అహోబలపతి గురించే ఆలోచిస్తున్నాడు ఆదిత్య.
అహోబలపతిమీద ఈ రోజు కాకపోయినా, రేపైనా కక్ష తీర్చుకోవడం ఖాయం.
అహోబలపతి వర్గాన్ని ఎదుర్కోవాలంటే...
గుర్రం పెద్దబ్బాయి వర్గానికి తను దగ్గర కావాలి. తనచేత ధరణిని చంపించడానికి అహోబలపతి చూస్తున్నాడని తెలిస్తే...
"మీక్కావాలా... గుర్రం పెద్దబ్బాయికి కావాలా ఇన్ఫర్మేషన్."
ఆ మాటకు తొట్రుపాటుపడ్డాడు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం.
"మీకే ఇన్ ఫర్మేషనూ అఖ్ఖర్లేదు... ఎందుకంటే వాటితో మీకు సంబంధం లేదు. గుర్రం పెద్దబ్బాయికి ఇన్ ఫర్మేషన్ కావాలనుకుంటే... ఆయన్నే నా దగ్గరకు రమ్మనండి... లేదా నన్ను ఆయన దగ్గరకు పంపించండి... దట్సాల్... ఏం జరిగిందో నేను చెప్తాను" తను మనసులోనే సిద్ధం చేసుకున్న ఒక ప్లాన్ ప్రకారం అన్నాడు ఆదిత్య.
ఆ మాటకు కోపమొచ్చింది సుబ్రహ్మణ్యానికి. కళ్ళముందు ఏభై వేలు మెదిలాయి.
"ఇది జైలనుకున్నావా? హోటల్ రూమనుకున్నావా?"
"ఆ విషయం మీకే తెలియాలి" ఆయన చేతిలోంచి సిగరెట్ ను తను తీసుకుంటూ అన్నాడు ఆదిత్య.
"అంటే... నాకు నువ్వు ఇన్ ఫర్మేషన్ చెప్పవన్నమాట"
మాట్లాడలేదు ఆదిత్య.
"నేను చెప్పినట్టు చేస్తే... అంటే... నువ్వు నాకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే నా కోపరేషన్ కూడా నీకుంటుంది" అంతకంటే ఎలా చెప్పాలో అర్ధంకాలేదు సుబ్రహ్మణ్యానికి.
"నేను గుర్రం పెద్దబ్బాయినే కలవాలనుకుంటున్నట్టు ఆయనకు చెప్పండి... కలిసే ఏర్పాటు చేయండి చాలు. మీ పర్పస్ మీకూ నెరవేరుతుంది. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఆదిత్య.
హమ్మ! నీ తెలివితేటలు తగలడా! నువ్వు ఆవలిస్తే పేగులు లెక్కపెడుతున్నావురోయ్... నిన్ను ఇన్ డైరెక్ట్ గా వుపయోగించుకోవాలే తప్ప డైరెక్ట్ గా పెట్టుకోగూడదు.
"ఓ.కె. ఆదిత్యా! ఏ విషయమైనా నీకూ, నాకూ మధ్యనే వుండాలి. హోంమినిస్టర్ నిన్ను కలవడానికొచ్చినా ఈ విషయాలేవీ మాట్లాడకూడదు... గుర్తుంచుకో... ఏ పాయింటయినా ఎక్కడయినా లీకయ్యిందా నువ్వనేవాడి వుండవు... మైండిట్" అని చెప్పి...
వార్డర్ల వైపు తిరిగి....
"వీడ్ని... ఎవరూ చూడకుండా వాడి సెల్ కి పంపించేయండి" అని చెప్పి, ఆ గదిలోంచి వేగంగా వెళ్ళిపోయాడు.
* * * * *
ఫోన్ మోగగానే బాలయాదవ్ తీసి మాట్లాడి... గుర్రం పెద్దబ్బాయి కిచ్చాడు.
"లైన్లో సుబ్రహ్మణ్యం"
"ఏంది సుబ్రహ్మణ్యం? ఏంది కత" అడిగాడు గుర్రం పెద్దబ్బాయి.
మొత్తం విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పి "అది సార్ కత" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"బాగానే ఉంది... పేషెంట్ కోరింది... డాక్టర్ ఇచ్చిందీ ఒకటే మందన్నమాట. అయితే ఓ పనిచెయ్యి."
"చెప్పండి సార్! మీరేం చెప్తే అది చేస్తాను" వినయంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.
సుబ్రహ్మణ్యంలాంటి వాళ్ళని కొన్ని వేలమందిని చూసిన వ్యక్తి గుర్రం పెద్దబ్బాయి. జగజ్జంత్రి.
