"ఏం జరిగింది? ముందది చెప్పు" శర్మ అనే పోస్టుమ్యాన్ అడిగాడు. అతను ఏభై ఏళ్ళ వయసులో అచ్చు నలిగిపోయిన కార్డుముక్కలా ఉంటాడు.
"శ్రద్ధగా వినండి. వాడెవడోగానీ రజనీ అనే పిల్లకు రోజుకొక వుత్తరం రాస్తున్నాడు. నాకున్న వీక్ నెస్ తెలుసుకదా. నా చేతుల్తో లవ్ లెటర్ ను చించిపడెయ్యలేను. దాంతో రెండు కిలోమీటర్లు నడిచెళ్ళి ఆ పిల్లకు ఉత్తరం యిచ్చి మరో రెండు కిలోమీటర్లు నడిచి వస్తున్నాను." చెప్పాడు వేలు.
"రోజుకొక ఉత్తరమా?" అప్పారావు అడిగాడు. అతను టు టౌన్ పోస్టుమాన్. తెరిచిపెట్టిన స్టాంప్ ప్యాడ్ లా నల్లగా వుంటాడు.
"అవును. రోజూ ఇన్ ల్యాండ్ కవర్ రాస్తున్నాడు."
"అది లవ్ లెటర్ అని నీకెలా తెలుసు?" చిట్టిబాబు ప్రశ్నించాడు అతను భవానీనగర్ ఏరియా పోస్టుమ్యాన్.
"ఫ్రమ్ అడ్రస్ లేదుగనుక. అందునా లవర్స్ కాకపోతే రోజూ ఉత్తరం రాయడు" ఠక్కున చెప్పాడు వేలు.
"ఈ వూరేనా అతనిది?" సీరియస్ గా అడిగాడు అప్పారావు రోజూ ఒకే ఇంటికి అంతదూరం నడిచెళ్ళి వుత్తరాన్ని ఇవ్వడం ఎంత కష్టమో అతనికి తెలుసు. అందుకే అతనూ వేలులాగే ఆ అజ్ఞాత ప్రేమికుడు మీద పీకలదాకా కోపం తెచ్చుకున్నాడు.
"ఈ వూరే, స్టాంప్ చూశాను. ఇందిరానగర్ కాలనీ ముద్ర వుంది."
"అయితే అది నా ఏరియానే. రేపు మాటు వేస్తాను. ఆ ఏరియాలో పోస్టాఫీసులోనే పోస్టుబాక్స్ వుండేది. ఉత్తరాన్ని అక్కడే పోస్టు చేయాలి. చేతివ్రాత పోల్చుకోగలవు కదా" అడిగాడు శర్మ.
"పోల్చుకోగలను దూరంనుంచే చెప్పేయగలను. రోస్ కలర్ స్కెచ్ పెన్ తో అందంగా అడ్రస్ రాసుంటుంది" చెప్పాడు వేలు.
"అయితే అందరం రేపే అతన్ని పట్టుకుందాం. అతన్ని పట్టుకున్నాక ఏం చేద్దాం?" ఆ ప్రేమికుడ్ని పట్టుకుని తందామన్నంత అక్కసుతో అడిగాడు అప్పారావు.
"నాకిప్పుడు ఓ గుడ్ ఐడియా వచ్చింది. వాడ్ని రేపు పట్టుకుని వాడిచేతే మన అన్ని వుత్తరాల్నీ బట్వాడా చేయిద్దాం. అప్పుడు తెలుస్తోంది వాడికి బాధ. లవర్స్ ఉత్తరాల్ని అందించే మధ్యవర్తుల కింద పోస్టుమ్యాన్ లను జమకట్టే వెధవలందరికీ ఇదే శిక్ష. ఏమంటారు?" అందరివైపు చూశాడు వేలు.
"చాలా భేషుగ్గా వుంది" చిట్టిబాబు చెప్పాడు.
అందరూ ఆ శిక్షను ఆమోదించారు.
రేపు ఎప్పుడౌతుందా అని వాళ్ళు ఎదురుచూడసాగారు.
పొద్దు పొడవగానే అందరూ తయారైపోయారు. ముందు అనుకున్నట్టు అందరూ ఇందిరానగర్ కాలనీ పోస్టాఫీసు దగ్గర కాపు కాశారు. అప్పుడు టైమ్ ఉదయం తొమ్మిదిగంటలవుతోంది.
అదే సమయానికి ఆఫీస్ కు బయల్దేరుతున్నాడు నరేష్.
వైట్ ఫ్యాంట్ మీద వైట్ షర్ట్ టక్ చేసుకున్నాడు. కాన్వాస్ షూస్ వేసుకుంటూ వుండగా ప్రసాద్ వచ్చాడు.
