చలిలో "స్త్రీ" నాథుడు
ఒక చల్లని రాత్రి. తొలి జాము ఇంకా ముగియలేదు. మాఘ్య చంద్రుడు కమ్మని వెన్నెల తన కిరణాలతో చిమ్ముతున్నాడు. చలి చలి గాలులు మంద మందంగా వీస్తున్నాయి. రెడ్డి రాజులు ప్రీతిగా ఇచ్చిన కాశ్మీరు సేలువా భుజంమీద వేలాడుతుండగా, పావు కోళ్ళు టకటకలు బరాబరులు చేస్తూ వుండగా, వెంట ఆంతరంగిక శిష్యుడు చెన్నమ రాజు తోడురాగా వాడ వీధిలో నడుస్తున్నాడు శ్రీనాధకవిసార్వభౌముడు.
ఓ ఇంటికోసం ఓ ఇంతికోసం వెళుతున్నాడు. మలుపు తిరిగితే మరుని చేబంతి మరులదొంతి... మదవతి మాణిక్యం ఇల్లు. అంతలో చూసి ఎగసివస్తోన్న ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని నియంత్రించుకుంటూ అన్నాడు.
గుబ్బల గుమ్మలే చిగురు బొమ్మ సువర్ణపు గీలు బొమ్మబల్
గబ్బి మిటారి చూపులది.... దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంట గట్టితిని పెద్దవు నిన్ననరాదు గానిదా
నబ్బ! పయోజ గర్భ మగనాలికి ఇంత విలాస మేటికిన్
మంత్రోపదేశంలా గురువుగారు చెప్పిన ఆ పద్యం విని ఆ సొగసు కత్తెను చూశాడు శిష్యుడు. నిజమే! ఆమె వయసుల సొంపు తెలిపే సోయగాలు ఇలా వున్నాయి. ఆ పక్కనే యముని వాహనం లాంటి మగడు! అడవి కాచిన ఆ అందాన్ని చూసిన రసిక సార్వభౌముడి గుండె కదిలి కవిత్వం వచ్చింది.
నిట్టూరుస్తు మరో అడుగు వేశారు ఇద్దరూ! అక్కడ అరుగు ముందు నిలబడి చేయి కడుకుంటున్నవ్యక్తిని చూడగానే పక పక నవ్వాడు శ్రీనాధుడు.
'బావా! బాగున్నావా?'
"ఆహా సుష్ఠుగా భోంచేసే కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది. మీరు నగర సంచారం బయలుదేరి "వీధి" "వీధి" తిరుగుతున్నట్టున్నారు---!
"చెన్నమ రాజా----!"
'వింటున్నానండీ---'
"చెన్నా! మా రామయ్య బావగురించి నువ్వెప్పుడూ వినలేదు కదూ -
గ్రామము చేతనుండి పరికల్పిత ధాన్యము నింటనుండి శ్రీ
రామకటాక్ష వీక్షణ పరం పరచే గడతేరె గాక మా
రామయ "బావ" (మంత్రి) భోజన పరాక్రమమేమని చెప్పవచ్చు నా
స్వామి యెరుంగు తత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్
ఇంతింత ముద్దలు చేస్తూ గుటుకు గుటుకు మింగుతూ వుంటే చూడముచ్చటగా వుంటుంది.
'వినే వేడుకగా వుంది బావా! నిజం! నాన్నగారు సంపాదించిన గ్రామ కరణీకమూ, ముక్కారు పండే వరిపొలాలు, ఆ రాముని దయవుంది కాబట్టే కడుపులో చల్ల కదలకుండా సుఖంగా జీవిస్తున్నారు-' అన్నాడు రామయ్య -
వస్తామంటూ శిష్య సమేతంగా కదిలి మరో నాలుగు అడుగులు వేయగానే అక్కడ దైవజ్ఞ శర్మగారి ఇల్లు కన్పించింది. చిన్న ఇల్లు, పాడికోసం పోషించుకుంటున్న పశువులు. గంపెడు సంసారం! తల చెడిన తల్లి, చెల్లెలు, వదిన... ఆపదకూ అక్కరకూ సేకరించి పెట్టుకున్న వంట కట్టెలు.... ఇల్లంతా కిచాటుగా వుంటుంది. శిష్యుడివైపు చూసి మనస్సులోని వెగటంతా వెలికి వచ్చేలా...
