లెటర్ చదవడం పూర్తయింది.
వీడెవడో తెలుగు కూడా రాయడం రాదు. ఈ దాశరధరామ్ కు బుద్ధి కూడా లేదు. చిరంజీవి అని ప్రారంభించి నమస్కారాలు పెట్టాడు. చిరంజీవిని ఆశీర్వదించాలి. అందులో వానలు కురిశాయా అని రాశాడు. వీడికి వానలు కురిస్తే ఏం, కురవకపోతే ఏం? చెల్లెలు ఆరోగ్యం జాగ్రత్తట! వెంకట్రామయ్యకు తెలుసు ఆ విషయం. ఆమె ఆరోగ్యాన్ని వాడు చూసుకుంటాడు. సో - ఈ లెటరు అనవసరం అనుకుంటూ ఆ కార్డుని చించేశాడు వేలు.
అతను ఆ ప్రాంతానికి ఉత్తరాలు బట్వాడా చేసే పోస్ట్ మ్యాన్! పరమ సోమరి. రోజూ అంతే! ఆ ప్రాంతానికి వచ్చే ముప్పాతిక భాగం ఉత్తారాల్ని చించేస్తాడు. ముందు తనే ఉత్తరాలను చదివి మరీ ముఖ్యమనుకుంటే యిస్తాడు. మిగిలినవాటిని ముక్కల కింద చేసి, మురికి కాలవలో పడేస్తాడు.
అయితే అతనికి ఓ సుగుణముంది. ప్రేమికుల ఉత్తరాలని మాత్రం చించడు. ప్రేమికులంటే సాఫ్ట్ కార్నర్ వుంది. ఫ్రమ్ అడ్రస్ లేని ఉత్తరాలన్నీ ప్రేమికులు రాసుకున్నవనీ ఓ గుడ్డి గుర్తు అతనికి. వాటిని మాత్రం భద్రంగా బట్వాడా చేస్తాడు.
ఆఫీసర్లకు తప్ప మిగిలిన పోస్ట్ మ్యాన్ లకంతా వేలు విషయం తెలుసు. అలా ఉత్తరాలను చదివి బట్వాడా చేయటం మంచి పధ్ధతి కాదని ఎవరయినా తోటి ఉద్యోగి అంటే వుపన్యాసం మొదలుపెడతాడు.
"మీలాగా గాడిద చాకిరి నేను చేయలేను. బాలాజీ కాలనీ, గిరిపురంకాలనీ, చౌదురి కాలనీకంతా ఒక్క పోస్ట్ మ్యాన్ ని వేస్తే వాడు తన ఉద్యోగ ధర్మాన్ని సరిగా నిర్వహిస్తాడా? నిర్వహించలేడు. ఒక్కో కాలనీలో ఎన్ని యిళ్ళున్నాయనుకున్నారు? వందల యిళ్ళు. వీటన్నిటికీ రోజూ ఉత్తరాలను బట్వాడా చేయడమంటే మాటలా? ఈ ప్రజల వెధవలు ఏ చిన్న విషయానికయినా అటు నాలుగు అక్షరాలు రాసి దానిని పోస్ట్ డబ్బాలో పడేస్తారు. ఏం వాటికేమన్నా రెక్కలు మొలిచి ఎగిరెళతాయనుకున్నారా? దానికి స్టాంప్ లేయాలి. అవి వందల మైళ్ళు ప్రయాణించాలి. వాటిని మనం పంచాలి. ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు పంచడమంటే ఎంత కష్టమో మనకు తెలుస్తూంది కదా! మన ఆఫీసర్లు మన కష్టాల్ని చూసి స్టాఫ్ ను పంచుతున్నారా? లేదే! అలాంటప్పుడు మనమే పని తగ్గించుకోవాలి. అదే నేనూ చేస్తూన్నది. మన మాజీ సి.ఎమ్. ప్రధానమంత్రి కావాలని వేలవేల దేవుళ్ళకు మొక్కుతున్నాను. ఆయనే మన ప్రధానయితే. ఏదో ఒకరోజు ఒళ్ళు మండి పోస్ట్ ను రద్దు చేస్తున్నాను అని అంటారనీ ఆశ."
ఇక ఆ వుపన్యాసానికి జడిసి వేలును మరోమాట అడగలేరు వాళ్ళు.
వేలు పనంతా ముగించాడు. ఉత్తరాలు కొన్నే మిగిలాయి. అతని కుడిచేతిలో మాత్రం ఓ కవరుంది. దానిని గురించే అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
ఫ్రమ్ అడ్రస్ లేదు కాబట్టి అది ప్రేమ ఉత్తరమే అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ప్రతిరోజూ ఒకే దస్తూరితో ఒకే అడ్రస్ కు ఉత్తరం వస్తూ వుండడం అతన్ని విస్మయంతో ముంచెత్తుతోంది.
