Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 21


    పరంధామయ్య వచ్చినరోజునే సాయంకాలం చంద్రయ్య వాళ్ళని పిలిపిద్దాం అన్నాడు కానీ, పరంధామయ్య అందుకు అంగీకరించలేదు. 'మనం ఆడ పెళ్ళి వాళ్ళం. మనమే వెళ్ళి మాట్లాడటం ధర్మం' అన్నాడాయన.
    రామశేషు, చంద్రయ్య, పరంధామయ్య, ఆయన భార్య, జయంతి కలిసి పూలూ పళ్ళూ తీసుకొని బయలుదేరారు.
    పరంధామయ్య వాళ్ళు వస్తున్నారని రామశేషు ముందుగానే చెప్పి వచ్చాడు. తగిన ఏర్పాట్లతో ఉన్న రమణయ్య జయంతి, చంద్రయ్య తన ఇంటికి రావటం తన వ్యక్తిగతమైన విజయంగా భావించాడు. అతని తల త్రిఇగి ఎగిరినట్లయింది.
    "నమస్కారం !"
    వచ్చిన వాళ్ళని గౌరవంగా ఆహ్వానించి కూర్చోపెట్టాడు రమణయ్య.
    అతనికి చంద్రయ్యతో ఎలా పలకరింపులు ప్రారంభించాలో అర్ధం కాలేదు. ఇన్నేళ్ళుగా ముఖముఖాలు కూడా చూచుకోలేదు వాళ్ళు.
    తనేమో. తనపొలమేమో తప్ప మరొక విషయం పట్టని రమణయ్యకు ఊరు నాలుగు చెరుగులూ కూడా సరిగా తెలియవంటే వింత లేదు. అతనవతలి బజారుకు వెళ్ళలేదు. ఇన్నేళ్ళుగా చంద్రయ్య ఇటు రాలేదు. మనసులో ఉన్న భేదభావాలవల్ల ఒకరినొకరు పలుకరించుకునే ప్రసక్తి కూడా లేదు.
    ఇంటికి వచ్చిన పెద్ద మనుషుల్ని పలకరించకపోతే అది తన తప్పు అవుతుందని జయంతిని, "అక్కయ్యా!" అనీ, చంద్రాన్ని తన మామూలు ధోరణిలో "చంద్రం!" అనీ పలుకరించి కాఫీలు అందించాడు రమణయ్య.
    "బావా! నీతో ఒక మాట అనిపించుకుని వెళదామని వచ్చారు వీళ్ళు" అన్నాడు రామశేషు.
    "మంచిది. బావా" అన్నాడు రమణయ్య.
    "అబ్బాయి వచ్చాక అమ్మాయిని చూసి ఖాయం చేద్దాం" అన్నాడు పరంధామయ్య.
    "ఖాయం ఖాయమే! అబ్బాయివచ్చాక ముహుర్తాలు పెట్టుకుందాం" అన్నాడు రమణయ్య.
    నీ అంతటివాడు "నీ తమ్ముడు. వాడి అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిది కదా?" అన్నాడు పరంధామయ్య.
    "రాముని తమ్ములు, ధర్మజుని తమ్ములు అవతార పురుషులు. అయినా ఒకసారి కాకపోతే మరొకసారి అయినా అన్నగారి మాట మీరారేమోకానీ, నా తమ్ముడు నా మాట మీరడు" అన్నాడు రమణయ్య.
    "అంత విశ్వాసం అంధవిశ్వాసమే, రమణయ్యా! ఏమైన కానీ అతను రానీ" అన్నాడు పరంధామయ్య.
    "మీ ఇష్టం. కానీ, మాటంటే మాటే."
    "సరే! జయంతీ, ఆ పళ్ళూ పూలూ ఇవ్వమ్మా" అన్నాడు పరంధామయ్య.
    "సరోజా పళ్ళెం తీసుకురా" అన్నాడు రమణయ్య.
