అప్పుడే బయటికి అడుగు పెట్టబోతున్న రవిచంద్రకి గుండె ఆగిపోయినట్లనిపించింది.
సరిగ్గా అలాగే అనిపించింది భానురేఖకి కూడా. తనని వీళ్ళ ఇంటికి పంపించేస్తారా? అక్కడ మళ్ళీ తనకి కొత్త మనుషుల మధ్య కొత్త కష్టాలు తప్పవా? అల్లకల్లోలంగా అయిపోయింది ఆమె మనసు.
మదన్ మోహన్ తన్మయంగా చూస్తున్నాడు భానురేఖని! దేనితో తయారుచేశాడు దేముడు... ఈ అమ్మాయిని? మంచిగంధం, మల్లెపూలూ, జుంటి తేనే. మేలిమి బంగారం, వెన్నెల కాంతినీ కలిపి మంచి మూడ్ లో ఉన్నప్పుడు మలిచాడా ఈ అమ్మాయిని.
"మీ పేరేమిటి?" అంటున్నాడు మదన్ మోహన్.
"జి. భానురేఖ" అని చెప్పింది భానురేఖ... భీతహరిణేక్షణలా చూస్తూ. హెడ్మాష్టర్ తో జవాబు చెబుతున్న స్టూడెంట్ లా చెబుతోంది తను.
"జి ఫర్ గుడ్ గర్ల్! అవునా!" అన్నాడు మదన్ మోహన్ చిరునవ్వుతో.
భానురేఖ పెదిమలు కొంచెం సాగాయి.
ఆ నవ్వు రబ్బరు నవ్వులా అసహజంగా వుంది. ఆ అమ్మాయి మనసులో ఒకే ఆలోచన! ఇతనితో వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి తను?
కాసేపు అవీ ఇవీ మాట్లాడి, మాట్లడుతున్నంతసేపూ భానురేఖ అందాన్ని చూపులతో తాగేసి, ఆ మత్తులో తడబడిపోతూ మరికొన్ని మాటలు మాట్లాడి బయటికి వచ్చాడు మదన్ మోహన్.
రవిచంద్ర నిలబడి ఉన్నాడు కారుదగ్గర.
"రవిచంద్రా! ఏమిటిది! మీతో మాట్లాడాలి నేను" అన్నాడు మదన్ మోహన్, ఇంకెవరూ వినకుండా.
"తర్వాత మిమ్మల్ని కలుస్తాను" అన్నాడు రవిచంద్ర. అంతకంటే ఎక్కువ చెప్పలేదు.
* * * *
"మీతో మాట్లాడాలి నేను" అన్నాడు రఘురాం. మదన్ మోహన్ వెళ్ళిపోయాక.
సంతోషంలేని నవ్వు నవ్వాడు రవిచంద్ర. "నేను చదివిన చదువు నేను చేస్తున్న ఉద్యోగానికి మరీ ఎక్కువయిపోతుందని తీసేస్తారా సర్!"
"తీసేస్తానని అనటం లేదు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?"
ఏదో చెప్పాలని నోరు తెరిచి ఆగిపోయాడు రవిచంద్ర. ఇప్పుడింక చెప్పి లాభం లేదు. మదన్ మోహన్ తో మ్యారేజ్ సెటిలయిపోతోంది భానురేఖకి. అంతా అయిపోయాక తను బయటపడిపోయి మనసులోనిదంతా చెప్పెయ్యడమెందుకు? అనవసరమైన అన్ ప్లెజెంట్ నెస్!
"ఏదన్నా మంచి ఉద్యోగంలో చేరేముందు మనుషుల్లో కలిసిపోయి మార్కెట్ సర్వే చేయదల్చుకున్నాను కొంతకాలం పాటు! ఇదివరకు రాకుమారులు పట్టాభిషేకానికి ముందు దేశాటన చేసి లోకానుభవం సంపాదించేవాళ్ళు చూడండి. అలాగే! అంతే! గుడ్ బై సర్! థాంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్!" వెనక్కి తిరిగాడు రవిచంద్ర.
విలాసిని ఏదో పెద్దగా అరవబోయింది. ఆమెను వారించి, అతను వెళ్ళిన వైపే చూస్తూండిపోయాడు రఘురాం.
రవిచంద్ర గేటుదాటి బయటకి రాగానే గుసగుసగా మాటలు వినబడ్డాయి.
"మీతో మాట్లాడాలి! సాయంత్రం పార్కుకి రండి!" అర్జెంటుగా చెప్పేసి వెళ్ళిపోయింది భానురేఖ.
గుండె ఆగిపోయినట్లయి పోయింది రవిచంద్రకి. ఆరోజుకి రెండోసారి- ఇఇసారి సంతోషంతో.
* * * *
పార్కులో అతనికి బాగా దగ్గరగా కూర్చుంది భానురేఖ. భానురేఖ వంటిమీద నుంచి వస్తున్న పరిమళం, పక్కనే ఉన్న గులాబి పూలవాసనా, పచ్చిగడ్డీ సువాసనా కలిసి అద్భుతమైన అట్ మాస్ఫియర్ సృష్టిస్తున్నాయి.
"చెప్పండి!" అన్నాడు రవిచంద్ర ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటూ.
"నేను మీకు లక్షరూపాయలు ఇస్తాను మీరొకపని చేయాలి."
ఆశ్చర్యంతో నోటమాట రాలేదు రవిచంద్రకి. అతికష్టం మీద మాట కూడదీసుకుని అన్నాడు.
"పనా! ఏం పని?"
"మీరు నన్ను చంపెయ్యాలి. నాకు తెలియకుండా, ఎప్పుడో ఒకప్పుడు నన్ను చంపెయ్యాలి. ఎలాంటి చావైనా ఫర్వాలేదు. నీళ్ళలో తోసేసినా, నిప్పుల్లోకి నెట్టేసినా, తుపాకితో కాల్చేసినా ఫర్వాలేదు. కానీ నన్ను గన్ షాట్ గా చంపెయ్యాలి!"
"ఎందుకు?" అన్నాడు రవిచంద్ర తడారిపోయిన గొంతుతో.
"నాకు బ్రతుకు మీద ఇష్టం లేదు. చచ్చిపోటానికి ఇదివరకొకసారి ప్రయత్నించాను. ఫెయిలయి, పోలీసు కేసయింది. అందుకని ఇంకో ప్రయత్నం చెయ్యడానికి భయం! దయచేసి మీరు నన్ను చంపెయ్యండి. తలుచుకుంటే మీరు ఏదయినా చెయ్యగలరు. లిఫ్టు ఆపరేటర్ గా పని చెయ్యగలరు. కారు డ్రయివరుగా పని చెయ్యగలరు. రక్తంతో తెల్ల గులాబీని ఎర్ర గులాబిగా మార్చగలరు. మీకిది చాలా చిన్న పని. పైగా చాలా డబ్బు వస్తుంది మీకు. ఏమంటారు?" జాలిగా అడిగింది భానురేఖ.