"ఓయ్! మనోజ్! ఈ వయస్సులో ఏమిటి అంత పరధ్యానం?" మనోజ్ దగ్గరగా వచ్చి అతని భుజం పట్టుకుని కుదుపుతూ అన్నాడు ఛటర్జీ.
చేతిలో లెటర్ పాడ్, పెన్ను పట్టుకుని, మరొకచేత్తో తన భుజం కుదుపుతూ, తనని పిలిచిన ఛటర్జీ చూసి, "పిలిచారా మామయ్యా!" అన్నాడు మనోజ్.
"లేదు! అరిచాను" నవ్వుతూ అన్నాడు ఛటర్జీ.
మనోజ్ సర్దుకు కూర్చున్నాడు.
"ఏదో ఆలోచిస్తున్నాలే మామయ్యా! విషయం చెప్పు!" అన్నాడు.
"ఆలోచిస్తున్నానని వేరే చెప్పనక్కర లేదోయ్! ఇప్పటికి మూడుసార్లు పిలిచాను దగ్గరికి వచ్చి భుజం తట్టి పిలిస్తే తప్ప నువ్వు మాట్లాడకపోతివి. అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావ్ దేని గురించి? మళ్ళీ క్రొత్తగా తలనొప్పి కేసేమయినా వచ్చిందా?"
క్రొత్తరకమయిన ఈ కేసు గురించి మామయ్యకి చెప్పాలనిపించింది మనోజ్ కి. అంతలోనే మళ్ళీ ఎందుకో చెప్పబుద్దికాలేదు అతనికి.
ఎందుకు చెప్పబుద్ది కాలేదో ఆ క్షణాన మనోజ్ కి అర్ధం కాలేదు. తను డ్యూటీలో చేరింది మొదలు అన్నీ విచిత్రమయిన కేసులే. దేనికయినా ఒక ఆధారమంటూ దొరుకుతుంది. కానీ ఈ కేసుకి చిన్న క్లూ కాదు కదా! అణుమాత్రం కూడా వూహకి అందటంలేదు. ఈ కేసు పూర్వాపరాలు ఏమిటో?....
"మనోజ్! మళ్ళీ పడిపోయావ్ పరధ్యానంలో నీకన్నా నేను నయం ఈ వయస్సులో పరధ్యానాలూ, మతిమరుపులూ వుండకూడదు."
"నిజమే మామయ్యా!" బుద్ధిమంతుడిలాగా ఒప్పుకున్నాడు.
"షాలిని నిన్న లెటర్ లో ఏం రాసింది? నేను ఈ తఫా శెలవుల్లో వచ్చినప్పుడు. మామయ్యని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను. కొత్తరకం కేసు సృష్టిస్తాను మామయ్య కోసం అంటూ రాసిందా లేదా?"
"ఎందుకు గుర్తులేదూ! షాలిని లెటర్ లో రాసిన ప్రతి అక్షరం నాకు గుర్తుంది. పోలీసువారి బుర్రలు ఎలా పనిచేస్తాయో షాలినీకి తెలియదు. నేను ఏదో తమాషా కేసు తయారుచేస్తాను అని ముందే రాసి నాకు ముందే క్లూ ఇచ్చేసింది. దానివల్ల ఇప్పుడు ఏమయింది?
నేను ముందే జాగ్రత్త పడతాను. తమాషా పని చెయ్యాలన్నా, నేరం చెయ్యాలన్నా, ముందే చిన్న క్లూ కూడా ఇవ్వకూడదు. అందులో ముఖ్యంగా మా పోలీసువాళ్ళకి" అంటూ నవ్వుతూ చెప్పాడు మనోజ్.
"అరెరె! నువ్వు చెప్పిందీ నిజమే సుమా! బంగారు తల్లికి ఇంత చిన్న ఆలోచన రాకపోయె. షాలిని మనసు నొచ్చుకోకూడదు. ఇప్పుడేం చెయ్యాలి?" సాలోచనగా ఆలోచనలోపడ్డాడు ఛటర్జీ.
"మావయ్యా!"
"ఊ...."
"ఇప్పుడు నువ్వు లెటర్ రాసేది షాలినీకే కదా!"
"అవును! షాలినీ దగ్గరనుంచీ నిన్న ఈ లెటర్ వచ్చింది. ఇంతవరకూ నేను రిప్లై రాయలేకపోతిని. "డాడీకి చూడు నా మీద ప్రేమ తగ్గిపోయింది" అనుకోదూ!"
ఛటర్జీ చిన్నపిల్లాడిలాగా అంటూంటే మనోజ్ కి నవ్వు వచ్చింది.
"ప్రతి చిన్న విషయానికీ మావయ్య ఎంత బాధపడతాడో. మగవాళ్ళకి ఇంత సున్నితమైన మనస్సు వుండకూడదు అనుకున్న మనోజ్ ఛటర్జీ మనస్సు మళ్ళించటానికి మాట మారుస్తూ.
