Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 20


    అన్నయ్యవేపు చూసి నవ్వి వెళ్ళిపోయింది సరోజ.
    "మా సరోజ బంగారం, బావా!"
    "అక్కడికి నేను తక్కువైనట్లు!"
    "ఇదిగో, బావా! భగవంతుడు మీ ఇద్దర్నీ ఏర్చికూర్చాడు. సరోజకు తగినవాడివి నీవు, నీకు తగింది సరోజ." సరేనా!
    "భగవంతుడెప్పుడూ అలాగే జతకూర్చుతాడు. కానీ, ఇంతకీ విషయమేమిటో చెప్పు, చెరుకు నాటించడానికి పొలం పనికొస్తుందో, రాదో చూడటానికి మనుషులు వస్తామన్నారు."
    "బావా! నీకు పొలం పనులు తప్ప మరేమీ పట్టవా? దేశంలో రాజకీయంగా ఎంత మార్పు వస్తూంది! కేంద్రంలో జనతా ప్రభుత్వం వచ్చింది. సినిమాలు చూడవు, ఎంతెంత మంచి సినిమాలు వస్తున్నాయని! పత్రికలు చదవ్వు. నీకేమీ అక్కర్లేదా? ఎప్పుడూ పొలం, పంట, ధాన్యం అమ్ముకోవటం, మళ్ళీ పంట. అంతేనా నీ జీవితం?"
    "నాకిప్పుడేం తక్కువైంది, బావా?" సూటిగా అడిగాడు రమణయ్య.
    "అలా అడిగితే ఏం చెప్పను?" నంగి నంగిగా అన్నాడు రామశేషు ఏదో దాస్తున్నట్లు!
    "బావా! ఎవరి ప్రపంచం వాళ్ళది. మనం అంతా కావలించు కోవాలని అనుకుంటాం కానీ సాధ్యం కాదు. రాజకీయ నాయకులకు వాళ్ళ పదవులూ, అవి నిలుపుకునే మార్గాలూ తప్ప మరొకటి తెలియదు. అవి కాక ఏం మాట్లాడినా అవి ఉపన్యాసం కొరకే! వర్తకులు వాళ్ళ కొనుగోళ్ళు, అమ్మకాలు, లాభాలు తప్ప మరొకటి ఆలోచించరు. ఆఖరికి సినిమాకి వెళ్ళినా పెట్టిన డబ్బుకు తగిన ఆనందం లభించిందా! లేదా అనే చూస్తారు వారు.  
    "సినిమావాళ్ళూ అంతే! వాళ్ళ బుకింగ్స్ ఆదాయాలు, సక్సెస్, ప్రజాదరణ మించి ఆలోచించలేరు. పత్రికల వాళ్ళు అంతే! న్యూస్ దృష్టి తప్ప రసదృష్టి ఉండదు వాళ్ళకు. అంతా పులుముకున్నట్లు మాట్లాడేవారికి ఏదీ తెలియదు. దేనిలోనూ ఇంటరెస్టు ఉండదు.
    రమణయ్య మాటలు విని ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రామశేషు.
    "మళ్ళీ ఆశ్చర్యపడుదువుగానీ, విషయం చెప్పు?" అని అడిగాడు రమణయ్య.
    "గోపీ పెళ్ళి చేస్తావా?"
    "ఏమిటి బావా, ఇదీ? చదువుకుంటున్న కుర్రాడికి పెళ్ళా?"
    "బావా! గోపీకి ఈ సంవత్సరం పెళ్ళిచేయటమే ఉత్తమం, ఇరవై వరకూ ఆగావా - ప్రేమా, గీమా అంటూ మొదలు పెడతారు మన అదుపు తప్పిపోతారు."
    "బావా! మా తమ్ముడు అలాంటివాడు కాదు. వాడికి వాడి చదువు తప్ప మరొక విషయం పట్టదు."
    పకపక నవ్వాడు రామశేషు.
