వేయిచేతులతో ఆలిని వెతుక్కొనే
వాడి, వేడి మగడు
ఎండలు! ఎండలు! ఎటుచూసినా ఎండలు? ఎలా వున్నాయి ఎండలు?
ఈ ఎండలు మండిపోతూవుంటే ఆతప తాపానికి తట్టుకోలేక దేవతలు ఎలా ఉన్నారట!
దట్టమగు మేఘముల వట్టివేరుల తెరలు
కట్టి జాబిలి నాలవట్టమ్ము చేసికొని
గట్టి వేల్పులు చదలపట్టి వారెందులకు
అట్టహాసపు వేడినాపుకో జూలుటకె!
అంతటి దేవతలే వేడిమికి తట్టుకోలేక వట్టివేళ్ళ తడికల చాటున దాక్కున్నారంటే మనం వట్టివేళ్ళ తడికల తడిపి తడవడంలో వింతేముంది? ఏసీల మాటున, కూలర్ల చాటున దాక్కుంటే వేడిగాలి వేడి విసురూ తగ్గుతుందేమో కాని ఋతుప్రభావంతో పుట్టుకొచ్చే వేడి ఎక్కడికి పోతుంది. శరీరాన్ని అంతరాంతరంగా తపిస్తూనే వుంటుంది.
ఎండకు ఎండిన భూమిపగుళ్ళు పారుతుంది వేసవిలో! వేసవికి ఎండి వర్షంలో తడిస్తేనే భూమి సారవంతమౌతుంది నాగలితో చీల్చిన దానికంటే భూమి తనంతతాను పగుళ్ళు వారితేనే పంట పండేది. ఈ సహజ పరిణామాన్ని కవితన దృష్టిలో ఎలా చూస్తున్నాడో చూడండి.
చాయయను తన భార్య మాయమై దాగుకొన
వేయికరములతోడ వెదకెనో సూర్యుడన
కాయుచుండెడి యెండకాక కోర్వని ధరణి
వేయి చోట్లను పగిలి ఎడద బీటలు వారె!
చాయ అంటే నీడ! చాయ సూర్యుడి భార్యట! వెలుగెక్కడ వుంటుందో దాని మాటున్నే నీడ వుంటుంది కదా! వేయంచుల వేలువు వేడి వేడి కిరణాలు వెదజల్లుతూ వుంటే అది రవి తన భార్య ఛాయను వేయి చేతులతో వెదుకుతూ వున్నట్లు వుందట! ఆయన కిరణాలు నేరుగా సోకేది భూమినే కదా! అంచేత ఆ కాకకు ఓర్వని భూమి తనంత వేయిచోట్ల పగిలి చీలికయి బీటలు వారిందట! ఏమయా! నీ భార్య ఇక్కడ భూమ్మీదే కాదు భూమికింద కూడా దాక్కోలేదు! కావాలంటే చొచ్చుకుని వెళ్ళి చూడు అన్నట్టుగా బీటలు వారిందట భూమి! ఎంత గొప్ప ఊహ!
ఇంకో ఊహా చిత్రం చూద్దాం.
ఆయన తీక్షణాంశువు! బాగా దప్పికొన్నాడు! దానితో పాటే ఆకలి! అంచేత ఎక్కడ కన్పిస్తే అక్కడ తినేస్తాడని భయపడుతోంది నీడ! చెట్టు దట్టంగా పెరిగి కొమ్మకు కొమ్మగా రెమ్మకు రెమ్మగా విస్తరిల్లి తమచుట్టూ నీడను నిలుపుకుంటాయి.
అంచేత తీక్షాంశు కిరణాల తాకిడికి తట్టుకోలేని నీడ వృక్షపాదాలను ఆశ్రయించదట! అయితే అక్కడేమిటి సంగతి! వేసవిలో వేళ్ళతో నీటిని పీల్చుకుని పీల్చుకుని ఎక్కడా జలం దొరకని చెట్లు తపనతో తపిస్తున్నాయి! ఎక్కడెక్కడి జలా చాలటంలేదు. అందడంలేదు. ఆ అక్షీణక్షుదతో ఆ చెట్లు ఒకవేళ నీడల్నే తాగేస్తాయేమోనని చెట్టు పాదాలను ఆశ్రయించిన నీడ చూస్తూ చూస్తూ వుండగానే పారిపోయిందిట!
