మేరీ విస్తుపోయింది.
ఆంజనేయులు కూడా అర్థింపుగా చూడటంతో అలాగే చేసింది మేరీ.
ఆంజనేయులు, ఆనందం చేతిలో సూట్ కేస్ తీసుకొని మేరీతో ముందు నడిచాడు.
వాచ్ మెన్ వస్తున్న మేరీని చూసి ఆంజనేయులి భార్య అనుకున్నాడు.
అతనేదో మాట్లాడేలోపు ఆంజనేయులు, మేరీ లోపలకెళ్ళి పోయారు.
"మన ఆంజనేయులి భార్య... ఊరినుంచి ఇప్పుడేవస్తోంది ప్రొద్దున రావాల్సిన ట్రైన్ యిప్పుడొచ్చి తగలడింది... సూట్ కేస్ కూడా ఉంది. చూశావుగా" అంటూ ఆనందం వడివడిగా లోపలకెళ్ళిపోయాడు.
ఆ విషయం చెప్పటానికి వాచ్ మెన్ మెయిన్ బంగ్లాకేసి పరిగెత్తటం చూసిన ఆనందం పరిగెత్తుకెళ్ళి-
"అరే మర్చేపోయాను. ఇంట్లో పాలులేవు. టీ పార్టీ తరువాత ఇస్తాంలే" అని మేరీ ఆశ్చర్యపోయి చూస్తున్నా పట్టించుకోకుండా వాచ్ మెన్ వచ్చేలోపు మేరీని బలవంతంగా గేట్ దాటించేశాడు.
* * * *
ఆ రాత్రికి రాత్రే భువనేశ్వరీదేవి ఎక్కడ గదికొచ్చి పడుతుందోనని అనందం, ఆంజనేయులు హడావిడిగాబంగ్లాకి వెళ్ళి జరిగింది యధా తధంగా భుజంగరావుకి చెప్పారు.
గండం గడిచినందుకు భుజంగరావు ఊపిరి పీల్చుకున్నాడు.
అంతలో రానే వచ్చింది భువనేశ్వరి నవ్వుకుంటూ.
"అమ్మాయి వచ్చేసిందటగా...? వాచ్ మెన్ చెప్పాడు. ప్రొద్దుననగా రావల్సిన అమ్మాయి ఇప్పుడొచ్చిందేమిటి?" ఆరాతీస్తూ అంది భువనేశ్వరి.
"టై...ట్రైన్ లేట్..." అన్నాడు ఆనందం తడబాటుని కప్పిపుచ్చుకుంటూ.
"అదా కారణం... అమ్మాయిని చూడొచ్చా?" అందామె తిరిగి.
ముగ్గురి గుండెల్లో మరఫిరంగులు పేలిపోయాయి.
క్షణాల్లో తేరుకున్న భుజంగరావు "అమ్మాయి ప్రయాణంచేసి అలసిపోయుంటుంది. తరువాత చూడచ్చులే..." అని సర్దేశాడు.
అప్పటికామె సంతృప్తిపడింది.
ఆంజనేయులు, ఆనందం అక్కడి నుంచి చిన్నగా తప్పుకునే ప్రయత్నంలో ఉండగా-
"ఇక రేపటినుంచి ప్రొద్దుటే యింటి ముందు ఊడ్చటం, కళ్ళాపి చల్లటం, ముగ్గులు పెట్టటం, దండెంపై చీరలు, జాకెట్లు ఆరేయటం, వంటా వార్పూ అంతా మొదలవుతుందన్నమాట. ఎన్నాళ్ళకి ఈ బంగళా బాగుపడబోతోంది..." అని అనుకుంటూ భువనేశ్వరి లోపల కెళ్ళిపోయింది.
అప్పటికే ఆనందం, ఆంజనేయులికి స్పృహ తప్పినంత పనయిపోయింది.
ఆంజనేయులు గోడకేసి తలను కొట్టుకున్నాడు.
"అమ్మాయికి బాగా సిగ్గని కొన్నాళ్ళు డ్రామా ఆడవచ్చనుకున్నాం. ఈలోపు ఈ కళ్ళాపి చల్లటం ఏమిటి? ముత్యాలముగ్గులో సంగీతలా ముగ్గు లేయటం ఏమిటి? కొంపదీసి పాటలు కూడా పాడమంటుందేమో! ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయా... అంటూ... ఆపైన చీరలు, జాకెట్లు ఆరేయ్యటం, వంట చేయటం... ఓరినాయనో..." అంటూ ఆనందం క్రింద చతికిలబడి పోయాడు.