    "మనం మనవాళ్ళని గురించి అలాగే అనుకుంటాం. అందులో తప్పులేదనుకో! కానీ, మన ఎస్టిమేషన్స్ తప్పిపోయినప్పుడే బావ."
    "కానీలే! నీ నమ్మకాన్ని నేనెందుకు వమ్ము చెయ్యాలి కానీ? ఇంతకీ పెళ్ళంటూ చేయదలచుకొంటే ఒక మంచి సంబంధం ఉంది."
    "ఈ ఏడు కాకపోయినా వచ్చే ఏడయినా పెళ్ళి చేయాలికదా? మంచి సంబంధం అనుకుంటే ఒక ఏడు వాళ్ళూ ఆగవచ్చు."
    "ఒక ఏడు నీవూ ముందు చేయవచ్చు."
    "నిజమే!"
    "చంద్రయ్య పంపాడు"
    ఆశ్చర్యపోయాడు రమణయ్య.
    "చంద్రయ్య?" నాతో వియ్యమా? అమ్మాయి ఎవరు?
    "ఎందుకు బావా, అంత ఆశ్చర్యం? ఇప్పుడు చంద్రయ్య నీకంటే మించిన సంసారి కాదు. చెల్లెలు పేర ఉన్న ఆస్తి కూడా సగానికి పైగా అమ్ముడయింది- తెలుసుకదా?"
    రమణయ్య ముఖంలో ఒక విధమైన గర్వంతో కూడిన తృప్తి మెరిసింది.
    చంద్రయ్య మరదలు హైమావతి అని ఒక అమ్మాయి ఉంది. పరంధామయ్యగారి మరదలు కూతురు. పరంధామయ్య కొడుకు సురేష్ తండ్రితో పంచుకుని విడిగా ఉంటున్నాడు. కాచి పోసే దిక్కులేని పరంధామయ్య, తండ్రి చచ్చిన మరదలు కూతురు హైమావతిని చేరదీశాడు.
    ఆ అమ్మాయిని తగిన వాడికిచ్చి చేయాలని ఉంది. చంద్రయ్యతో సంబంధాలు చూడమన్నాడట, చంద్రయ్య దృష్టిలో కంటే జయంతి దృష్టిలో గోపీ ముందుగా మెదిలాడు, దీనికి విశాల మద్దతు కూడా ఉంది.
    నీవు ఊఁ అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. ఈవిషయం కదిల్చి రమ్మని పంపాడు చంద్రయ్య.
    విషయం చెప్పి తాపీగా సిగరెట్ వెలిగించాడు రామశేషు. 'ఇక ఆలోచించుకో అన్నట్టు, రమణయ్య కళ్ళలో గర్వం తొణికిసలాడింది.
    "ఒకానొకనాడు ఆ ఇంట్లో తన తండ్రి పాలేరు. తనూ ఆ ఇంటికి సేవ చేశాడు. ఆ రెండు కారణాలతో కలిసిన రెండు మనసుల్ని క్రూరంగా విడతీసి, హేళన చేశారు... తనని ఇంటినుంచి తరిమివేశారు.
    తను పట్టుదలగా ఇల్లూ పొలమూ, గౌరవమూ సంపాదించుకున్నాడు. తనని హేళనగా చేసిన ఆ కుటుంబంతో సమానంగా తులతూగాలని అహర్నిశలూ శ్రమించాడు .తన కల ఫలించింది. తను వాళ్ళ అంతటి వాడయ్యాడు, ఆ కుటుంబం తను గడపదాటి వచ్చింది మొదలు అమావాశ్య ముఖమైన చంద్రునిలా క్షిణిస్తూ వచ్చింది.
    చివరికి ఈనాడు యే చంద్రయ్య అయితే పిల్లనివ్వడానికి తను యోగ్యుడు కాదు అన్నా ఆ చంద్రయ్య తన తమ్మునికి తన భార్య చెల్లెల్ని ఇస్తానంటున్నాడు.
    ఇది తన విజయం.
    'ఇది కేవలం తనకు, చంద్రయ్యకు మధ్య సాగిన అంతర్యుద్ధంలో తను సాధించిన అఖండ విజయం.
