నువ్వొక మహాద్భుతమైన శిల్పివే. కాదనలేను. ఎవ్వరూ అనలేరు కూడా. కానీ మృత్యువుకి ప్రతిభతో సంబంధం- కులమతాలతో అంతకంటే సంబంధం లేదు.
శిల్పిగా నువ్వెంత గొప్పవాడివో, జ్యోతిష్కుడిగా నేనూ అంత గొప్పవాడినే. నాకు తెలిసినంతవరకు ఈ రాత్రి ఝాము ముగిసేలోపే నీకు మృత్యువు తోడవుతుంది. అది యముడి శిలాశాసనం. అది తిరగబడటం అంటే- విశ్వవ్యాపిత దైవశాసనాలన్నీ తిరగరాయబడవలసిందే. అదెలా సాధ్యం? అని గొణిగాడట. అప్పటికే జ్యోతిష్కుడి మొఖంలో- తను, తన శాస్త్రం శిల్పి ముందు ఓడిపోయిన భావాన్ని వ్యక్తపర్చాడు. తన ఓటమిని ఒప్పుకున్నాడు కూడా.
"మీరనుకొనే శాస్త్రాలన్నీ నా ద్వారానే తిరగరాయబడతాయి చూస్తుండండి. ఇక మిగిలింది యముడే కదా... ఆయనా నా ముందు ఓడిపోవలసిందే" అని అన్నాడట.
జ్యోతిష్కుడు తల వంచుకున్నాడట.
ఇదిలా వుండగా అక్కడ యముడు- కింకరుల మీద, చిత్రగుప్తుడి మీద విరుచుకుపడ్డాడట. ఎవరు నిజమో, ఎవరు నకిలీనో తెలీని మీరు దద్దమ్మలు అనీ యింకా అదీ, ఇదీ అని తెగతిట్టిపోసాడట.
మీరే ప్రయత్నించరాదా అని చిత్రగుప్తుడు గొణిగాడట.
చివరకు యముడే యమపాశం తీసుకొని బయలుదేరి శిల్పి ఇంటికి వెళ్ళాడట.
వెళ్ళగానే ముందుగా జ్యోతిష్కుడు ముందు హాల్లో కనిపించాడట.
ఏమిటి విషయం అని యముడు జ్యోతిష్కుడ్ని వివరాలలోకి దింపాడట.
అతనో పెద్ద అహంభావి. ఎవరిమాటా వినడు. దైవశాసనాల్ని కూడా ధిక్కరించేంత అహంభావి. 'మీకైనా, మరెవరికైనా ఆ ఏడుగురిలో ఎవరు శిల్పి, విగ్రహాలు ఎవన్నది కనిపెట్టడం కష్టం' అని వాపోయాడట.
యముడు తల పంకించి, కొద్ది క్షణాలు యోచించి, లోపలకు వెళ్ళి ఏడు విగ్రహాల్ని చూసి- ఆహా... ఏమీ శిల్పి చాతుర్యం... అచ్చం తనలాగే ఆరు శిల్పాల్ని చేసి మృత్యువునే సందిగ్ధంలో పడవేసాడే! ఈ శిల్పికి నా ప్రణామాలు. మయుడంతటి శిల్పి ఈయన. మయుడి శిష్యుడేమో అని అన్నాడట.
ఆ వెంటనే శిల్పి కోపంగా- మయుడెక్కడ, నేనెక్కడ? మయుడు నా ముందు బచ్చా. తెలిసి మాట్లాడు యముడా... అని అన్నాడట.
రెడీగా వున్న యముడు, శిల్పి మీదకు యమపాశాన్ని వదిలాడట. అంతే శిల్పి మృత్యువు పాలయ్యాడు" రాజేంద్రప్రసాద్ చెప్పటం కొద్ది క్షణాలు ఆపి తిరిగి అన్నాడు-
"చూశావా... మనిషికి అహం ఎంత చేటు తెస్తుందో... మనం ది గ్రేట్ ఇండస్ట్రియల్ ఎంపరర్ రాఘవేంద్రనాయుడు ముందు ఎంత? ఆ రాఘవేంద్రనాయుడికి ఆయన కొడుకంటే ప్రాణమట. నువ్వదేపనిగా మధుకర్ ని రెచ్చగొడితే అది అతనితో పోదు, పెద్దాయనవరకూ వెళుతుంది. ఆ తరువాత మనం మనగలగటం చాలా కష్టం. ఇంతకంటే చెప్పేదేం లేదు. జాగ్రత్త" అని మృదువుగా కూతురు మహతిని హెచ్చరించి బయటకు వెళ్ళిపోయాడు.
"కథ చాలా బావుంది- అంతే... కాని యిది జీవితం" అని చిన్నగా నవ్వుతూ అంది మహతి తనూ లేస్తూ. మహతి తల్లి దిగ్భ్రాంతికి గురయింది.
* * * * *
"ఏంటాలోచిస్తున్నావ్... నా ఉద్దేశంలో థింకింగ్ ఈజ్ ది నాన్సెన్స్ థింగ్ ఇన్ ది వరల్డ్... అందువల్ల నేనరెంజ్ చేస్తాను... నువ్వు వూ అను" మరో పెగ్గు లోనికెళ్ళింది. మధుకర్ నరాలనిండా ఏదో తెలీని కసి. ఆ కసిని అగ్గిపుల్లతో కాకుండా పెట్రోల్ వేసి రెట్టింపు చేస్తున్నాడు మూర్తి, "భయపడుతున్నావా?" హేళన చేస్తున్నట్లుగా నవ్వాడు మూర్తి.
