Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 20

    "అయ్యో తల్లీ!" అంటూ నుదుటి మీద చేతితో కొట్టుకున్నాడు విష్ణుమూర్తి.
   
    "కాంతామణులారా! మీరు కాస్తంతయినా ఆలోచించకుండా ఇలా పయనమై వచ్చారు. నేను ప్రస్తుతం నామమాత్రుడ్ని నా అవతారం వెంకటేశ్వరస్వామిగా భూలోకంలో ఏడుకొండలమీద నివాసం ఏర్పరచుకొని క్షణం విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్ళు భక్తుల కోరికలణు వినలేక అన్నీ తీర్చలేక మళ్ళీ మళ్ళీ భక్తులు నా దర్శనానికి వస్తుంటే అదిచూసి భరించలేక ఒకపక్క నా అప్పు తీరక నానా అగచాట్లు పడుతున్నాను.
   
    భూలోకంలో కూడా అందరి భక్తుల కోరికలు తీర్చలేక అక్కడ నుంచి ఎప్పుడు పారిపోదామా అని చూస్తున్నాను. నా అవతారం మూలకంగా అటు శ్రీలక్ష్మికి-ఇటు కుబేరుడికి క్షణం తీరుబడి లేకుండగ వుంది.
   
    వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు, ఇప్పుడు నేను ఒంటరివాడిని. నన్ను నేను ఓదార్చుకుంటూ నా పనులు నేనే చేసుకుంటూ నాకాళ్ళు నేనే వత్తుకుంటున్నాను"
   
    తన మాటలు వింటానికి మనుషులు దొరికారు కదాని తనకష్టాలు ఏకరువుపెట్టాడు విష్ణుమూర్తి.
   
    "మీరు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు పోనీ వెంకటేశ్వరుడి అవతారంతోనే మా కోరికలు నెరవేర్చండి కావాలంటే మా మగవాళ్ళందరి తలనీలాలు ఒక ఏడాదిపాటు అలా పెరగడం ఇలా ఇవ్వటంచేస్తాం వాళ్ళ తరుపున మేము మొక్కుకుంటున్నాము" అని చెప్పింది ఈ తపా రంగనాయకి.
   
    "అలా అన్నావ్ బాగుంది" సంతోషమ్మ బోలెడు సంతోషపడి పోతూ అంది.
   
    భూలోకంలో కూడా నేను ఈ మధ్యకాలంలో భక్తుల కోరికలు తీర్చకుండా దుస్తులు....దుర్మార్గులు ....లంచగొండులు...అలాంటివాళ్ళ కోరికలు తీరుస్తున్నాను. అది విధి లిఖితం వాళ్ళయితే నా హుండీలో కట్టలకి కట్టలు ధనరాసులు పడేస్తున్నారు.
   
    మొన్నీమధ్య ఒకడు "నేను చేసే హత్య సక్సెస్ అయ్యిటట్లు చూడండి స్వామి నేనీ రివాల్వర్ యింక ముట్టకుండా నా స్వరం మీకు కానుకగా అర్పిస్తాను" అని మొక్కుకున్నాడు. వాడి కోరిక తీరింది. తెలివిగా హత్య చేశాడు. ఆ హత్యానేరం వాడిమీద పడలేదు.
   
    రివాల్వర్ తీసుకొచ్చి నా హుండీలో వేసి "నా సర్వస్వం యిదే స్వామీ! దీనితో నాకింక పనిలేదు నా కోరిక తీర్చినందుకు ఇది కానుకగా సమర్పిస్తున్నాను" అంటూ మొక్కుతీర్చుకున్నాడు.
   
    నేను తెల్లబోయి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాను. నా పరిస్థితి ఇది. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారో చెప్పండి" అన్నాడు విష్ణుమూర్తి.
   
    "మీరు తలుచుకుంటే కాదా?" గట్టిగా అడిగింది లీడర్ లీలారాణి.
   
    "గట్టిగా తలచుకున్నా ఓటిగా తలచుకున్నా కాదు కానేరదు. ఇప్పుడు నేను రెండు పడవలమీద కాళ్ళుపెట్టి ప్రయాణం చేస్తున్నాను. ఇక్కడ విష్ణుమూర్తి అవతారంతోను వుండాలి అక్కడ భూలోకంలో వెంకటేశ్వరస్వామి అవతారంతోను వుండాలి.
   
    నామటుకు నాకు ఇప్పుడు మీ కోర్కెలు తీర్చటానికి ఫుల్ పరర్స్ లేవు. ఏం చేసినా వెంకటేశ్వరస్వామిగానే చెయ్యాలి. కాని భూలోకంలో పాపం పండటం వలన దుష్టులకే సాయపడాల్సి వస్తోంది. మిమ్మల్ని నిరాశ పరిచినందుకు నన్ను మన్నించండి కాంతామణులారా" అన్నాడు విష్ణుమూర్తి.
   
