Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 20

    సుచిత్ర తల్లిదండ్రుల కళ్ళు మెరవటాన్ని పసిగట్టిందామె.

    భార్యేదో చెప్పబోతుండగా-ఆయన ఆమె కేసి చూసి_ "నేనున్నాగా- నేను మాట్లాడతాలే...." అని హుంకరించినట్లని, మనోజ్ఞ వైపు తిరిగాడు.

    "చెరి ఇరవై వేలా....!?" అనడిగాడు.

    కూతురు పోయి ఆరు నెలలే అయింది. ఆ విషయాన్ని ఎంతకీ చెప్పకుండా....దాని తాలూకు విషాదం వ్యక్తపర్చకపోగా తాపీగా-డబ్బే ప్రధానమన్నట్లు మాట్లాడుతున్నారే?!

    "అవునండి....వడ్డీ అదీ కలుపుకుంటే చెరో పాతిక వస్తుందేమో. నేను త్వరలో దుబాయ్ వెళ్ళిపోవాలి. ఆలోపే ఈ పని జరిగిపోవాలి. ఈ సహాయం నేను మా దీదీకి చేయకపోతే నన్ను అసహ్యించుకుంటుంది, సంపాదిస్తూ కూడా సహాయం చేయలేదని. ప్లీజ్....సుచిత్ర ఎక్కడి కెళ్ళిందో చెప్పండి...." మరో బాణం గాల్లోకి....

    "సుచిత్ర ఊరెళ్ళిందని ఎవరు చెప్పారు? మేం చెప్పలేదే....?" ఆయన ఆశ్చర్యంగా అడిగాడు.

    "ఇంతసేపయినా కనబడకపోతేనూ...." నసుగుతూ అంది ఆమె.

    "ఏమనుకోవద్దమ్మా.... మాకు కష్టాలొచ్చిపడ్డాయి. మా బిడ్డను వివేక్ అనే దుర్మార్గుడు రేప్ చేసి చంపేశాడు...." అన్నాడాయన విచారంగా.

    "వ్వాట్....?! రియల్లీ ...." అదిరిపాటును నటిస్తూ అంది ఆమె.

    "అవునమ్మా...." అందాయన భార్య దిగులుగా.

    "ఓ....నో....రియల్లీ ఐయామ్ వెరీ సారీ...." బాధని నటిస్తూ అంది మనోజ్ఞ.

    వారి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం....

    "అయితే బ్యాంకులో డబ్బు వెంటనే డ్రా చేయలేం. అఫిడవిట్లని, నోటరీ అని, డెత్ సర్టిఫికెట్ అని బ్యాంకు వాళ్ళు తినేస్తారు." నిస్పృహగా అంది ఆమె.

    "అయ్యో....మా బిడ్డ డబ్బు మాకు రాదా....!" ఆయన వెంటనే అన్నాడు.

    "సుచిత్ర చనిపోయిందని బ్యాంకు వాళ్ళకు తెలిస్తే పెద్ద తతంగం. అదయ్యేసరికి ఐదారు సంవత్సరాలు పడుతుంది....అలాకాకుండా చేసుకోవాలంటే ఒక మార్గం వుంది. దానికయినా సుచిత్ర సంతకం కావాలి" తనలో తాను అనుకున్నట్లుగా అంది.

    "ఏమిటది చెప్పమ్మా....చూస్తూ చూస్తూ పాతిక వేలెలా పోగొట్టుకుంటాం...." ఆయన మాటల్లో తొంగిచూసిన ఆరాటాన్ని పసిగట్టింది ఆమె.

    "ఖాళీ తెల్లకాగితాల మీద సుచిత్ర ఎప్పుడన్నా సంతకం చేసింది వుంటే- ఆ సంతకం కింద నేను చేస్తే సరిపోతుంది. కానెలా....? తనేమో లేదాయె...." అంది మనోజ్ఞ.

    "అలా అయితే కష్టమేనే. మా అమ్మాయి ఇప్పుడు లేదుగా.... అందామె.

    "నిన్ను నోర్ముయ్యమన్నానా....?" ఆయన భార్యని కసురుకొని- "అలాంటి కాగితం ఒకటుండాలమ్మా....." జ్ఞప్తికి తెచ్చుకుంటున్నట్లు అన్నాడు.

