Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 20


    ముగ్గురూ తడుస్తున్నారు. అయినా వానదేవుడు దయతలచలేదు.

 

    తెల్లవారింది వానతగ్గింది. ఇక గిర్దావరు ప్రభుత్వం సాగింది. కోయలందరిని పిలిపించాడు. భూములు కొలవాలన్నాడు గిర్దావరు. కాలం మారిందన్నాడు. అరకకు పది ఇక చెల్లదన్నాడు. సువ్వాయి (సెటిల్ మెంట్) జరుగుతుందన్నాడు. బీగం (మొగల్ చక్రవర్తుల కొలత) లెక్కన మామూళ్ళు కట్టాలన్నాడు. పొలాలు వాళ్ళ వాళ్ళ పేర్లమీద రాయించుకోవాలన్నాడు. తనకు డబ్బు ముట్టచెప్పకుంటే మరొకరికి అమ్ముతానన్నాడు.

 

    కోయలకు వింతగా తోచింది. భూమి కొలవటం ఏమిటి? అది ఒకని పేర ఎలా ఉంటుంది? భూమి దున్నుకొన్నవానిది కావాలిగాని! అయినా అన్నింటికీ ఒప్పుకొన్నారు. కోయకు ప్రాణం నేల. అతడు దాన్ని వదులుకోలేడు. అది వారి జీవిత భాగస్వామిని, ఆలిని మించింది. అన్నింటినీ మించింది. అందుకే అన్నింటికీ వొప్పుకున్నారు, నిలువుదోపిడి యిచ్చారు.

 

    సింగన్న కట్టుగొయ్యకే ఉన్నాడు. అతనికి తిండిలేదు. నీళ్ళులేవు. అయినా అన్నీ విన్నాడతను. ఇందులో ఏదో అన్యాయం ఉందనిపించిందతనికి. ఎందుకో మనసు సల సల కాగింది. తండ్రిని చూచాడు. మళ్ళీ తలవంచుకున్నాడు.

 

    అమీను తనభాగం వొప్పించుకున్నాడు. తలార్లు, డప్పులవాళ్ళు గుర్రాలవాళ్ళు అంతా వొప్పించుకున్నారు మామూళ్ళు.

 

    మళ్ళీ అధికార్ల జల్సాలు సాగేయి. తాగుడు, తైతక్కులు, ఆ రాత్రి అమీనుకు మరొక ఆకలైంది. ఆడది కావాలనిపించింది. కట్టుగొయ్య దగ్గర చాలామంది పడుచులున్నారు. అతనికి స్పృహలేదు. తూలుతున్నాడు. బయటికి అడుగువేయబోయాడు. గ్రహించాడు గిర్దావరు. హడలిపోయాడు. కోయ దేన్నైనా సహిస్తాడు. దాన్ని సహించడు. కోయ కోపగించాడా ప్రాణాలతో కాదు పీనుగులు కూడా అడవి దాటవు. తన ప్రాణం దక్కాలంటే అమీన్ను వెనక్కు లాగాలి. లాగాడు. అమీను కాళ్ళూ, కడుపులూ పట్టుకొని బ్రతిమిలాడాడు. వారించాడు. మాన్పించాడు. ఇక అక్కడ ఉండరాదనుకున్నాడు. తెల్లవారి ప్రయాణానికి సిద్ధం కావాలనుకున్నాడు. అమీను రానన్నాడు. ఇద్దరూ కీచులాడుకున్నారు. అమీను రాకున్నా తాను వెళ్ళిపోతానన్నాడు గిర్దావరు. అమీను లొంగక తప్పలేదు.

 

    తెల్లవారింది. సింగన్న కట్టుగొయ్యకే ఉన్నాడు. అధికారుల గుర్రాలు తయారైనాయి. డప్పులు మ్రోగాయి. కొమ్ములు మోగాయి. సింగన్నను విప్పారు. నడుముకు పగ్గం కట్టారు. అమీను గుర్రానికి కట్టారు. సింగన్న నీరసించిపోయాడు. ఊగుతూ అనుసరించాడు.

 

    సింగన్న తల్లి గుండె చెరువైంది హోరుమని ఏడ్చింది. సమ్మయ్య అమీను కాళ్ళు కడుపులు పట్టుకొని బ్రతిమిలాడాడు. గిర్దావరును ప్రార్థించాడు. ఇద్దరూ వినలేదు. జుల్మానా చెల్లించి విడిపించు కొమ్మనారు. కోయ ఆడి తప్పడు... ఆ విషయం తెలుసు వారికి. అయినా సింగన్నకు గుణపాఠం నేర్పాలనుకున్నారు.

