తెరుచుకున్న తలుపుల్లోంచి కామాక్షి వాళ్లు పడుకునే మంచం కనిపించింది. మంచంమీద కామాక్షి ఒక్కతే పడుకొని ఉంది. పక్కన పాండురంగం లేడు.
కామాక్షి దగ్గరికి వచ్చి, కామాక్షి జబ్బమీద చెయ్యివేసి కుదుపుతూ నిద్రలేపాడు.
కామాక్షి ఒకపట్టాన నిద్రలేవలేదు.
ఆయనకి కంగారు పుట్టి కామాక్షిని గట్టిగా తట్టి, లేపాడు.
ఓ పక్క కళ్ళు మూతలు పడుతున్నా లేవగలిగింది కామాక్షి. సగం నిద్ర సగం తెలివిలో వుండి, "ఏమిటి నాన్నా?" అని అడిగింది.
"నువ్వొకసారి లేచిరామ్మా! మనం ఆసుపత్రికి వెళ్లాలి" అన్నాడు మాధవయ్య.
నిద్రమత్తులో వున్నా, తండ్రి మాటలు విని తెలివి తెచ్చుకుంది కామాక్షి.
"ఆసుపత్రా! దేనికి నాన్నా?" గాభరాగా అడిగింది.
"చెబుతానమ్మా? నువ్వు లేచి చల్లని నీళ్ళతో కళ్ళు తుడుచుకునిరా!" అన్నాడు మాధవయ్య.
ఎందుకు ఏమిటి? అనకుండా గబగబా లేచి, పక్క గదిలోకి వెళ్ళి కుండలో నీళ్లు తీసుకుని ఒకటి రెండుసార్లు ముఖం కడుక్కుంది. నీళ్ళని బాగా చల్లుకుంది కళ్ళమీద. అప్పటికి కాస్త కళ్ళు తెరిపిళ్లు పడ్డాయి కామాక్షికి.
"ఏమైంది నాన్నా? ఆసుపత్రికి దేనికి?" అడిగింది.
"అమ్మకి ఆయాసంగా వుందిట. పెద్దాసుపత్రికి తీసుకువెడదామని నిర్ణయించుకొని నిన్ను లేపాను. మీ అన్నయ్య రిక్షా తీసుకురావడానికి వెళ్లాడు. అమ్మకి అలావుందని నువ్వేమీ గాభరాపడకు. గాభరా చూస్తే తను మరింత గాభరా పడుతుంది" పద అంటూ తను ముందు దారితీశాడు మాధవయ్య.
భర్త గుర్తుకు వచ్చాడు కామాక్షికి. ఐతే అతని మీద అనుమానం రాలేదు. తల్లి దగ్గర వున్నాడేమో అని అనుకుంది.
కామాక్షి తల్లి దగ్గరికి వచ్చేసరికి శేఖరం రెండు రిక్షాలు తీసుకువచ్చాడు.
తల్లి ప్రక్కనే కూర్చున్న కామాక్షి అప్పుడు అడిగింది.
"ఆయనేరి నాన్నా!"
"లావెట్రీకి ఏమన్నా వేళ్ళాడేమోనమ్మా! నేను నీ గదిలోకి వచ్చేసరికి పాండురంగం అక్కడలేడు. పగలంతా పని చేసి చేసి బాగా అలసిపోయావేమో, నీవేమో మొద్దునిద్రపోతున్నావు" అని చెప్పాడు మాధవయ్య.
"నేను వెళ్లి చూసివస్తాను నాన్నా!" అంటూ అక్కడి నుంచీ లేచి వెళ్లింది కామాక్షి.
కామాక్షి లావెట్రీ దగ్గరకి వెళ్లి తలుపు లాగి చూసింది. తలుపులు తెరుచుకున్నాయి. కానీ లోపల పాండురంగం లేడు. పెరట్లోకి వెళ్లి చూసింది. పెరటి తలుపులు దగ్గరికి వేసి వున్నాయి.
అప్పుడు భర్తమీద అనుమానం వచ్చింది కామాక్షికి.
"ఇప్పుడు తనేం చెయ్యాలి?"
క్షణకాలం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది కామాక్షి.
వెంటనే తండ్రి దగ్గరకి వచ్చింది.
"ఏదో పనిమీద రాత్రి పదకొండున్నరకి స్నేహితుడు రమ్మన్నాడుట. పడుకోబోతూ నాతో ఆ విషయం ఆయన చెప్పేవెళ్ళారు. నేనే వెళ్ళి వీధి తలుపు వేసి వచ్చాను. నిద్రమత్తులో వుండి ఆ విషయమే మర్చిపోయాను" అని చెప్పింది కామాక్షి.
అసలే గాభరాలో వున్నారేమో వాళ్లు కామాక్షి చెప్పింది నమ్మారు.
