Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 20


    సాయంత్రం ఆరుగంటలకే ఇంటికొచ్చిన ఇద్దర్నీ చూసి భుజంగరావు ఆశ్చర్యపోయాడు.

 

    "అంకుల్ మిలేగయా...ఖూబ్ సూరత్ కీ ఔరత్ కా ఫోటో మిలేగయా..." అన్నాడు ఆనందం బ్రహ్మానందంగా.

 

    "హమ్మయ్య... మా ఆవిడ పోరు తగ్గుతుంది కొన్నాళ్ళయినా... మీరేమో అమ్మాయిని తీసుకురావటానికి నెల్లూరు వెళ్ళారని చెప్పాను. ఇప్పుడెలా...? అంటున్నంతలో భువనేశ్వరీ ఆంజనేయులి పెళ్ళాం కోసం పరీక్షగా చూస్తూ లోపలికొచ్చింది.

 

    ఆంజనేయులు, ఆనందం భయంగా భుజంగరావుకేసి చూశారు.

 

    "వీళ్ళు పోతే పిల్లనిపంపిస్తారా భువనేశ్వరీ... మేమే దింపుతాం సారె, చీరెతో మీరెళ్ళిపోండి అని కసిరికొట్టారట..." భుజంగరావు డ్రామా ఆడేశాడు.

 

    "నిజమేనా...?" అందామె అనుమానంగా చూస్తూ.

 

    "మీ మీద ఒట్టు పిన్నిగారూ" అన్నాడు ఆనందం.

 

    "మరయితే ఎప్పుడొస్తుంది...?" ఆమె కళ్ళలో ఇంకా అనుమానం అలాగే వుంది.

 

    "వీళ్ళ మామగారికి నెలలని, వర్జ్యాలని, తిధులని ఏవేవో పట్టింపులు... మంచి ముహూర్తం చూసి తీసుకొస్తానన్నారు..." ఆనందం కోసేస్తున్నాడు సీరియస్ గా మొహం పెట్టి.

 

    "మరంత దూరం వెళ్ళారుగా? పిల్ల ఫోటో అయినా తెచ్చారా?"

 

    దాని కోసమే ఎదురుచూస్తున్న ఆనందం తన చేతిలోని ఫోటోని చటుక్కున ఆమెకందించాడు.

 

    "అమ్మాయి ఒక్కటున్నది తేకపోతే, ఇద్దరున్నది తేవచ్చుగా" అంటూ ఫోటో కేసి చూసింది.

 

    "అమ్మాయి చాలా బావుంది. శుభ్రంగా తోవిన రాగి చెంబులా కళ కళ్ళాడుతోంది. ఇలాంటమ్మాయిని వదిలేసి ఎలా ఉండబుద్ధవుతోందయ్యా నీకు? ఇంతకీ ఎప్పుడొస్తుంది..." తిరిగి అడిగిందావిడ.

 

    "దెయ్యం లాంటమ్మాయి ఫోటో తెచ్చుంటే ఆమెలా తొందరపడేది కాదుగా...?" విసుక్కున్నాడు ఆంజనేయులు చిన్నగా.

 

    గబిజిబిగా, టెన్షన్ లో వున్న ఆనందం చటుక్కున అనేశాడు.

 

    "పదో తారీఖున వస్తుందండి" అని.

 

    "బస్సులో వస్తుందా... రైల్లో వస్తుందా... ప్రస్తుతానికి ఇంట్లోవాడి వైనా, పరాయి వాడివైనా నువ్వే కాబట్టి. చెయ్యాల్సిన పనులు బోల్డున్నాయి. ఏవండీ పురోహితుడికి ఒకసారి కబురు పెడతారా..." అందావిడ.

 

    "పురోహితుడికా... ఇప్పుడెందుకు...? ఆశ్చర్యంగా అడిగాడు భుజంగరావు.

 

    "ఒకసారి పక్కకు రండి..." అంటూ ఆయన చేతిని పుచ్చుకుని, లాక్కొని పక్కకు తీసికెళ్ళి-

 

    "కొత్తగా కాపరానికి వస్తున్న అమ్మాయి గదా... వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చినా, రాకపోయినా, శుభకార్యం, ఆ 'కార్యం' మనచేతి మీద జరిపిస్తే, పుణ్యమూ, పురుషార్థమూనండీ" అంది సిగ్గుపడుతూ.

 

    "కార్యమా" నోరెళ్ళబెట్టాడాయన.