దోసెడు కొంపలో పనుల తొక్కిడి మంచము దూడ రేణమున్
పాసిన వంటకంబు పసి బాలుర శాచము విస్తరాకులన్
మాసిన గుడ్డలున్ తలకు మాసిన ముండలు వంట కుండలున్
రాసెడు కట్టెలున్ తలపరాదు పురోహితునింటి కృత్యముల్
అన్నాడు ఆశువుగా
"గురువుగారూ! ఒకసారి చెప్పారు
కాలకంథర! ఈశాన! గరళకంఠ!
విసము మెసవిన గలుగు నక్కసటవోవ
కొమ్మ మేడూరి గుమ్మ చకోరనేత్ర!
పనస తొన వంటి పెదవి చుంబనము సేయు
అలాగా ఈ పురోహితుడి ఇల్లూ, ఈ ఇంట్లో చూసిన పేడ పెంట, వంట చూసిన అసహ్యం అంతాపోయి, ఎదపొంగి పోయేలా మరో మంచి పద్యం సెలవివ్వండి. చెవుల తుప్పువదిలేలా--- భావం గుప్పుమనేలా...." అని అడిగాడు చెన్నమరాజు.
శిష్యుడి మాటలు విని అటు చూశాడు కవిరాజు.
తటల్లిత మెరసినట్లు యవ్వనం విరిసినట్లు ఆయన అంతరంగాన్ని తొందరించింది.
పంచారించిన నీ పయోధరము లాస్పాలింతునో, లేతబొ---
మ్మంచుం గెంజిగురాకు మోవిణిశిధాత్వర్ధం బనుష్ఠిలతునో---
పంచాస్త్రో "పనిషత్ రహస్య పరమ బ్రహ్మస్వరూపంబు నీ
కాంచీదామ పదంబు ముట్టుదునొ యోకర్ణాట తాటంకినీ....
"నమస్కారం కవివరా! నేను రాజలక్ష్మిని మీరు రసికులు.... చేత పట్టినా, ణిశి అనే ధాతువు యొక్క అర్ధమైన చుంబనాన్ని నా కెంజిగురాకు పెదవిపై ముద్రించినా మన్మధ ఉపనిషత్తుఠ రహస్యాలు చెప్పే పరబ్రహ్మ స్వరూపమైననా మొలనూలి మొదటి మెట్టు ముట్టినా మీ ఈదాసి జన్మధన్యమే! వారం చెప్పితే వేచివుంటా. నక్షత్రం చెపితే అక్షయ స్వాగతం ఏర్పాటుచేస్తా.... తిది ప్రకటిస్తే ఆతిధ్యం కురియిస్తా... ఆపై అంజలి ఘటిస్తా...." అంది.
"తధాస్తు!" అన్నారు కవి శ్రేష్ఠులు మరో అడుగు ముందుకు వేసి
"ధన్యోస్మి" అంటూ దోయిలౌగ్గిందామె
చెన్నమ రాజు గురువుగారి వెంట నడిచాడు.
"చెన్నా! చూశావా!"
"ప్రభూ! మీ కవిత సామాన్యమా!
పంపావిరూపాక్ష బహుజటా జాటికా
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
కర్ణాటి కామినీ కర్ణహాటక రత్న
తాటంకయుగ ధాళదళ్యములకు
నిర్నిబంధ నిబంధమై వెనయు కవిత
తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు .... అంటూ ఆనాడు మీరు ముమ్మసు కవికి చెవులు నాటేలా చెప్పింది ఇంకానా చెవుల్లో గింగురు మంటూనే వుంది---" అన్నాడు.
ఆ మాటకు శ్రీనాధుడేమి అనలేదు
మరో రెండు గజాలు
పదారేళ్ల చంద్రకాంత.... పరువాల మేలిపూత, సోయగాల పుంత.... సొగసుల పులకరింత నమస్కరించింది ఎదురై.
