Previous Page Next Page 
మాయ జలతారు పేజి 20


    పోచయ్య మాట్లాళ్ళేదు. అతని గుండెల్లో గుబులు ప్రవేశించింది. ఎందుకు వచ్చానా బొంబాయికి అనుకున్నాడు. గుండెనిండా చీకటి అలముకుంది. సముద్రంలో ఈదగలడా తాను? అక్కడే మునిగి చస్తాడేమో! తాను చచ్చిపోతే లచ్చి? ఛా - లచ్చిని వదిలి వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. తగిన శాస్తి జరుగుతుందని అనుకున్నాడు. కళ్ళు మూసుకొని తనకు జ్ఞాపకం ఉన్న దేవుళ్ళందరికి మొక్కాడు.
    సర్చిలైటు వెలుగు పడవమీద పడింది. "వంగి కూర్చోండి పడవలోకి" అని అరచాడు. అరబ్బు నలుగురూ సిగరెట్లు పారేసి పడవలోకి నక్కి కూర్చున్నారు. టార్చ్ లైటు వర్తులాకారంలో తిరుగుతూంది. మోటారు బోటు ధ్వని వినిపిస్తూంది. బోటు దగ్గరికి వస్తూంది. పడవ వేగంగా ఒడ్డుకు పరుగెడుతూంది. మోటారు బోటు దగ్గరికి వస్తూంది. సర్చ్ లైటు వెలుగు దగ్గర్నుంచి పడుతూంది. సర్చ్ లైటు పడవను దాటగానే "దూకండి" అన్నాడు అరబ్బు సరంగు ముగ్గురూ అమాంతంగా దూకారు. వెనకా ముందాదాడు పోచయ్య. మళ్ళీ లైటు వెలుగు పడింది. లైటు వెలుగు దూరం కాగానే పడవలోంచి సముద్రంలోకి నెట్టాడు సరంగు పోచయ్యను సముద్రంలో పడ్డాడు పోచయ్య ఈదుతున్నాడు. మిగతా ముగ్గురూ అట్టే దూరం పోలేదు. సర్చిలైటు వారిమీద పడింది 'మునగండి' అనే కేక వినబడి మునిగాడు పోచయ్య. జీవన్మరణ సమస్య. ఈదుతున్నాడు పోచయ్య. భయం అతణ్ణి నీరసింపజేస్తూంది. ప్రస్తుతానికి బతకాలి ఆ పట్టుదలతో ఈదుతున్నాడు. తుపాకి పేలిన చప్పుడైంది లైటు వారిమీద పడింది. మునిగాడు పోచయ్య తేలి చూచేవరకు సముద్రంలో నీరు ఎర్రగా కనిపించింది రక్తం. ఎవరికి గాయం తగిలింది తెలియదు. పొడుగువాడు చారల బ్లూషర్టువాడిని లాక్కొని పోతున్నాడు. మోటారు బోటు పడవవైపు సాగిపోయింది. ఒడ్డుకు చేరేవరకు చారల బ్లూషర్టువానికి స్పృహ లేదు. పిక్కలోంచి గుండు దూసుకుపోయింది. రక్తం ఇంకా కారుతూంది. పొడుగువాడు ఎత్తుకొని ఒడ్డుకు చేర్చాడు చారల బ్లూషర్టువాణ్ణి.
    "డాక్టర్ డాక్టర్" అని కేక లేసేడు పొట్టివాడు. పోచయ్య కాళ్లు వణికాయి. రక్తం, గాయం చూచి భరించలేకపోయాడు పరిగెత్తాడు, "డాక్టర్ డాక్టర్" అంటూ "సంచి సంచీ" అని అరిచే పొట్టివాని మాటలు సైతంవినిపించలేదతనికి. గాయపడినవాణ్ణి రక్షించాలి, అదొక్కటే అతనికి తోచింది ఎటు పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు? తెలియదు అప్పటికి తెల్లవారుజామైంది, రోడ్ల మీద పడి పరిగెత్తుతున్నాడు పోలీసువాడు చూచాడు, "ఏయ్ ఆగు ఆగు" అని అరచాడు. అది వినిపించనేలేదు పోచయ్యకు. పారిపోతున్నాడనుకున్నాడు. పోలీసువాడు పోలీసువాడూ పరిగెత్తాడు. అందేట్టు లేడు పోచయ్య. విజిల్ ఊదాడు విజిల్ మీద విజిల్ ముందు నుంచీ వెనుకనుంచీ వచ్చి పట్టేశారు పోలీసులు తడినెత్తి, తడిబట్టలు, వీపున తోలు సంచి పోలీసులు పట్టుకున్న తర్వాత గాని ఈ లోకంలోకి రాలేదు పోచయ్య వగరుస్తూ "డాక్టర్ డాక్టర్" అంటున్నాడు.
    జనం చాలామంది కూడారు. పోలీసు వ్యాను వచ్చింది. అప్పుడు గ్రహించాడు తాను చేసిన తప్పు. అప్పటికీ "డాక్టర్ను పంపించండి" అనేమాట నోటిదాకా వచ్చి దిగమింగాడు.
    ఆ రోజంతా పోలీసు లాకప్ లో ఉన్నాడు. పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా చెప్పలేదు. అయినా, అతనికి తెలిసింది మాత్రం ఏమిటి? ఏం చెపుతాడు?
    తెల్లవారి కోర్టుకు తీసికెళ్ళారు పోలీసులు.
    అక్కడ కనిపించాడు బైరాగి. అతణ్ణి చూడగానే పీకనొక్కేయాలనిపించింది. పోచయ్యకు కాళ్ళకూ చేతులకూ బేడీలున్నాయి. ఏం చేయగలడు? కోపం దిగమ్రింగాడు. అతని ఉద్రేకాన్ని చూచి చిరునవ్వు నవ్వాడు బైరాగి. బోనెక్కించారు పోచయ్యను. తోలు సంచీ మేజిస్ట్రేటు ముందుంచారు పోలీసులు. విప్పమన్నాడు న్యాయాధిపుడు. కొన్ని బంగారు కణికలు, కొన్ని గడియారాలు, కొన్ని పెన్నులూ ఉన్నాయి అందులో.
    "ఈ సంచీ ఎవరిది?" అడిగాడు మేజిస్ట్రేటు.
    "ఎరికలే" అన్నాడు పోచయ్య. ఎన్ని ప్రశ్నలడిగినా అన్నిటికీ తనకు తెలియదన్నట్లుగానే జవాబు చెబుతున్నాడు. చెప్పేద్దామని నోటిదాకా వచ్చినా బైరాగి కళ్ళతో ఉరుముతున్నాడు. "జేలు నుంచి వచ్చాక ప్రాణాల్తో పోలేవు" అనే మాటలు గుర్తుకు వస్తున్నాయి.
    ఒకసారి బైరాగిని చూపించి వీడే అన్నింటికీ కారణం అని చెప్పేద్దామన్నంత వరకూ వచ్చాడు. బైరాగి కళ్ళు నిప్పులు కురిశాయి. భరించలేకపోయాడు. మళ్ళీ మౌనం దాల్చాడు.
    "పది నెలలు కఠిన శిక్ష" అన్నాడు న్యాయాధిపతి.
    గుండెలో పిడుగులు కురిశాయి పోచయ్యకు.
    పోలీసు వ్యానులో ఎక్కించుకుపోయారు పోచయ్యను.
    చూపందినంత దూరం చూస్తూ నుంచున్నాడు బైరాగి.

