కోయలు కొట్టిన కలప బండ్లమీద వస్తున్నది. గుట్టలుగా పడుతున్నది. జనం రంపాలతో కోస్తున్నారు. అది చూచాడు తాసిల్దారు. ఈ పర్వదినాలలోనే గుడి కూల్చి పుణ్యం ఆర్జించుకోవాలని సంకల్పించుకున్నాడు. అతని ఆజ్ఞకు అడ్డంటూ లేదు. కాని ఎందుకో కాస్త ఆలోచించాడు. ఆలోచిస్తూనే వున్నాడు. పిడుగులాంటి వార్త తెచ్చాడొకడు.
"ఖరీజా (మల్లమ్మ) కండ్లపడ్తలేదు. అని విన్నవించాడు. ఆ వార్త విన్న తాసిల్దారు ఒళ్ళుమండిపోయింది. వచ్చినవాణ్ణి లాగి కొట్టాడు. "ఎతుకుండి లంజయాడికి పోతది? దొరక్కుంటే నీ పానాల్తీస్త" అని కేక పట్టి బల్లపీటమీద కూలబడ్డాడు. అతనికి భూమి తనచుట్టూ తిరుగుతున్నట్లని పించింది. తాను తల్ల క్రిందులై నట్లనిపించింది. తన అధికారం అస్తమించుతున్నట్లనిపించింది. తన బంగళాలో అడుగు పెట్టిన ఆడది పోతే గోరీలగడ్డకే. కాని బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. అలాగే జరిగిందింత కాలమూ. మల్లమ్మ పారిపోయింది. ఆ ఆలోచనే అతడు భరించలేక పోయాడు. గుండెకు రంపపుకోత ఎక్కువైంది. వళ్ళు చమటలు పట్టింది. ఆ మాట నమ్మలేక పోయాడు.
"ఆవ్" కేక పెట్టాడు.
బంగళా బద్దలైంది.
జనం చుట్టూ చేరింది.
"నిజంగా పోయిందా?" ప్రశ్నకాదు.
పిడుగుపాటు!
అంతా మౌనంగా తలలు వంచుకున్నారు.
"బోలో" గర్జన.
"అవ్ సర్కార్! పోయింది" ప్రాణం లేనట్లు చెప్పిన జవాబు.
"కహాఁగయీ, కైసేగయీ?" అగ్ని పర్వతం బద్దలైంది; ఆ మంటతో దీపాలు వెలిగాయి. తాసిల్దారు ఉగ్రుడై లేచాడు. చేతికి అందిన వాణ్నల్లా బాదాడు. తనుస్తూ బల్లమీద కూర్చొని "అమీన్ కో బులావ్" అన్నాడు.
జనం పరుగెత్తారు.
పీరీల కొట్టంలో అగ్గి మండుతూంది.
జనం పదాలు పాడుతున్నారు.
అగ్నిగుండం చుట్టూ తిరుగుతున్నారు.
అమీను వచ్చాడు. అగ్ని గుండంలా ఉన్నాడు తాసిల్దారు. హడలిపోయాడు అమీను.
"ఏమింతజామ్ చేస్తున్నావ్? ఆడదాన్ని పట్టుకోలేక పోయినావ్ పీరిగాకో పకడ్ లావ్1 పీటో2 మాదర్ చత్ కో" ఆజ్ఞాపించాడు తాసిల్దారు.
అమీను సైతం మండిపోయాడు - కాని లోలోన రావఁడిని కొట్టినందుకు బాధ్యతంతా తనమీద వేశాడు. ఇప్పుడేమో పీరణ్ణి కొట్టమంటున్నాడు! కొట్టడం కొట్టడం చావ కొట్టాలి. తాసిల్దారు తప్పు తాసిల్దారు నెత్తినే కొట్టాలి. తనను చూస్తే హడలిపోవాలి గూడెం అనుకొని బయలుదేరాడు. పోలీసు స్టేషను నుంచి జవాన్లను తుపాకుల సహితంగా తీసుకొని బయలుదేరాడు. వడ్డెర గూడెం మీద పడ్డాడు. కనిపించిన వాణ్ణల్లా కొట్టాడు. మల్లి జాడ అడిగాడు జాడ అడగడం కాదు బాదడం ప్రధానం, పీరయ్య గుడిసెలో దూరాడు.
_____________________________________________
1.పట్టుకురా. 2. బాదు.
