Previous Page Next Page 
శరతల్పం పేజి 20


    జాగ్రత్తగా విన్నారు నారాయణస్వామి.
    అవును మనిషి మూలగే!
    వెదికారు చీకటి స్పష్టంగా ఏమీ కనిపించలేదు.
    "లచ్చమ్మా! లాంతరు పట్టుకరా! ఇక్కడేమో మూలుగు వినపడ్తున్నది" కేక వేశారు నారాయణస్వామి.
    లచ్చమ్మ క్షణంలో లాంతరుతో ప్రత్యక్షం అయింది. మూలుగు వచ్చినవైపు వెళ్ళి చూచారు.
    గురువయ్యే!
    స్పృహ లేకుండా మట్టిలో పడి ఉన్నాడు! వంటి నిండా దెబ్బలు!
    లచ్చమ్మ చూచింది. లాంతరు పడేసింది. గురువయ్యమీద పడి 'హోరు' మంది.
    నారాయణస్వామి నుంచొని చూశారు__దూరంగా.
    ఎలాంటివాడు ఎలా అయినాడు? ఏమయింది గురువయ్యకు? ఎందుకిలా అయినాడు? అర్ధంకాని ప్రశ్నలు మెదడును బాధించసాగేయి. గురువయ్య తప్ప వారికి అన్యం కనిపించలేదు.
    లాంతరు బోర్లాపడి భగ్గుభగ్గు మని, మసిపట్టి, అదిరిపోయింది! లాంతర్లోని నూనంతా ఒలికిపోయింది. అది అక్కడున్న ఇద్దర్లో ఎవరూ గమనించలేదు.
    లచ్చమ్మ గురువయ్య మీద పడి ఏడుస్తూంది.
    నారాయణస్వామి చూస్తున్నారు___దూరంగా.
    ఏం చేయాలో వారికి తోచలేదు.
    గురువయ్య కెలా ఉందో తెలియదు.
    లచ్చమ్మ గుండెలవిసేట్టు ఏడుస్తూంది. తాను దూరంగా నుంచొని చూస్తున్నాడు. గుండె లవుస్తున్నాయి! కల్లోనిండుతున్నాయి__కాని కదలరు!
    తాను బ్రాహ్మడు! అతను అంటరానివాడు!
    ఎదుట బాధ! దుఃఖం! వ్యధ!
    ఏం చేయాలి తాను? ఏమిటీ చేయడం? ఏం చేయాలి తాను? ఏమిటీ చేయడం?
    తటాలున లాంతరు వైపు చూచారు. అది అదిరిపోయి మట్టిలో పడి ఉంది.
    "భగవాన్! పరీక్షిస్తున్నావా?" అని ముందడుగు వేసి లచ్చమ్మ చేతులు పట్టుకొని ఆమెను ఓదార్చారు.
    చుక్కల వెలుగు మాత్రం వుంది.
    గురువయ్య ముఖం స్పష్టంగా కనిపిస్తూంది.
    "గురువయ్యా!" కండువాతో గురువయ్య ముఖంమీది మట్టి తుడుస్తూ పిలిచారు నారాయణస్వామి.
    గురువయ్య పెదవులు కదిలాయి.
    పెద్ద మూలుగు వచ్చింది! కళ్ళు తెరిచాడు!
    "ధూప, నీలు" అన్నాడు.
    అక్కడ నీళ్ళెక్కడున్నాయి! లచ్చమ్మ పరిగెత్తింది. కాలువలో దోసిలతో నీళ్ళు తెచ్చింది. అక్కడికి వచ్చేవరకు మిగిలినవి కొన్నే అయినా పెదవులు తడప డానికీ, నాలుక దాటడానికి సరిపోయాయి.
    గురువయ్య చూపుకు స్పష్టత వస్తూంది.
    "ఎవరు - అయ్యగారా - అయ్యగారా-మీ రెందుకొచ్చిన్రు - నే నెక్కడున్న?" గురువయ్య గొంతు భారంతో తగ్గిపోయింది.
    లచ్చమ్మ కళ్ళు నిండాయి-అరచేత్తో తుడుచుకుంది.
    "అవును. నేనే, లచ్చమ్మగూడా వచ్చింది. తాటివనంలో ఉన్నాం-లే ఇంటికి పోదం."
    గురువయ్య కనుకొలకుల్లో నిలువలేని కన్నీరు కణతమీంచి చెవి దాకా పారింది.
    "అయ్యగారూ! మీ రెందుకొచ్చిన్రు" అన్నాడు చేతులు జోడించి దెబ్బల బాధకన్నా సిగ్గు గురువయ్యను ఎక్కువగా క్రుంగదీస్తూంది.
    "లే. ఇంటికి పోదం" అని వీపు కిందికి చేయి పోనిచ్చి గురువయ్యను లేపారు నారాయణస్వామి. లేచి కూర్చున్నాడు గురువయ్య. చంకల కింద చేతులువేసి చెరొకవైపు పట్టుకొని గురువయ్యను లేపారు. లేచి నుంచున్నాడు గురువయ్య. తన భుజం మీదికి చెయ్యి లాక్కొని "నడువ లేస్తవా?" అడిగారు నారాయణస్వామి.
    గురువయ్య మాట్లాడలేదు-కాని ఒక అడుగు వేశాడు-లచ్చమ్మ భుజంమీద మరొక చేయివేసి, నడుస్తూనే లాంత రందుకుంది లచ్చమ్మ.
    మెల్లగా అడుగులు వేస్తూ ఊరివైపు సాగారు.
    ఊళ్ళో కుక్కలు మొరుగుతున్నాయి!
    గుమ్మంలో నుంచున్న నాంచారమ్మ అలికిడివిని ఎదురుగా ఉరికింది. గురువయ్యను చూచింది.
    "ఏమైంది? ఎట్లున్నడు? ఎక్కడ దొరికిండు?"
    గురువయ్య తల వంచుకున్నాడు.
    మిగతావారు మాట్లాడలేదు.
    గురువయ్య ఇంటివైపు సాగిపోయారు.
    నాంచారమ్మ గుమ్మంలో నిలిచిపోయింది.
    నారాయణస్వామి తిరిగివచ్చి బావి దగ్గరకు చేరాడు____దొడ్డి గుమ్మం నుంచి. నాంచారమ్మ నీళ్ళుతోడి బొక్కెనతో నారాయణస్వామిమీద పోసింది.
    
