"వార్డెన్ వచ్చే టైమైంది. జల్దీగా వచ్చెయ్. అదిగో నేరుగా వెళ్ళు. ఆఫీస్ రూం... అక్కడ సర్వెంట్ మెయిడ్ తో చెప్తే" చెప్తాడు.గేట్ మెన్ చెప్పటం పూర్తి కాకముందే గబగబా లోనికి నడిచాడు మూర్తి. ఆఫీస్ రూమ్ లో సర్వెంట్ మెయిడూ లేడు, ఎవ్వరూ లేరు. వరండా అంతా నిశ్శబ్దంగా వుంది. గదుల్లోంచి అమ్మాయిల మాటలు చిన్నగా వినబడుతున్నాయి. గబుక్కున ముందుకెళ్ళిపోయాడు.
ఓ రూమ్ డోర్ వారగా తీసుంది.
తలుపు ముందుకి తోసాడు నెమ్మదిగా.
ఓ అమ్మాయి, వెల్లకిలా పడుకుని కాలుమీద కాలు వేసుకొని మహాభారతం చదువుతోంది. అట్టమీద 'మహాభారతం' అక్షరాల్ని చూసి ఆశ్చర్యపోయాడు మూర్తి.
పదహారేళ్ళ పాప చేతిలో మహాభారతం. విచిత్రంగా వుందే! తనేం అమ్మాయిల హాస్టల్ కి వచ్చాడా? లేదా రామకృష్ణ మఠానికొచ్చాడా? సందేహం వచ్చింది. చిన్నగా దగ్గాడు. ఆ దగ్గుతో బెడ్ మీద వున్న అమ్మాయి ఉలిక్కిపడి, అక్కడ ఆ సమయంలో ఓ అబ్బాయి కనబడటంతో, కెవ్వుమని కేకవేయబోయి, ఆగి-
"ఎవరండి? ఎవరు కావాలి" అంది గాభరాగా. అదే సమయములో ఆ అమ్మాయి చేతిలో మహాభారతం అట్ట కింద పడిపోయింది. అప్పుడు బయటపడింది ఆ అమ్మాయి చేతిలో మ్యాగజైన్.
డైబోనెయిల్ అది.
"సారీ మేడమ్. సుధారాణి ఎమ్.ఎస్.సి., ఫైనలియర్ ఏ రూమో చెప్తారా?" వినయంగా మొహంపెట్టి అడిగాడు మూర్తి.
"సుధా... నా... మీకేమౌతుంది?"
"కజిన్. అర్జంటుగా కలవాలి."
"నా రూమ్మేట్. కానీ ఎప్పుడొస్తుందో, ఎక్కడికెళుతుందో ఎవ్వరికీ తెలీదు. ఉదయం తొమ్మిది గంటలకు బయటకెళ్ళింది. ఇంతవరకూ రాలేదు. రోజూ వార్డెన్ చేత అక్షింతలు నాకు" ఆగి ఆగి అంది నెమ్మదిగా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
"మరిప్పుడు రావచ్చునంటారా" మరింత వినయంగా అడిగాడు మూర్తి.
"మరీ పాతాళభైరవిలో రామారావులా రావచ్చునంటారా, రాదంటారా అంటే నేనేం చెప్పలేను. ఇంతకీ మీరు వార్డెన్ పర్మిషన్ తోనే వచ్చారా?"
"లేదు."
"కొంప మునిగింది. మీరు ముందు అర్జెంట్ గా గేటు బయట కెళ్లిపోండి. వార్డెన్ వచ్చే టైమైంది. మిమ్మల్నిక్కడ చూస్తే నన్ను డిస్ మిస్ చేస్తుంది" ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా డోర్ వేసేసుకుంది ఆ అమ్మాయి. ఈ డెవిల్ వచ్చేవరకు వెయిట్ చెయ్యక తప్పదా! అయితే ఎక్కడ వెయిట్ చెయ్యాలి? ఆఫీసు రూంలోనా, గేటు బయటా? ఆలోచిస్తూ వస్తున్న మూర్తికి ఘీంకారం లాంటి అరుపు, ఏనుగు లాంటి ఆకారం వినబడి, కనబడేసరికి సదరు శాల్తీయే వార్డెన్ అయుంటుందని అనుకుని వినయంగా మొహం పెట్టి-
"గుడ్ ఆఫ్టర్ నూన్ అంటీ- మా సిస్టర్" ఏదో అనబోయాడు.
"లుక్ మిస్టర్! హు ఆర్యూ? కమ్ కమ్ కమ్" అంటూ చికాగ్గా మొహం పెట్టి ఆఫీస్ రూమ్ లో కెళ్ళిందావిడ.
ఆఫీస్ రూమ్ లో తన సీట్లో కూర్చున్నాక అఫీషియల్ గా ఫైరయి పోయింది. "ఎవడ్రా నువ్వు? ప్రతీ కోన్ కిస్కాగాడూ లోనకొచ్చెయ్యడమేనా...? ఇది ఉమెన్స్ హాస్టలనుకున్నావా లేక నీ అత్తగారిల్లనుకున్నావా? నీలాంటివాళ్ళ వల్ల ఇక్కడ జరగకూడనిదేదైనా జరిగిందనుకో. ఎవడ్రా రెస్పాన్సిబుల్? అసలే ఈ మధ్య హాస్టళ్ళలో ఏవేవో జరుగుతున్నాయని వెధవగోల... ఎంతమంది నాలాంటివాళ్ళు స్ట్రిక్టు వార్డెనులున్నా, తప్పదు మరి... ఎక్కడో ఏదో జరిగిందని, అన్ని హాస్టళ్ళనీ దుమ్మెత్తిపోయడం తప్పంటాను. నువ్వేమంటావ్" సడన్ గా ఆవిడ అలా అనేసరికి మూర్తికేమనాలో తోచలేదు.