పీరయ్య భార్య పీరమ్మ చిక్కి శల్యం అయిపోయింది. భీముడు తన పెద్దకొడుకు చేతిలో లేకుండా పోయాడు. పుట్టిన కొత్తబిడ్డ గిట్టాడు. తాసిల్దారు పట్టుకొని పోయిన మల్లమ్మ మాయం అయింది. ఆ మాటవిని విరుచుకుపడ్డదా తల్లి. స్పృహలేదు. పలవరిస్తూంది. పీరయ్య కన్నీరు కారుస్తూ మంచం పక్కన కూర్చున్నాడు.
గుడిసెలోకి దూరిన అమీను, "భంచత్ మల్లినేడ దాచినవ్ బే" అని లేపి లాగి తన్నాడు. పీరయ్య బంతిలా బయటపడ్డాడు. పడడం పడడం రాతి మీద పడ్డాడు. నొసలు చిట్లింది. పండ్లు విరిగాయి. అతడు లేవడానికి ప్రయత్నిస్తుండగానే జవాన్లు వచ్చి చెరోరెక్క పట్టి లేపి లాక్కుపోయారు. దారి పొడుగునా రక్తం కారుతూనే వుంది. అయినా బాదుతూనే ఉన్నాడు అమీను. పోలీస్టేషన్ కు తెచ్చారు పీరయ్యను. పీరయ్యను గుంజకు కట్టేసి తాసిల్దారు మీద కసి అతనిమీద తీర్చుకుంటున్నాడు అమీను. మల్లి జాడ చెప్పమంటున్నాడు అమీను. తనకు తెలియదంటున్నాడు పీరయ్య. బాదేస్తున్నాడు. కర్రలు విరుగుతున్నాయి. శరీరం రక్తసిక్తం అయిపోయింది. ఇంక మాట్లాడే స్థితిలో లేడు పీరయ్య. ఆ దశలో లాక్కుపోయాడు తాసిల్దారు దగ్గరికి.
పీరయ్య స్థితి దయనీయంగా ఉంది. వంటినిండా రక్తం. నోట్లో రక్తం. కాళ్ళు వేళ్లాడ పడుతున్నాయి. అలాంటి వాణ్ణి తాసిల్దారు ముందు నుంచో పెట్టారు. అతని కాళ్ళు నిలవడంలేదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. లోకం కనిపించడం లేదు.
"యాడ దాచినవ్ బే మల్లిని" తాసిల్దారు గర్జన.
ఆ ధ్వనికి ఈ లోకంలోకి వచ్చాడు పీరయ్య. చేతులు జోడించాడు. తనకు తెలియదన్నట్లు చూచాడు. మాట రావడంలేదు.
"బోల్ నహీఁతో మార్ డాలూఁగా' తాసిల్దారు కేకవేసి లేచాడు.
పీరయ్య మూత్రం వదిలాడు.
"భంచత్ నఖ్రాల్ చేస్తవ్ బే" అని కర్ర అందుకొని ఉరికాడు తాసిల్దారు. అతనిని చూసి జవాన్లు పక్కకు జరిగారు. పీరయ్య ధడేల్ మని నేలమీద పడ్డాడు. తాసిల్దారికి శివం వచ్చింది. కర్రతో విపరీతంగా బాదేశాడు పీరయ్యను. అతడు కనీసం మూలుగలేదు. దూది మూటమీద బాదినట్లు బాదాడు. కాలితో తన్ని "లాల్ ఖాన్* కు" కట్టెయండి. గాడ్దికొడుకు పీనిగల బొందిలకి పోవాలే" అని దూరం జరిగాడు.
అతని కాలికి రక్తం అంటింది. మనుషులను పిలిచి కడిగించుకున్నాడు.
జవాన్లు పీరయ్యను ఈడ్చుకపోయారు. గొలుసులతో కట్టుకొయ్యకు కట్టేశారు.
పీరయ్యకు స్పృహలేదు.
తెల్లవారింది. ఆ 47 రోజులు తాసిల్దారుకు భోగాలు త్యాజ్యం. అందుకే త్వరగాలేచాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ముల్లాకోసరం ఎదిరిచూస్తూ కూర్చున్నాడు. ముల్లా వచ్చాడు. తాసిల్దారు లేచి నుంచున్నాడు. సలాంచేశాడు. ముసల్మానులు కూడారు. ముల్లా ఖురాను చదివాడు. హజ్రత్ ఆలీని అభూసూఫియానీ హత్య చేయించిన ఉదంతాన్ని గురించి ఉపన్యసించాడు.
__________________________________
*రక్త స్తంభం.