అగరుధూపాది వాపితాభ్యంతరంబు
మగువ! నీ మన్మధచ్చత్ర మండపమ్ము
సర్వయోషి దసామాన్య సౌష్టవంబు
కాచుగావుత యోర్గంటి కటక విటుల.... అంటూ ఆశీస్సులు వర్షించాడు. స్వస్తిక నమస్కారంతో నిలుచుందా బాలిక.
మరికొంత దూరం నడవగానే ఎక్కడినుంచో పాట వినిపించింది.
వీనుల విందులైతేనే సోన లెనయ
ముందు రాగమునకు జగన్మోహ నముగ
బాడునది జాలరి మిటారి ఈడు లేని
కాకలీ నాదమున నాడ గడుపు పాట---
అని 'విన్నావా చెన్నా! ఎంత సొగసుగా పాడ్తుందో -' అన్నాడు.
'చిత్తం - చిత్తజుడు మత్తిల్లేలా -'
"ఊ" అంటూ నాలుగడుగులు నడిచి అటు చూశాడు. తను వెళ్ళదలచుకున్న ఆ ఇల్లూ ---
ఆయన మనసులో చిన్నది స్ఫురించింది చప్పున
అఱ గౌను, గుబ్బచన్నులు
మెఱు గుంగన్నులును గలుగు మెచ్చుల నవలా
కుఱు బోడ వేశ్య రత్నము
బఱినోవగ విడిచి నట్టి బ్రహ్మకు జే జే -
అప్పటి నుండి మనసులో నాటి తెప్పలు పెడ్తోంది ఆ తిప్పులాడి, తనకు తీరిక, రావడానికి కుదురక, వూరక యిన్నాళ్లు గడిచాయి ---- అనుకున్నాడు.
'గురువుగారూ'
జాణతనము కలదు - సవరతనము కలదు, తెలివి కలదు మోవి తీరు కలదు, చేయలంతి తమకు చేకూరె నిప్పుడు - వెళ్ళ వలయు
యిన్నాళ్ళు చేసిన జాగు వోగయి బాగయ్యేలాగు వెళ్ళండి -
'భళా చెన్నమ రాజా!
మాఘ మాసంబు పులి వలె మలయు చుండె
బచ్చడంబేల ఉవిదయే వెచ్చ నిచ్చు
ముదిత చన్నులు పొగలేని మర్మురములు
చలికి నొఱగొయ కేలుందు సైయనంగ!
అన్నాడు కందర్ప దర్పభంగంగా---
ముకుళిత హస్తుడై " కందర్ప శాస్త్రవేదులు ఇంతకు యింతింత చింతయేలా నెఱపన్ - సందేహింపకనడువుడు---" అన్నాడు.
తొందరించిన మదనుని సందడింపుతో సరభసంగానడిచాడు.
ఆ సమయంలో ఆ ఆటవెలది చీపురు తీసుకుని బయటకు వచ్చింది.
ఆరో వెలది - మన్మధుని ఆరో వెలది
పలికితే తేనియలొలికే - చురుకు చూపుల కొమ్మంచులు ఉలికిపడే కులుకుల కలికి.... కానీ ఆ సమయం ఆ వేషం....
రసిక సార్వభౌముని మనస్సు చివుక్కుమంది చప్పున వెనుదిరిగి....
'రా చెన్నా! వెళ్ళిపోదాం---'
'గురువర్యా---' తత్తరపాటుతో అన్నాడు.
'అవును చెన్నా!'
అసలది భోగముదైతే
కుశల ప్రశ్నంబు వేసి కూర్చోమనదా?
కసపూడ్చు కరకు ముండకు
రసి కతయన యేమి తేలియు రా! రా! చెన్నా---' అంటూ విసవిస నడిచాడు.
అవును---
శ్రీనాధుడు శృంగార రస శ్రీనాధుడు---
కవిసార్వభౌముడు రసిక సార్వభౌముడు---
కవిరాజు సరస కవిరాజ---
అంతేకాని రసహీనుడుకాడు.
----*----