                                                 * * * *

                                                     9

    రాజారావుకు స్పృహవచ్చిన తరువాత లక్ష్మి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. జనరల్ వార్డులోని పరిస్థితులు చూచాడు. అక్కడ రోగితోనే రోగం పోతుందని గ్రహించాడు. లక్ష్మిని మృత్యువాత పడనీయరాదనుకున్నాడు. తన రూముకు మార్పించుకున్నాడు. డబ్బు విషయంలో వెనకా ముందూ చూడలేదు. డాక్టర్లకు నర్సులకు విపరీతం అయిన శ్రద్ధ వచ్చింది. ఎక్సరేలు తీశారు. పరీక్షలన్నీ చేశారు. తేలిందల్లా ఆమె మెదడుకు బలమైన గాయం తగిలిందని అందుకు చికిత్స ఎవరికీ తోచలేదు. అయినా, రోమ రోమానికి సూదులు గుచ్చారు. గ్లూకోజ్ మీద బ్రతికిస్తున్నారు. లక్ష్మి పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. శ్వాస ఆడటం తప్ప ప్రాణం ఉన్న లక్షణాలేమీ కనిపించడం లేదు. అయినా, డాక్టర్లు నిరాశ చెందలేదు. దేశం నలుమూలల ఉన్న స్పెషలిస్టులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అవసరమైతే విదేశాలకు కూడా పంపడానికి సిద్ధపడ్డాడు రాజారావు.
    రాజారావు ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. అతడు మామూలు మనిషి అయిపోయాడు. అయినా ఆస్పత్రి వదల్లేదు. రేయింబవళ్ళు లక్ష్మినే కనిపెట్టుకొని ఉంటున్నాడు. డాక్టర్లను పిలిపించడం, పరీక్షలు చేయించడం, మందులు రాయించడం, తెప్పించడం, క్రమం తప్పకుండా వాటిని వాడించడం _ ఇదే సరిపోతూందతనికి. పార్వతి కూడా ప్రతిరోజూ వచ్చి పోతూంది. లక్ష్మి విషయంలో ఆమెకూ సానుభూతి కలిగింది, తమ పనిమీద ఉన్నప్పుడు పడిపోయిన పిల్ల అని.
    రాజారావు వాలు కుర్చీలో కూర్చొని వార్తాపత్రిక చూస్తున్నాడు. డెయిజీ గదిలోకి వచ్చింది కూడా గమనించలేదు. డెయిజీ నోటితో పత్రిక మడిచింది 'హలో' అన్నాడు పేలవంగా.
    డెయిజీ కుర్చీలో కూర్చుంది. ఇద్దరూ ముఖాముఖీ కూర్చున్నారు_ఎవరూ మాట్లాడలేదు. గడియారపు టకటక తప్ప ఏమీ వినిపించడంలేదు.
    "మిసెస్ రాజారావు వెళ్ళిపోయిందా?"
    "ఆ"
    "వారం రోజులనుంచీ ఇంటికి వెళ్ళడంలేదు" నేలను చూస్తూ అన్నది డెయిజీ. ఆమె గుండె దడదడ లాడింది. ఎంతో మధనపడి ఒక నిర్ణయం తీసుకొనే రాజారావు దగ్గరకి వచ్చింది.
    రాజారావు సిగరెట్టు వెలిగించాడు "ఎంగేజ్ మెంట్స్ ఎక్కువైనాయా?" వెటకారంగా అడిగాడు.
    డెయిజీ తలెత్తి రాజారావును చూచింది. లిప్తపాటు గుండె ఆగింది. ఆమె కళ్ళల్లో నీరు నిండింది. కన్నీటిచుక్క చెక్కిలిమీదినుండి జారింది. రాజారావు పేపరు విప్పాడు ముఖం దాచుకున్నాడు.

 Previous Page Next Page