Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 21

    "అంతేగా మరి...."

    "కొత్త సంతకం వున్న కాగితం యిస్తే ఏమిటర్ధం?"

    "ఫోర్జరీ అని."

    "ఫోర్జరీ కాదనీ, ఒరిజినల్ అని తెలుసుకొనే అవకాశం హైదరాబాద్ లోనే యిప్పుడుంది. ఫారెన్ సిక్ వింగ్ రైటింగ్ ఎక్స్ పర్ట్స్ హైదరాబాద్ లో లేరా?"

    "ఉన్నారు. అయితే?"

    "ఫోర్జరీ కాదని తేలితే...."

    "ఊఁ తేలితే ఏమిటి?"

    "ఏముంటుంది.... అదామె రేపో, ఎల్లుండో.... ఆ తర్వాతరోజో సంతకం చేసిందని అర్ధం.... అంటే ఆమె ఎక్కడో బతికుందనే అర్ధం."

    "నాకర్ధం కాలేదు."

    "ఫోరెన్ సీక్ లాబ్ కెళ్ళి ఐదు వేలిస్తే- ఆ సంతకం ఎప్పుడు పెట్టిందో నిమిషాల్లో చెప్పేస్తారు. కాగితాన్నిబట్టి, ఇంక్ నిబట్టి, ఇంక్ ఆరిపోవటాన్నిబట్టి- దానిలోని తేమనిబట్టి, ఆ సంతకం ఎన్ని రోజులకిందట చేసిందో ఇట్టే తేల్చి పడేస్తారు.... దాంతో కేసు...."

    ఆమె మాటల్ని పూర్తికానివ్వలేదు హరికుమార్.

    "కొత్త మలుపు తిరుగుతుంది- నీ పేరు ఇండియన్ క్రిమినల్ హిస్టరీలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. నీ ప్రియుడు- అమాయకుడైన వివేక్ బతికిపోతాడు. శెభాష్.... నేనిన్ని ప్రశ్నలేశానని ఏమనుకోవద్దు.... నా ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతే, రేపు లాయర్ వేసే ప్రశ్నలకెలా సమాధానం చెప్పగలవు? జడ్జీగారికెలా సమాధానం చెప్పగలవు?

    అదీగాక- ఇద్దరి మధ్య వాదన నడిచేప్పుడు ఎవరయితే వాదించలేక ఒకచోట ఆగిపోతారో.... ఆ చోట అవతలి వ్యక్తి విజయానికి మైలురాయి.

    నీ అనుమానాలు నిజమే....

    నీలాగా ఆలోచించేంత షార్ఫ్ నెస్ నాకు లేకపోయినా- నిన్ను షార్ఫ్ నెస్ చేసేంత శక్తి మాత్రం వుంది. అందుకే అడ్డంగా వాదించాను.

    మైసూర్ లో మీ ఇంటి పక్కనే వుంటున్న మా ఫ్రెండ్ భండారీ వారం క్రితం నాకు ఫోన్ చేసి, నీ గురించి చెప్పి, నీకు హెల్ప్ చేయమని అడిగినప్పుడు- 'ఆ అమ్మాయేం చేయగలదు? ఆల్ రెడీ ఉరి పడిపోయిందని' చప్పరించాను.

    కానిప్పుడా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను.

    క్రైమ్ ఇన్వెస్టిగేషన్ న్యూ డైమన్షన్.... పేపర్ మీది ఇంక్ ని బట్టి దాన్ని వాడిన కాలాన్ని కొలిచే సాధనానికి నా జోహార్లు.... నిన్ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను మనోజ్ఞా!" అన్నాడు హరికుమార్ ఆనందోద్వేగంతో.

    ఇద్దరి మధ్యా కొద్ది క్షణాలు నిశ్శబ్దం పేరుకుంది.

    బోయ్ మరోసారి రెండు కప్పుల టీ తెచ్చాడు.

    ఇద్దరికీ చెరొక కప్పు యిచ్చి వెళ్ళిపోయాడు బోయ్.

    "మీరిక్కడికొచ్చి ఎన్నాళ్ళయింది?" అడిగాడు హరికుమార్.

    "వారం రోజులయింది" అంది మనోజ్ఞ.

    "ఇంకా ముందు వచ్చివుంటే మీరు వివేక్ ని కాపాడగలిగేవారేమో" నొచ్చుకున్నట్లుగా అన్నాడు హరి.

