Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 20


    "ఎవరూ.... నన్ను చూడడం ఎందుకు?" అంది వాణి ఆశ్చర్యపడ్తూ.
    "నిన్ను కాకపోతే నన్నా చూస్తారు-కాబోయే కోడల్ని చూడాలని వుంది రమ్మంటారా అంటూ కరణం, ప్రెసిడెంటు, మున్సబు,డాక్టరు భార్య వగైరా అంతా కబురుచేశారు, కాదని ఎలా అంటాను. కాస్త కాఫీ, ఫలహారాలుకూడా తయారుచేయించు-ఆ బీరువాలో ఏదన్నా పట్టుచీర కట్టుకో ఆ వేళకి"అంటూ పురమాయించింది ఆవిడ.
    ఆ మధ్యాహ్నం రెండుగంటలకి కిషోర్ రేణు వచ్చారు- హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దరిని చూసి సంబరపడి పోయింది వాణి- రేణుని కౌగలించుకున్నంతపనిచేసింది. మేడ మీదకి తీసికెళ్ళింది.
    రేణు వినయంగా అనసూయమ్మకి నమస్కారం చేసింది.
    "రా అమ్మా - ఎప్పుడూ కనపడవు- బాగున్నావా- చదువయిపోయిందన్నమాట" అంటూ దగ్గిర కూర్చోపెట్టుకుని ఆప్యాయంగా పల్కరించింది.
    కిషోర్ కున్నంత చనువులేదు రేణుకి అని గ్రహించింది వాణి.
    వాణిని చూడ్డానికి ఊళ్ళో ఆడవాళ్ళు వస్తున్నారన్న సంగతి రేణుకవిని వాణిని పెళ్ళికూతురిలా బలవంతాన ముస్తాబు చేసింది. పద్మావతి బీరువానించి పెద్ద బనారస్ చీర కట్టి మెడలో నగలు అలంకరించి, పూలుకట్టిపెట్టి- అట్టహాసంగా అలంకరించింది. వాణి వద్దంటూ మొహమాటపడ్తూంటే "నీవు పెళ్ళికూతురిగా వుండగా చూడలేం, యిప్పుడు నా ముచ్చట కాదనకండి" అంటూ పట్టుపట్టి అలంకరించింది.
    కిషోర్ ని లాక్కొచ్చి చూపించింది.
    వాణి సిగ్గుతో ముడుచుకుపోయింది- కిషోర్ కళ్ళతో కళ్ళు కలవగానే తడబడిపోయింది.
    "ఏమిటన్నయ్యా అలా వుండిపోయారు యిద్దరూ ఏదో నీవే పెళ్ళికొడుకున్నంత సిగ్గుపడిపోతూంది" అంటూ హాస్యం ఆడింది రేణు.
    ఇద్దరూ సిగ్గుపడ్డారు-కిదోర్ ఏం అనకుండా వెళ్ళి పోయాడు గదిలోంచి.
    అనసూయమ్మ వాణి ముస్తాబుచూసి సంతోషించింది.
    నాల్గు గంటలకి ఊళ్ళో పెద్దకుటుంబాల ఆడవాళ్ళు పదిమంది కట్టకట్టుకుని వచ్చారు. అనసూయమ్మ గదిలో పెద్ద తివాచి పరిచి అందరిని కూర్చోపెట్టారు.
    రేణు వాణిని తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
    కాఫీ-ఫలహారాలు సీతమ్మ తీసికొచ్చి అందించింది అందరికి.
    "మీ కోడలమ్మ చాలాబాగా పాడతారటకదండీ ఒక్క పాట పాడించండి వింటాం" అన్నారంతా.
    అనసూయమ్మ వాణిని పాడమంది.
    "ఒక్కక్షణం వుండండి" అంటూ రేణు బయటికి పరిగెత్తింది.
