కొంతలో కొంతనయం. సామ్రాజ్యలక్ష్మి కుర్చీపీత మీద నుంచీపడ్డా, తొంటిభాగమూ, మోకాలిభాగమూ బెణికినట్లు నెప్పి చేశాయి గానీ, విరగలేదు.
గదిలోంచి బైటికి వచ్చిన బోసుబాబు "వదినా! వదినా!" అంటూ పిలిచాడు.
తప్పని సరై ఒక మూలుగు మూలిగింది సామాజ్యలక్ష్మి.
"ఇక్కడున్నావా వదినా!" అంటూ బోసుబాబు వచ్చేసరికి సామ్రాజ్యలక్ష్మి జంతువు ఆకారంలో వంగి అతి బలవంతానా పైకి లేవటానికి ప్రయత్నిస్తోంది.
"అరెరె! ఏమయింది వదినా! పడ్డావా?" అంటూ చేయి అందించి పైకి లేపాడు బోసుబాబు.
పదేళ్ళక్రితమే పరలోకానికి ఏగిన తల్లిని తలచుకుంటూ "అమ్మా!" అంది సామ్రాజ్యలక్ష్మి.
"అసలు ఎలాపడ్డావు వదినా?" బోసుబాబు అడిగాడు. అలా అడుగుతూనే కుర్చీ పీటను చూసి, "అరె కుర్చీపీట కూడా పడిందే!" అన్నాడు.
ఒకచేత్తో నడుంపుచ్చుకుని కుంటుకుంటూ నడుస్తూ, దిక్కుమాలిన కుర్చీపీట తెస్తున్నాను! కాలుజారి పడ్డాను!" అంది సామ్రాజ్యలక్ష్మి.
"కుర్చీపీట ఎందుకు తెస్తున్నావు? వదినా!" అన్నాడు బోసుబాబు.
"ఎందుకు తెస్తాను? అవసరముండి తెస్తున్నాయి. ఎక్కి బూజు దులుపుదామని!" అంది సామ్రాజ్యలక్ష్మి.
"ఇవాళ శుక్రవారం కదా! వదినా!"
అప్పటికి సామ్రాజ్యలక్ష్మి మంచందగ్గరకి చేరటం, మంచం ఎక్కి పడుకోవటం జరిగింది.
"శుక్రవారమో పాడో ఎవడికి గుర్తుండి చచ్చింది. తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందని, ఏదో చేయబోయాను. అది వికటించింది" విసుక్కుంటూ సమాధానం ఇచ్చింది సామ్రాజ్యలక్ష్మి.
"చేతబడిలో కూడా అంతే వదినా! సరిగ్గా నియమాలు పాటించకపోతే, బెడిసి బెజ్జారం హిందుళ్ళు...."
"వాడెవడు?" దడుచుకుంటూ అంది సామాజ్యలక్ష్మి.
"అతను ఒక మహా మాంత్రికుడు వాడి నివాసం ఎక్కడో తెలుసా? ఆడవాళ్ల నడుము మీద?"
"వామ్మో!" పెద్దగా అరిచింది సామ్రాజ్యలక్ష్మి.
బోసుబాబు ఆ తరువాత కుర్చీ లాక్కుని, వదినా మంచం దగ్గరగా కూర్చున్నాడు.
ఇంకా భయంగానే చూస్తున్నది సామ్రాజ్యలక్ష్మి, బోసుబాబుని.
"వదినా! నువ్వు నా మీద పరిశోధన మొదలుపెట్టావని, నేను తెలుసుకున్నాను. నా దోవన నేను వుంటే, మీ అందరికీ నా మీద ఇంత అనుమానం దేనికి? మీ జోలికి రావటంలేదు. మిమ్మల్ని ఎవర్నీ వేధించటం లేదు. అయినా నన్ను అనుమానించావు. వెయ్యి కళ్ళతో నన్ను గమనించటం ప్రారంభించావ్! ఆ విషయం నేను గమనించాను. నీకు చేతబడులన్నా దయ్యాలన్నా చచ్చేంత భయమని నాకు తెలుసు.