"యూ ఆర్ రైట్ అంటీ. యూ ఆర్ రైట్."
"ఇప్పుడు చెప్పు- అబద్ధాలాడితే సహించన్నేను" ఆ మాటకి మళ్ళీ మొదటి నుంచీ రికార్డు పెట్టాడు మూర్తి.
"సుధారాణి, ఆ పిల్ల గురించి నీకేం అర్థంకాలేదు. నేనంటే బొత్తిగా భయం లేదు. భక్తిలేదు. ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఏమైనా అంటే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది. ఈ ఆడపిల్లల్తో ఇదే గోల. నీళ్ళను కళ్ళల్లోనే నిల్వ చేసుకుని వుంటారుకామోసు."
"అవునాంటీ! సుధ గురించి అదే మా బెంగనూ. అందుకే దాన్ని ఆప్పుడప్పుడు టెస్ట్ చేయడానికి ఇలా వాళ్ళ డాడీ నన్ను పంపుతుంటాడు" సరిగ్గా అతికే అబద్ధం ఆడాడు మూర్తి.
"తెల్సీ తెలియని వయస్సులోనే ఆడపిల్లల్ని అదుపులో పెట్టుకోవాలి. ఏదో ఉద్యోగం తప్పదని చెయ్యడం తప్పించి, వీళ్ళందరి గోలా నాకెందుకయ్యా చెప్పు. నేను మా ఆయన్నే అదుపులో పెట్టుకోలేక చస్తున్నాను" పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయిందావిడ. పాపం భోళా మనిషి! అమాయకంగా మొహం కనబడితే చాలు, ఆవిడ తన కష్ట సుఖాలన్నీ చెప్పేసుకుంటుంది. ప్రథమ కోపం తప్ప- ఆ కోపానికి ఆ హాస్టలమ్మాయిల ముందు బలయిపోతారు. తర్వాత ఆవిడ కథలన్నీ ఏకరువు పెట్టడంతో అప్పుడూ బలయిపోతారు. అందుకే వార్డనంటే అంత హడల్.
"ఏమిటాంటీ... అంకుల్ మిమ్మల్ని,దేవతలాంటి మిమ్మల్ని ఇబ్బంది పెడతారా-" అన్నాడు సాధ్యమైనంత సానుభూతి నటిస్తూ.
"నువ్వేదో మంచివాడిలా వున్నావ్... కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందని, నేనేదో కొంచెం లావుగా వుంటానని-" తన సహజధోరణిలో చెప్పుకుపోతోందావిడ.
"ఫర్లేదాంటీ- రోజూ బస్కీలు తీయండి. జాగింగ్ కి వెళ్ళండి.ట్రిమ్ముగా హేమమాలినిలాగా తయారైపోతారు- మీకేం- సి.ఎం. అయ్యాక జయలలితనే చూడండి. ఎలా అయిపోయిందో- వార్డెన్ గా వచ్చాక, హాస్టల్ కూడు తిని,మీరూ అలా అయిపోయి వుంటారు. అంతే కానీ-"
"యూ ఆర్ కరెక్ట్... కరెక్ట్... నీలా ఆలోచిస్తే, మా ఆయన ఎప్పుడో దార్లోకొచ్చేవారు. పూర్ ఫెలో..." భర్తమీద జాలిపడింది ఆవిడ.
ఏదో అనబోతున్న వార్డెన్ చూపులు గేటులోంచి వస్తున్న సుధారాణి మీద పడ్డాయి.
"అదుగో వస్తుందయ్యా, వెంటనే నువ్వేం మాట్లాడక-" అని చెప్పి-
వార్డెన్ ని చూసి ఇక సోది తప్పదని లోనికొస్తున్న సుధారాణిని పిలిచి "ఏయ్ అమ్మాయ్- నీకెన్ని సార్లు చెప్పాలమ్మా- కాలేజీ అవగానే హాస్టల్ కి రమ్మని ఒంటిగంటకు క్లాసులైపోతే, ఇప్పుడా నువ్వు రావటం? ఎక్కడికెళ్ళావ్?" భీకరంగా అరిచినట్లు అడిగింది.
"మా కజిన్ వచ్చాడని ఎవరో చెప్తే, బస్టాండుకి వెళ్ళాను మేడమ్" సుధారాణి నోట్లోంచి అబద్ధాలు పుట్టలు పుట్టలుగా వస్తాయి. టక్కున ఓ అబద్ధం ఆడేసింది.
"బస్టాండులో బస్సుదిగి నీ కజిన్, అక్కడే అలా తిరుగుతుంటాడా? హాస్టల్ కిరాడా- చూడు పాపం చూడు నీ కజిన్ ఇక్కడ ఎంతగా నీకోసం వెయిట్ చేస్తున్నాడో" పక్కనున్న మూర్తిని చూస్తూ అంది వార్డెన్.
ఈ మూర్తి ఇక్కడెందుకున్నాడా! అని ఆలోచిస్తూనే లోనికొచ్చింది సుధారాణి! తనతో ఏదో పనుందన్న మాట. విషయం అర్థమైంది సుధారాణికి.
"మేడమ్! మా కజిన్ తో మాట్లాడి వచ్చేస్తాను-" రిక్వెస్టుగా అడిగింది.
"మరి వెళ్ళవూ... వెళ్ళు, కానీ ఎనిమిది గంటలలోపు హాస్టల్ లో వుండాలి. అర్థమైందా?"