శారద ఆలోచనలో పడింది ఒక్కక్షణం. విజయ! మాటలతో ఏదో ధైర్యం, తెగింపు కల్గుతూంది. కాని ఈ ధైర్యం చివరి వరకు నిలుస్తుందా లేదా? ఇటు కాకుండా అటుకాకుండా తన బతుకు తయారవుతుందా అన్న సందిగ్దంలో కొట్టుమిట్టాడింది.
ఆమె సంశయం గుర్తించినట్లు విజయ "శారదా! యిప్పుడే అంత దూరం ఆలోచించ నవసరం లేదు. ముందు మాటలతో సవ్యంగా నీ భర్త మారితే సంతోషమే. చూడు శారదా ఈ మగవాళ్ళకి మాత్రం పెళ్ళాం యింట్లో నుంచి లేచిపోయిందంటే పరువు తక్కువ కాదంటావా? భార్య యింట్లోంచి వెళ్ళిపోయిందంటే వాళ్ళుమాత్రం నలుగురిలో తలెత్తుకోగలరా? పైపై బెదిరింపులేకాని నిజంగా భార్య యింట్లోంచి వెళ్ళిపోవడం వాళ్ళకిమాత్రం యిష్టం అనుకుంటున్నావా? శారదా యీనాడు స్త్రీలకి చాలా హక్కులువున్నాయి, భార్యని పొమ్మనడం రమ్మనడంఅంతా వాళ్ళఇష్టమే కాదు. ఒకవేళ యింకా మూర్ఖంగా అతను ప్రవర్తిస్తే, మారకపోతే నీకు అండగా నేనున్నాను. తరువాత కోర్టు వుంది నీకు న్యాయం చేకూర్చడానికి."
శారదకంతా ఏదో అయోమయంగా వుంది. తనిన్నాళ్ళు ఎందుకింత తెలివి తక్కువగా భయపడింది. అవును భార్యని వదలడం అంత సులువా. ఈ మాత్రం ఆలోచన లేకుండా అంతలో ఎందుకు భయపడింది. అమ్మ నాన్న రానీయరని, లోకులు ఏమంటారోనని పిచ్చి భయాలతో నరకంలో మగ్గింది. యిప్పుడు విజయ యిచ్చిన చేయూత ఆసరాతో తన బతుకుని చక్కదిద్దుకోడమో - తెగతెంపులు చేసుకోడమో తన చేతిలో పని!
"ఏమిటంతలా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచనలు నాకు తెలుసు. చూడు శారదా మీవారు ఊరినించి ఎప్పుడు వస్తారు.?"
"మరి రెండు మూడు రోజుల్లో."
"ఆహా. అయితే ఒక పని చెయ్యి. రేపు రెస్టు తీసుకుంటే నీ ఆరోగ్యం చక్కబడుతుంది. ఎల్లుండి బయలుదేరి మీ చెల్లెలు పెళ్ళికివెళ్ళు. చెల్లెలు పెళ్ళికి వెళ్ళ వద్దనే హక్కు ఆయనకిలేదు. ఆయనకిష్టం లేకపోతే మానవచ్చు. నిన్ను వద్దనడం అమానుషం. అంచేత ఇంట్లో ఉత్తరం రాసి పక్కింట్లో తాళం యిచ్చి వెళ్ళు. పెళ్ళయ్యాక తిరిగిరా. అప్పుడు ఆయన గొడవ లేవదీస్తే అలా నిన్ను కట్టడిచేసే అధికారం భర్త అయినంత మాత్రాన లేదని తెలియచెయ్యి - చేయిచేసుకుంటే నీ అస్త్రం వుపయోగించు..."
"ఏమిటి గీతా రహస్యం బోధిస్తున్నావు. ఈ పూటకి భోజనం వద్దా ఏంటి- పోనీ క్యారియర్ పంపమంటావా? యిటు భోజనం అటు గీతోపదేశం పూర్తవుతుంది." శ్రీధర్ గుమ్మందగ్గర నిలబడి వింటూ హాస్యంగా అన్నాడు. "పన్నెండున్నర అయింది తెలుసా."