    "రక్షించారు బాబాయిగారూ! వెంటనే అదివ్వండి. రేపే డ్రా చేసి మీ పాతిక మీకిస్తాను" మరో బాణం వదిలింది మనోజ్ఞ.

    "వెంటనే అంటే వీలుకాదమ్మా...." ఆయన తల గోక్కుంటూ అన్నాడు.

    "ఇందులో వీలయ్యేదేముంది బాబాయిగారూ! వెతికితే సరి...."

    "వెతికినా ఉండొద్దూ?" ఆమె అంది చటుక్కున.

    "నువ్వు నోర్ముయ్! వెతుకుతానమ్మా! నాలుగు రోజులాగి రా...." అన్నాడాయన.

    "అలాగే బాబాయిగారూ....! త్వరగా వెతకండి. లేదంటే ఈలోగా నేను దుబాయ్ తిరిగివెళ్ళే ప్రోగ్రామ్ ఫిక్సయితే యిద్దరం నష్టపోతాం. పాతిక కోసం దుబాయ్ లో ఉద్యోగం మానుకోలేంగదా! వస్తా" అంటూ చకచకా గేటుకేసి నడిచింది.

    గేటు తీసివేస్తూ ఓరగా వాళ్ళకేసి చూసింది. వాళ్ళేదో గుసగుసలాడుకుంటూ కనిపించారు.

    ఆమె భృకుటి అనుమానంతో ముడివడింది.


                                                                 *    *    *    *


    మనోజ్ఞ ఆటో దగ్గరకు వెళ్ళి ఎక్కబోతుండగా-

    "ఇది ఎంగేజ్డ్" అన్నాడతను.

    "నేనేనయ్యా బాబూ" అని ముఖంమీద ముసుగును తీసి చూపించింది.

    ఆటో డ్రైవర్ బిత్తరపోయి ఆటో స్టార్ట్ చేశాడు.

    మరో అరగంటకి ఆటో 'వార్తా' పత్రికాఫీసు ముందు ఆగింది.


                          *    *    *    *


    క్రైమ్ రిపోర్టర్ హరికుమార్ ఆ రోజు కాస్త ఫ్రీగా వున్నాడు.

    మనోజ్ఞని చూస్తూనే పలకరింపుగా నవ్వాడు.

    "ఎనీ ప్రోగ్రెస్?" అడిగాడు హరికుమార్.

    "ఎస్" అంది ఎక్సైటింగ్ గా.

    హరికుమార్ లేచి ఆమెను తనతో రమ్మని లాన్ లోకి వెళ్ళి కూర్చుంటూ అటుగా వచ్చిన బోయ్ ని పిలిచి రెండు టీ కూపన్స్ తీసి యిచ్చాడు.

    "చెప్పండి" అన్నాడు హరికుమార్.

    ముందు మైక్రో కేసెట్ - కార్డర్ ఆన్ చేసి వినిపించింది.

    జరిగిందంతా తిరిగి పూసగుచ్చినట్లు చెప్పింది ఆమె.

    ఇద్దరి మధ్యా కొద్దిక్షణాలు నిశ్శబ్దం పేరుకుంది.

    "నాకేదో అనుమానంగా వుంది హరిగారూ" అంది తిరిగి.

    "ఎలా?" అడిగాడతను.

    "తమ బిడ్డని పోగొట్టుకున్న విషాదం వారి ముఖాల్లో కనిపించలేదు."

    "కొందరి ముఖాల్లో ఫీలింగ్స్ కనిపించవు"

    కొడుకు మాట్లాడబోతే తండ్రి మందలించాడు.

    "నువ్వు పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చి వుండవచ్చని భావించి జాగ్రత్త కోసం మందలించి వుండవచ్చు."

    "నేను స్త్రీని! పైగా బురఖాలో వున్నాను."

    "పోలీస్ డిపార్ట్ మెంట్స్ లో స్త్రీలు లేరా?"

    "ఉండవచ్చు. ఉన్నా బురఖా వేసుకోకూడదు. అది రూలు."

    "శెభాష్? అఫ్ కోర్స్...."

    "అరగంట తరువాతగానీ తమ కూతురు చనిపోయిందని చెప్పలేదు...."

