మంట రగులుతూనే వుంటుంది.
ఆ మంట ముందుకు అరచేతుల్ని చాపి మూర్తిలాంటివాళ్ళు చలి కాగుతూనే వుంటారు.
ఒక స్థిరమైన నిర్ణయానికి రావటానికి మధుకర్ కి కొంత సమయం పడుతుంది. ఒకింత మెంటల్ ప్రిపరేషన్ ద్వారానే చెడ్డ పనికి మనస్పూర్తిగా సిద్ధపడతాడు.
ఒకసారి ఆ నిర్ణయానికి వస్తే, ఇకతన్ని ఎవరూ ఆపలేరు.
మొండితనం, పౌరుషం, ఉక్రోషం, ఆత్మాభిమానం, ఆపైన ఒకింత మూర్ఖత్వం కూడా కలిసి మధుకర్ గా రూపాంతరం చెందాయి.
అది మూర్తికి బాగా తెలుసు. ఎండిన బీడుకి నిప్పు ఎవరైనా పెట్టగలరు తడిసిన పచ్చగడ్డికి నిప్పు పెట్టటమే ఒకింత కష్టం.
అది రగులుతుంటే మాత్రం ఇక ఆగదు. తనకు తెలిసిన విద్యది. మరి దాని ద్వారానే గదా- తను బ్రతకాలి... ఇదీ మూర్తి కాన్సెప్ట్.
* * * * *
రాజేంద్రప్రసాద్ హాల్లో పచార్లు చేస్తున్నాడు.
హాలంతా నిశ్శబ్దంగా వుంది.
ఆయన గంభీరంగా వున్నాడు.
ఎదురుగా సోఫాలో మహతి కూర్చుని, తల వంచుకుని వుంది. మరో సోఫాలో ఆయన భార్య అదే స్థితిలో వుంది.
"నీకో కథ చెబుతాను శ్రద్ధగా విను" అని, కొద్ది క్షణాలు మౌనంగా వుండి తిరిగి చెప్పటం ప్రారంభించారాయన.
"కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట. ఒక శిల్పి వుండేవాడట. మహాద్భుతమైన శిల్పి అతను. అతను చెక్కే శిల్పాలను చూసి బ్రహ్మ దేవుడే ఆశ్చర్యపోయేవాడట. సృష్టికర్తకే దిగులు తెప్పించే ఆ గొప్ప సృజనాత్మకత వున్న శిల్పి అతను. ప్రపంచ ప్రజలు అబ్బురపడే ఎన్నో అద్భుత విగ్రహాలను, గుళ్ళను, గోపురాలను ఆయన జీవితకాలంలో మలిచాడట. అయినా కాలం అతనిపై తన ప్రభావాన్ని చూపించక ఊరుకోదు కదా... చూపించింది... వృద్ధాప్యం వచ్చేసింది.
ఒకరోజు ఒక గొప్ప జ్యోతిష్కుడు శిల్పి వద్దకు వేరే పనిమీద వచ్చి తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ- త్వరలో నీకోసం యమపాశాన్ని తీసుకొని కింకరులు రాబోతున్నారని, పుణ్యకార్యాలు ఏమైనా చేసేదుంటే చేయమని, దైవస్మరణ చేసుకొంటూ ఆఖరిరోజుల్ని గడపమని చెప్పి వెళ్ళిపోయాడట.
దాంతో శిల్పి కలవరపడ్డాడు.
తను చెక్కవలసి వున్న మరో అద్భుత శిల్పం మిగిలిపోయి వుందట. దాన్ని పూర్తి చేయటానికి కనీసం ఆరునెలలయినా పడుతుందట. దాంతో ఆ శిల్పి ఒక రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడట.
ఎలాగయినా మృత్యుదేవతని మోసం చేయాలి. యముడ్ని మట్టి గరిపించాలి. ఎలా? అందుకే అచ్చం తనలాగే వుండే విగ్రహాన్ని రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని చేయటం మొదలెట్టాడు.
కాలం క్రమంగా కరిగిపోతోంది. హీ ఈజ్ కౌంటింగ్ హిజ్ లాస్ట్ డేస్ అని భ్రమపడకూడదు. తన అద్భుత శిల్పి చాతుర్యంతో తన జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నాననే పూర్తి నమ్మకంతోనే అతను వున్నాడు.
నిద్రాహారాలు మాని, ఏకదీక్షతో ఆరు విగ్రహాల్ని తయారుచేశాడు. చివరగా వాటికేసి చూసి, తనని అద్దంలో సరిపోల్చుకుని సంతృప్తి పడ్డాడట.
ఆ రాత్రి జ్యోతిష్కుడు మళ్ళా శిల్పి వద్దకు వచ్చాడట.