    రెండు నిమిషాలలో కిషోర్ వీణ తీసుకొచ్చి వాణి ముందు పెట్టాడు. "మీకోసమే ఈ వీణ బాగుచేయించి తీసుకొచ్చాను- ఈరోజు వీణ పాటకచ్చేరి వినిపించండి" అన్నాడు.
    వాణి గాత్రంవల్ల వీణ వాయిద్యం యింపుగా వుందో వీణ కలవడంవల్ల వాణి గాత్రంలో మాధుర్యం నిండిందో చెప్పడం కష్టం అయింది ఆరోజు అందరికి.
    అంతా మైమరిచి వింటున్నారు. కింద కారుశబ్దం ఎవరూ వినలేదు- రాజారావు వచ్చిన వైనం ఎవరికీ తెలీదు-పైనించి పాట వినరావడం విని రాజారావు ఆశ్చర్యంగా మేడఎక్కి వచ్చాడు. యజమానిని చూసి పనివాళ్ళు బిత్తరపోయి "అయ్యగారు" అనుకుంటూ చకచక తప్పుకుని చల్లాచదరయ్యారు. గుమ్మందగ్గిర కలకలం విని గదిలోంచి అందరూ అటు చూశారు- గుమ్మంలో నిలబడి గదిలో అందరిని తీక్షణంగా చూస్తున్న రాజారావుని చూడగానే అందరూ ఒక్క క్షణం తెల్లబోయారు. వాణి చటుక్కున వీణ వదిలేసింది-అనసూయమ్మ గాభరాపడింది- రాజారావు మొహంచిట్లించి గంభీరంగా చూస్తూ గుమ్మంలోంచి తప్పుకున్నాడు.
    "వెళ్ళొస్తాం అండీ" అంటూ ఆడవాళ్ళంతా గబగబ వెళ్ళిపోయారు బయటికి- కిషోర్, రేణు వెళ్ళాలో వద్దో తెలియనట్టు తొట్రుపడ్డారు.
    రాజారావు గంభీరంగా లోపలికి వచ్చి- "ఏమిటిదంతా యీ గానా బజానాలేమిటి, సానికొంపా యిది" అన్నాడు తీక్షణంగా.
    వాణి బిత్తరపోయి చూసింది.
    రాజారావు తీక్షణంగా కిషోర్ వంక రేణువంక చూసి తరువాత తల్లివంక చూశాడు. అడ్డమైన వాళ్ళందరిని యింట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను" అన్నాడు కఠినంగా.
    కిషోర్ చురుక్కున చూశాడు- ఏదో అనాలని నోరు తెరిచే లోపలే అనసూయమ్మ కాస్త తేరుకుని- "ఎవరా అడ్డమైనవాళ్ళు- ఊర్లో ఆడవాళ్ళు వాణిని చూస్తామని వచ్చారు..... కిషోర్, రేణు వాణితో స్నేహం కలిసి యీ పూటే వచ్చారు- వాణి బాగా పాడుతుందని అంతా పాడమంటే పాడింది" అందావిడ కఠినంగా.
    "ఊర్లో వాళ్ళ సంగతి కాదు..." రాజారావు కిషోర్ వంక చూశాడు.
    "అడ్డమైన వాళ్ళంటే మేమనేగా మీ అభిప్రాయం" రేణు కాస్తరోషంగా అంది. "మీ దయవల్ల అంత గతి మాలిలేం మేము-కాస్త మర్యాద యిచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది" అవమానం భరించలేక అంది రేణు.
    "మర్యాద యివ్వవలసింది సరిసమానులకి" వ్యంగ్యంగా అన్నాడు రాజారావు.
    "ఏమున్నా లేకపోయినా పౌరుషానికి లోటులేదు పొలం దున్నుకుంటూ బతికేవాళ్ళకికూడా యింత అహంకారమా - అమ్మా మీకు చాలాసార్లు చెప్పాను, ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పనికిరావని" రాజారావు మొహం ఎర్రబరుచుకుని కఠినంగా అన్నాడు.

 Previous Page Next Page