అడ్రస్ మరో మారు చూశాడు. ఈ రజనీ ఎవరు? రోజూ ఉత్తరం రాసే ఈ కుర్రాడెవరు? తనకు ప్రేమ ఉత్తరాల మీద ఎంత మమకారం వున్నా రోజూ వాడెవడో రాసిన ఉత్తరాలన్నీ బట్వాడా చేయాలా? అసలింతకీ ఈ ప్రేమికులంతా పోస్టుమ్యాన్ లను ఏమనుకుంటారు? ఉత్తరాలు అందించే మధ్యవర్తులనుకుంటున్నారా! వీడు ఎవడో తెలుసుకుని బుద్ధి చెప్పాలనుకున్నాడు సుత్తివేలు.
అతను విసుక్కోవడం కూడా సబబే. బాలాజీకాలనీ పట్టణానికి దూరంగా విసిరేసినట్టుంటుంది. ప్రతిరోజూ అక్కడికి నడిచివెళ్ళి ఉత్తరం అందివ్వడం కష్టమే.
వేలు ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పి ముద్రలను గమనించాడు. పరీక్షగా చూశాక ఆ ఉత్తరం ఇందిరానగర్ కాలనీలో పోస్టు చేసినట్టు తెలిసింది. ఈ ఉత్తరాలు రాసే వ్యక్తి ఈ వూరువాడే అని నిర్ధారణ కొచ్చాడు.
రోజూ తనను ఇన్ని మైళ్ళు నడిచేటట్టు చేస్తున్న ఆ వ్యక్తిని పట్టుకుని తగిన శిక్ష వేయాలని వేలు నిశ్చయించుకున్నాడు. ఆ శిక్ష ఏమిటో కూడా నిర్ణయించాడు.
ఆ ఎండలో దాహం వేసిన కాకి నీళ్ళకుండను వెదుక్కుని పోయినట్టు బాలాజీ కాలనీకి వెళ్ళాడు.
రజని ఇంటిగేటు తెరుచుకుని లోపలికెళ్ళి "పోస్ట్" అని అరిచాడు.
ఆ పిలుపుకి రజని లోపలనుండి వచ్చింది. ఉత్తరం తీసుకుని మౌనంగా వెళ్ళింది.
ఒక్కక్షణం బాధపడ్డాడు వేలు. ఇంతదూరం నడిచి ఉత్తరం తెచ్చినందుకు ఒక చిన్న నవ్వు నవ్వి "నీళ్ళు తాగుతారా?" అని అడిగితే పోస్టుమ్యాన్ ఎంత సంతోషిస్తాడు. లాభంలేదు పోస్టుమ్యాన్ కష్టం ఎవరూ గుర్తించరనుకుని వెను తిరిగాడు అతను.
గేటుమూసి వీధిలోపడ్డాడు.
ఎండ వీపును మాడ్చేస్తోంది. తల్లోపట్టిన చెమట ముఖంమీద పాములుగా సాగి నోట్లోకి వస్తోంది.
"ఛీ ఛీ వెధవ ఉద్యోగం రోజూ నన్నింత కష్టపెట్టే వాడి పని రేపటితో ఆఖరు. జీవితంలో ఇంకెప్పుడూ ఉత్తరం రాయడు. అనుకుంటూ అతను వడివడిగా అడుగులు వేశాడు.
ఇంటికి వచ్చి, ఏదో రెండు మూడు మెతుకులు తిని పోస్టాఫీసుకు వచ్చాడు వేలు.
అప్పటికే మిగిలిన పోస్టుమ్యాన్ లు ఆఫీసు ఎదురుగ్గా వున్న గానుగ చెట్టుకింద నిలబడి మాట్లాడుకుంటున్నారు.
లోపల ఉత్తరాలను సార్ట్ అవుట్ చేస్తున్నారు. ఆ పని అయిపోయాక తిరిగి మధ్యాహ్నం బట్వాడా చేయడానికి వెళ్ళాలి వాళ్ళు.
తమ దగ్గరకు వస్తున్న వేలును చూస్తూనే ఏదో జరిగిందని అనుకున్నారు వాళ్ళు.
"వాడ్ని కార్డుమీద ఇష్టం వచ్చిన చోట్ల ముద్రలు వేసినట్టు ఉతికి పారెయ్యాలి. వాడ్ని మాత్రం వూరికే వదలకూడదు" అన్నాడు వచ్చీరాగానే వేలు.
"ఎవర్ని?" కోరస్ గా అడిగారు మిగిలిన పోస్ట్ మ్యాన్ లు.
"రోజూ నన్ను రెండు కిలోమీటర్లు నడిపించే వాడ్ని ఏం చేసినా పాపం రాదు. నా కసి తీరదు."
"ఎవర్ని?" అసహనంగా అడిగారు మళ్ళీ కోరస్ గా.
"వాడెవడో మనం కనిపెట్టాలి."