Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 21

    పట్టు బలవంతానా పద్మిని ప్రియదర్శినిని లేపికూర్చోబెట్టింది పార్వతమ్మ. "నీకు జ్వరంగా ఉందమ్మాయ్! ఈ మాత్ర వేసుకుని మంచినీళ్ళు తాగు. కాసేపటికి కాస్త నెమ్మదిస్తుంది జ్వరం" అని చెప్పింది.

    ఒక చేతిలో మంచినీళ్ళ గ్లాసు, మరో చేతిలో జ్వరం మాత్ర పండు ముత్తయిదువ ఆకారం కాశీ పోసి కట్టుకున్న బార్డరున్న కంచి పట్టుచీర, నుదుట అర్ధరూపాయంత కుంకం బొట్టు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మిలాగా వుంది పార్వతమ్మ. పద్మిని ప్రియదర్శిని కళ్ళకి పండు ముత్తయిదువ కనిపించింది.

    "అదేం మాత్ర? నిజంగా జ్వరం మాత్రేనా! ఇస్తున్నదెవరు? ఆమెకి, తనకి ఎటువంటి పరిచయం?" ఇవేమీ ఆ సమయంలో పద్మిని ప్రియదర్శిని ఆలోచించలేదు. వణుకుతున్న చేతులతో మాత్ర, మంచినీళ్ళు ఏకకాలంలో అందుకొని మాత్ర వేసుకుంటూనే మంచినీళ్ళు మొత్తం తాగేసింది. "ఇంకా కొద్దిగ మంచినీళ్ళ"నే మాట అంటూనే గ్లాసు అందించింది పద్మిని. పార్వతమ్మ సగం గ్లాసు మంచినీళ్ళు అందిస్తూ "జ్వరంలో ఎక్కువ మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతుంది. ఇప్పుడేకదమ్మాయీ మాత్ర వేసుకున్నావు కొద్దిసేపు ఆగి తాగు" అంది.

    చాలా దాహంగ వుంది పద్మినీకి. ఐనా ఆమె మాట కాదనలేక ఆ కొద్దిమంచినీళ్ళే తాగి "థాంక్స్" అని నెమ్మదిగా గొణిగి మళ్ళీ ముసుగుతన్ని పడుకుంది.

    పార్వతమ్మ చేత్తో యిచ్చిన మాత్ర బాగా పనిచేసింది. పావుగంటకల్లా జ్వరం దిగజారటం మొదలుపెట్టింది పద్మినీకి. దుప్పటి కప్పుకొని లేచి కూర్చుంది.

    "జ్వరం కాస్త తగ్గిందా అమ్మాయీ!" పార్వతమ్మ ఆప్యాయంగా అడిగింది.

    "కొద్దిగ తగ్గింది ఆంటీ" కృతజ్ఞతా భావంతో చూస్తూ జవాబిచ్చింది పద్మిని.

    "కూర్చున్నా వెందుకు? కాసేపు పడుకునే వుండకపోయావా!" పార్వతమ్మ అడిగింది.

    "బాత్రూమ్ కి వెళ్ళాలి" నెమ్మదిగా చెప్పింది పద్మిని అలా చెపుతూనే బాత్రూమ్ కి వెళ్ళటానికి లేచి నిలబడింది. రైలు కుదుపుకి నిలబడలేక తూలి మళ్ళీ సీట్లో పడింది.

    "జాగ్రత్తగా వెళ్ళమ్మా! వెళ్ళి రాగలవా?" పార్వతమ్మ అడిగింది.

    "కదులుతున్న రైల్లో మామూలువాళ్ళమే సరిగ్గా నడవలేం. ఆ అమ్మాయికి బాగా జ్వరంకూడా వుంది. కాస్త సాయం చెయ్" నెమ్మదిగా పార్వతమ్మతో చెప్పాడు శంకర్రావు.

    "నా మతి మండిపోనూ" తనని తానే చిన్నగా తిట్టుకొని లేచి నిలబడింది పార్వతమ్మ. "నేను రెక్క పుచ్చుకుంటాను రా అమ్మాయీ!" అంది.

    పార్వతమ్మ సాయంతో బాత్రూమ్ కి వెళ్ళి వచ్చింది పద్మిని.

    జ్వరం దిగజారుతున్న గుర్తుగా నుదుట కొద్దిగ చమటలు పట్టాయి పద్మినీకి.

    పార్వతమ్మ ప్లాస్కులోంచి కాఫీ వొంచి అరకప్పు కాఫీ పద్మినికి అందించింది.

    "అనవసరంగా మీకు శ్రమ" పద్మిని అంది.

    "కష్టాల్లో సాటి మనిషిని ఆదుకోటం శ్రమగా భావించకూడదు. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మానవ ధర్మానికి అర్ధమేముంటుంది" పార్వతమ్మ నవ్వుతూ అంది.

    కాఫీ తాగిం తర్వాత చాలా తేలిగ్గా అనిపించింది పద్మినీకి.

