Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 21

    ట్రీమ్ గ తయారయిన వాసంతిని చూసి కడిగిన ముత్యంలా వున్నావు అన్నాడు శ్యామ్ సుందర్.
    "రంభ ఊర్వశితో పోల్చలేదు రక్షించారు." అంది వాసంతి.
    "వాళ్ళంటే నీకు అయిష్టమా?"
    "కాదు కానీండి. జయమాలిని జ్యోతిలక్ష్మి గుర్తుకువస్తారు అదీ అసలు కారణం."
    "గుర్తుకు రావటం ఏమిటి వాళ్ళే వీళ్ళయితే."
    "ఈజిట్!"
    "ఎస్. ఓసారి రంభ ఊర్వశి దేవేంద్రుడి ఎదుట నాట్యం చేస్తూ మధ్యలో ఏదో గుర్తుకురాగా కనుసైగ చేసుకున్నారు. అది గమనించిన దేవేంద్రుడు ఉగ్రుడై వీళ్ళకి శాపం యిచ్చాడు. భూలోకంలో సినీలోకంలో పడి మీ నాట్యంతో ఆరుకోట్ల ఆంధ్రులనీ మెప్పించినా మీకు దక్కేది తిట్లూ దీవెనలే అని...అంతే వాళ్ళు జయమాలిని జ్యోతిలక్ష్ములు అయిపోయారు."
    నోటి ముత్యాలు రాలేలా నవ్వింది వాసంతి.
    "ఇలా రాయంచరమణిలా తయారయి ముగ్ధ మనోహరంగా నవ్వావంటే నా మనసు నా ఆధీనం తప్పుతుంది." అన్నాడు శ్యామ్ సుందర్.
    "ఆలశ్యం అమృతం విషం." అంటూ వాసంతి చెప్పుల్లో కాళ్ళు దూర్చింది. 
    ఇద్దరూ బెడ్ రూమ్ లోంచి బైటపడి శ్రీదేవమ్మతో చెప్పి మోహన్ యింటికి బైలుదేరారు.
    అరగంటలో మోహన్ యిల్లుచేరారు.
    మోహన్ శ్యాంసుందర్ కన్నా అయిదేళ్ళు పెద్దవాడు. రూపం అతి సామాన్యంగా వుంది. శరీరంతోపాటే సిగరెట కలిసి పుట్టిందా అన్నట్లు వేళ్ళమధ్య అలావుంది సిగరెట్. బాగా చైన్ స్మోకర్ అని తెలిసిపోతున్నది. పూలలుంగీ కట్టుకున్నాడు. బనీన్ గాని షర్ట్ గానీ లేదు. పరాయివాళ్ళ ముందు అలా దిగంబరంగా వుంటే వాసంతికి మహామంట. ఎందుకో మోహన్ ని చూస్తే సదభిప్రాయం కలగలేదు.
    మోహన్ వాళ్ళావిడని పరిచయం చేశాడు. పేరు సుశీల. పేరుకి తగ్గట్లుగా వుంది. తెల్లగా పీలగా సన్నటి పొడుగాటి జడ. చాలా సాదా అలంకరణతో వుంది. అయినా ఆమెలో అదోరకమైన ఆకర్షణవుంది. వాళ్ళకి యిద్దరు పిల్లలు. ముందు పాప తర్వాత బాబు. మోహన్ కీ తల్లివుంది చూట్టానికి గుండు లాగానే వుంది. మంచంమీద కూర్చుంటే మంచం దిగదు. కుర్చీ ఎక్కితే కుర్చీ దిగదు.
    "నా ఆరోగ్యం మంచిది కాదమ్మాయ్, రెండడుగులు వేసినా కాస్త పనిచేసినా ఆయాసం వస్తుంది, అంతా అది చూసుకోవాల్సిందే ఏం చేస్తాను. నా ఆరోగ్యం అలా తగలడింది." అంది ఆవిడ.
    "నే నేమన్నా అడిగానా పెట్టానా!" అనుకుంది వాసంతి.  
    సుశీల పనితో వక్కతీ సతమతమవుతుంది. సాయం వెళ్ళటానికి వాసంతికి కొత్త, సుశీల వంట గదిలోవుంటే వీళ్ళు ముందు రూమ్ లో కూర్చున్నారు!
    మోహన్ తల్లి మంచందిగి వచ్చి వీళ్ళదగ్గరగా కుర్చీ ఎక్కి కూర్చుంది.
    మోహన్ కొడుకుని వళ్ళో కూర్చోపెట్టుకుని సిగరెట్ కి పని కల్పిస్తూనే కబుర్లు మొదలుపెట్టాడు. "వీడు మావంశోద్ధారకుడురా శ్యామ్! వీడి తెలివి అమోఘం. చూసింది ఏదీ వదలడు," అంటూ కొడుకుచేసిన ఘనకార్యాలు కొన్ని చెప్పి "జేమ్స్ బాండ్ ఎలా పిష్టల్ కాలుస్తాడో అంకుల్ కి చూపించరా!" అన్నాడు.