    "బెంగుళూర్ ఆంగ్ల దినపత్రికలు చూశాకే నాకూ తెలిసింది. అప్పటివరకు నాకూ తెలీదు. నేను కావాలని కోరుకోని వివేక్ మీద ఎందుకు ఒత్తిడి తేవాలని నా దారిన నేనుండిపోయాను. వివేక్ మీద నాకు వున్న ప్రేమ- వివేక్ వివాహంతో ఆరాధనగా మారిపోయింది. ఇది జరిగి సరీగ్గా సంవత్సరం అయిపోయింది. అప్పటి నుంచి అతని జీవితంలోకి తొంగి చూడటం, అతనికి కష్టాలు తెచ్చిపెడుతుందని భావించి కమ్యూనికేషన్స్ ని కట్ చేసుకున్నాను" దుఃఖంతో ఆమె కంఠం పూడుకుపోయింది ఆ మాటలంటున్నప్పుడు.

    "ప్లీజ్.... ప్లీజ్.... కంట్రోల్ యువర్ సెల్ఫ్.... కాంక్రిట్ దిమ్మల మధ్య కూరుకుపోయిన కేసుని మీ ఆశాభావంతో కదిలించారు. దాన్ని పరిగెత్తించాల్సింది కూడా మీరే. మీరే దుఃఖంలో కూరుకుపోతే ఎలా? ఇప్పుడిప్పుడే పదునుదేరుతున్న మీ బ్రెయిన్ ని దుఃఖం ముంచెత్తకూడదు. నౌ ఐయామ్ ప్రామిసింగ్ యూ.... ఇప్పటివరకు మీ సిన్సియారిటీ ఎలాంటిదో తెలుసుకోవాలని- సూదిమందమైన రంధ్రంలేని కేసులో డైనమేట్ ని ఎలా అమర్చగలమని సంకోచించాను. ఇప్పుడది లేదు. లెటజ్ డూ సమ్ థింగ్ కన్ స్ట్రక్టివ్.

    కమాన్.... లేవండి.... మనకాట్టే టైం లేదు. కాలంకంటే వేగముగా పరిగెత్తగలిగినప్పుడే మనం వివేక్ ని రక్షించుకోగలిగేది" అంటూ లేచాడు హరికుమార్.

    ఆమె కళ్ళలో ఆశాభావంతో కూడుకున్న వెలుగు.

    'థాంక్యూ మిస్టర్ సుధాకర్ భండారీ.... థాంక్యూ' అని మనసులోనే అనుకుంది ఆమె.

    "మనం ఇక్కడ తీసుకునే ఒక్కో రోజు, అక్కడ జైల్లో రెండురోజులై మృత్యువు వివేక్ ని ముందుకు తీసుకువెళుతుంది. అది గుర్తుంచుకోవాలి. అవసరం అనుకుంటే నేను సెలవు పెడతాను. ఒక్క క్షణం కూడా వృధాకానీయవద్దు.

    సాలటరీ కన్ ఫైన్ మెంట్ లోకి వివేక్ పంపించబడ్డాడో- ఇక దేవుడు కూడా అతడ్ని రక్షించలేడు" ఎంతో ఉద్వేగంతో అన్నాడు హరికుమార్.

    "ఎస్.... యూ ఆర్ రైట్" అంది ఆమె పట్టుదలగా.

    "నీ నెక్ట్స్ స్టెప్?" అడిగాడు హరికుమార్.

    "జూబ్లీహిల్స్ ఎక్స్ టెన్షన్ పోలీస్ స్టేషన్ నుంచి వివేక్ కేసు ఎఫ్.ఐ.ఆర్. జిరాక్స్ కాపీని సంపాదించటం."

    "అదంత తేలిగ్గా వస్తుందనుకోను. ఆ స్టేషన్ ఎస్.ఐ. దీక్షిత్ మంచివాడే! నిజాయితీపరుడే... సి.ఐ. పద్మనాభన్ మాత్రం లంచగొండి. పైగా పద్మనాభన్ జితేంద్రనాద్ గ్రూపని నా అనుమానం. డబ్బు కోసం గడ్డితినే నరరూప రాక్షసుడు! అయినా అతనికీ స్టేజీలో నువ్వు రంగంలోకి దిగిన విషయం తెలీకుండా వుండటమే క్షేమం....! లేదంటే విషయం పెద్దవాళ్ళకు చేరిపోతుంది. దాంతో పావులు కదిలిపోతాయి. ప్రమాదం ముంచుకొస్తుంది."

    "నేనింతా హడావిడి చేస్తుంటే వాళ్ళకు తెలీకుండా వుంటుందా?" మనోజ్ఞ అడిగింది.

    "ఎప్పుడో తెలిసేదానికీ, ఇప్పుడే తెలిసేదానికీ తేడా లేదా? ఇప్పుడే తెలిస్తే నీ పరిశోధనని ముందుకు వెళ్ళనివ్వరు. పైగా నిన్ను బ్రతకనివ్వరు."