"పెళ్ళయిందన్న ఒక్క అబద్ధానికి ఎన్ని కష్టాలొచ్చి పడ్డాయో చూడు..." అంటూ ఆంజనేయులు ఏడుపు మొహం పెట్టేశాడు.
అరగంటకి ఆనందం మెదడులో స్కడ్ పేలిపోయింది. అంతే... ఆంజనేయుల్ని పట్టుకొని బరబరా లాక్కుంటూ వెళ్ళిపోయాడు.
* * * *
ఇద్దరూ నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చారు. ఓ బట్టలషాపులోకి దారితీశాడు ఆనందం.
"గార్డెన్ వర్ లీ సారీస్ ఉన్నాయా...?" అడిగాడు ఆనందం.
"చీరలెందుకురా...?"
"ఒరే... అంజిగా... నేను షాపింగ్ చేస్తుంటాను... నువ్వు బిల్లులు ఇచ్చేస్తూ వెళ్తుండు... అంతే... మాట్లాడక... సస్పెన్స్ రాత్రికి చెప్తాను" అన్నాడు ఆనందం సీరియస్ గా.
రెండు చీరల్ని సెలక్ట్ చేశాక డబ్బులిచ్చేశాడు ఆంజనేయులు మారు మాట్లాడకుండా.
ఆ తర్వాత 'బేంగిల్స్ షాపు'కి తీసికెళ్ళాడు.
రకరకాల బొట్లు, చెవి రింగులు, గాజులు, మట్టెలు, పట్టీలు తీసుకున్నాడు. వాటితోపాటు 'గోరింటాకు పొట్లాం' కూడా తీసుకున్నాడు.
మాట్లాడకుండా బిల్లు చెల్లించాడు ఆంజనేయులు.
* * * *
తెల్లవారు జామున మూడు గంటలకు, అలారం మోతతో, టక్కుమని శవాలు కూర్చున్నట్టు లేచి కూర్చున్నారు.
"పోగ్రాం చెప్పరా..." అన్నాడు ఆంజనేయులు.
"నేను స్నానమవీ చేసొస్తాను... వచ్చాక... నువ్వు నా కాళ్ళకీ చేతులికీ... గోరింటాకు పెట్టాలి..." అని చెప్పేసి లోనకి పరుగెత్తాడు ఆనందం.
పావుగంట తర్వాత తిరిగొచ్చాడు.
రెండు చేతులకీ, రెండు కాళ్ళకూ రకరకాల డిజైన్లతో గోరింటాకు పెట్టేశాడు ఆంజనేయులు.
"ఇదెంత సేపటికి ఎండుతుందో..." అనుమానంగా అడిగాడు ఆంజనేయులు.
"ఎండుతుంది... చచ్చినట్టు ఎండుతుంది... ముందా ఫేస్ ని అయిదులో పెట్టు" అని ఆంజనేయులికి ఆజ్ఞాపించి-
తను నిలువుగా చేతులూ, కాళ్ళూ బార్లా చాపుకుని చాపమీద పడుకున్నాడు.
"పిన్నిగారు సరిగ్గా అయిదున్నర గంటలకి సూర్యుడికి నమస్కారం పెట్టుకోడానికి మేడెక్కుతారు... అవునా... అదే సమయంలో నేను ముగ్గు బుట్ట చేతబట్టి, వాకిట్లో ముగ్గు వేస్తుంటాను... ఆశ్చర్యంగా ఆవిడ నా వేపు చూస్తున్న టైమ్ లోనే గబుక్కున ఇంట్లో కొచ్చేస్తాను... ఎలా ఉంది?"
"బ్రహ్మాండం..."
"సరిగ్గా ఏడుగంటలకు పిన్నిగారు మొక్కలకు నీళ్ళు పోస్తుంటారు. అదే సమయంలో నేను... నా బట్టల్నీ, నీ బట్టల్నీ ఆరేస్తుంటాను..."
"అద్భుతం..."
"సరిగ్గా పిన్నిగారు... కొత్త కోడల్ని గనుక... నన్ను కూడా టిఫిన్ కి మీతోపాటు రమ్మని పిలవడానికి వస్తారు... అవునా... అవునా..." అప్పుడేం చెయ్యాలో. అర్థం కాలేదు ఆనందానికి.
"ఏం చెయ్యాల్రా..." ఆనందం తిరిగి ప్రశ్నించాడు.