                                                 *    *    *    *


    "పదో తారీఖున అనేబదులు, నెలాఖరుకి అని చావచ్చుగా?" రాత్రి పడుకుంటూ ఆంజనేయులు చిరాకుపడ్డాడు.

 

    "ఇంకా నయం వచ్చే సంవత్సరం అనమనలేదు... అంత దూరం గడువు పెడితే చంపేస్తుందావిడ. అసలావిడ నాకేసి ఎప్పుడు చూసినా, ఆ  చూపుల్లో అనుమానమే. ఆ భయంలో, తొందరలో నోటికొచ్చింది అనేశాను..." అంటూ ముసుగు కప్పుకొని నిద్రలోకి జారుకున్నాడు ఆనందం.


                             *    *    *    *


    తొమ్మిదోతేదీ రాత్రి భోజనాలప్పుడు-

 

    "అమ్మాయి వచ్చేది రేపుదయమే కదు బాబూ..." అని భువనేశ్వరి అడగడంతో...

 

    పిచ్చి చూపులు చూస్తూ-

 

    "అవునండీ..." అని జవాబు చెప్పాడు ఆనందం. ఆవిడ మజ్జిగ తేవడానికి లోనికెళ్ళేసరికి గబగబా కంచంలో చెయ్యి కడిగేసుకుని బయట పడ్డారిద్దరూ.

 

    మర్నాడు పదో తేదీ.

 

    ఉదయాన్నే ఆవిడ వచ్చేస్తుందన్న ఉద్దేశ్యంతో, తెల్లవారు జామున నాలుగ్గంటలకే స్నానాలవీ చేసి బయటపడ్డారిద్దరూ.

 

    భువనేశ్వరీ దేవి ఏడుగంటలకల్లా అవుట్ హౌస్ కొచ్చి చూసింది.

 

    ఇద్దరూ కనబడక పోవడంతో-

 

    గబగబా భర్త దగ్గరకెళ్ళి-

 

    "పెళ్ళామంటే అంజిబాబుకి మోజేనండోయ్.. తీస్కురాడానికి స్టేషన్ వెళ్ళినట్టున్నాడు" అంది.

 

    దానికి ఏ జవాబు చెప్పలేదు భుజంగరావు. ఉదయాన్నే ఏడవాలో నవ్వాలో ఆయనకేం అర్థం కాలేదు.


                                                 *    *    *    *


    "ఉదయమైతే తప్పించుకొని వచ్చేశాం... ఇప్పుడెలా...? ఈ రోజే పదోతారీఖు..." ఆంజనేయులు బంగారంలాంటి తన జాబ్ ని, రెంట్ లేని ఇంటిని గుర్తుకు తెచ్చుకొని దిగాలుపడిపోయాడు.

 

    "ఓకే ఒక పని చెయ్... మేరీని జస్ట్ ఫర్ టీకి రమ్మని ఇన్ వైట్ చెయ్యి. అదీ సాయంత్రం ఏడు తరువాత. మిగతా కధ నేను నడుపుతాను" అన్నాడు ఆనందం.

 

    ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు ఆంజనేయులు.


                                                    *    *    *    *    


    రాత్రి ఏడు గంటలకు ఆంజనేయుల్ని, ఆనందాన్ని, మేరీని ఎక్కించుకున్న ఆటో బయలుదేరింది.

 

    "మీరు ఊరినుంచి వస్తున్నారా? చేతిలో సూట్ కేస్ వుంది..." ఆనందం కేసి చూస్తూ అడిగింది మేరీ.

 

    "నేను కాదు. మీరొస్తున్నారు ఊరినుంచి" అన్నాడు ఆనందం అనాలోచితంగా.

 

    "నేనా...?" నేను వస్తున్నది మా ఆఫీసు నుంచి గదా?" బిత్తరపోతూ అంది మేరీ.

 

    నాలిక్కరుచుకున్నాడు ఆనందం.

 

    మరో పావుగంటకు ఆటో భుజంగరావు బంగ్లా మెయిన్ గేట్ ముందాగింది.

 

    "ఈ బంగ్లాలో ఒక ఆచారం వుంది. ఆడవాళ్ళు తల మీద ముసుగు వేసుకోవాలి. లేదంటే ఓనర్ ఊరుకోరు" అన్నాడు ఆనందం కొత్త డ్రామాకి సమాయత్తమవుతూ.

 Previous Page Next Page