"హలో నరేష్" అని అతనిని కిందనుంచి పైవరకూ పరిశీలించాక "గెటప్ మార్చావే. వెరీఫైన్" అన్నాడు ప్రసాద్.
"అవును సార్" ఇబ్బందిగా నవ్వాడు అతను.
జీవితంలో అంత శుభ్రంగా బట్టలేసుకోవడం అదే మొదటిసారి. అందుకే అతనికి కొత్త కొత్తగా సిగ్గుసిగ్గుగా వుంది.
"జీతం పుచ్చుకున్నావా?" ప్రసాద్ అడిగాడు.
"లేదు సార్. అడ్వాన్స్ ఇచ్చారు మా ప్రొప్రయిటర్. అద్దె బకాయి గంట క్రితమే నాన్నగారికి ఇచ్చాను సార్ మీకిచ్చారా?"
"అదా విషయం. ఇందాకట్నుంచీ చూస్తున్నాను. ఆయన రింగు రింగులుగా పొగ వదులుతూ దర్జాగా వీధి అరుగుమీద మంచంపైన కూర్చుని చిద్విలాసంగా నవ్వుతున్నారు. నా దగ్గర డబ్బు తీసుకోకుండా ఈయనకు సిగరెట్లు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అనుకున్నాను. అదన్నమాట సంగతి. ఇంకెప్పుడూ ఆయన దగ్గర డబ్బులివ్వకు."
"మొత్తం డబ్బూ సిగరెట్లకు తగలేస్తున్నాడా సార్?"
"ఒక్క సిగరెట్లే యేమిటి? ఇప్పుడు రెండు దురలవాట్లున్నాయి. ఒకటి సిగరెట్. రెండోది వక్కపొడి."
పక్కన బాంబుపడ్డట్లు అదిరిపడ్డాడు నరేష్.
"వక్కపొడా?"
"ఆఁ వక్కపొడే! అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నీ సలహా యిలా బెడిసికొడుతుందనుకోలేదయ్యా! నువ్వు చెప్పినట్టు సిగరెట్ కావాలనుకున్నప్పుడంతా వక్కపొడి యిచ్చాం. వక్కపొడి నమిలి సిగరెట్ కోసం చేయి చాచేవాడు. ఇన్నిరోజుల అలవాటు కదా అని వక్కపొడితో పాటు సిగరెట్టూ యిచ్చాం. ఇప్పుడు ఎంతవరకూ వచ్చిందంటే చెబుతా విను. అలా వక్కపొడి నమిలి, తాపీగా సిగరెట్ వెలిగించుకుని తాగుతున్నాడు. ఇంతకు ముందు సిగరెట్లకే డబ్బు అడిగేవాడు. ఇప్పుడు వక్కపొడికి కూడా కలిపి అడుగుతున్నాడు" తల పట్టుకున్నాడు ప్రసాద్ .
ఆశ్చర్యంగా వుంది సార్!"
"నీకు ఒక్క ఆశ్చర్యమే! నాకు రెండు, ఆశ్చర్యంతో పాటు బాధ కూడా" ఆందోళనగా చూశాడు అతను నరేష్ వైపు.
"ఇప్పుడేం చేద్దాం సార్?"
"అది అడగడానికే కదా యిప్పుడు నీ దగ్గరకొచ్చింది."
నరేష్ కాసేపు ఆలోచించాక చెప్పాడు "సార్! ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందనుకుంటా! ఈసారి నాన్నగారికి సిగరెట్ కాల్చాలన్న పిచ్చి వచ్చినప్పుడంతా మూడు ఔన్సుల విస్కీని నీళ్ళలో కలిపి ఇచ్చేయండి సార్ ఆ తరువాత సిగరెట్ యివ్వకండి. నెమ్మదిగా సిగరెట్లు మరిచిపోయాక విస్కీ యివ్వడం మానేద్దాం. ఇరవైయేళ్ళ సిగరెట్ అలవాటు మానడం కష్టం గానీ, కొన్నిరోజుల విస్కీ అలవాటు మానడం చాలా సులభం సార్! ఈసారికి యిలా చేయండి. ఆయన సిగరెట్లు, వక్కపొడి మానేస్తారు."
ఈ సలహా కూడా నచ్చింది ప్రసాద్ కి.
"మరి మీ భార్య సమస్య తీరిందా సార్?"
"లేదు! నేనింకా అస్కలిత బ్రహ్మచారినే" ఠక్కున అని వెళ్ళిపోయాడతను.
అంతక్రితం రాసిన లెటర్ తీసుకుని పోస్ట్ చేయడానికి బయలుదేరాడు. నరేష్. పోస్టాఫీసు నుంచి ఆటే ఆఫీసుకు వెళదామనుకుని ఫైల్స్ కూడా తీసుకున్నాడు.