    ఆమె తెచ్చిన స్టీలు పళ్ళెంలో పదహారు ఆపిల్ పళ్ళూ, పదహారు నారింజ పళ్ళూ, పదహారు రవికలూ, పూలూ, పసుపూ, కుంకుమా పెట్టి ఇచ్చింది జయంతి. సరోజ అందుకొని వెళ్ళి అత్తగారి ఫోటోముందు ఉంచింది!
    "ఇక వస్తాం. గోపీ రాగానే కబురు పంపించు" అన్నాడు పరంధామయ్య.
    "కబురెందుకు? నేనే వస్తాను" అన్నాడు రమణయ్య. అందరికీ తాంబూలాలు ఇస్తూ.
    "నీ ఇష్టం" అన్నారాయన.  
    అంతా వెళ్ళిపోయారు.
    "తను పలుకరించినా చంద్రం ఒక్కమాటైనా మాట్లాడలేదు చూడు" అనుకున్నాడు రమణయ్య. అతను మనస్సులో ఇంకా కోపం పోలేదేమో? అనుకున్నాడు మళ్ళీ.
    నెల రోజులు గడిచాయి.
    ప్రీవియస్ పరీక్షలు రాసి వచ్చాడు గోపీ.
    గోపీతో పెళ్ళి విషయం ప్రస్తావించే అవకాశం రాలేదు రమణయ్యకు. గోపీ బాబుతో కాలం గడుపుతున్నాడు, బాబు వయస్సు ఐదేళ్లు లేకపోయినా వాడికి మాటలు బాగా వచ్చాయి. అస్తమానం కబుర్లు చెపుతూ ఉంటాడు.
    బాబుని కూర్చోపెట్టుకుని ఇంగ్లీషు నెలలు పలికిస్తున్నాడు గోపీ. స్వచ్చంగా స్పుటంగా పలికే వీడి తీరు గోపీకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారాల పేర్లు చెప్పాడు. అన్నీ పలుకుతున్నాడు వాడు.
    "డాడీ!"
    "దాదీ"
    "దాదీ కాదురా బాబూ! డాడీ! అంటే తెలుసా? నాన్న అన్నాడు గోపీ.
    "డాడీ! డాడీ" అని పిలిచాడు వాడు, అప్పుడే యింటికి తిరిగి వస్తున్న రమణయ్యని.
    "అన్నయ్యా వీడికి చదువు బాగా వస్తుంది. బాగా చదువుతాడు.
    "అన్నాడు గోపీ. రమణయ్య నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
    "మమ్మీ - అమ్మ"
    "మమ్మీ - అమ్మ"
    పదాలు పలికిస్తున్నాడు గోపీ.
    "బాబు గారూ! అయ్యగారుండారా?" అడిగేడు రాముడు.
    "అన్నయ్యా! రాముడొచ్చాడు" కేకేశాడు గోపీ.
    "వచ్చె! వచ్చె! అని మూతి తుడుచుకుంటూ వచ్చేడు రమణయ్య.
    "బాబుగారూ దండాలండీ! అయ్యగారు పెల్లి యిసయం ఎచ్చరించి రమ్మన్నారండి, ఎల్తున్నాను" అని వెళ్ళిపోయాడు వాడు మరో మాటకి అవకాశం యివ్వకుండా.
    "ఏమిటన్నయ్యా? పెళ్ళి విషయం ఏమిటి?" అడిగాడు గోపీ.
    మంచం ఈడ్చుకుని గోపీ వాలు కుర్చీకి దగ్గరగా లాక్కుని కూర్చుని అన్నాడు రమణయ్య.
    "నీ పెళ్ళి విషయమే గోపీ!"
    ఆశ్చర్యపోయాడు గోపీ! ఇప్పుడు నాకేం పెళ్ళి అన్నయ్యా! ఇంకా సంవత్సరం చదవాలి. ఉద్యోగం రావాలి" అన్నాడు.
    "నేనూ అలాగే అనుకున్నాను గోపీ! కానీ అనుకోకుండా పరిస్థితులు కలిసొచ్చాయి. చంద్రయ్య పిన్నత్తగారి కూతురు హైమావతిని నీకివ్వాలని వచ్చారు. అంద చందాలు గుణగణాలూ చక్కగా ఉన్న ఆ అమ్మాయి నీకు తగిన జోడే అనుకున్నాను. నీవు రాగానే అమ్మాయిని చూసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పాను."