"నో... నో" ముద్దుగా అన్నాడు మధుకర్.
"మరి... డోంట్ థింక్ ఐసే. ఇవాళ రాత్రి పదిగంటలలోపు నువ్వు మహతిని అనుభవిస్తావ్" ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అన్నాడు మూర్తి.
మూర్తి తలుచుకుంటే ఏమైనా చెయ్యగలడు.
"ఎక్కడ, ఎలా" ఆ రెండు మాటలూ మధుకర్ నోటినుంచి వచ్చాయి.
"అదే సస్పెన్స్... ఐదువేలు రూపాయలిలాతే.... నువ్విక్కడే వుండు... సరిగ్గా ఇంకో గంట తర్వాత ఎక్కడో, ఎలాగో చెబుతాను" లేస్తూ అన్నాడు మూర్తి.
"రూపాయలెందుకు" ఎప్పుడూ అలాంటి ప్రశ్నలు వెయ్యడు మధుకర్. మహతి విషయంలో మాత్రం అన్నీ ప్రశ్నలతోటే అతని ఆరా మొదలవుతుంది.
"బజ్జీలు కొనుక్కోవడానికి" మధుకర్ ఇచ్చిన డబ్బందుకుంటూ అన్నాడు మూర్తి. కొద్ది క్షణాలాగి "చూడు మధూ, ఎక్కువ తాగకు ఆరోగ్యం పాడవుతుంది" అని సలహా ఇచ్చి బయటికెళ్ళిపోయాడు మూర్తి హుషారుగా.
మధుకర్ కి చాలా థ్రిల్లింగ్ గా వుంది.
గ్లాసులో మిలమిలా మెరుస్తున్న ఎరుపురంగు ద్రవంలో మహతి ముఖం కన్పించినట్టయింది. జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం ఒక పథకం రూపంలో ఊపిరి పోసుకుంటోంది క్రమంగా.
మహతి నిజంగా సౌందర్యవీణ.
ఎప్పుడూ బిజీగా వుండే బ్రహ్మదేవుడు, హాలీడేనాడు తీరుబడిగా వెన్నెల్లోని చల్లనికాంతినీ, మబ్బుల్లోని మెత్తని లాలిత్యాన్నీ, పారిజాత పువ్వుల్లోని సుగంధభరిత పరిమళాన్నీ, పారే నది కెరటాల గమ్మత్తయిన నడకనీ, సృష్టిలోని వింత అందాలన్నింటినీ కలబోసి, కాచి, తూచి, చేసిన అద్భుత సౌందర్యదేవత మహతి.
మహతిని ఎలా తెస్తాడు మూర్తి? కిడ్నాప్ చేస్తాడా? బెదిరిస్తాడా? మూర్తి ట్రాప్ లో మహతి పడుతుందా? ఐదువేల రూపాయల కోసం మూర్తి తనకి మస్కా కొట్టాడా?
సిగరెట్ పొగను రింగులు రింగులుగా వదులుతూ ఆలోచిస్తున్నాడు మధుకర్.
ఆ సమయంలో ఓపెన్ స్ట్రీట్ బార్ లో జనం పలచగా వున్నారు. లైట్ గా గాల్లో సుడులు తిరుగుతున్న మాడోనా విరహపు గొంతులోని వయ్యారం "కిస్ మీ, కిల్ మీ" అంటూ మధుకర్ ని మరింతగా మత్తెక్కిస్తోంది. నరాల్లో నిషా నెమ్మదిగా ప్రవహిస్తోంది కరెంట్ లా.
* * * * *
లేడీస్ హాస్టల్ గేటుముందు నిలుచున్నాడు మూర్తి.
"ఐ కెన్ డు ఎనీథింగ్... ఇన్ దిస్ వరల్డ్... ఎయిదర్ గుడ్ ఆర్ బేడ్" మంచి పనుల్ని ప్రపంచం ఎలాగూ చెయ్యనివ్వదు. చేసినా హర్షించదు. పైగా మంచి చేసినవాడికి ప్రపంచం ఇచ్చే ఏకైక బిరుదు వెర్రిబాగులవాడని. అందుకు చరిత్రే సాక్ష్యం.
నేటి మనిషికి అల్టిమేట్ గోల్ బేడ్- అందుకే థింక్ బేడ్, సి బేడ్, డు బేడ్, ఇదీ మూర్తి థీరీ!
ఈ మూడు లక్షణాలు వుంటే లైఫంతా దిల్ దునియా. అలాంటి దునియాలో అలాంటి వ్యక్తుల్ని సులభంగా గుర్తుపట్టగలడు మూర్తి.
అందుకే...
మధుకర్ తన చెప్పుచేతల్లో వుండాలంటే, ఈ మాత్రం సాహసం తనకు అవసరం.
అందుకే ఈ పనికి సుధారాణిని ఎంచుకున్నాడు.
"ఎంత నీ కజిన్ సిస్టరైనా ఈ టైమ్ లో లోపలికి పంపించడం వీలు కాదయ్యా..." గేట్ మెన్ అన్నాడు, మూర్తి చెప్పిన అబద్ధాన్ని నమ్ముతూ.
"నాదీ వూరు కదయ్యా బాబు. సాయంత్రం బస్సుకెళ్ళిపోవాలి. ఒక్కసారి పలకరించి వెళ్ళిపోతాను. రూల్స్ రూల్సేనయ్యా. ఫైవ్ మినిట్స్... అంతే" జేబులోంచి వందరూపాయల నోటు తీసి గేట్ మాన్ చేతిలో పెట్టాడు మూర్తి.