"నీ ఘడియలు దగ్గరపడ్డాయి. దైవస్మరణ చేసుకో" అని చెప్పి ఒకింత బాధపడ్డాడు.
అందుకా శిల్పి నవ్వి- "భలేవారే, యముడు నా విషయంలో పొరబడబోతున్నాడు చూడండి" అని అన్నాడట.
జ్యోతిష్కుడుకేం అర్థంకాలేదు.
అదెలా సంభవమని ఆశ్చర్యపడుతుండగానే, శిల్పి జ్యోతిష్కుడ్ని కాసేపు ఆగి లోపలకు రమ్మని చెప్పి, తను ముందుగానే లోపల గదిలోకి వెళ్ళిపోయాడట.
కాసేపాగి జ్యోతిష్కుడు లోపలకు వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడట. అక్కడ ఏడు విగ్రహాలు వరుసగా నిలబడి వున్నాయి. అవి అచ్చం ఒకలాగే వున్నాయి. అందులో ఒకరు శిల్పి.
కాని ఎంత పరీక్షగా చూసినా, ఎంత బుర్ర బ్రద్ధలు చేసుకున్నా, జ్యోతిష్కుడికి అసలు శిల్పి ఎవరన్నది అర్థంకాలేదు.
అలా జ్యోతిష్కుడు పిచ్చిపట్టి చూస్తుండగా, అంతలో నలుగురు యమకింకరులు చేతుల్లో యమపాశాన్ని తీసుకొని ఆ గదిలోకి వచ్చారట.
వాళ్ళకీ అదే పరిస్థితి ఎదురయి, ప్రక్కనే వున్న జ్యోతిష్కుడ్ని అడిగారట- అందులో శిల్పి ఎవరని.
జ్యోతిష్కుడు పెదవి విరిచాడట. కింకరులు ఎన్ని రకాలుగా చూసినా, ఎంత పరీక్షగా చూసినా, అసలు శిల్పిని కనుగొనలేకపోయారట.
ఒకర్ని తీసుకెళ్ళబోయి మరొకర్ని తీసుకెళితే- తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందని భయపడి, రిక్తహస్తాలతో వెనుదిరిగి వెళ్ళిపోయారట.
జ్యోతిష్కుడికి పిచ్చిపట్టినట్లయి ముందు హాల్లోకి వెళ్ళి జ్యోతిష్య శాస్త్రాన్ని తిరగవేయసాగాడట.
అంతలో లోపలనుంచి శిల్పి వచ్చి, "చూశావా నా చాతుర్యం?" అని నవ్వాడట.
జ్యోతిష్కుడు దిగ్భ్రాంతి నుంచి తేరుకుని "ముక్కోటి దేవతల్ని నీవు మోసం చేయగలవేమోగానీ మృత్యువుకి ప్రతినిధి అయిన యముడ్ని మోసం చేయలేవు చూడు" అన్నాడట.
శిల్పి నవ్వి సరే చూద్దాం అని తిరిగి లోపలకు వెళ్ళాడట.
జ్యోతిష్కుడు- శిల్పి తిధి నక్షత్రాల్ని, గ్రహాల్ని చూసి మృత్యువు ఆ రాత్రికే అతన్ని వరించవలసి వుందే అని విస్మయపడ్డాడట.
ఇక్కడిలా వుండగా యమకింకరులు యమలోకానికి వెళ్ళి జరిగింది యముడికి చెప్పారట.
యముడు కింకరుల్ని మందలించి, చిత్రగుప్తుడ్ని తీసుకెళ్ళి అతని ప్రాణాల్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడట.
ఈసారి కింకరులు చిత్రగుప్తుడ్ని వెంటబెట్టుకుని తిరిగి శిల్పి ఇంటికి వచ్చారట.
చిత్రగుప్తుడు కూడా పిచ్చెత్తిపోయి జ్యోతిష్కుడ్ని బ్రతిమిలాడాడట అసలు శిల్పిని చూపించమని.
జ్యోతిష్కుడు మునుపటిలాగే తన ఆశక్తతను వెలిబుచ్చాడట.
కొన్ని ఘడియలపాటు ప్రయత్నించి చిత్రగుప్తుడు చేతులెత్తేశాడట.
ఆపైన కింకరులు, చిత్రగుప్తుడు తిరిగి రిక్తహస్తాలతో యమలోకం వెళ్ళిపోయారట.
జ్యోతిష్కుడు, కింకరులు, చిత్రగుప్తుడు ఆ శిల్పి నైపుణ్యానికి జోహార్లు అర్పించారే తప్ప, తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేకపోయారు.
జ్యోతిష్కుడు తిరిగి ముందు హాల్లోకి వచ్చి లెక్కలు వేయసాగాడట.
అంతలో లోపలనుంచి శిల్పి బయటకు వచ్చి యిప్పుడేమంటావ్ అని అడిగాడట.