 

    స్వస్థానం చేరుకున్నాయి గుర్రాలు. సింగన్నను చింతచెట్టుకు కట్టించాడు అమీను అక్కడ తీరని కసి ఇక్కడ తీర్చుకున్నాడు. "తిరగబడ్తవులే మాదర్ చత్" అవి దవడ మించి లాగి కొట్టాడు. సింగన్న రక్తం ఉమిసాడు. బాదవలసిందని జవాన్లకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు.సమ్మయ్య సాహుకారి దగ్గరికి వెళ్ళాడు. అతడు బేరం సాగించాడు. డబ్బు లేదన్నాడు. వచ్చే పంట వ్రాసి ఇవ్వమన్నాడు. గూడెంలో వచ్చే పంట సాంతం రాసి ఇచ్చాడు సమ్మయ్య. అప్పుడు అమీనుకూ గిర్దావరుకూ చీట్లు వ్రాసి ఇచ్చాడు. చీటి తెచ్చి అమీనుకు ఇచ్చాడు సమ్మయ్య. కొడుకును చూచి అతని గుండె పగిలింది. వంటినిండా దద్దులు, నోట్లోంచి రక్తం కారుతూంది. తలవాలిపోయింది.

 

    "ఇక ఇడ్వుండి" అన్నాడు పూడిపోయిన గొంతుతో.

 

    "చోడ్ దేవ్ మాదర్ చత్ కో" అమీను ఆజ్ఞ.

 

    సింగన్నను వదిలారు. అక్కడ క్షణం ఉండదల్చుకోలే దతను.

 

    అడుగు ముందుకు వేశాడు. తండ్రి అతనిని అనుసరించాడు.

 

    గూడెం చేరుకునే వరకు సింగన్న తల్లి కడవ నెత్తిన పెట్టుకొని గూడెంలోకి పోతూంది. ఆమె వెంట కొందరు ఆడపిల్లలున్నారు. మడుగులో కోడిగ్రుడ్లు, పసుపు, కుంకుమ, పొరక పుల్లలు విడిచిపోతూంది. అది బాలెంతరాలు చేయవలసిన పని. ఆ తరవాత ఆమె "కుండల్లకు పోతుంది" అంటే పనులు ప్రారంభిస్తుంది. 

   

    తల్లితోపాటే గడపలో అడుగుపెట్టాడు. సింగన్న. కడవ దించి నేలమీద ముడుచుకుంది తల్లి. తల్లి వంటిమీద చేయివేసి చూశాడు సింగన్న.

 

    మండిపోతుంది.

 

    పేలాలు వేగినట్లున్నాయి!


                                      4


    పిరీల కొట్టం ముందు కట్టిన మంచెమీద తాషామార్ఫా మ్రోగింది. పిల్లలంతా కూడారు. తలలెత్తి వింటున్నారు. కొట్టంలో పీరీలను నిలబెట్టే రోజది. మెల్లమెల్లగా జనం కూడుకుంటున్నారు. ఇక్కడ మతంతో ప్రమేయంలేదు. హిందువులు, మహ్మదీయులు అంతా కూడారు. హసన్ సోదరులు యాజిద్ దౌర్జన్యానికి బలియైనారు. వారు బలియైంది మొహరం నెలలో. అది మహ్మదీయులకు ముఖ్యంగా షియాలకు పవిత్ర మాసం.

 

    తాషామార్ఫా మ్రోగుతూంది. ఆషూర్ ఖానా లోపల బయటా జనసమ్మర్ధం ఎక్కువగా వుంది. ముల్లా వచ్చాడు. అతడు కట్టుకున్నది ధోవతి, వేసుకున్నది కమీజు. నెత్తిన కుచ్చుటోపి వుంది. అతడు పెట్టెలో నుంచి పీరీలను తీసేముందు చేత్తో వెనక గోచి లాగేశాడు. తాషామార్ఫా జోరుగా మోగింది. పీరీలను పీటమీద నిలబెట్టాడు. బట్టలు కట్టాడు. వాటి పక్కన నెమలి ఈకల కట్టలు పెట్టాడు. ఊరు (సాంబ్రాణి) పొగ వేశాడు. ఏవేవో మంత్రాలు వేశాడు. మళ్ళీ గోచి పెట్టుకున్నడు. కొట్టం దిగి క్రిందికి వచ్చాడు. కొట్టం ముందు గిరిగీశాడు. గునపాలు పట్టుకొని నుంచున్న జనం అతని గిరిని అనుసరించి తవ్వారు. మట్టి తోడేశారు. అందులో కట్టెలు వేశారు. ఒకడు నిప్పు తెచ్చాడు. అందులో వేశాడు. నిప్పు రాజుకొని కట్టెలు అంటుకున్నాయి. మంటలు లేచాయి. జనంలో ఆనందం చెలరేగింది. చెట్ట పట్టాలు పట్టుకొని అగ్ని గుండం చుట్టూ చేరారు. అడుగులువేస్తూ చప్పట్లు కొడ్తూ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ 'హసన్ హుసేన్ లిద్దరూ అన్నదమ్ములంటా" అనే పదంలో వారి కథంతా చెప్పుకుంటున్నారు.

