ఒక్క శంకరాభరణం తప్ప మా ఆయనగారిని అడిగితే "అది శివుడి మెడలో వుంది తాచుపామో! కట్లపామో! ఎవరికీ తెలుసు. మా ఆయనకీ శంకరాభరణం చేయించటం ఇష్టంలేక పాము అని తేలు అని కధలు చెబుతున్నారని న నుమానం ఏమంటావ్?"
"మీరింత చక్కగా చెబుతుంటే నేనేమంటాను పిన్నిగారు! మనం వెళుతున్నది ఆయన దగ్గరికే కదా! ఆ పరమేశ్వరుడినే పట్టుకుని గట్టిగా అడిగి మీ అనుమానం తీర్చుకోండి" త్రివేణి అంది.
"శివుడికి భోళా శంకరుడని పేరెందుకొచ్చిందో!" సంతోషమ్మ రంగనాయకిని అడిగింది.
"ఎందు కొచ్చిందంటే ఏం చెబుతాను! మనక్కూడా అసలు పేర్లు కాక కొసరుపేర్లు, ముద్దు పేర్లు, గయ్యాళి....రాక్షసి...లాంటి మరో పేర్లు ఉన్నట్లు ఆయనకీ రక రకాల పేర్లు ఉండి వుంటాయ్." రంగనాయకి చెప్పింది.
"అదేంకాదు శంకరుడు ఉత్త భోళా మనిషట. కాస్త ఉబ్బేస్తే చాలు. బెలూన్ లా ఉబ్బిపోతాడట. మనమేం చెప్పినా భోళాగా నమ్మేస్తాడట. అందుకే భోళాశంకరుడని ఆయనకీ పేరు వచ్చింది" లీడర్ లీలారాణి వాళ్ళ అనుమానం తీరుస్తూ చెప్పింది.
"హుర్రే" అని ఒకరుపు అరిచి "అయితే మనం స్మశానంలో పాగా వేసినట్టే. కైలాస గిరిమీద జెండా పాతేసినట్టే" అరుణవర్ణం దుస్తులు ధరించిన అరునేందిర సంతోషంతో చెప్పింది. చెప్పిందేగాక "శంకర్ భయ్యాకి ఇదే నా రెడ్ శాల్యూట్" అంది.
అందరూ ఘొల్లున నవ్వారు.
"అయితే మనమిప్పుడు చెయ్యాల్సింది శంకరుడు కనపడంగానే ఓ మాట మంచీ లేకుండా గబ గబా ఆయనమీద పాటలు పాడేసి అంతకన్నా గబగబా పొగిడేద్దాం. అంతేనా!" డాక్టర్ గారి భార్య అమృతవల్లి అడిగింది.
"అవును అలా చేద్దాం" అందరూ ఒకటేమాట అన్నారు.
"ఎవరేం పాట పాడాలో ఇప్పుడే ఆలోచించుకొని పెట్టుకోండి. ఆ తర్వాత నేను చెబుతాను ఆయన్ని ఎలా పొగిడితే బాగుంటుందో!" లీడర్ లీలారాణి అంది.
అందరూ ఆమోద సూచకంగా తలలు తాటించారు.
"శంభో హర హర సాంబశివ......"
"బోలో శివశంకర్......"
"నమో భూతనాథా....."
"ఓం శివ ఓం శివ సుందరశివ సుందరశివ సత్యంశివ సత్యం శివ...."
అందరూ అలా తలోరకం పాట ఆలోచించుకుంటుంటే సంతోషమ్మ మరొ పాట ఆలోచించి పెట్టుకుంది.
"నాగ రావ నాగేంద్రరావా....వెంటనే ఆమెకి అనుమానం వచ్చింది. అందరూ శివుడిమీద పాట పాడాలని అనుకుంటుంటే నేనేంటి పిచ్చి బొందలాగా నాగులచవితి పాట ఎన్నుకొన్నాను. అయినా నాకు ఆ ఒక్కపాట తప్ప మరోపాట రాదాయే ఆ...ఏదైతే ఏంలే శంకరుడి మెడలో ఉండేది నాగుపామేకదా ఆ పాముమీద ఒక పాట పాడితే సరి" అని మళ్ళీ తనకి తానే సర్దుకుంది.
ఎవరికి వారే అలా ఆలోచిస్తూ మాటల సంగతి మర్చిపోయి పాటల్లోపడి కైలాస నగరం చేరారు. వీళ్ళు వెళ్ళేసరికి కైలాస నగరంలో శివుడు లేడు. గంటక్రితమే మహా స్మశానానికి వెళ్ళినట్లు అక్కడి మునివర్యులద్వారా తెలుసుకున్న వారై స్మశానంవైపు ఉరుకులు పరుగులు తీశారు.