    "ఐ నెవ్వర్ కేర్ మిస్టర్ హరికుమార్...." ఆవేశంగా అంది ఆమె.

    "నువ్వు నీ ప్రాణాల్ని లెక్కచేస్తావని కాదు- వివేక్ ని కాపాడబోయే తొందరలో నీ ప్రాణాలమీదకు తెచ్చుకుంటే, నువ్వతన్ని కాపాడలేవు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. కూల్ డౌన్ మనోజ్ఞా! వివేకంతో అడుగు నువ్వేసినప్పుడే విజయం మనదవుతుంది. అదిసరే మరింకెలా ఎఫ్.ఐ.ఆర్. కాఫీని సంపాదిస్తావు? మూడో కంటికి తెలీకుండా స్టేషన్ రైటర్ని మేనేజ్ చేసినప్పుడే అది సాధ్యం."

    "ఎస్! యూ ఆర్ ఆల్వేస్ రైట్....! స్టేషన్ రైటర్ వుండేది మాదాపూర్ లో మాకు దగ్గరే. అతన్ని మేనేజ్ చేయటానికి నా వ్యానిటీ బ్యాగుంది. ఐదా....పదా....ఎంతడిగినా యిచ్చి తీసుకుంటాను. ఇచ్చాక అతనూ యిరుక్కుపోతాడు గనక విషయం బయటకు రాదు."

    "డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తున్నావ్. జాగ్రత్త....దానితో ముందుముందు చాలా అవసరం వుంటుంది."

    "నాకిప్పుడు సుమారు యాభై లక్షల ఆస్తికి పైగానే వుంది....మైసూర్ లలితమహల్ ప్యాలస్ కి, చాముండీ బెట్టకు మధ్య ముప్పై ఎకరాల పొలం వుంది. అది ఎంత లేదన్నా ఎకరం లక్షకు పైనే చేస్తుంది.... దాన్ని అమ్మేసి కేష్ మొత్తం తీసుకురమ్మని సుధాకర్ భండారీకి చెప్పాను.

    ఆయన ప్రస్తుతం మైసూర్ లో పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మాన్! ఇక్కడికి వచ్చేముందు ఆయన పేర జి.పి.ఏ. కూడా చేసి వచ్చాం.   

    సిద్దార్ధ లే అవుట్ లో పాతిక లక్షల ఖరీదుచేసే ఇల్లు కూడా వుంది దాన్నలాగే చేసి వచ్చాం.

    నేను ప్రతిరోజూ రాత్రి పది తర్వాత సుధాకర్ భండారీకి ఫోన్ చేస్తూనే వున్నాను. అది ఏ క్షణాన అమ్ముడుపోతే ఆయన ఆ క్షణాన కేష్ తో బయలుదేరి యిక్కడికి వచ్చేస్తారు. నేనిప్పుడు డబ్బుకు వెనుకాడను. నా సర్వస్వం పోయినా సరే.... లెక్కచేయను. వివేక్ నిర్దోషని ఋజువయి విడుదలకావాలి."

    "నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను మనోజ్ఞా! ఇంత గొప్ప ప్రియురాలు కోట్లలో ఒకరికైనా లభిస్తారా అన్నది సందేహమే! వివేక్ ఒక రకంగా అదృష్టవంతుడయితే- మరో రకంగా దురదృష్టవంతుడు కూడా...."

    "ఇప్పుడు స్టేషన్ రైటర్ ఇంటికేనా?"

    "ఎస్...."

    "ఇప్పుడు పది గంటలయింది. ఈరాత్రి సమయంలో ఆటోవాళ్ళనీ, టాక్సీవాళ్ళనీ నమ్మలేం. పదండి నేనూ వస్తాను. అతను నాకూ తెలుసు.... నా వృత్తిరీత్యా" అని లోపలికెళ్ళి న్యూస్ బ్యూరో చీఫ్ కేదో చెప్పి ఆటో పిలిచాడు.

    మరుక్షణం ఆటో వాళ్ళిద్దర్నీ ఎక్కించుకుని పంజగుట్ట నుంచి మాదాపూర్ కేసి దూసుకుపోయింది.


                           *    *    *    *


    సరిగ్గా అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు....

    జైలు పరిసరాలు గంభీరతను సంతరించుకున్నాయి.

    'షూట్ ఎట్ సైట్ ఫర్ నో రెస్పాన్స్' ఆజ్ఞల్ని కూడా దిక్కరిస్తూ దగ్గరలో వున్న మరుభూమి నుంచి ఓ కుక్క రోదనగా అరిచింది. ఆ శబ్దం....ఆ నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టింది.

    జైలుగంట పదకొండుసార్లు మోగి ఆ నిశ్శబ్దంలోనే కూరుకుపోయింది.

 Previous Page Next Page