    అందరు ఆడవాళ్ళు అవతలికి వెళ్ళి కాసేపు గుసగుసలాడుకొని తిరిగొచ్చారు.
   
    "ఏంటి మళ్ళీ వచ్చారు?" విష్ణుమూర్తి అడిగాడు.
   
    "మీరు 'మా కోర్కెలు తీర్చలేని స్థితిలో వున్నాన'ని చెప్పారు కనీసం ఏ దేవుడి దగ్గరకెళితే మా కోర్కెలు నెరవేరతాయో అదయినా చెప్పి పుణ్యం కట్టుకోండి...." అంటూ అందరూ దీనాతిదీనంగా అడిగారు.
   
    విష్ణుమూర్తి కొద్దిసేపు కళ్ళు మూసుకొని తెరచి "కాంతామణులారా! మీ కోర్కెలు నేను తీర్చలేకపోయినా ఉపాయం మాత్రం చెప్పగలవాడను. అన్నింటికీ మూలం ఆ ఆదిశంకరుడు. ఆ బోళాశంకరుడి దగ్గరకెళ్ళండి. మనసారా స్తుతించండి ఆయన మీ కోర్కెలు తీర్చవచ్చు.
   
    వెనకా ముందు చూడకుండా వరాలివ్వటంలో కూడా శంకరుడికి శంకరుడే సాటి" అని పైకి చెప్పి లోలోపల ముసిముసిగా నవ్వుకొని తన తెలివికి తనే మురిసిపోయాడు విష్ణుమూర్తి.
   
    ఇంక అక్కడ వుండి చేసేదేమీ కనిపించలేదు వాళ్ళకి విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని ఇవతలికి వచ్చేశారు.
   
    "అమ్మయ్యా! తెలివిగా వీళ్ళని వదిలించుకున్నాను బాబు" అనుకున్నాడు విష్ణుమూర్తి.
   
    "అన్న విష్ణుమూర్తి చాలా మంచివాడు. పాపం మన కోర్కెలు తను తీర్చలేని స్థితిలో వుండటంవలన ఏమీ చేయలేకపోయాడు. కనీసం సలహా ఇచ్చాడు. అందుకు సంతోషిద్దాం" అనుకున్నారు.
   
    ఈ తఫా ఆడవాళ్ళంతా కలిసి కైలాసం నగరం లేక మహాస్మశానం...ఎక్కడ వున్నాడో ఆ పరమేశ్వరుడు అనుకుంటూ బయలుదేరారు.
   
                                            *    *    *    *
   
    "శంభోశంకర సాంబశివ...."
   
    అంటూ అలివేణి కూనిరాగం తీస్తుంటే ఆమె కోడలు త్రివేణి నేనుమాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు "శంకరా!" అంటూ శంకరా భరణంలోని పాట ఎత్తుకుంది.
   
    "అమ్మాయ్ త్రివేణీ!" అంటూ ప్రేమగా పిలిచింది సూరంపూడి సూర్యకాంతాదేవి.
   
    "పిలిచారా!" పాటలోంచి బైట పడుతూ అడిగింది త్రివేణి.
   
    "పిలిచానమ్మాయ్! నాకో పెద్ద అనుమానం వచ్చింది. అది నిన్నడిగి తీర్చుకుందామని నీ పాట మధ్యలో అంతరాయం కలిగించాను. ఏమీ అనుకోకేం."
   
    "ఏమీ అనుకోకు. మీ అనుమానమేమిటో అడగండి."
   
    "శంకరాభరణం అంటే ఏమిటి?"
   
    "భలేవారే పిన్నిగారు! శంకరాభరణం సినిమా ఆరుసార్లు చూశారు ఎప్పుడూ శంకరశాస్త్రి గురించే కలవరిస్తూంటారు. శంకరాభరణం అన్న మాటకి ఆ మాత్రం అర్ధం తెలీదా!"
   
    "తెలుసుకో. శంకరాభరణం అంటే అదొక రాగం పేరని కాని నా అనుమానం ఏమిటంటే ఆభరణం అంటే నగ కదా. శంకరాభరణం అంటే అదేదో చాలా ఖరీదైన, బరువైన బంగారునగ అయుంటుంది. ఈ మగాళ్ళు అంత బరువైన బంగారు నగ ఎక్కడ చేయించాల్సి వస్తుందోనని అదోపాట రాగం అనేసి వుంటారు. అలా అని నా అనుమానం అమ్మాయ్! నాకు తెలిసినంతవరలో ఎన్ని రకాల నగలున్నాయో అన్ని రకాల నగలు చేయించుకొన్నాను.

 Previous Page Next Page