వీళ్ళు వెళ్ళేసరికి-
అక్కడ స్మశానంలో-
పరమ శివుడు బూడిదకుప్ప మధ్యగా బాసిపెట్లు వేసుకోని కూర్చొని తీరుబడిగా బూడిదని చేతుల్లోకి తీసుకొని ఒంటికి పట్టించుకొంటున్నాడు. అదేదో ప్రకృతి వైద్యంలాగా మహా శ్రద్దగా చేస్తున్నాడా పని. శివుడి చేతిలో వుండే శూలం ఓ పక్కగా నేలమీద గుచ్చి వుంది. ఆయన ధరించే పుర్రెలదండ అక్కడేవున్నా చెట్టు కొమ్మకి వేళ్ళాడుతోంది. ఆయన మెడలోవుండే నాగుపాము ఇప్పుడు నేలమీద పడుకుని నిద్రపోతోంది.
శివుడు అలా బూడిద పూసుకుంటుంటే అదేదో ప్రకృతి ఆశ్రమానికో, క్రొత్తరకం బ్యూటీ పార్లర్ కో వచ్చినట్టుగా వుంది ఆడవాళ్ళకి.
బూడిద కుప్పమధ్య ఆయనొక్కడు తప్ప సమయానికి ఆ చుట్టుపట్ల ఎవరు లేరు. ఆయనసలే నిశాచరుడు. భయం ఎరగనివాడు. భయంకరమైన ఆ స్మశానంలో నిర్భయంగా కూర్చుని తనపని తాను చేసుకుపోతున్నాడు.
ఒంటికి అలా బూడిద పట్టించుకోవడంలో ఆనందం ఏముందో ఆయనకే తెలియాలి.
ఒక్కసారి ఆడవాళ్ళంతా వివిధ రకాల వాయిస్ తో అన్ని రకాల పాటలు ఆ పరమ శివుడిమీద భక్తి పారవశ్యంతో ఎలుగెత్తి పాడసాగారు.
వాళ్ళని చూసి వాళ్ళ పాటలు విని ఆ సదాశివుడు 'స్టన్' అయిపోయాడు.
పాటలు పాడటం పూర్తయిందో లేదో పొగడ్తలు మొదలు పెట్టారు. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు....ఒకళ్ళని మించి మరొకళ్ళు....'మేం తక్కువ తిన్నామా అంటే మేమేనా అంత తక్కువ తిన్నది' అన్నట్లు ఆ పొగడ్తలు అలా అలా సాగిపోతున్నాయ్.
వాళ్ళ పొగడ్తలకి శంకరుడు అంతకంతకు ఉబ్బిపోతున్నాడు.
ఆ విషయం ముందుగా గమనించిన మహారచయిత్రి మహాదేవి "ఇందాక మనం చూసిందానికి ఇప్పటికి పరమశివుడు లావెక్కాడు కదూ!" అంది.
"ఎక్కడా ఏమిటి! అదేపనిగ పొగిడితే ఆయన బెలూన్ లా ఉబ్బి పోతున్నాడు. రవిగాంచనిచోట కవిగాంచును. నాకర్ధమయింది ఇది" కవయిత్రి కాంచనమాల అంది.
"పాహిమాం....పాహిమాం పరమశివా పాహిమాం. మేము ప్రమాదంలో వున్నాం. మా కోర్కెలు తీరుస్తామని మాటివ్వండి. లేకపోతే ఉన్న పళాన ఆత్మహత్యలు చేసుకొని ఇక్కడే చచ్చి బూడిద కుప్పలమైపోతాం. మీరింక మా కన్నీటి బూడిదను రాచుకోవాల్సిందే" లీడర్ లీలారాణి ముందుకొచ్చి అంది.
అప్పటికే వాళ్ళ పాటలతో, వాళ్ళ పొగడ్త మాటలతో పొంగిపోయిన పరమ శివుడు శరీరం ఉబ్భింది కాని మెదడు ఉబ్బనందువల్ల బోల్తా పడిపోయి భోళాగా ఆందోళన చెందుతున్నాడు.
"నన్ను ఇంతగా కొలిచే మీ అందరి కోర్కెలు తీర్చడం నా ధర్మం భక్తుల కోర్కెలు తీర్చని భగవంతుడేం భగవంతుడు. మరోసారి మరోసారి అయితే కాస్త ఆలోచించాల్సి వచ్చేది. నేను శరీరానికి బూడిద పట్టించుకొనే సమయంలో ఎవరైనా ఏదైనా అడిగితే తప్పక తీరుస్తాను. ఈ విషయం ఎవరికీ తెలీదు. మీరు ఈ విషయం తెలుసుకుని ఎలా వచ్చారు నాకు తెలీదు. అడగండి....అడగండి."