నిద్రా దరిద్రుడు
మన సాహిత్యంలో ఒక కావ్యంతోనో ఒక నాటకంతోనో ఒకే ఒక నవలా రచనతోనో సుప్రసిద్ధులై శశ్వత్ శాశ్వత కీర్తి సంపాదించుకున్న మహనీయులు ఎందరో వుండవచ్చు. లేదా కన్యాశుల్కంతో గురజాడ, వరవిక్రయంతో కాళ్ళకూరి, కాలాతీత వ్యక్తులతో శ్రీమతి డాక్టర్ శ్రీదేవిలా చిర యశస్సు సంపాదించుకొని పాఠకుల హృదయ సామ్రాజ్యంలో శాశ్వతంగా నిలిచిపోవచ్చు. వాళ్ళు మరెన్నో రచనలు చేసి వుండవచ్చు అయితే ఈ రచనలు కీర్తి సంతరించుకోక పోవడంవల్ల అవి గుర్తులో నిలువలేదు.
అలాగే కీర్తి శేషులు శంకరం బాడి సుందరాచార్యులు అనే కీర్తి శేషులు ద్ధగీత లాంటి లఘకావ్యాన్నిరచించినా, మరింకెన్నో రచనలు చేసినా అవి ఇప్పుడు ఏ కొందరికో తప్ప అందరికీ గుర్తులేవు. అయితే మూడు కోట్లు ఆంధ్రులున్నఆనాటి నుంచి ఆరుకోట్ల ఆంధ్రులయిన ఈనాటి వరకూ వారి పేరు మార్మోగ్రేది ఒకే ఒక గేయంతో; అది తెలుగుతల్లి సంకీర్తనం. మా తెలుగు తల్లికీ మల్లెపూదండ. మా కన్నతల్లికీ మంగళారతులు అంటూ ఆయన మాతృభూమిని మాతృభాషలో చేసిన స్తవం తెలుగు భాష. తెలుగునాడు, తెలుగువాడు, తెలుగు తేజం ఉన్నన్ని రోజులూ ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. ఒక వందేమాతరం లాగా (బంకిం చంద్ర ఛటర్జీ) ఒక జనగణ మనలాగా (రవీంద్రనాధ ఠాగూరు) అది తెలుగువారికి ఒక జాతి(య) గీతం.
ఇప్పుడు పేర్కొన్న మహానీయులంతా ఒకటో రెండో రచనలు చేసి ఏ ఒక్క దానివల్లో అజరామరమైన కీర్తిని పొందిన వాళ్ళు. కాని సంస్కృత సాహిత్యంలో ఒకే ఒక్క శ్లోక రచనతో ఆనాటి నుంచి నేటి దాకా రసిక రంజనంగా రసిక జన మనోహరంగా చేసిన ఆ ఒక్క శ్లోక రచనతో రసిక హృదయాల్లో నిలిచిపోయిన కవి వాటినుంచి నేటిదాకా ఒక్కడే ఒక్కడు....
ఆయన పేరు మాతృగుప్తుడు
ఆయన విక్రమార్క చక్రవర్తి కాలపువాడు
ఆయన విక్రమార్కుని తరపున కాశ్మీర దేశాన్ని పరిపాలించిన కవి రాజు.
అయితేనేం --- ఆయన పేరు కవిగా నిలిచింది. 'నిద్రా దరిద్రుడనే.'
మాతృగుప్త కవి బిరుదం నిద్రాదరిద్రుడు. ఆయన చెప్పిన శ్లోక భావం పరిపుష్టమైన రసవంతమై భావపూర్ణమైనందువల్ల ఆ ఒక శ్లోకం చేతనే ఆయన పేరు మరుగునపడి ఆయన బిరుదం 'నిద్రాదరిద్రుడు' శాశ్వతంగా నిలిచిపోయింది.
ఒక మహారాజు రాజ్యం చేసే బంగరు కాలంలో ఆ రాజు రసికుడై, సరసుడై సంగీత సాహిత్యాల్ని పోషిస్తే ఆ రాజ్యంలోని కవులే గాక గాయకులే కాక ఇరుగుపొరుగు రాజ్యం కవులు పండితులు గాయకులు కూడా ఇక్కడికి వచ్చి సభా ప్రవేశం చేసి సన్మానం పొందుతారు. ఆదికవులున్న స్వేఛ్చ ఒక దేశానికి ఒక కాలానికి కవులు బుద్ధులుకారు కాలేరు. అలా ఎవడైనా అయితే వాడు అచ్చమైన కవి కాదన్న మాటే!