    అప్పుడడిగింది పార్వతమ్మ. "నీ పేరేమిటమ్మాయీ" అని.

    పేరు విషయంలో అబద్ధం చెప్పాలనిపించలేదు పద్మినికి.

    "పూర్తి పేరు పద్మిని ప్రియదర్శిని. చాలామంది "పద్మిని" అని పిలుస్తుంటారు" అని చెప్పింది.

    "ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావా?"

    "ఊ" అంది పద్మిని.

    "ఇంత జ్వరంలో ఒంటరిగా........"

    "పార్వతీ! అధిక ప్రసంగం ఎప్పుడూ మంచిదికాదు. ఆ అమ్మాయికి జ్వరం తగ్గిందో లేదో ప్రశ్నలమీద ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా?" చిన్నగా మందలించాడు శంకర్రావు.

    వెంటనే పార్వతమ్మ "ఏమీ అనుకోకమ్మాయీ! ఏదో ఒకటి మాట్లాడకపోతే నాకు తోచదు. నేనలా మాట్లాడుతూనే వుంటాను. ఈయనగారు నా పక్కనే వుండి "అధికప్రసంగం చేస్తున్నావు పార్వతీ" అంటూ గుర్తు చేస్తూంటారు. అప్పటికిగాని నాకు తెలిసిరాదు. నేను అతిగా మాట్లాడుతున్నానని" నవ్వుతూ చెప్పింది.

    "పార్వతీ!" అన్నాడు శంకర్రావు.

    సరేలెండి" అంది పార్వతమ్మ.

    ఆ దంపతులని చూస్తూంటేనూ, వాళ్ళ ఫార్సు చూస్తుంటేనూ చాలా ముచ్చట వేసింది పద్మినికి. కొద్దిసేపు ఎవరూ ఎవరితోనూ మాట్లాడుకోలేదు. సరిగ్గా అప్పుడే ఆ కంపార్టుమెంట్ లోకి టి.సి. వచ్చాడు. కంపార్టుమెంట్ లో ప్రయాణీకులు పలుచగా వున్నారు. అందర్నీ టిక్కెట్టడిగి వీళ్ళ దగ్గరికొచ్చాడు.

    శంకర్రావు వాళ్ళిద్దరి టిక్కెట్లూ చూపించాడు. పద్మిని వందరూపాయల నోటు ఖర్చీపులో చుట్టి జాకెట్టులో దోపుకున్నది బయటికి తీసింది. 'ట్రయిను కదులుతుండగా స్టేషన్ లోకి అడుగుపెట్టాను. టిక్కెట్టు తీసుకునే టైము లేకపోయింది. విజయవాడకి టిక్కెట్ యెంతవుతుందో మనీ తీసుకోండి" అంటూ వందరూపాయల నోటు అందించింది.

    టిక్కెట్ కలెక్టర్ వందరూపాయలు తీసుకొని టిక్కెట్ కోశాడు.

    అంతక్రితం పార్వతమ్మ ,శంకర్రావు వెళ్ళేది విజయవాడని వాళ్ళ మాటలని బట్టి గ్రహించిన పద్మిని తెలివిగా టిక్కెట్ విజయవాడకు తీసుకుంది.

    మంచివాళ్ళ మాటలు...ఆపదలోంచి బయటపడటం...జ్వరం తగ్గు మొహం పడటం...అన్నీ పద్మినీకి అనుకూలంగా మారాయ్.

    ప్రస్తుతానికి విజయవాడ వెళ్ళి ఏం చేయాలో పద్మినీకి తెలీదు. రైలు వెళుతున్నది తను ప్రయాణం చేస్తున్నది అంతే. ముందు ఒక ఆపద తప్పించుకోవటం జరిగింది తరువాత సంగతి తరువాత. ఇంకా రెండుగంటలకు గాని విజయవాడరాదు. పద్మినీకి కొద్దికొద్దిగ ఆకలి వేస్తున్నది. ఏం తినాలో తెలీలేదు. మరోసారి కాఫీ తాగితే బాగుండునని వుంది. అక్కడెక్కడా రైలు ఆగేట్టూ కనబడలేదు. కాఫీ వచ్చేట్టూ కనబడలేదు. ఈ లోపల పార్వతమ్మ ఫ్లాస్కు అందుకొని ఫ్లాస్కులోంచి కాఫీ కప్పులోకి వొంచి ముందు భర్తకిచ్చింది.

    కప్పులోను ఆ తరువాత గ్లాసులోను మిగతా కాఫీ వొంచింది. కప్పు తాను తీసుకుని గ్లాసు పద్మినీకిస్తూ "తాగమ్మా!" అంది.

    "వద్దండీ" అంటూ మొహమాటపడింది పద్మిని.

    "ఎక్కువేం లేవు తాగమ్మా!" అని అందించింది పార్వతమ్మ.

    ఈ తఫా వద్దనలేదు పద్మిని .కాఫీ గ్లాసు తీసుకుని ఆవురావురుమంటూ తాగేసింది.

 Previous Page Next Page