"అల్లుడుగారు ఏ నిముషానయినా రావచ్చు. మనం వీధి తాళం పెట్టుకుని వెడితే ఏం బావుంటుంది? ఎవరో ఒకరు ఇంట్లో వుంటే మంచిదేమో? ఇప్పుడేం చేద్దాంరా శేఖరం!" మాధవయ్య అడిగాడు.
"ఓ పని చెయ్యండి నాన్నా! మీరింట్లో వుండండి! నేను కామాక్షి అమ్మను హాస్పటల్ కి తీసుకు వెళతాం" ఉపాయం చెప్పాడు శేఖరం.
ఆయనకి ఇంట్లో వుండడం అంత యిష్టం లేకపోయినా "ఇదీ ఒకందుకు బానే వుంది" అనిపించింది.
అలా వెళ్ళిన వాళ్ళు గంటన్నరలోపే తిరిగి యింటికి వచ్చారు.
"కడుపులో బాగా గ్యాస్ వుందట. ఆ గ్యాస్ వత్తిడివల్ల ఆయసమూ, గుండెల్లో నొప్పి వచ్చినట్లు అనిపిస్తుందట. అమ్మకి అసలే నీరసం, కాస్త ఏదయినా వస్తే తట్టుకోలేదు. యిది గుండెకి సంబంధించిన జబ్బు కాదని, రాత్రిళ్ళు దుంపకూరలు, పింది పదార్ధాలు లాంటివి తినవద్దని డాక్టర్ పరీక్ష చేసి సలహా చెప్పి యివిగో ఈ మాత్రలు ఇచ్చి పంపించాడు" అంటూ శేఖరం అసలు విషయం చెప్పాడు.
గంటక్రితం నుంచీ, ఇంట్లో ఒక్కడూ వుండి ఆందోళనగా అటూ ఇటూ పచార్లు చేస్తున్న మాధవయ్య "హమ్మయ్య!" అనుకుని తేలికగా నిట్టూర్పు విడిచాడు.
కొద్దిసేపు మాట్లాడుకొని అందరూ పడుకోడానికి లేచారు.
"ఆయనవస్తే నేను తలుపుతీస్తాలే నాన్నా! మీరెవరయినా మేలుకొని వుంటే మీరే తీద్దురుగాని ఇంక పడుకుందాం!"
చల్లని నీళ్ళతో ముఖం ఒకటికి రెండుసార్లు కడుక్కుంది. నిద్రరాక కళ్ళను నీళ్ళతో తడుపుకుంటూనే వుంది. అయినా, కనురెప్పలు బరువుగా వుండి మూతలు పడుతూనే వున్నాయి.
తన భర్త చెప్పకుండా బయటికి వెళ్ళడానికి, తన నిద్రకి ఏమైనా సంబంధం వుందా?-కామాక్షి మంచం మీద కూర్చుని, అలా ఎంతసేపో ఆలోచిస్తూ వుండిపోయింది.
సమయం నాలుగు కావస్తూండగా.
నెమ్మదిగా తలుపులు తోసుకుని పాండురంగం లోపలికి వచ్చాడు.
మేల్కొనివున్న కామాక్షిని చూసి పాండురంగం నిర్ఘాంతపోయాడు.
"రండి! మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మరీ నాలుగున్నర అవుతుందేమో అనుకున్నాను. ఫరవాలేదు. నాలుగు అయ్యేసరికే వచ్చారు. ప్యాంటు షర్టూ విప్పి లుంగీ కట్టుకు వస్తారు కదా!" మామూలుగా అంటూ కామాక్షి వెళ్ళి మంచం మీద కూర్చుంది.
పాండురంగం ప్యాంటు షర్టు విప్పి లుంగీ కట్టుకుని వచ్చాడు.
"కామాక్షీ! నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. వంద ప్రశ్నలు వెయ్యాలని రడీగా కూర్చున్నావు. నీవడిగే ప్రతి ప్రశ్నకీ జవాబుచెబుతాను. అయితే యిప్పుడుకాదు రేపు! నాకు విపరీతంగా తలనొప్పిగా వుంది. నన్నిప్పుడు మాట్లాడించవద్దు. మాట్లాడించినా, నా నుంచి జవాబు రాదు. నేను నిద్రపోవాలి."
ఈ మాటలంటూ పాండురంగం గదిలో పెద్ద లైటు ఆర్పి బెడ్ లైట్ స్విచ్ నొక్కి ప్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి, నిండా దుప్పటి కప్పుకుని, మంచంమీద అటు తిరిగి పడుకుండిపోయాడు.
"దొంగ దొరికాడు" దొంగతనం గురించి రేపైనా తెలియకపోతుందా? తెల్లారకపోదు!" అనుకున్న కామాక్షి ఒక నిట్టూర్పు విడిచి తనూ పడుకుంది.
16
"మనోజ్!"
"....."