 

    హజ్రత్ మహమ్మద్ గతించారు. వారి స్థానంలో ఖలీఫా ఎవరు కావాలని తగాదా జరిగింది. మహమ్మద్ అల్లుడు 'ఆలీ' ఖాలీఫా కావాలన్నారు కొందరు. వారు షియాలు. ఖలీఫాను ఎన్నుకోవాలన్న వారు సున్నీలు. సున్నీలు నెగ్గారు. అబూబకర్ ఖలీఫా అయినాడు. అతని తరువాత ఉమర్, ఉస్మాన్ ఖలీఫాలైనారు. వారు ఖురాన్ ఆదేశాలకు అనుగుణంగా రాజ్యం చేయలేదని మళ్ళీ మహమ్మద్ అల్లుడు ఆలీని ఖలీఫా చేశారు. అది సహించలేని అభూసుఫియాని ఆలీని హత్య చేయించి తానే ఖలీఫా అయినాడు. ఆలీ కొడుకులు హసన్, హుసేన్ రాజ్యానికి కావాలనుకున్న ప్రజలు సూఫియాని బలపరచలేదు. తనను బలపర్చవలసిందని అతడు హుసేన్ సోదరులను నిర్భంధం చేశాడు. అందుకు అంగీకరించనందున విషం పెట్టి చంపించాడు. సూఫియాని తరువాత మావియా అతని తరువాత యాజిద్ ఖలీఫా అయినాడు. అతని క్రౌర్యాన్ని ప్రజలు సహించలేక పోయారు. హసన్ తనను బలపర్చకుంటే తనకు రాజ్యం దక్కదనుకున్నాడు. అతనిమీద వత్తిడి తెచ్చాడు. హత్యా ప్రయత్నంకూడా చేశాడు. అది గ్రహించిన హసన్ మదీనా నుంచి మక్కాకు పారిపోయాడు. అక్కడ కూడ తనకు క్షేమం లేదని తెలిసి తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందని కోరుతూ 'కూఫా'కు మనిషిని పంపాడు. పోయిన మనిషి తలతీసి పురద్వారానికి వ్రేలాడతీశారు. ఆ విషయం తెలిసి ఎంతో దుఃఖించాడు హసన్. ప్రాణరక్షణకుగాను 72 మంది బృందంతో 'ఇరాక్'కు బయలుదేరాడు. కర్బలావద్ద యాజిద్ సైన్యం అతన్ని చుట్టేసింది. అడుగు ముందుకు వేయనీయలేదు. దగ్గరే ఉన్న ఫరాత్ నది నుండి నీరు సహితం తెచ్చుకోనివ్వలేదు.  ఎడారి, మండే ఎండ, వడగాల్పులు, నీటిచుక్క లేదు. ఒక్కొక్కరు చనిపోసాగారు. తనను ఖలీఫాగా అంగీకరించాల్సిందని యాజిద్ కబురంపుతున్నాడు. హసన్ అందుకు అంగీకరించలేదు. ఆరునెలల బిడ్డ సహితంగా అంతా చనిపోయారు. అప్పుడు హసన్ కత్తి పట్టుకొని రణరంగంలో దూకాడు. యాజిద్ సైన్యాలు అతణ్ణి చీల్చి చెండాడాయి.  

 

    హసన్ ప్రాణాలు వదిలాడు. కాని ఆదర్శాలు వదల్లేదు. అందుకే గావాఁలు అన్ని మతాలవారూ పీరీలపండుగ జరుపుకుంటారు ఈ ప్రాంతంలో.

 

    తాసిల్దారు షియా వర్గీయుడు. అతడూ మొహరం పాటిస్తాడు. ఆ పది రోజులు అతనికి శోకదినాలు. నల్లని బట్టలు కట్టుకుంటాడు. అవి శలవు రోజులు. ఖురాను వింటూ, దానధర్మాలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటాడు. శోకగీతాల ఆలాపన ప్రతిరోజూ జరుగుతుంటుంది. అందుకుగాను మనుషులను హైద్రాబాదు నుంచి ప్రత్యేకంగా పిలిపిస్తాడు. తాసిల్దారు యింటి ముందు బెంచీలమీద లక్కపూసిన కుండల్లో పానకం పెట్టివుంది. అది షర్బతు. దాన్ని ఎవరైనా ఎంతైనా త్రాగవచ్చు. అతడు పేదలకు రొట్టెలు, ఇతర తినుబండారాలు, బట్టలు దానం చేస్తుంటాడు. చేసిన పాపాలు కడుక్కోవలసిన రోజులవి. పరలోకానికిగాను పుణ్యం సంపాదించుకోవలసిన రోజులవి.

 Previous Page Next Page