"మామయ్యా! నేను ఇంకొక అరగంటకి బయటకి వెడతాను. లెటర్ పూర్తిచేసి ఇవ్వు. నేను వెడుతూ పోస్ట్ చేసి వెడతాను. చివరమటుకు రెండు ముక్కలురాసే చోటు వుంచు. నేను కూడా రాస్తాను షాలినీకి" అన్నాడు.
"అలాగే!" అన్నాడు ఛటర్జీ.
మనోజ్ స్పోర్ట్స్ మాగజైన్ తీసుకుని తిరగేస్తూ కూర్చున్నాడు.
ఛటర్జీ లెటర్ రాయటంలో మునిగిపోయాడు.
17
"చాలా వింతగా వుంది కదూ!" అన్నాడు అతను.
"వింతగానే కాదు విడ్డూరంగా కూడా వుంది!" అన్నాడు సమాధానంగా రెండవ అతను.
వాళ్ళిద్దరి మాటలూ విని మరొక ఆయన "ఉత్తవింత, విడ్డూరమే కాదు, ఇది కనీవిని వూహించని సంఘటన. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత, ఇలాంటి కేసుని ఎక్కడా చూడలేదు" అన్నాడు ఇంకా అటే చూస్తూ.
వీళ్ళ ముగ్గురే కాదు. అక్కడ గుమికూడిన జనం, పలురకాలుగా తలో వ్యాఖ్య చేస్తున్నారు.
ఇప్పుడు ఇక్కడ, ఒక మరణం సంభవించింది.
కానీ, ఇది మామూలు మరణం కాదు.
హత్య.
ఈ హత్య కూడా మామూలుగా జరగలేదు.
చాలా విచిత్రంగా చేయబడింది.
హత్య చేయబడింది ఆరేళ్ళ పాప.
ఆ పాప పేరు "జెన్నీ" ఆ పాప తల్లితండ్రులు, అక్కడ హత్యకాబడిన పాపను చూస్తూ, ఒకరిని పట్టుకుని మరొకరు ఏడుస్తున్నారు.
ఆరేళ్ళ జెన్నీని, హత్యచేసే అవసరం ఎవరికి వుందో తెలియదు గానీ, ఈ హత్యమాత్రం చాలా విచిత్రంగా చెయ్యడం జరిగింది.
జెన్నీ తల్లితండ్రులు ఆంగ్లో యిండియన్లు.
తండ్రి స్కూల్లో టీచరు. తల్లి కూడా మరొక కాన్వెంట్ లో టీచర్. ఇరువురూ కలిసి నిన్నటి ఉదయం వూరు వెళ్ళారు. ఇంటి మొత్తంమీద జెన్నీ, జెన్నీ వాళ్ళ అక్కయ్య మాత్రమే ఉన్నారు.
ఆమె వయస్సు పద్దెనిమిది ఏళ్లు. జెన్నీకి ఆ అమ్మాయి సొంత అక్క కాదు. కానీ తల్లిదండ్రులు లేనందువల్ల చిన్నతనం దగ్గర నుండీ వీళ్ళ ఇంటిలోనే వుంటోంది. వాళ్లిద్దరూ సొంత అక్కాచెల్లెళ్ళ కన్నా ప్రేమగా వుండేవారు.
వీళ్ళుండే ఆ చిన్న వీధిలో ఇంతవరకూ దొంగల భయం కూడా లేదు. ఇరుగూ పొరుగూ ఇళ్లు కూడా వీరి ఇంటికి కాస్త దూరంగానే వున్నాయి. తల్లీతండ్రీ వూరికి వెళ్లినా పిల్లలిద్దరూ ధైర్యంగా వరండాలో పడుకున్నారు. ఈ దారుణం ఎప్పుడు జరిగిందో, ఎట్లా జరిగిందో ఎవరికీ తెలియదు.
ఆ యింటి కాంపౌండ్ చాలా పెద్దది. ఇల్లు మాత్రం చాలా చిన్నది. జెన్నీని కాంపౌండ్ లో ఒక మూలకి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిమీద కిరసనాయిల్ గానీ, పెట్రోలుగానీ, జల్లడం జరిగింది.
నిలువునా తగలబెట్టాలనే ఉద్దేశం కాబోలు అగ్గిపుల్ల ముట్టించి హంతకుడు అక్కడి నుంచీ వెంటనే తప్పుకోవటం జరిగింది. పాప పూర్తిగా కాలక, శరీరంలో మూడువంతులు కాలిపోయి మరణించి వుంది. బహుశా హంతకుడు ఇదిచూసి వుంటే మొత్తం దగ్గర వుండి కాల్చేవాడో, లేక మరణించింది చాల్లే అనుకుని వెళ్ళిపోయేవాడో ఎవరికీ తెలియదు.
జెన్నీ తగలబడుతున్నపుడు వాళ్ల అక్కే చూడలేదు. తెల్లవారు ఝామున వూరినుంచీ వచ్చిన తల్లిదండ్రులు ఈ దుస్సంఘటన ముందుగా చూడటం జరిగింది. ఆ తరువాత ఏడుపులూ మొత్తుకోళ్లూ, జనం పోగవడం అది చూసినవాళ్ళు పలురకాలుగా మాట్లాడుకోవడం జరిగాయి.