"నీకిస్తానన్న డబ్బు... ఒక గంటలో నీ ఇంటికందుతుంది... డోన్ట్ వర్రీ! ఖైదీల్ని రాళ్ళు, రప్పలు కొట్టించడానికి తీసికెళ్ళే ప్రోగ్రాం ఉంటుంది గదా? ఆ ప్రోగ్రాం ఒకటి పెట్టించు... దార్లో ఆదిత్య తప్పించుకోవాలి."
సుబ్రహ్మణ్యం భయంగా అటూ ఇటూ చూశాడు. తన గదిలో ఎవరూ లేరు.
"తప్పించుకుంటే ఏం బాగోదు సర్" అన్నాడు మెల్లగా.
"ఒక సీన్ కావాలంటావు. సీన్లకేముంది... ఎన్ని సీన్లయినా పెట్టిద్దాం... ఆదిత్యను ఎలర్ట్ చేయి... సక్రమంగా ఆదిత్యను నాకప్పగించు... పిల్లలు గలవాడివి... ఇంకో యాభైవేలు తీసుకో" అహోబలపతి మీదున్న కక్షకు అంకురార్పణ చేశాడు గుర్రం పెద్దబ్బాయి.
"ఓ.కె. సార్! మీరుండగా నాకేంటి భయం... ప్రిజనర్స్ వాలంటరీ సర్వీస్ ప్రోగ్రామ్ రేపు ఆదివారం పెడతాను సర్."
"నీ ఇష్టం... మేకిట్ ఫర్ ఫెక్ట్... వాళ్ళని ఎక్కడికి తీసికెళ్తావ్?"
రూట్ చెప్పాడు సుబ్రహ్మణ్యం.
"ఎన్ని గంటలకు?" అడిగాడు గుర్రం పెద్దబ్బాయి.
"రిటర్న్ జర్నీలో అయితే... మసక మసక చీకటుంటుంది... సాయంత్రం అయిదున్నర, ఆరుగంటల మధ్య" చెప్పాడు జైలు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం.
"వెరీగుడ్! కేరీఆన్" ఫోన్ పెట్టేశాడు గుర్రం పెద్దబ్బాయి.
రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసి కేలండర్ వైపు చూశాడు సుబ్రహ్మణ్యం.
ఇంకా రెండురోజులు గడిస్తే....
ఆదివారం....
* * * * *
"నిన్నరాత్రి నిన్నెక్కడకు తీసికెళ్ళారు" అడిగాడు ధరణి.
ఖైదీలందరూ గ్రౌండును శుభ్రంచేసే కార్యక్రమంలో వున్నారు.
"మీరు చూశారా?" ఆశ్చర్యంగా తలతిప్పి అడిగాడు ఆదిత్య.
"రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు. మా బేబీయే కల్లోకొచ్చింది... నాతో దానికి ఎటాచ్ మెంట్ ఎక్కువ. సుమబాలకు, మా ప్రెటీకీ దూరంగా వుండడం యిదే ప్రధమం. ఏదో తెలీని డిస్ట్రబెన్స్ మనసులో" నెమ్మదిగా అన్నాడు ధరణి.
"ప్రెటీ అంటే మీ బేబీయా?"
"అవును"
"మరి సుమబాల?"
"వైఫ్... నా భార్య... వెరీ లైవ్ లీ అండ్ కైండ్ లేడీ" కనురెప్పలు మూసుకుని అన్నాడు ధరణి.
ఆ మాటల ద్వారా ధరణి మనసును అంచనా వేయగలుగుతున్నాడు ఆదిత్య.
"హి ఈజ్ఫర్ ఫెక్ట్ జంటిల్ మాన్ అండ్ గుడ్ ఎట్ హార్ట్..." ఆదిత్య మనసులో ఏర్పడిన భావమది.
"ఇంకెన్నాళ్ళు... అతి త్వరలో మీరు మీ వాళ్ళ దగ్గరుంటారు"
ఆదిత్య మాటకు ధరణి కనురెప్పలు విప్పాడు.
"బహుశా ప్రెటీ నా మీద బెంగపెట్టుకుని వుంటుంది. నీకు తెలీదు ఆదిత్యా! అది అచ్చం మా మదర్ లా వుంటుంది. ఈ దిక్కుమాలిన బిజినెస్ గొడవల్లో అనవసరంగా యిరుక్కున్నాను. లేకపోతే..." ఏదో మనసులోనే గూడుకట్టుకున్న బాధ... ఆకృతిలేని ఆవేదన... భాషకందని అంతర్మధనం.