    నిర్ఘాంత పోయాడు గోపీ. అతని కంతా అగమ్యగోచరంగా కనిపించింది.
    "అన్నయ్యా! నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. అంతగా అయితే యింకో సంవత్సరం తర్వాత చూద్దామని చెప్పు" అన్నాడు.
    "వీలుకాదేమో గోపీ! వాళ్ళీ ముహూర్తాల్లోనే పెళ్ళి చేసెయ్యాలనే ఉద్దేశ్యంలో వున్నారు. పైగా పరంధామయ్యగారి ఆరోగ్యం కూడా అట్టే బాగుండటం లేదు. అందుకనే వాళ్ళు త్వరపడుతున్నారు"
    "అంతగా త్వరపడుతూ వుంటే ఇంకో సంబంధం చూసుకోమని చెప్పు" నిశ్చయంగా అన్నాడు గోపీ.
    "వీల్లేదు గోపీ! నేను నీ తరఫున వాళ్ళకి మాట ఇచ్చాను. నా మాట కోసం అయినా నీవు పెళ్ళి చేసుకోవాలి" అన్నాడు రమణయ్య.
    "ఏమిటన్నయ్యా నీ పిచ్చి, ఎవరో వచ్చి బలవంతం పెడితే - వాళ్ళ అవసరం ఉంటే నీవు ఒప్పుకోవటం ఏమిటి? నాకేమీ అర్ధం కావటం లేదు" అన్నాడు గోపీ.
    "గోపీ! నీ కది అర్ధం కాదు. చంద్రయ్య, పరంధామయ్యగార్ల సంబంధం చాలా గొప్పది. మనలాంటివాళ్ళతో వాళ్లు సంబంధానికి అంగీకరించటమే గొప్ప. ఆయనతో సంబంధం అంటే సామాన్యం కాదు" అన్నాడు రమణయ్య.
    "నీవు ఇంకా పూర్వకాలం రోజుల్లో ఉన్నావన్నయ్యా. ఎవరి గొప్పఎవరినేం చేస్తుంది? అయినా మనం యింకా తగ్గుస్థాయిలో ఉన్నామనా నీ అభిప్రాయం? నీ స్థాయి వాళ్ళస్థాయికి ఎదగటంవల్లే వాళ్ళు నీతో వియ్యంమందాలని వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళ గొప్పేం వుంది?" మన తక్కువేం ఉంది? నవ్వుతూ అన్నాడు గోపీ.
    "నీకు అది అర్ధం కాదులే గోపీ! ఏమయినా కానీ నీవీ పెళ్ళికి అంగీకరించాలి" అన్నాడు దృఢ నిశ్చయంతో రమణయ్య.
    వింతగా చూశాడు గోపీ.
    "నన్ను క్షమించన్నయ్య! నేనీ పెళ్ళి చేసుకోలేను. చేసుకోను"
    లేచి బోతున్న తమ్ముడితో "ఏం? ఎందుకు?" అని కఠినంగా అడిగాడు రమణయ్య.
    "నీవు చెప్పక తప్పదంటే చెపుతానన్నయ్యా"
    "చెప్పు. చెప్పి తీరాలి"
    "నేను నా క్లాస్ మేట్ రాధ అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయీ నన్ను ప్రేమించింది. యూనివర్శిటీ ఎడ్యుకేషన్ చదువుకున్న నేను నాతో దరిదాపుగా చదువుకున్న అమ్మాయినే చేసుకోవాలని అనుకుంటూ వుండేవాడిని, అలాగే కుదిరింది.
    ఏదో వానాకాలపు చదువు చదువుకున్న అమ్మాయిని నేను చేసుకోలేను. ఈ విషయంలో నీవు నా మనస్సు ప్రకారం నడుస్తావనే ధైర్యం వల్ల నేను ఆ అమ్మాయికి మాట యిచ్చాను.

 Previous Page Next Page