నువ్వు నిన్నటిరోజు నా గది కిటికీకి చాకుతో రంధ్రం పెట్టడం గమనించాను, నిన్ను ఏడిపించటానికి మాత్రమే, బొగ్గు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కుంకుడు కాయలు, ఎర్రసిరా, పంచదార, విసినకర్రా అన్నీ ఒక్కొక్కటీ నా గదిలోకి తీసుకువెడుతూంటే నువ్వు కుతూహలంగా చూశావ్! నీకు తెలుసు నేను పరమ నాస్తికుడ్నని. అయినా ఈ నిమిషాన నువ్వు ఆ విషయాన్ని మరచిపోయావ్?
నేను నా కిష్టమయిన పనేదో చేసుకుంటున్నాను, దానివల్ల నష్టపోయినా, లాభపడినా నా ఒక్కడివరకే అది జరిగేది. ఇంట్లోవాళ్లకి ఎలాంటి నష్టమూ కష్టమూరావు. నేను చేసేవి చేతబడులూ, క్షుద్రవిద్యలు లాంటివికావు. నాకిష్టమయినది నాకు సంబంధించిందీ, నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి, పిచ్చి వేషాలతో రెచ్చగొట్టాద్దు.
అంతేకాదు.
"వదినా! ఈ విషయం ఇంతటితో మరిచిపో! ఇవన్నీ అన్నయ్యకి తెలిస్తే నిన్ను చీదరించుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ముఖానే నవ్వుతారు.
నాకన్నా పెద్దదానివి అని, వదినవి అని నీ మీద వున్న గౌరవంతో ఈ విషయం ఎవరితో చెప్పకుండా ఇంతటితో పోనిస్తున్నాను" అని చెప్పి అక్కడినుంచీ వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు బోసుబాబు.
సామ్రాజ్యలక్ష్మికి నోటమాట కాదు కదా! గుటకకూడా మింగుడు పడలేదు. జరిగినది హరాయించుకోటానికి సరిగ్గా పది నిమిషాలు పట్టింది.
15
ఎప్పటిలాగా.
పెరటి మార్గాన పాండురంగం ఇంట్లోంచి బయటికి వచ్చాడు నిద్రమాత్రలవల్ల కామాక్షి గాఢనిద్రపోతోంది.
ఆ రాత్రి ఒంటిగంట వేళ.
మహాలక్షమ్మకి గుండెల్లో నెప్పి వచ్చింది. ఆయాసపడుతోంది. శ్వాసపీల్చడం కష్టమవుతోంది. ఉత్తపుడు కూడా మహాలక్షమ్మ రాయిలాంటి మనిషి కాదు. ఇప్పుడు వచ్చిన ఆయాసానికి గుండె బరువుని భరించలేక ప్రక్కనే వున్న భర్తని లేపింది.
మాధవయ్య లేచి చూసేసరికి, భార్య బాధపడడం ఒకటే కాక. ఆమె వళ్ళంతా ముచ్చెమటలు దిగజారడం గ్రహించాడు. ఆయనకి కంగారు వేసింది.
వెంటనే కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళి శేఖరాన్ని లేపుకుని వచ్చాడు.
తల్లిని ఒకసారి చూసి.
"మీరు బావని లేపి విషయం నెమ్మదిగా చెప్పండి! కామాక్షిని కంగారు పడవద్దని చెప్పండి. నేను వెళ్ళి రిక్షాలు తీసుకువస్తాను" అని చెప్పి శేఖరం బయటకి వెళ్ళిపోయాడు.
మాధవయ్య కామాక్షి గది దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తడుతూ "కామాక్షీ! కామాక్షీ!" అంటూ పిలిచాడు.
కామాక్షి బదులు పలకకపోవటంతో ఈతఫా అల్లుడిని పిలిచాడు మాధవయ్య.
ఈ తఫా కూడా గదిలోంచి సమాధానం రాలేదు.
"ఇరువురూ గాఢనిద్రలో ఉన్నట్లున్నారు. లేపాలా? వద్దా?" అని తలుపుదగ్గరే నుంచొని ఒక నిముషం తర్జన భర్జన పడ్డాడు మాధవయ్య.
ఈ తఫా మాధవయ్య తలుపు మీద గట్టిగా కొడుతూ "కామాక్షీ! కామాక్షీ!" అంటూ గట్టిగా పిలిచాడు.
కామాక్షి లేవలేదు గానీ, తలుపు మీద గట్టిగా కొట్టడం వల్ల తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఎలాగో తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి గదా! అని మరింత తలుపులు నెట్టాడు మాధవయ్య.