కొంచెం వుత్సాహం యిస్తే చాలు-
ఆ తర్వాత యితను అందుకోబోయే ఎత్తులు యిప్పుడే ఎవరు ఊహించగలరు?
ఇంతలో భోజనాలకి పిలుపు వచ్చింది.
అందరూ భోజనాలకి కూర్చున్నారు.
భోజనాలకి ముందు కాళ్ళు కడుక్కోవడం అనేది కొత్తగా తోచింది రాజాకి. అయినా అందరూ అలా చేస్తున్నారు కాబట్టి తను కూడా చెయ్యక తప్పలేదు.
కంచంలో వున్న అధరువులని చూడగానే రాజాకి నోరు చప్పబడి పోయినట్లయింది.
ఇట్లాంటి గడ్డి తను ఎప్పుడూ తినడు. ఎంత ఆకలిగా వున్నా కూడా.
కంచంలో పెసర పచ్చడి, పొట్లకాయ కూర, అన్నం వడ్డించి వున్నాయి. పక్కనే గిన్నెలో చారు పెట్టి వుంది.
నిన్న ఒక పెద్దమనిషి పర్సు కొట్టేసి చైనీస్ హోటల్లో తను జల్సా చెయ్యడం గుర్తొచ్చింది రాజాకి.
అది ఒక ఫుడ్ ఫెస్టివల్!
ఇదీ....
ఇది కరువు బాధితులకు పెట్టే తిండి పొట్లాలలోని అన్నంలాగుంది.
ఈ గడ్డి తింటూ తను ఇక్కడే వుంటే మూడురోజుల్లో మంచినీళ్ళడక్కుండా చచ్చూరుకుంటాడు.
భోజనాలయ్యాక కృష్ణాజీ అన్నాడు.
"మాస్టారూ! నేను శెలవు తీసుకుంటాను. మళ్ళీ పొద్దున కనబడతాను."
"మంచిది" అన్నాడు ఆనందరావుగారు.
రాజాని పక్కకి పిలిచి, జాగ్రత్తలు చెప్పి, వెళ్ళిపోయాడు కృష్ణాజీ.
రాజాని పక్కన కూర్చోబెట్టుకుని, ఇంకాసేపు అవీ ఇవీ ప్రశ్నలు అడిగాడు ఆనందరావు.
తర్వాత అన్నాడు రాజా.
"ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తాను'
"ఎందుకు?"
చిటికెన వేలు చూపించాడు రాజా.
"లోపల బాత్ రూం ఉంది"
"కొత్త ప్లేస్ లో నాకు రాదు"
నవ్వాడు ఆనందరావు.
"పారిపోయే ప్రయత్నం చెయ్యకు! కృష్ణాజీ ఇక్కడంతా కాపలాపెట్టే ఉంటాడు.
"అంత అవసరం వస్తే వెళ్ళిపోతా. పారిపోయే ప్రశ్నేలేదు" అని బయటికి వెళ్ళాడు రాజా.
సందు చివర్లో వుంది పాన్ షాపు.
అక్కడికెళ్ళి, సిగరెట్ అంటించాడు రాజా.
సిగరెట్ కాలుస్తూ పరిశీలనగా అటూ ఇటూ చూశాడు.
అక్కడికి దగ్గరలోనే కనబడ్డాడు ఒక మనిషి. బలిష్టంగా ఉన్నాడు.
అతన్ని చూడగానే గుర్తు పట్టేశాడు రాజా.
అతను గోవిందరాజులు. టూ టవున్ పోలీసుస్టేషను కానిస్టేబులు.
అనుమానం లేదు. టైగర్ కృష్ణాజీ తన మీద కాపలా దిట్టంగానే ఉంచాడు.
నోరు సిగరెట్ వాసన రాకుండా పాన్ వేసుకుని, నమిలి ఉమ్మేసి ఆనందరావు ఇంటికి తిరిగివచ్చాడు రాజా.
అతన్ని చూసీ చూడనట్లు వూరుకున్నాడు ఆనందరావు.
కాసేపటి తర్వాత అన్నాడు.
'బయట నీ పడక! పడుకుని పొద్దున్నే లే! అర్థమయ్యిందా?"
తను ఇంకొకళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడమే గానీ తను ఇంకొకళ్ళు చెప్పిన మాట వినడం అలవాటు లేదు రాజాకి. చిరాకు ఆపుకుంటూ చూశాడు.
తర్వాత ఏమనుకున్నాడోగానీ లేచి వెళ్ళి, మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు తన్నాడు.
పడుకున్న అతనికి వెంటనే నిద్ర పట్టలేదు - గతం గుర్తొచ్చింది.
అయిదో ఏట తను ఇల్లొదిలి పారిపోయి వచ్చాడు.
ఆ రోజు నుంచి తన చిన్న పొట్టని తనే పోషించుకోవడానికిగానూ ఒక బూట్ పాలిష్ కుర్రాడి దగ్గర అసిస్టెంటుగా చేరాడు. వాడి పేరు గురు. వాడికీ ఏడేళ్ళకంటే ఎక్కువ వయసు లేదు. వాడు సెంటర్లో నడుస్తున్న పాదాల మీదే దృష్టి కేంద్రీకరించి, "గిరాకీ"లని పట్టేస్తూ వుండేవాడు.
మనిషి తన ముందు ఆగగానే, ఒక అట్టని ముందుకు తోసేవాడు తను. గురుగాడు పుసులు పట్టిన కళ్ళతో బూటుని చూస్తూ బ్రష్ చేసి తనకి అందించేవాడు. తను వాటికి నీళ్ళు కలిపిన రంగు పట్టించేవాడు. రంగు ఆరగానే గురూగాడు పాలిష్ పట్టించేవాడు. బ్రష్ చేసేవాడు. చివరగా తను బూటుని తన గుండెకి ఆనించుకుని ఒక బట్టతో మెరుపు వచ్చేలా తుడిచేవాడు.
గురూగాడికి రూపాయి వస్తే తనకు పావలా వచ్చేది.
అదీ లెఖ్క!
ఒక సంవత్సరం అలా అప్రెంటిస్ గా పని చేశాక - తనే బ్రష్షూ, పాలిష్ డబ్బాలూ, రంగు సీసాలూ కొని సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాడు. అవును మరి! ఎన్నాళ్ళని ఇంకొకడి మోచేతికింద నీళ్ళు తాగుతాడు తనూ? తను గురూగాడితో బాటు, వాడి పక్కనే తన సామాగ్రి అంతా ముందు పెట్టుకుని, 'పాలిష్, పాలిష్!" అని అరుస్తూ ఉండేవాడు. తన మొహం చూసో, తమ మాటలకి ఇంప్రెస్ అయ్యోగానీ పుసులు కట్టిన కళ్ళతో వుండే గురుగాడి దగ్గరికంటే తన దగ్గరికే గిరాకీలు ఎక్కువమంది వస్తూ ఉండేవాళ్ళు.