    వాడు తండ్రి వడిలోంచి కోతిలా నేలమీదకి గెంతి జేమ్స్ బాండ్ పోజుపెట్టి "డిష్కం, ఢాం ఢాం చావవే ముండా!" అన్నాడు.
    అక్కడే కింద కూర్చున్న అక్కతో.
    ఆ పిల్ల లేచి లోపలికి వెళ్ళిపోయింది.
    మోహన్ పకపకనవ్వాడు.
    ఏడ్వలేని నవ్వొకటి నవ్వాడు శ్యామ్ సుందర్.
    వాసంతి మాత్రం నిర్ఘాంతపోయింది. ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడే కావచ్చు. తనకన్నా పెద్దది అక్కను పట్టుకుని ముండ గిండ అంటూ తిట్టటం అదిచూసి తండ్రి నవ్వటం. ఇలాంటిమనుషులు కూడా వుంటారు కాబోలుననిపించింది. ఆ కొద్దిసేపటిలోనే మోహన్ కూతురినోవిధంగా కొడుకునో విధంగా ట్రీట్ చేయటం గమనించింది .ఇలాంటివాడు శ్యామ్ కెలా ఫ్రెండ్ అయ్యాడు! అనుకుంది.
    "మా వాడిలాగానే నీవు కట్నం తీసుకోలేదుట గదా! తీసుకోకపోయినా అర్ధంవుందిలే. మీ ఆవిడ అందాలబొమ్మ అన్నట్లు తల్లీతండ్రికి వక్కతే కూతురటగా. వాళ్ళ తదనంతరం ఆస్తి అంతా మీదే. మాకోడలూవుంది కట్నంతేకపోగా పుట్టింటి నుంచి పూచికపుల్ల తెచ్చిందిలేదు. దేనికైనా పెట్టిపుట్టాలి," ముసలమ్మ సాధిస్తూ మొదలుపెట్టింది.
    వాసంతి  మర్యాదకి వూరుకుందిగాని లేకపోతే ముఖాన నాలుగూ అని లేచివచ్చేదే.
    వెంటనే మోహన్ అందుకున్నాడు.
    "నా కిష్టమైంది చేసుకున్నాను. ఎందుకు వకటికి పదిసార్లు అంటావ్! కట్నమనే పేరుతో ఆడపిల్ల గొంతుకోయటం ససేమిరా నాకిష్టంలేదు."
    మోహన్ మాటలో నిజాయితీ కానరాలేదు వాసంతికి.
    వాసంతి ఫామిలీగురించి ఆరాలుతీయటం మొదలుపెట్టింది ముసలమ్మ మరోపక్క. గదినిండా పరుచుకున్న సిగరెట్ పొగ వేరోపక్క ముద్దు ఎక్కువయి తిక్కవేషాలు వేస్తున్న మోహన్ పుత్రరత్నం. అక్కడనుంచి పారిపోదామనిపించింది వాసంతికి. శ్యాంసుందర్ గ్రహించాడో లేదోగాని మామూలుగానే మాట్లాడుతున్నాడు.  
    ముసలమ్మకి పిల్లలకి ముందు భోజనం పెట్టేయమన్నాడు మోహన్ ఈలోపల ఆడదామంటూ కార్డ్స్ తీశాడు.
    వెధవకబుర్లు బదులు యిదీ నయమేననుకుంది వాసంతి.
    చాలా ఆటలు వాసంతి గెలిచింది.
    "ఏమోననుకున్నాను. సిస్టర్ చాలా గట్టిదే" అన్నాడు మోహన్. "కార్డ్స్ కలపటం కానీండి. వేసేతీరు. ఆటలో బాగా అనుభవంవున్నట్లు తోస్తున్నది. రోజూ ఆడతారా సిస్టర్!" మోహన్ అదిగాడు.
    "ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా ఆడతాను. మా అంకుల్ ఆంటీతో ఆడతాను. రోజూ ఆడినంత మాత్రాన గొప్పగా ఆడతారని ఎక్కడాలేదు. పేకాటలో అనుభవమున్న దరిద్రులు ఎంతమందిలేరు! ముక్క ఎత్తినా వేసినా ముద్రుష్టమే." అంది వాసంతి.
    శ్యామ్ నవ్వాడు.
    మోహన్ ముఖం గంటుపెట్టుకున్నాడు.
    మోహన్ యింట్లో తరుచు చతుర్ ముఖ పారాయణం ఆడతాడని అలమరలో పేర్చివున్న కార్డ్స్ పెట్టెలనుచూసి వాసంతి గ్రహించుకుంది, మాటలతో ముఖం వాయగొట్టాలనుకుంది.
    ముసలమ్మగారి తిండి పూర్తి కావటానికి సరీగ అరగంట పట్టింది, తింటున్నంతసేపు సాధించటం సన్నసన్నగ వినిపిస్తూనే వుంది వాసంతికి.
    భోజనాలకి వీళ్ళకికూడా పిలుపువచ్చింది.

 Previous Page Next Page