    'ఇది తనకు గర్వకారణం'
    తనలో మెదిలిన ఊహలకు తనలో తనే నవ్వుకున్నాడు రమణయ్య.
    బావ రామశేషు ముఖం చూసి, "బావా! ఇంకో నెల రోజుల్లో నా తమ్ముడు వస్తాడు మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసి. వాడు రాగానే ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళి జరిపిద్దాం. సంబంధం ఖాయం అని చెప్పు. పరంధామయ్యగారికి ఈ వర్తమానం పంపించమని చెప్పు" అన్నాడు సంతోషంగా.
    రమణయ్య ముఖంలో అంతకూ మారుతూ వచ్చిన భావాల్ని చూస్తూ ఆశ్చర్యపోతున్న రామశేషుకు రమణయ్య మాటలు ఆనందాన్ని కలిగించాయి. తను వచ్చినపని సఫలమైందన్న ఆనందంతో బావనుంచి శలవు తీసుకుని వెళ్ళిపోయాడు రామశేషు.
    రామశేషు వెళ్ళగానే గబగబా ఇంట్లోకి నడిచాడు. "రోజా! రోజా! చూశావా- ఎంత మంచి కబురు తెచ్చాడో మీ అన్నయ్య? చంద్రయ్య భార్య జయంతి లేదూ? ఆమె పితనల్లి కూతురు హైమావతిణి మన గోపీకి ఇస్తామని చెప్పిపంపాడు.
    "మన గోపీ అదృష్టవంతుడు, మంచి అమ్మాయి, మంచి సంబంధం. ఇదంతా మా అమ్మ చలవ" అని రామలక్ష్మి పటానికి నమస్కరించాడు.
    ఆయన ఆనందం చూసి! "మీరు మాట ఇచ్చేశారా?! అయినా గోపీని అడిగి ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది" అంది సరోజ.
    "నా తమ్ముడు నా మాట మీరడే!" అన్నాడు గర్వంగా రమణయ్య.
    భార్య ఇచ్చిన మజ్జిగతాగి పొలం పయనమయ్యాడు అతను. పొలానికి వెళ్ళేసరికి పని మనుషులు వచ్చారు. అంతా పరిశీలించి, తూర్పు వైపు నాలుగెకరాలు చెరకు నాటితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడు.
    రమణయ్యకు ఆపొలాన్ని చూడగానే ఒళ్ళు పులకరించింది. ఎవరూ చూడకూండా చేతినిండా మట్టితీసుకుని ఆనందంగా ఎగరేసి, "అమ్మా! భూ మాతా! నా కన్నతల్లిని నేను ఎరగను. మా పినతల్లి ఆదరణ ఎరుగుదును. తల్లివి నీ అనురాగం ఎరుగుదును. నన్ను మనిషిని చేసిన దేవతపు నీవు. నీ అనుగ్రహం వల్లనే మట్టి పిసుక్కునే మనిషినల్లా బంగారుమనిషినయ్యాను. నే పట్టిందల్లా బంగారాన్ని చేసిన దివ్యశక్తివి నీవు" అనుకున్నాడు.


                                    10


    చంద్రయ్య కబురందుకుని పరంధామయ్య, ఆయన భార్యా వచ్చారు. పెళ్ళికొడుకు లేకుండా, అమ్మాయిని చూడకూండా సంబంధం ఎలా ఖాయం చేస్తారు? అని అడిగాడు పరంధామయ్య.
    "అబ్బాయిని నేను చూశాను, అమ్మాయి ఫోటో మీరు తెచ్చారు కదా? రమణకి  చూపుదాం" అన్నాడు చంద్రయ్య.
    "నీ ఇష్టం" అన్నాడు పరంధామయ్య.
    "రమణయ్య ఏదైనా మాట అంటే తప్పేవాడు కాదు, నాన్నా అతను పౌరుషవంతుడు అంది జయంతి.

 Previous Page Next Page