    "తమింటికి వచ్చిన ప్రతివారికీ తమ బిడ్డ చనిపోయిందని చెప్పుకోవాలా? ఇతరుల సానుభూతి వాళ్ళకక్కర్లేదేమో...."

    "నే వెళ్ళేసరికి అందరూ కులాసాగా వున్నారు"

    "జీవితాంతం చచ్చినవాళ్ళను తలుచుకునే బాధపడాలా?"

    "లాభం అనగానే ఆత్రుతపడ్డారు"

    "అది మానవ సహజం"

    "నన్ను వరండాలోకి తీసుకెళ్ళి మాట్లాడారు"

    "హాల్లో ఉన్నవాళ్ళకి డిస్ట్రబెన్స్ వుండకూడదనేమో"

    "భార్యనసలు మాట్లాడనివ్వలేదు"

    "పితృస్వామ్యం"

    "ఖాళీ కాగితం మీద సుచిత్ర సంతకం వుంటే చాలని అడిగితే 'అలా అయితే కష్టమేనే- మా అమ్మాయి ఇప్పుడు లేదుగా' అంది సుచిత్ర తల్లి."

    "లేనప్పుడు కష్టమేగా మరి."

    "ఇప్పుడు లేదుగా" అనంది.

    "ఇప్పుడు లేదుగా అనంటే- చావకముందు వుండేదని- ఇప్పుడు లేదని అర్ధం. ఇప్పుడు లేదని అంటే అప్పుడక్కడ లేదనే వుద్దేశం కాకపోవచ్చుగా?" 

    "ఆ కాగితం వెంటనే యివ్వమంటే- నాలుగు రోజులు గడువడిగాడు. ఉంటే డబ్బు మీద అంత ఆశ వున్నవాడు వెంటనే వెతికి యిచ్చేవాడుగా?"

    "వెతికేందుకు కావచ్చుగా....

    "వెతికినా వుండొద్దూ....?" అనామె దీర్ఘం తీసింది. "వెతుకుతానమ్మా- నాలుగు రోజులాగిరా" అని ఆయన సర్దాడు."

    "ఆమె ఎరికలో లేకపోవచ్చు, ఆయన ఎరికలో వుండవచ్చుగా?"

    "నేనటు గేటుకేసి నడవగానే వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ కనిపించారు."

    "గుసగుసలాడుకున్నంత మాత్రాన రేప్ కి గురయి, చంపబడి- పోస్ట్ మార్టమ్ చేయబడి.... బరీడ్ అయిన సుచిత్ర బతికి వున్నట్లు కాదుగా?"

    మనోజ్ఞ వెంటనే నవ్వింది.

    ఆమె ఎందుకలా నవ్విందో హరికుమార్ కి అర్ధంకాలేదు.

    "సుచిత్ర బతికే వుందని నేననలేదుగా? నేను డైరెక్ట్ గా అనుమానించలేదుగా? మీరనుమానించారు. నేననుమానింకానని మీరనుమానించారు.

    ట్రూత్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ....సుచిత్ర ఖచ్చితంగా చనిపోయిందనే నిజం మీకు తెలుసు. మీరు ఫాలో అయ్యారు. అలాంటప్పుడు సుచిత్ర బతికి వున్నట్లు కాదుగా- అని మీరనకూడదు. అన్నారంటే నా అనుమానాలు సరైన ఆధారం కోసం ఆరాటపడుతున్నాయని మీకర్ధమయిపోయింది. అది నాకూ అర్ధమైంది. సుచిత్ర ఎందుకో.... బతికే వుందేమోనని.... నా అనుమానం.... అఫ్ కోర్స్.... జస్ట్ డౌట్.... బట్..... బట్.... నాలుగు రోజుల్లో నా అనుమానం తీరిపోనున్నది...." స్థిరంగా అంది మనోజ్ఞ.

    "ఎలా....?"

    "డబ్బంటే ప్రాణం ఇచ్చే సుచిత్ర తండ్రి పాతికవేలు వదులుకోడు. సుచిత్ర నిజంగా చనిపోయుంటే- పొరపాటున ఆమె సంతకం చేసిన కాగితము మీద వుండే సుచిత్ర సంతకం ఆరు నెలలు క్రితందయి వుండాలి. అవునా?"  

 Previous Page Next Page