తీక్షాణంశు వాకలిచే తినివేయమని వగచి
వృక్ష పాదములంటి వేడుకొన్నది నీడ!
అక్షీణక్షుధ చేత ఆ తరువు త్రావునని
వీక్షించు చుండగనె వెడలి పోయినది!
ఎంత సహజమైన వర్ణన! భయంతో పెద్దవాళ్ళ పాదాలు పట్టుకోవడం- ఆ మీదట ఆ పెద్దలే మింగేస్తారని భయపడి పారిపోవడం లోకరీతిని ధ్వనించడం లేదూ!
మండుటెండలో మానవుల తిరుగాడలేరు మహారాణులు తిరుగాడలేరు! వీళ్ళమాట కేందేవతలు కూడా దివినుండి భువికి దిగిరారు! ఎందుకట! తీవ్ర తాపక్షోభ వివరాలు తెలిసిట!
భువినున్న మానవులు భూమీశు రాణువలు
అపురవుర! మరుభూమి నడుగు పెట్టనికతమె---
దివినున్న దేవతలు తీవ్రతాపక్షోభ
వివరాలు తెలిసియే పృధివి నడుగిడలేదు!
భూమి మరుభూమి అయ్యాక మానవులు మనుగడ సాధించే వాళ్ళు ఎలా అడుగుపెడ్తారు? మాములు వాళ్ళే అడుగు పెట్టలేక పోతే రాణులు రాగలరా? వాళ్ళూ వీళ్ళూ ఎందుకు దేవతలే రాలేరు! ఎందుకు? వాళ్ళు అమరులు! వాళ్ళకు మరుభూమిలో అడుగిడే అవకాశం లేదు. మానవ రక్షణ కోసం పై నుంచి కిందికి దిగివచ్చే దేవతలు--- తీవ్ర తాపంతో భూమి క్షోభించి మరుభూమి అయ్యిందని దిగి రావడం లేదు! శ్మశానంలో వాళ్ళకేం పని?
కవి ఊహకు అన్నీ చిత్రంగానే కన్పిస్తాయి! రాముడు సముద్రం దాటాలి! అందుకోసం సేతువుని నిర్మించాలి! మరి వారధి కట్టడానికి అక్కడే ఉన్న ఇసుకను ఎందుకు వాడుకోలేదు?
దానికో చిత్రమైన సమాధానం చెపుతూన్నాడు కవి!
చమత్కారం చూడండి!
మండు వేసవిలో ఇసుక దానికి రెట్టింపుగా మండిపోతుంది! మామూలు నేలకంటే ఇసుకనేలలు త్వరగా వేడెక్కి పెనం మీద వేయించినట్లు ఇసుక రేణువులు వేడిలో ఇసుక రేణువులా మండుతాయి! ఆ మండే యిసుకను సముద్రంలో వేస్తే ఆ సముద్రం మండిపోతుందేమో అది మనకెందుకు ఆనుకుని కోతిమూకలు కొండలను పెకిలించి వారధి నిర్మించాయటి! అహో అద్భుతమైన ఊహ!
మండు ఈ ఇసుకతో దండి వారధి కట్ట
మండునేమో జలధి మనకేల ఇది యనుచు
కొండలను పెకిలించి కోతిమూకలు నాడు
దండెత్తి పోయినవి దానవుల నోడించ
తమిళంలో జయగొండన్ కవితలు చదువుకుని తనివితీరా ఆనందించిన ఆరుద్ర తన తెనుగువాళ్ళకోసం తెనిగించిన "వేసవి" పద్యాలివి--- ఆయనవే. "వెన్నెల" పద్యాలు మళ్ళీ "వెన్నెల్లో"
----*----