ఒక మహారాజు యధేచ్చగా చతురుదధి వేలా వలయితి మహీ మండలాన్ని ఏకచ్చత్రంగా పరిపాలిస్తే రాజు ప్రాపకం సంపాదించుకోగలిగిన కవికే భాగ్యం దక్కుతుంది. మిగతా కవులకు కానీ పండితులకు కానీ, గాయకులకు కానీ ఆ అదృష్టం, ఆ అవకాశం దొరకదు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు పాలించిన స్వర్ణయుగంలోనూ సంకుసాల నృసింహ కవివంటివాళ్ళకు వలసిన స్థానం దొరికింది కాదు. అలాటి వాళ్ళు ఇంకెందరుండినారో మనకు నిక్కచ్చిగా తెలీదు.
అంతఃపుర ప్రవేశానికి రాజదర్బారులో చేరడానికి ఎన్నెన్నో ద్వారాలు ద్వారం ద్వారం వద్ద ఒక్కో ఘటికుడు ఉంటాడు కదా! ఉద్దండుడైన వికట కవి రామలింగ కవికే అంత సులువుగా భువన విజయ సభా ప్రవేశం దొరికింది కాదంటే నోరుమెత్తని నోరెత్తని వాళ్ళ మాట చెప్పాలా.
శ్రీ విక్రమార్క చక్రవర్తి పరిపాలన చేసే రోజుల్లోని కధ ఇది.
ఒక రోజు రాజుగారికి హఠాత్తుగా మెళుకువైంది. అపుడు సమయం యెంతైనదని భటుడిని అడిగాడు.
అతగాడు చాలా నిక్కచ్చిగా చెప్పాడు. అంత సరిగ్గా కాలగణన చేసి చెప్పగానే రాజుగారికి ఆశ్చర్యం వేసి అడిగాడు. దానికా భటుడు తనకి నిద్ర దూరం అని చెప్పాడు. ఎందుకు నిద్ర దూరం అంటే బ్రతుకు భారం.... రోజూ రావలసిన భటుడి స్థానంలో పొట్ట కూటి కోసం తాను రావలసి వచ్చిందని చెప్పాడు కవిగారు. రాజుగారికి నిద్రా భంగంతో ఆగక నిద్ర దూరమై వివరాలన్నీ అడిగాడు.
అప్పుడు భటుడిగా ఉన్న "మాతృగుప్తుడు" అన్న "కవి" ఓ శ్లోకం చెప్పాడు అది ఇది.
జానే కోప పరాబ్ముఖీ ప్రియతమా స్వస్నేద్య దృష్టా మయా!
మామామ్ సంస్పృశ పాణినేతి రుదతీ గంతుం ప్రవృత్తాతతః
నోయావత్పరి రభ్య చాటుక శతై రాశ్వాస యామి ప్రియాం!!
భ్రాత స్తాన దహం శఠేనవిధినా నిద్రా దరిద్రః కృతః!!
కోపంతో వెనుదిరిగి పోతున్న ప్రియతమను ప్రసన్నం చేసుకోవాలను కుంటూ వుండగా నిద్రా భంగమై స్వప్న భంగమైంది. కల చెదిరిపోవడంతో "కాంత" కదిలిపోయింది. కలలో కనిపించి అలరించి ఆపై కోపగించి వెళ్ళిపోయిన ఆ ప్రియురాల్ని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ కలగని మళ్ళీ ఆ ప్రియురాల్ని కలలోకి తెచ్చుకుని ఆమెని ప్రసన్నం చేసుకొని ఆమె ప్రేమను పొందుదామంటే నిద్రేరాదు. నిద్రా దరిద్రుడికి ఇక కల ఎక్కడిది? కలే లేకపోతే కలలోని కాంత ఎక్కడుంది.
అస్సలు నిద్ర ముఖం ఎరగనయ్యా మహారాజా అని చెప్పడానికి ఆయన చెప్పిన శ్లోకం అది.
ఈ "మాతృగుప్తుని" ప్రస్తావన విశ్వనాధవారి కాశ్మీర దేశ నవలల్లో వస్తుంది. ఆ కాశ్మీర దేశనవలల్లో.... కల్హణుని రాజ తరింగిణి ఆధారంగా చేసుకొని విశ్వనాధవారు సృష్టించిన ఆరునవలల్లో "భ్రమర వాసిని" ఒకటి.
ఆ "భ్రమర వాసిని" నవల మీద పరిశోధన చేసిన సుగృహీత నామధేయ కాశీనాధుని సువర్చలాదేవిగారి సిద్ధాంత గ్రంధంలో వుంది ఈ శ్లోకం.
శ్లోకం ఎంత మధురమో, ఎంత దుర్లభమో, ఎంత శ్లాఘనీయమో, స్మరణీయమో విశ్వనాధవారి భ్రమర వాసిని పై జరిగిన పరిశీలనం కూడా అంత ప్రశంసనీయం.... పఠనీయం.... ఓ గొప్ప కవి గురించి చెప్పుకునే సమయంలో ఒక గొప్ప "వ్యాఖ్యానాన్ని" గూర్చి చెప్పుకోవడం తప్పుకాదనుకుంటాను.
----*----