                                      11
    
    పిచ్చమ్మ వ్యవహారం కొంతకాలం సాఫీగానే సాగింది. భర్త గుర్తించలేదు. బుచ్చమ్మ కనిపెట్టలేదు. ఉభయుల కళ్ళుమూసి ఉదయం వేపవనంలోనూ, రాత్రి తాటివనంలోనూ గడిపింది గురువయ్యతో. ఒకనాడు బుచ్చమ్మకు అనుమానం కలిగింది. పగలు ఇంటికి వచ్చేవరకు పిచ్చమ్మ లేదు. తరవాత వచ్చి కోమటింటికి వెళ్ళొచ్చానంది. బుచ్చమ్మ తెలివైంది. పిచ్చమ్మ కళ్ళల్లో కాంతి చూచింది. కనిపెట్టింది. కనిపెట్టిందంటే గురువయ్య అని గ్రహించిందని కాదు-కోడలు అడ్డదారి తొక్కుతూందని! ఆ రాత్రి కనిపెట్టింది. పిచ్చమ్మను కదలనివ్వలేదు. కొడుకునూ, కోడల్నూ కూర్చుండబెట్టుకొని ముచ్చట సాగించింది. పిచ్చమ్మకు ,ముచ్చట గిట్టడంలేదు. ముండ్లమీదివలె కూర్చుంది. ఆమె కళ్ళల్లో తాటివనం, గురువయ్య కనిపిస్తున్నారు. ఏదో పనిమీద అటూ ఇటూ తిరిగింది. కూర్చోలేక పోయింది. నుంచోలేకపోయింది. పడుకుంటే నిద్రపట్టలేదు.
    ఆ రాత్రి తాటివనం బోసివోయింది.
    గురువయ్య వంటరిగా బోలెడు తంగేడు పూలు కోసిపోశాడు.
    ఉదయం కడవ తీసుకొని ఏటికి బయల్దేరింది. గురువయ్య ఎప్పుడొచ్చాడో ఉన్నాడు. రాత్రి రానందుకు కోపగించలే దతను. దొరికిన అవకాశాన్ని ప్రశ్నల తోనూ, పంతాలతోనూ వదులుకోలేదతను. వచ్చింది పిచ్చమ్మ. అతనికి కావలసిందదే! అనుభవించాడు.
    రాత్రికి రాలేనేమో అని చెప్పి వెళ్ళిపోయింది పిచ్చమ్మ.
    రాత్రి కాకుండా ఉండాలనుకున్నాడు గురువయ్య.
    తెల్లవారి కడవ పట్టుకొని ఏటికి బయల్దేరింది పిచ్చమ్మ. వారించింది బుచ్చమ్మ. బావికి వెళ్ళి రమ్మంది. పిచ్చమ్మ బావికే వెళ్ళి వచ్చింది. కాని మనసు మనసులో లేదు.
    వేపవనం__వేచి వున్న గురువయ్య.
    ఆ దృశ్యమే చేరింది మనసులో. వంట చెడగొట్టింది. మొగుడు తినేశాడు. అత్త పట్టేసింది. వళ్ళు బాగుండలేదని బొంకింది. కణతలకు శొంఠిగంధం వేసింది బుచ్చమ్మ. గంధానికి తిరిగే రోగం కాదది.
    ఆ సాయంకాలం వనంలో కల్లు పోసేప్పుడు చూచాడు గురువయ్య పిచ్చమ్మను. కళ్ళు నిండి ఉన్నాయి. గురువయ్య గుండె పొంగుతున్నది.
    "ఏంది కత?" గురువయ్య.
    "అత్త కనిపెట్టింది."    
    "ఎట్ల మరి?"
    "ఎట్లనన్న వస్త. వనంలనే వుండు."

 Previous Page Next Page