"ఐడియా. గుడ్ ఐడియా. ప్లీజ్ యింటికెళ్ళి భోజనం పంపించవూ వంటవాడితో. ఎలాగో శారదకి భోజనం పంపాలి, ఆ చేత్తో నాకూ."
"బాగుంది. ఏదో రహస్యంగా అంటే- అయినా ఆ అమ్మాయిని పాపం ఎందుకలా పాడుచేస్తావు. నీవు మొగుడిని వదిలింది చాలక అందరికీ నేర్పిపెడ్తున్నావా. చూడండి శారదగారూ. ఆవిడ మాటలు విని చెడిపోకండి." చమత్కారంగా అన్నాడు శ్రీధర్.
"మొగుడ్ని వదిలి నేను చెడిపోయింది ఏమీ లేదులే, నీవు దొరికావు." విజయ నవ్వుతూ అంది.
"బాగుంది నీ అదృష్టంకొద్ది నాలాంటి వెర్రి వెంగళాయి దొరికాడు. అందరికీ దొరకవద్దూ."
విజయ కళ్ళు శ్రీధర్ వైపు తిరిగాయి. ఆ కళ్ళల్లో ఆరాధన, ప్రేమ శారద దృష్టిని దాటిపోలేదు. "నిజం శ్రీమగవాళ్ళంతా నీలా ఆలోచించితే మా ఆడవాళ్ళకి యిన్ని సమస్యలు మిగిలివుండేవి కావు." ఆమె గొంతు బొంగురుపోయింది...
"శారదా, శ్రీధర్ అన్నది నిజం. భర్తతో తెగతెంపులు చేసుకోడం కష్టంకాదు. ఆ స్త్రీకి మిగిలిన జీవితం మోడైపోకుండా తిరిగి నీరుపోసి చిగురింపచేసే పురుషుడు దొరకడం దుర్లభం-నా పుణ్యంకొద్ది శ్రీధర్ దొరికాడు."
"ఆపాపు. ఈ మాటలు కొన్ని వేలసార్లు విని విని విసుగెత్తి పోయాను. ఇప్పటికే గర్వంతో నా ఛాతి యింత వెడల్పు అయిపోయింది. యింకా పెరిగిందంటే కొత్త షర్టులు కొనుక్కోవాలి! సరే నేను వెళ్ళి భోజనం పంపిస్తాను" అంటూ వెళ్ళాడు శ్రీధర్.
వాళ్ళిద్దరి అన్యోన్యత అనురాగం చూస్తూంటే శారద మనసు సంతృప్తితో నిండిపోయింది. తను కలలుకన్న జీవితం యిది! తనకి దక్కింది ఏమిటి?
"శారదా ఏమిటి ఆలోచిస్తున్నావు. నేను చెప్పినట్లు చెయ్యి."
"భగవంతుని దయవల్ల నీ కాపురం చక్కబడితే మంచిదే. లేదంటే ఏదో ఉద్యోగం చేసుకుందువు కాని. శ్రీధర్ లాంటి సంస్కారి. ఉన్నతుడు మరొక పురుషుడు నీ జీవితంలో తటస్థపడితే నీకు జీవితంలో లోటు వుండదు...."
"డాక్టర్ గారూ, మీగురించి చెపుతున్నానన్నారు, చెప్పండి ప్లీజ్. వినాలని చాలా ఆరాటంగా వుంది, నిజంగా మిమ్మల్ని చూస్తూంటే మీరు జీవితంలో కష్టాలు పడ్డారంటే నమ్మశక్యంకాని విషయంలా అనిపిస్తూంది. చెప్పండి ప్లీజ్." ఆత్రుతగా అంది.