అబూబకర్ తరువాత ఉమర్, అతని తరువాత ఉస్మాన్ ఖలీఫాలైనారు. వారు ఖురాన్ ఆదేశాలను పాటించనందున ప్రజలు మహమ్మద్ అల్లుడు ఆలీని ఖలీఫాచేశారు. అబూసూఫీయాని అనేవానికి రాజ్యకాంక్ష కలిగింది. అతడు ఆలీని అంతం చేయదల్చుకున్నడు. అబ్దుర్రహమాన్ అనే వానికి విషం పూసిన కత్తి ఇచ్చి హత్య చేయమన్నాడు. అబ్దుర్రహమాన్ మసీదుకు వెళ్ళాడు. నమాజు చేసేప్పుడు హజరత్ అలీ వెనుక నుంచున్నాడు. నమాజు చేయడానికి వంగినప్పుడు ఆలీని పొడిచేశాడు. ఆలీ అక్కడే చనిపోయాడు.
13 వందల సంవత్సరాల క్రితం అమరులైన హసన్ సోదరులను తలచుకొని శోకగీతాలు పాడారు - కృతకంగా ఏడ్చారు. గుండెలు బాదుకున్నారు. తరువాత దాన ధర్మాలు జరిగాయి.
తెల్లవారింది. పీరయ్య కట్టుగొయ్యకే వున్నాడు. శరీరం రక్తముతో నిండి వుంది. పెదవులు పగిలి రక్తం పక్కులు పట్టింది. ముఖం కమిలిపోయింది. కండ్లు వాచాయి. మూర్తి భయంకరంగా వుంది. రాత్రి సాంతం పీరయ్యకు స్పృహలేదు. వెన్నెల అతని గాయాలను మాన్పిందో - కాలమే మందుగా పనిచేసిందో తెల్లవారి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచాడు. తూర్పును చూచాడు. ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు. ఎర్రగా, గుండ్రంగా ఎగబాకుతున్నాడు. ఎదిగే సూర్యుడు అందంగా కనిపించాడు. ఆశ మెరిపించాడు అలా క్షణం చూశాడు సూర్యుడ్ని తనను చూచుకున్నాడు. తన శరీరం తనకే భయం కలిగిస్తూంది. అసహ్యం కలిగిస్తూంది. ఏమైంది? ఎందుకిలా అయినాడు తాను? తాను చేసిన పాపం ఏమిటి? తర్కించుకున్నాడు. తర్జన భర్జనలు సాగేయి. పళ్ళు పట పట లాడించాడు. అసలు తాను జీవిస్తాడా? బ్రతికి బట్టకడుతాడా? పీనుగులబొంద గుర్తుకు వచ్చింది. తాను చచ్చిపోతాడేమో! తననూ ఆ బొందిలో పారేస్తారేమో! ఏమో! మరి!
చావు, మృత్యువు, యముడు, ఒక్కోసారి పదాలే మనిషిని భయపెడ్తాయి. భయపడ్డాడు పీరయ్య. గుండె గుబగుబ లాడింది. చీకట్లు గుంపులు గుంపులుగా తనవైపు రాసాగేయి. ఏదో ఆవేదన. ఏదో ఆందోళన. ఏదో ఆవేశం. బిగ్గరగా కేక పెట్టాలనుకున్నాడు. లోకానికి ఏదో చెప్పాలనుకున్నాడు. గొంతు చించుకోవాలనుకున్నాడు. లోకాన్ని దద్దరిల్ల చేయాలనుకున్నాడు. డొక్కలోంచి పెకలిన ధ్వని గొంతులో ఇగిరిపోయింది.
చుట్టూ చూశాడు. సూర్యుడు బాగా పైకి వచ్చేశాడు. అంతక్రితం ఆనందం కలిగించినవాడు మంట పెట్టసాగేడు. వళ్ళు మండిపోతూంది. గొంతు ఆరిపోతూంది. నాలుక పిడచ కడ్తూంది. దాహం, దప్పి, దూప, దాహానికి ప్రాణాలు ఎగిరిపోయేట్లున్నాయి! తనముందే బెంచీలున్నాయి. వాటిమీద లక్కపూసిన కుండలున్నాయి. వాటిలో పానకం వుంది. కొబ్బరి గరిటెల్తో పానకం తీసి గ్లాసులో పోసుకొని తాగుతున్నారు. జనం పిల్లలు గుంపులు గుంపులుగా కూడుతున్నారు. పానకం తన ముందేవుంది. ఎంతో దూరంకాదు. తాను వెళ్తే వెళ్ళాలి. కదిలాడు. గొలుసులు గలగలా మన్నాయి. కట్టివేస్తే మనిషి కదల్లేడు. అది ఎంత దగ్గరుంటేనేం? అర్థంచేసుకున్నాడు. నాలుకతో పెదవులు తడుపుకొందామనుకున్నాడు తడుపుకున్నాడు. పక్కులు ఊడాయి. రక్తం నాలుకకు అంటింది. తుపుక్కున ఊశాడు.